Next Page 
త్రినేత్రుడు-1 పేజి 1


                          త్రినేత్రుడు-1

                            __ సూర్యదేవర రామ్ మోహనరావు  

 

  


    ఆ వీధి నిశ్శబ్దంగా వుంది. పొడవుగా దర్బారులా వున్న ఆ వీధి మొత్తం మీద ఒకే ఒక వీధి దీపం చీకటిని తరిమే ప్రయత్నంలో ఓడిపోతున్నట్లుగా వుంది.

    సమయం రాత్రి పదకొండు, పన్నెండు గంటల మధ్య భారంగా కదులుతోంది.

    ఆ వీధి చివర వున్న ఓ పాత సినిమా హాలు ముందు మఫ్టీలో ఇద్దరు 'స్పెషల్ డిటెక్టివ్ స్క్వాడ్ కానిస్టేబుల్స్' ఎవరి కోసమో నిరీక్షిస్తున్నారు.

    అందులో హెడ్ కానిస్టేబుల్ కోటి 'ఎక్స్ రే' కళ్ళు చుట్టు ప్రక్కల వ్యక్తుల్ని, పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి.

    ఎంతోసేపటినుంచి అక్కడ వారి నిరీక్షణ సాగుతోంది.


    సుదీర్ఘ నిరీక్షణలో అలసిపోయిన మరో కానిస్టేబుల్ నిస్త్రాణగా అక్కడే వున్న టీ కొట్టు ముందున్న బల్లమీద చతికిలబడితే, కోటి ఆలోచనలు సడన్ గా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో స్టేషన్ కి వచ్చిన ఫోన్ కాల్ మీదకు మళ్ళాయి.

    అక్కడ స్టేషన్ లో ఎస్.ఐ. రాఘవ అసహనంగా పచార్లు చేస్తున్నాడు.

    స్టేషన్ బయట ఓ జీప్ సిద్ధంగా వుంది. దానిలో ఐదారు రైఫిల్స్ సెర్చ్ లైట్, హేండ్ మైక్ సర్దున్నాయి.

    కోటి దగ్గరనుంచి రానున్న వైర్ లెస్ మెసేజ్ కోసం రాఘవలో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతోంది.


                      *    *    *    *


    సెకండ్ షో పూర్తవటానికి మరొక్క పదినిమిషాలు వుందనగా థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులు తమను తాము మరచి సినిమా క్లైమాక్స్ వెంట పరుగెడుతుండగా- ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సైగ చేసుకొని నిశ్శబ్దంగా లేచి నిలబడ్డారు.

    తమని ఎవరన్నా గమనిస్తున్నారేమోనని ఓసారి చెక్ చేసుకుని నెమ్మదిగా గేటువేపు కదిలారు.

    అదే అదనుకోసం కాచుక్కూర్చున్న తిమ్మడు, సిద్దప్పలు కూడా నిశ్శబ్దంగా లేచారు.

    మెల్లగా గేటువైపు నడక సాగించారు.

    మధ్యమధ్యలో తిమ్మడు చేత్తో కుడి దవడను సవరదీసుకుంటున్నాడు. ముందు వెళుతున్న ఇద్దరికీ- తిమ్మడు, సిద్దప్పలకు మధ్య దూరం కేవలం ఇరవై అడుగులే.

    ఓ అర నిమిషానికి ఆ ఇద్దరు వ్యక్తులు థియేటర్ నుంచి బయటపడ్డారు. కాని వారు మెయిన్ గేటువైపు తిరగలేదు. కుడివేపుకి తిరిగి థియేటర్ వెనుక వైపుకు వెళుతున్నారు. వారినే అనుసరించారు తిమ్మడు, సిద్దప్ప.

    ఆ ఇద్దరు వ్యక్తులు ఆ వీధి మలుపులో వుండగా తిమ్మడు ముందుగా ఎగిరి మీదకి దూకాడు.

    హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి ఆ ఇద్దరు వ్యక్తులు షాక్ అయ్యారు. వారు ఆ షాక్ నుంచి తేరుకొనేలోపు సిద్దప్ప వారి మీదకు ఉరికాడు.

    క్షణాల్లో వారిమధ్య ముష్టియుద్ధం మొదలైంది. అది అంతకంతకూ తీవ్రరూపం దాల్చుతోంది.

    ఆ ఇద్దరు వ్యక్తులకు తిమ్మడు, సిద్దప్పలతో తలపడాలని లేదు.

    తమ మీద పోలీసుల నిఘా తీవ్రంగా వున్నట్లు గతరాత్రే ఓ వర్తమానం అందుకున్నారు వాళ్ళు. ఆ పరిస్థితుల్లో తాము చక్కబెట్టవలసిన కార్యం నిమిత్తం చాపక్రింద నీరులా లక్ష్యంవైపు వెళ్ళాలనుకున్నారేగాని గలాభా సృష్టించి పోలీసుల దృష్టిని ఆకర్షించాలని అనుకోలేదు.

    పోనీ ఇద్దర్ని చెరో చావు దెబ్బతీసి స్పృహ తప్పేలా చేసి వెళ్దామంటే వాళ్ళంత తేలికైన వాళ్ళలా కనిపించటం లేదు.

    ఐదడుగుల పదంగుళాల ఎత్తులో, ఆరోగ్యంగా, బలిష్టంగా వున్న యువకులు, చిచ్చర పిడుగుల్లా వున్నారు.

    వీరి గలాభాకి ఉలిక్కిపడి లేచిన ఓ ఊరకుక్క ఆందోళనగా మొరగటం ప్రారంభించింది. దీన్ని చూసి మరొకటి- మరొకటి. చూస్తుండగానే నిర్మానుష్యంగా వున్న ఆ వీధి కుక్కల అరుపులతో, ఏడుపులతో గందరగోళంగా తయారయింది.

    ఎందుకులే లేనిపోని గొడవ అనుకొని అప్పటివరకూ ఎంతో జాగ్రత్తగా దెబ్బల్ని కాచుకుంటున్న ఇద్దరు వ్యక్తులలో ఒకడు తిమ్మడి ఏమరపాటును చాటుచేసుకొని నడుముచుట్టూ బిగించుకొన్న సైకిల్ చెయిన్ ని సర్రున బయటకు లాగి కనురెప్పపాటులో తిమ్మడి పైకి విసిరాడు.

    తిమ్మడి కళ్ళముందు నక్షత్రాలు మెరిసాయి. 

    పదునైన చాకుతో సర్రున వీపు చీల్చిన ఫీలింగ్. క్షణాల్లోనే ఈ దెబ్బ తాలూకు రక్తం జివ్వున చిమ్మి చొక్కా, ఫాంట్ ని తడిపేసింది. అది చూసిన సిద్దప్ప కాలరుద్రుడిళా పెద్దపెట్టున పొలికేక పెట్టి దగ్గర్లోనే వున్న ఓ బండరాయిని పైకి ఎత్తాడు..

    అప్పటికే ఆ ఇద్దరూ పదడుగుల దూరం వెళ్ళిపోయారు. తిమ్మడు బాధగా ఒరిగిపోయాడు.

    సిద్దప్పకి ఏం చేయాలో పాలుపోలేదు.

    తక్షణం తిమ్మణ్ణి హాస్పటల్ కి తీసుకెళ్ళకపోతే మరింత రక్తం పోయే ప్రమాదం వుందని సిద్దప్ప ఆ ప్రయత్నాల్లో వుండగా పాము పడగలా ఒక్కసారి పైకిలేచి తిమ్మడు మెరుపు వేగం అందుకున్నాడు.

    తిమ్మడి పట్టుదల తెలిసినవాడే సిద్దప్ప. తనూ వార్ని వేటాడే ప్రయత్నంలో పడ్డాడు సిద్దప్ప.

    హెడ్ కానిస్టేబుల్ కోటికి అనుమానం వచ్చింది. ఆ ఇద్దరూ ఇటే వస్తారని ఏమిటి నమ్మకం? థియేటర్ వెనుక వైపు నుంచి ఉడాయిస్తే?

    అంతే! మరొక్క క్షణం అక్కడ వృధా చేయలేదు. క్షణాల్లో కోటి ఎక్కిన సైకిల్ థియేటర్ వెనుకవైపు వీధిలోకి మలుపు తిరిగింది.

    కోటి మలుపు తిరగటం, దెబ్బ తిన్న తిమ్మడు చిరుతపులిలా వారిని వెంటాడ్డం- ఆ వెనుకే సిద్దప్ప దూసుకుపోవడం ఒకేసారి జరిగింది.

    జరిగిన పొరపాటు గ్రహించిన కోటి సైకిల్ వేగాన్ని పెంచాడు.

    దూరంగా ఇద్దరు వ్యక్తులు, వారికి వెనుకగా మరిద్దరు వ్యక్తులు పరిగెత్తుకుపోవటమే ఇప్పుడు కోటికి కనిపిస్తోంది.

    కోటి హఠాత్తుగా సైకిల్ ఎక్కి థియేటర్ వెనుకకు వెళ్ళటాన్ని గమనించిన రెండో కానిస్టేబుల్ తనూ ఒక సైకిల్ స్టాండు తీశాడు.

    వీధి మలుపు తిరుగుతుండగా కనిపించిన దృశ్యానికి అతను ఓ క్షణం అనుమానపడ్డాడు.

    చటుక్కున రహస్యంగా దాచుకున్న 'వైర్ లెస్ సెట్' బయటకు తీసి ఆన్ చేశాడు.

    "సార్... హెడ్ గారు మారుతి థియేటర్ వెనుకవైపు వీధిలో ఎవరినో వెంటాడుతూ వెళుతున్నాడు" ఇతను చెప్పటం ఇంకా ఆపలేదు. రాఘవ అప్పటికే జీప్ లోకి దూకాడు.


                     *    *    *    *


    వీధి చివరగా వున్న ఆ ఇల్లు ఆ నిశిరాత్రివేళ పాలపుంత నుంచి విసిరేసిన ఒంటరి నక్షత్రంళా బిక్కుబిక్కుమంటూ వుంది.

    ఆమె మోకాళ్ళ మధ్య తల వంచుకుని గత స్మృతుల్ని నెమరు వేసుకుంటోంది. ఎదురుగా ఓ సీసా- దానిలో సగంవరకు కిరోసిన్ వుంది. గుడ్డ పీలికతో చేసిన వత్తి ఆ సీసా మూత మధ్యలోంచి కొద్దిగా పైకి వచ్చి కాస్తంత వెలుతురును ప్రసరింపచేస్తోంది.

    ప్రస్తుతం నలభయ్యవ వడిలో వున్నా కళ్ళలో ప్రాణం వున్నట్లుగా వుంది ఆమె.

    22 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రయాణంలో మిగుల్చుకున్నది కేవలం అవమానం.

    ఉన్నట్లుండి ఆలోచనల్లోంచి ఉలిక్కిపడి లేచింది. లేచి ఓపిక తెచ్చుకుని గడపవరకు వచ్చి ఓసారి వీధి చివరికి చూపులు సారించింది. వీధంతా నిర్మానుష్యంగా వుంది. భారంగా నిట్టూర్చి గడపమీదే కూలబడి పోయింది. తలవంచుకుని చూపుడువేలితో గడపను రాస్తూ తిరిగి ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది.

    కడు పేదరాలిగా ఊరి చివర వీధిలో, ఆ వీధి చివర ఇంటిలో ఒక్కతే తన కొడుకుతో బతుకును భారంగా వెళ్ళదీస్తున్న ఆమె అక్కడున్న అందరికీ స్నేహపాత్రురాలు.

    వయస్సులో వున్నప్పుడు గొప్ప అందగత్తె అన్న భావాన్ని కల్గించేలా ఆమెలో మిగిలిపోయిన హుందాతనం, ఆకలి, పేదరికం ఆక్రమించుకున్నా ఇంకా ఆరోగ్యంగా వున్న ఆమె తెల్లటి శరీరం, చురుకైన కళ్ళు, ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తున్నా చెక్కు చెదరని స్థయిర్యం, కష్టాల్ని, కన్నీళ్ళను, వేదాంతంతో నెగ్గుకురాగల ఆత్మవిశ్వాసం, తిరిగి ఎప్పటికైనా ఆ రోజులు రాకపోతాయా అన్న ఆశాభావం, కొండల్ని సైతం ఢీ కొట్టగల తెగువ ఆమెలో ఇంకా మిగిలి వున్నట్లు ఆమెకి మాత్రమే తెలిసిన నిజాలు.

    చూపుడు వేలితో జ్ఞాపకాల్ని తవ్వుకుంటూ తలెత్తి మరోసారి చూసింది. ఎవరో ఒక త్రాగుబోతు రోడ్డంట నడుస్తూ తూలుతూ వస్తున్నాడు.

    తను నిరీక్షిస్తున్న వ్యక్తి జాడే కనిపించడం లేదు.

    లేచి నిలబడి నలువేపులా ఓసారి చూసి, లోపలకు నడిచి తలుపు దగ్గరగా నెట్టి చాపమీద వాలిపోయి, ఇంటి పైకప్పులోంచి కంతల్ని చూస్తూ అలసిపోయిన కనురెప్పల్ని అప్పుడప్పుడు మూస్తూ తెరుస్తోంది.

    ఖరీదైన కాలయంత్రాలు కలిసిరాని కాలంతో కదిలి వెళ్ళిపోతే కారు చీకటిలో కదిలే కాంతి నక్షత్రాలే కాల గమనాన్ని తెలియజేస్తున్నాయి ఇప్పుడామెకు.

    మరోసారి లేచి బయటకు వచ్చి పైకి చూసి అర్దరాత్రి దాటి చాలా సేపయిందని అనుకుంది వాసమ్మ.


                     *    *    *    *


    ఆ ఇద్దరు వ్యక్తులూ సడన్ గా రూట్ మార్చి ఆ వీధి చివర నుంచి మొదలయ్యే చిట్టడవిలోకి దూకి అదృశ్యం అయ్యారు.

    నిమిషంలో అక్కడకు చేరుకున్న తిమ్మడు ఓసారి కళ్ళు చిట్లించి చూశాడు. పల్చని వెన్నల్లో చిక్కటి చిట్టడవి. వాళ్ళు దొరుకుతారనే ఆశ లేనేలేదు. వెళ్ళాలా వద్దా? వెంటాడాలా వద్దా? అని ఓ క్షణం యోచించి ముందుకు దూకబోతుండగా భుజంమీద చేయి పడింది.

    తిమ్మడు వెనుతిరిగి చూశాడు.

    సిద్దప్ప వద్దన్నట్లుగా తనవేపే అర్ధింపుగా చూస్తున్నాడు. ఓ క్షణం సిద్దప్ప వేపు తీక్షణంగా చూసి చెంగున ముందుకు దూకాడు.

    తన కసి తీరేవరకు వాళ్ళని వదలడు- దెబ్బ తీయకుండా వెనుతిరగడు..

    సిద్ధప్ప ఓ క్షణం వణికిపోయాడు.

    ఇంతటి ఆవేశం ఇతనిలో ఎలా చోటుచేసుకుంది? భవిష్యత్తులో ఎంత చేటు తెస్తుంది?

    ఉలిక్కిపడి ఆలోచనలనుంచి తేరుకొని ముందు తిమ్మడికి అండగా నిలబడాలి. ఆ తరువాతే అతన్ని బాగుచేసే ప్రయత్నం అని అనుకున్న మరుక్షణం తూనీగలా తిమ్మడు వెళ్ళేవైపే దూసుకుపోయాడు సిద్ధప్ప. సిద్ధప్ప అడవిలోకి దూరిన అర నిమిషానికి కోటి సైకిల్ అక్కడకు చేరుకుంది.

    ఇక సైకిల్ ముందుకు సాగదు.

    సైకిల్ దిగి తను వెళ్ళనున్న వైపుకి ఆ సైకిల్ హేండిల్ తిప్పి, అక్కడే స్టాండ్ వేసి లోపలికి దూకాడు కోటి.

    సరిగ్గా మరో నిమిషానికి రాఘవ జీప్ అక్కడకు చేరుకుంది. జీప్ ఆపి రాఘవ క్రిందకు దిగాడు. అక్కడే పెట్టి వున్న కోటి సైకిల్ ను గుర్తుపట్టాడు.

    దానికి దగ్గరగా వెళ్ళి చూసాడు. హేండిల్ స్ట్రెయిట్ గా లేక కాస్తంత పక్కకు తిరిగి వుంది. గతంలో రహస్యంగా అరేంజ్ చేసుకున్న కోడ్స్ ప్రకారం సైకిల్ హేండిల్ సూచించే వేపుకు వెళ్ళిపోవాలి.

    జీప్ లో వున్న నలుగురు పోలీసులు అప్పటికే దిగి చేతుల్లో రైఫిల్స్ హేండ్ మైక్, సెర్చ్ లైట్ తో సిద్ధంగా వున్నారు.

    మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా హేండిల్ సూచించే వైపుకు సాగిపోయారు వేగంగా.

    ఉధృతంగా వీస్తున్న గాలి మూలంగా సైకిల్ హేండిల్ కుడివేపుకు తిరిగిందని రాఘవ గ్రహించే స్థితిలో లేడు.

    కరక్ట్ గా ప్రమాదం పొంచివున్న వేపుకే హేండిల్ తిరగటం కేవలం యాదృచ్చికం.


                      *    *    *    *


    తెల్లవారుఝాము అయింది.

    చల్లని ఈదురుగాలులు ఉండుండి వీస్తున్నాయి. పరమ నిష్టగా ఆ ఘడియకే స్నానం చేసే అలవాటున్న నిష్ఠాగరిష్ఠులు సైతం భయపడేంతగా వుంది చలి.

    ఓ ప్రక్క మట్టిగోడలు, పైన చిల్లులున్న కప్పు క్రింద బీటలు ఇచ్చిన సిమెంట్ బండలు ఉన్నా, చలిని మరింత పెంచే పేద కొంప చలితో పోరాడుతున్నట్లుంది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS