Next Page 
మరో హిరోషిమా పేజి 1


                                             మరో హిరోషిమా

                                                     - యండమూరి వీరేంద్రనాథ్

 




    ప్రొలోగ్ :   

    నవంబరు 2, 1970

    రాత్రి 11-45


    హైదరాబాద్ కి వంద కిలోమీటర్ల దూరంలో ఒక రాజభవనంలాంటి ఇంట్లో రహస్య సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో పాల్గొన్న ముగ్గురిలో ఇద్దరు మాజీ సంస్థానాధిపతులు, ఒకరు ముస్లిం నవాబు.

    ఆ రోజు- అంటే నవంబరు రెండవ తారీఖు, 1970 ఉదయం పదకొండు గంటలకి రాజభరణాలను రద్దుచేస్తున్నట్లు ఇందిరాగాంధీ ప్రకటించింది. అదే సంవత్సరం ఆమె బ్యాంకుల్ని జాతీయం చేసి వుండటంతో ఎన్నో రూమర్లు చెలరేగాయి.

    భారతదేశంలో విలీనమవటానికి ఒప్పుకున్నందుకుగాను ఈ రాజులు అందరికీ (సంస్థానాధిపతులందరికీ) స్వతంత్రం వచ్చినప్పటినుంచీ సంవత్సరానికి కొంత 'భరణాన్ని' ప్రభుత్వం అప్పటివరకూ చెల్లిస్తూ వచ్చింది. ఇందిరాగాంధీ ఒక్క కలంపోటుతో దీన్ని రద్దు చేయడంతో ఈ సంస్థానాధిపతులలో కలవరం చెలరేగింది.

    అయితే ఈ మాజీ సంస్థానాధిపతుల కలవరం- కేవలం ప్రతి ఏడాదీ వచ్చే కోట్లాది రూపాయల రాబడి పోయినందుకు కాదు. మరో కలంపోటుద్వారా తమ రాజరికపు ఆస్థులన్నిటినీ ప్రభుత్వం తన ఖజానాలో కలిపేసుకుంటుందేమోనని!!

    "దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా మనం ఈ సంస్థానాధిపతులకు కోట్లాది రూపాయలు ఇచ్చాం. ఇదంతా ప్రజల దగ్గరనుంచి పన్నుల రూపాన వసూలు చేసిన డబ్బు. కేవలం రాజవంశీకులవటం వలన వారికింత డబ్బు ఇవ్వడం అన్యాయం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అభ్యున్నతికి నడుం కట్టింది. అందువల్ల ఇక నుంచి రాజభరణాల్ని రద్దుచేస్తున్నాం" అని ప్రకటించింది ప్రధాని ఇందిరాగాంధీ.

    ఇదిక్కడితో ఆగుతుందా?

    దేశంలోని మాజీ సంస్థానాధిపతులందరి మనసుల్లోనూ ఆ రోజున మెదలిన ఏకైక ప్రశ్న ఇది!

    "ఇదిక్కడితో ఆగదు" అన్నాడు రాజా విక్రమ్ దేవ్. ".... స్వతంత్రం రాకముందు ప్రజల్ని మనం పాలించే వాళ్ళం. పన్నుల రూపేణా వాళ్ళ దగ్గరనుంచి డబ్బులు వసూలు చేసేవాళ్ళం. భారతదేశంలో మన సంస్థానాలన్నీ విలీనమైనప్పుడు మా రాజ్యాన్ని ధారాదత్తం చేసినందుకు ప్రతిఫలంగా, ఏడాదికి కోటి రూపాయలు పైగా భారత ప్రభుత్వం మాకు చెల్లిస్తుందని సర్దార్ వల్లభాయ్ పటేల్ మా తాతగారికి వాగ్దానం చేసాడు! ఒక చిన్న ఆర్డినెన్స్ ద్వారా ఇందిరాగాంధీ ఆ వాగ్ధానాన్ని నిర్వీర్యం చేసింది. కేవలం పేద ప్రజల ఓట్ల కోసం చేపట్టిన చర్య ఇది!"

    "ఇదిక్కడితో ఆగదని ఎందుకు అనుకుంటున్నారు విక్రమ్ దేవ్ జీ?" అన్నాడు మన్సూర్ అహ్మద్ ఖాన్.

    "కేవలం ఒకప్పటి రాజులమవడం వల్ల మనకి ప్రతి ఏడాదీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించడం అనవసరమని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ప్రజల్లో తప్పకుండా ఈ చర్యపట్ల హర్షం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయింది. కాబట్టి తన గ్రూప్ ని సుస్థిరం చేసుకోవటానికి ఇందిరాగాంధీ ఇంకా చాలా ఎత్తులు వేస్తుంది. ఆమె దృష్టిలో న్యాయం -అన్యాయం లాంటివేమీ లేవని రాజభరణాల రద్దు ద్వారానే అర్ధమైంది కదా! ఎలక్షన్లు సమీపిస్తున్నాయ్! ప్రీవీపర్స్ ల రద్దుతో ఆమె ఆగదు. రాజుల ఆస్తులన్నీ ప్రజలనుంచి సంపాదించినవే కదా! అవి కూడా ప్రభుత్వానికే చెందాలని త్వరలోనే మరొక ఆర్డినెన్స్ జారీచేసి మన సంపదనంతా ప్రభుత్వ పరం చేసుకుంటుందని నా ఉద్దేశం."

    అక్కడి వాతావరణంలో అదోలాంటి ఉద్రిక్తత చోటుచేసుకుంది.

    "నో! నేను నమ్మను.... నమ్మలేను. ఇది అన్యాయం" అంటూ అరిచాడు రాజా విజయానంద గణపతి. 
   
    "డెబ్భైకోట్ల మెజారిటీ ప్రజలు చెప్పేదే ప్రజాస్వామ్యంలో న్యాయం. అందుకే మనం కోర్టుకి వెళ్లే హక్కు లేకుండా ఆమె రాజ్యంగాన్ని సవరించింది" కోపమూ, ఉక్రోషమూ మిళితమైన స్వరంతో అన్నాడు రాజా విక్రమ్ దేవ్.

    "మన ఆస్థుల్ని కూడా ప్రభుత్వం తీసేసుకుంటుందా?" భయంగా అడిగాడు మన్సూరు అహ్మద్ ఖాన్.

    "అనే అనుకుంటున్నాను. మన మాజీ సంస్థానాధిపతుల ఆస్థులన్నీ కలిపితే దాదాపు ఐదువేల కోట్లకు పైగానే ఉండవచ్చు. ఇదంతా స్వతంత్రానికి పూర్వం ప్రజల దగ్గర నుండి సంపాదించిన డబ్బే అని ఆమె వాదిస్తుంది. ఆ వాదనకిక ఎదురులేదు."

    "మరేం చేద్దాం?"

    "వీలైనంతవరకూ మన ఆస్థులన్నిటినీ రత్నాలు, వజ్రాలు, బంగారం రూపంలోకి మార్చుకుని కొంతకాలంపాటు ఆ నిధిని ఎక్కడైనా రహస్యంగా దాచుకోవడం ఉత్తమం. అది చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసాను."

    చాలాసేపు ఎవరూ మాట్లాడకపోవటంతో ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది.

    "మీరు చెప్పింది వాస్తవంగానే కనబడుతోంది. త్వరలోనే ఎమర్జన్సీని డిక్లేర్ చేయబోతోందన్న రూమర్లు కూడా వినిపిస్తున్నాయి కదా. అప్పుడిక మనమేమీ చెయ్యలేం. థాంక్యూ రాజా విక్రమ్ దేవ్! మీ సలహా పాటిస్తాం" అంటూ షేక్ హేండ్ ఇచ్చాడు రాజా విజయానంద గణపతి.


                                                  *    *    *


    డిసెంబరు 20, 1970

    చంబల్ వాలీ.

    మధ్యాహ్నం పన్నెండు గంటలైంది. శీతాకాలమైనా సరే ఆ అడవిలో ఎండ పెట పెటలాడుతోంది. దాహంతో అరిచే పక్షుల అరుపులు తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. ఆ నిశ్శబ్దాన్ని భగ్నంచేస్తూ గుర్రాల డెక్కల చప్పుడు, సకిలింతలు వినిపించాయి. నలుగురు రౌతులు ముందు స్వారీ చేస్తుండగా ఇరవైమంది అనుచరులు వారిని అనుసరిస్తున్నారు.

    అందరినీ ముందుకు నడిపిస్తున్న దృఢకాయుడి పేరు డాకూ మంగళ్ సింగ్. తలకు పాగా, నడుముచుట్టూ తోలు పడకా, భుజానికి రైఫిల్, కళ్ళలో ఎరుపుదనం, మొహంలో కరుకుదనం  అతడి ఆభరణాలు. అతడు తన జీవితంలో ఎప్పుడూ నవ్వి ఎరుగడు. అతడంటే ఇటు మధ్యప్రదేశ్, అటు బీహార్, మరోపక్క రాజస్థాన్ రాష్ట్రాలలో అందరికీ హడల్.

    చంబల్ లోయ ఉత్తర ప్రాంతంలో పూలన్ దేవి ప్రాచుర్యం పొందితే, దక్షిణ ప్రాంతానికి మంగళ్ సింగ్ మకుటంలేని మహారాజు. అయితే స్త్రీ అవడంవల్ల పూలన్ దేవికి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు లభిస్తే, అంతకన్నా పెద్ద నరరూప రాక్షసుడైన మంగళ్ సింగ్, చరిత్ర పుటల వెనకే వుండిపోయాడు. కేవలం ఒక హిందీ సినిమాలో మాత్రం అతనిపేరు వాడుకున్నారు.

    'గ్యాంగ్ ఆఫ్ ఫోర్' అని పిలవబడే ఈ ముఠాలో మంగళ్ సింగ్ కి ముఖ్య అనుచరులు ముగ్గురు. త్రిలోకనాథ్ యాదవ్, జానకిరాంభగత్, ఇబ్రహీంఖాన్.

    మధ్యప్రదేశ్ అడవులగుండా జగదల్ పూర్ వైపు ప్రయాణం చేస్తున్న విక్రమ్ దేవ్ జమీందార్ తాలూకు అశ్వదళాన్ని ఈ చంబల్ వాలీ బందిపోట్లు అకస్మాత్తుగా చుట్టుముట్టారు. రక్తం ఏరులై ప్రవహించింది. సుశిక్షితులైన వందమంది జమీందారీ సైనికులు ఈ బందిపోట్ల దాడిని ఎదుర్కోలేక ప్రాణాలర్పించారు.

    ఆ విధంగా మధ్యప్రదేశ్ లోని ఒక సంస్థానాధీశుడైన రాజా విక్రమ్ దేవ్ తాలూకు వందకోట్ల రూపాయల ఆస్థి -బంగారం రూపంలో బందిపోట్ల వశమైంది.

    ఆ నిధినంతా మంగళ్ సిం ఎక్కడో దాచాడు. ఎక్కడ దాచాడో అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అతడి ముఖ్య అనుచరులు ముగ్గురూ. తమ వాటా తమకి పంచుతాడన్న ఆశతో ఉన్నారు.

    వారి ఆశ తీరకుండానే మంగళ్ సింగ్ పోలీస్ ఎన్ కౌంటర్ లో మరణించడంతో వందకోట్ల విలువ గల నిధి ఆ విధంగా చరిత్ర పుటల్లో నిక్షిప్తమైపోయింది.

    పాతిక సంవత్సరాలు గడిచాయి.

                              *  *  *

                                               ప్రారంభం 


    నవంబరు 2, 1996

    ఉదయం 6 గంటలు

    లక్షలు ఖర్చుపెట్టి రిగ్గింగ్ చేసి, లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయిన ఎం.ఎల్.ఏ., కౌంటింగ్ గదినుంచి బయటకొచ్చినట్టు - మొహం ఎర్ర చేసుకుని తూర్పునుండి పైకొస్తున్నాడు సూర్యుడు.

    టెలిఫోన్ల కుంభకోణం నుంచి బయటపడి, హవాలా కేసులో ఇరుక్కున్న మంత్రిలా పచార్లు చేస్తున్నాడు పరంధామయ్య. 

    సినిమాలో తండ్రి పోలీసాఫీసరు, కొడుకు గూండా అయినప్పుడు క్లైమాక్స్ లో తల్లి వాళ్ళిద్దరిమధ్యా నిలబడి ఎవరి చేతిలో పిస్టల్ గుండుకి బలవ్వాలా అని ఆలోచిస్తున్నట్టు, ఆందోళనగా తండ్రీ కొడుకులవైపు చూస్తోంది పార్వతమ్మ.

    సి.బి.ఐ. డిపార్ట్ మెంట్ ని తన చేతిలో ఉంచుకున్న ప్రధాన మంత్రిలాగా ఇవేమీ పట్టనట్టు నిర్వికారంగా పేపర్ వైపు చూస్తున్నాడు బృహస్పతి. అతడి చేతిలో భూతద్దం వుంది. అతడికి చెరోవైపూ అతడి చెల్లెలూ, తమ్ముడూ ఉన్నారు. అతడి చెల్లెలు అమాయకంగా వుంది. అయితే ఆ అమ్మాయి మొహంలో కూడా- 'ఈ రాజకీయ నాయకులందరూ కలిసి నన్నేం చేస్తార్రా భగవంతుడా' అని అప్పుడే స్వతంత్రం వచ్చిన భరతమాత మొహంలో 1947లో కనబడిన ఆందోళన లాంటిది కనబడుతోంది. ఆ అమ్మాయి పేరు హిమసమీర.

    టాస్ గెలిచి, మాచ్ ఓడిపోయిన భారత కెప్టెన్ వైపు శ్రీలంక చూసినట్టు అన్న బృహస్పతి వైపు సానుభూతితో చూస్తున్నాడు తమ్ముడు. ఇంకో నాలుగు సంవత్సరాలు యిలాగే గడిస్తే 'అన్నయ్యకన్నా నేనో క్లాసు ముందుంటాను' అని ఆనందించాలో, అన్నయ్యకోసం విచారించాలో తెలియని అయోమయస్థితిలో... చీఫ్ మినిష్టర్ చనిపోయినప్పుడు, మొహం ఎలా పెట్టాలో తెలియని (ఆ పదవి నాశించే) డిప్యూటీ సి.ఎం.లా గంభీరంగా ఆ వాతావరణాన్ని వాడు పరిశీలిస్తున్నాడు. వాడి పేరు ప్రహ్లాద్.

    "ఒరేయ్! పేపర్ లో లేని నంబరు నువ్వు భూతద్దం పెట్టి వెతికినా కనబడదు. ఇక ఆ పత్తేదారు పరిశీలన ఆపు" కోపంగా అన్నాడు పరంధామయ్య పచార్లు ఆపి.

    "ఏమండీ! పెద్దాడి పరీక్ష మళ్ళీ పోయినట్టేనా?" ఆందోళనగా అంది పార్వతమ్మ.

    "ఏం? ఇంకో నాలుగు దినపత్రికలు తెప్పించి చూడమంటావా, పొరపాటున వాటిలో వీడి నంబర్ వుందేమో!"

    "అనవసరం నాన్నా. వాటిలో కూడా వుండదు" నిట్టూరుస్తూ లేచాడు బృహస్పతి.

    "మరి అంత ఖచ్చితంగా తెలిసినవాడివి భూతద్దంలో ఎందుకు వెదుకుతున్నావ్? వెటకారంగా అన్నారు పరంధామయ్య.

    "భూతద్దంలో వెదికినా ఈ పేపర్ దిద్దినవాడి బుర్రలో తెలివితేటలు కానీ తర్కం కానీ ఉండవని నిర్ధారించుకోవడానికి!" తాపీగా సమాధానం యిచ్చాడు బృహస్పతి.

    అసలే కోపంగా వున్న పరంధామయ్య ఆ మాటలకి మరింత రెచ్చిపోయి "ఏమిటిరా? ఏమిటి నీలో వున్నా తర్కం, వాడిలో లేనిదీనూ?" అంటూ గద్దించాడు.

    "అదే కదా లేనిది. అదుంటే నూటికి నూరు మార్కులూ వేసి వుండేవాడు. ఉదాహరణకి 'భారతదేశము - సమసమాజము' అన్న టాపిక్ మీద వ్యాసం వ్రాయమన్నారు. భారతదేశంలో సమసమాజం అసలెప్పటికీ రాదని వ్రాసాను. మహారాష్ట్రలో మందుకొట్టచ్చు. గుజరాత్ లో పుట్టిన నేరానికి మందు కొట్టకూడదు. అలాగే కర్ణాటకఓ పొలం వుంటే కావేరీ నదీ జలాలు వాడుకోవచ్చు. సరిహద్దు కిటువైపు తమిళనాడులో వుంటే పొలం ఎండిపోవలసిందే!! ముస్లిమ్ గా పుడితే ముగ్గుర్ని చేసుకోవచ్చు. హిందువైతే .... మ్చ్ ....! ఈ దేశంలో ఇంకెక్కడి సమసమాజం?, అని వ్రాసాను. నా తర్కం ఎగ్జామినర్ కి అర్ధంకాకపోవడం వాడి ఖర్మ" ఒక్క క్షణం ఆగి ఊపిరి పీల్చుకుని అన్నాడు.

    "అలాగే 'నెల్సన్ మండేలాని, మహాత్మాగాంధీతో సరిపోలుస్తూ నాలుగు వాక్యములు వ్రాయుము' అన్నారు. భారతదేశానికి మహాత్మాగాంధీ ఎలాగో, దక్షిణాఫ్రికాకి నెల్సన్ మండేలా అలా స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టాడని వ్రాసాను. నలభై సంవత్సరాలు జైల్లో వున్నాడని వ్రాసాను. అయితే అతడు జైల్లో వున్న కాలంలో అతడి భార్య మరెవరితోనో సంబంధం పెట్టుకుందని, గాంధీగారి కాలానికి, మండేలాకాలానికీ అదీ తేడా అనీ నా అభిప్రాయం వెలిబుచ్చాను. రాజకీయ నాయకులు జైళ్ళలో వున్నప్పుడు, తమ భార్యలు ఈ విధంగా బయటి సంబంధాలు పెట్టుకోవడం మొదలు పెడతారని తెలిస్తే- ఎప్పుడు ఏ హవాలా కేసులాంటి దాంట్లో ఇరుక్కుంటారో తెలియని మన రాజకీయ నాయకులు - మానసిక ఆందోళన ఎక్కువై- దేశం పట్ల తమ విధులు సవ్యంగా నిర్వర్తించలేరేమోనన్న భయాన్ని- ఒక భావిభారత పౌరుడిగా వ్యక్తం చేసాను. ఇలాంటి వాస్తవాలు వ్రాసినందుకు ఎగ్జామినర్ మార్కులు వేయకపోతే దానిలో నా తప్పేమిటి?" అంటూ లేచాడు బృహస్పతి.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS