Next Page 
నిశ్శబ్దం-నీకూ-నాకూ మధ్య పేజి 1


                                నిశ్శబ్దం - నీకూ - నాకూ మధ్య

                                         _ యండమూరి వీరేంద్రనాథ్

 




    "నేనొక అత్యంత తెలివైన మెదడును కలిగియున్న గొప్ప వెధవని" అని ఇంగ్లీషులో అనుకున్నాడు శంభుమిత్ర. మిగతా వాళ్ళకి దూరంగా నిలబడి, వాళ్ళనే చూస్తూ!


    కంజాత దళాల కింద కుంజిరంలా అంజనరేఖ, మంజరి తన మంజీరాన్ని కదిలిస్తే ఖంజరిపై సంజోక శబ్దం. కంజుడు గంజాయి తాగి అంజాయిస్తూ సృష్టిస్తే - మంజులు చేరి భంజిస్తే ఆడమ్మో, ఈవో తెలియని బంజారీలు, పింజారీలు.

    "హార్డేస్ నైట్" అంటున్నాడు పింజారి.

    "మై హార్డీజ్ బీటింగ్" అంటూంది బంజారీ.

    గుండె బీటివ్వక చస్తుందా. ఛస్తే ఎలానూ ఇవ్వదు.

    పదిమంది వున్నారక్కడ. పద్దెనిమిదీ, ఇరవై రెండు వయసున్న కుర్రవాళ్ళూ, ముప్పై నాలుగు, ఇరవయ్యీ, ముప్పై నాలుగు కొలతున్న ఆడవాళ్ళు.

    ఎంత హుషారుగా వున్నారు! అందమైనవాళ్ళు.... ఆనందం, సొంతమైనవాళ్ళు. అరుస్తున్నారు. నవ్వుతున్నారు. కేరింతలు కొడుతున్నారు.

    ఆలోచన లేదు - అనుభవం తప్ప.

    అనుభూతి లేదు - ఆదేశం తప్ప.   

    "ఓరీనీప్ప్లిట్ పెర్సనాలిటీ తగలెయ్య. జాపాల్ సాత్రేని వదలిపెట్టు" తనలోతనే అనుకున్నాడు శంభుమిత్ర.

    పొగ.

    గోల.

    గిటారు, డ్రమ్సూ, మాటలూ -మాటలు - మాటలు.

    ఆ కుర్తా వేసుకున్న అమ్మాయి ఎంత బావుందీ! భుజాలు మీదకి జుట్టూ - లేత కళ్ళూ, ఎర్రటి బుగ్గలూ.

    బల్ల అంచున వాలుగా కూర్చొని హొయలుగా కాలు వూపుతూ వైన్ గ్లాసు తిప్పుతూ ....జీవితాన్ని కేరెపిన్ అనుకున్న ధీమా. ఆ అమ్మాయిని చూడాల్సింది-

    ఆరెస్బాని.

    ఆ రెస్.బా.

    గళ్ళ షర్టు బెల్ బాటమ్ లోకి ఇన్ షర్టు. కుడివైపు ఒకళ్ళనీ ఎడమవైపు ఒకళ్ళనీ పడుకోబెట్టగలిగేటంత విశాల ఛాతి.

    ఉహుఁ! అవీ కావు చూడాల్సింది.

    వాడి మాటలు.

    అవును మాటలు.

    వాడొస్తేనే పార్టీలో హుషారు. వెళ్ళిపోగానే దిగజారు.

    రాగానే ఆ కుర్తా అమ్మాయితో హస్కు వేసుకున్నాడు. చుట్టూ మరి నలుగురు అమ్మాయిలూ చేరారు. ఇంక వాడే హీరో.

    తను విలనా-

    కాదు.

    జగ్గయ్య, చేతనానంద్, డానీ....ల్లా సీరియస్ టైప్ కారెక్టర్. తనకు మాటల్రావు. అమ్మాయిని చూస్తే మొహంమీద నవ్వు రాదు. అసలేమీ రాదు.

    పెద్ద నవ్వు.

    అటు చూచాడు.

    ఆరెస్బా వేసిన జోకుకు కుర్తా అమ్మాయి పడి పడి నవ్వుతోంది. గుండెలమీద చెయ్యి వేసుకుని ముందుకు వంగి వంగి నవ్వుతూంది. రెండు నిమిషాలు నవ్వీ నవ్వీ, ఆరెస్బా తనవైపు తదేకంగా చూడటం చూసి నవ్వాపి ఏమిటి చూస్తున్నావ్" అంది.

    "భూమిని స్త్రీతో పోలుస్తారు. కానీ నీ బ్రస్ట్సు చూసి భూమి కూడా ఆవేశం ఆపుకోలేక ఆకర్షణశక్తి ఉపయోగించి నిన్ను తన విఅపు లాక్కొంటూంది చూడు."

    ముందుకు వంగి వున్నది చప్పున సరిగా కూచుని చిరుకోపంతో చూసింది.

    ఓరి శంభూ! పెళ్ళయి పదేళ్ళయ్యాకైనా నువ్వు నీ భార్యతో ఇలా అనగలవా.

    - నా సంస్కారం జాతి.

    నోర్ముయ్యవోయ్.

    రంగు రంగుల బల్బుల మధ్య మసక చీకటి. దూరంగా ఎత్తయిన ప్లాట్ ఫామ్ లాటి దానిమీద నిలబడి మిగతా అందర్నీ చూస్తున్నాడు శంభుమిత్ర. చేతిలో ఫార్మాలిటీకోసం గ్లాసు. మనసులో వేదన.

    పదిమందిలో వుంటే ఒంటిగా వుండాలనిపిస్తుంది. ఒంటిగా వుంటే పదిమందిలోకి వెళ్ళాలనిపిస్తుంది.

    గదిలో అందరూ జంటలు జంటలుగా చేరి మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా జంటలు జంటలు. తనే ఈ వెధవ కాంప్లెక్స్ తో చూస్తున్నాడు.

    కుర్తా అమ్మాయిని వదిలి ఆరెస్బా బెల్ బాటమ్ అమ్మాయి దగ్గర కెళ్ళాడు. ఏ అమ్మాయి మొహంలోనైనా సరే ఆరెస్బా వస్తే చాలు హుషారు వచ్చేస్తుంది. తను వెళితే గౌరవమూ, నమ్రతాను.

    మారాలి.

    ఆరు మూడయినా మూడారయినా మారాలి.

    అందరిలో కలిసిపోవాలి.

    నెమ్మదిగా కదిలి వాళ్ళలోకి వెళ్ళాడు.

    తరవాతేం చెయ్యాలి ?

    కుర్తా అమ్మాయి దగ్గరగా వచ్చింది.

    నవ్వాడు ఆ అమ్మాయి పలకరింపుగా నవ్వి అతడి దగ్గర ఆగింది.

    ఏదో చెప్పాలి, ఏదన్నా అనాలి.

    ఏం అనాలి ?

    "హాయ్" అని ఆరెస్బా అరుపు ఇంకో మూలనుండి.

    అమ్మాయి అటు వెళ్ళింది.

    గ్లాసు విసిరి నేలకి కొడదామన్న కాసిని బలవంతంగా ఆపుకున్నాడు.

    చేతిమీద కర్చీఫ్ కప్పుకొని ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు ఆరెస్బా. చుట్టూ మళ్ళీ నలుగురు అమ్మాయిలు.

    శంభు హోస్టు దగ్గరికి వెళ్ళి "నే వెళ్ళొస్తాను. అండ్ థాంక్స్ ఫర్ పార్టీ" అన్నాడు.

    "అప్పుడేనా!"

    "పదిన్నర అవుతోంది."

    "సరే అయితే, థాంక్యూ" షేక్ హాండ్ ఇచ్చి బయటకు వస్తూ వుంటే- "గురు ఒక్క క్షణం" అన్న కేక వెనకనుంచి వినిపించింది.... "నేను వచ్చేస్తున్నాను."

    చూస్తే చంద్రం.

    చేతిలో గ్లాసు పూర్తిచేసి పెట్టేసి, పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరూ బయట కొచ్చారు.

    "పార్టీ బాగుంది కదూ" కారులో కూర్చున్నాక అన్నాడు చంద్రం.

    "బావుంది" అవసరమైన దానికంటే ఎక్కువ ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తున్నాడు.

    "ఆ తెల్ల మాక్సీ వేసుకున్న అమ్మాయి భలే వుంది."

    "ఊఁ"

    "ఆరెస్బా దగ్గిర చాలా కొత్త ఎల్.పి. లున్నాయి."

    "ఆ."

    చంద్రం స్నేహితుడివైపు చూసి "ఏమిటి నువ్వు ఈ లోకంలో లేనట్టున్నావ్" అన్నాడు.

    "ఆలోచిస్తున్నాను."

    "దేని గురించి?"

    వర్షం పడటంవల్ల రోడ్డు అద్దంలా మెరుస్తూ లైటు కాంతిని ప్రతిబింబిస్తూ వుంది. అంతా నిర్మానుష్యంగా వుంది. దూరంగా ఎక్కడో మరో కారు హారను. స్ట్రీట్ లైట్లు వేగంగా వెనక్కి వెళుతున్నాయి. చల్లటిగాలి గాజు అద్దాల మధ్యనుంచి బలంగా వీస్తోంది. శంభు చేతుల్లో స్టీరింగ్ వుందన్న మాటేగాని ఆలోహణ మాత్రం ఎక్కడో వుంది. తనేం ఆలోచిస్తున్నాడు! ఒకటే ఆలోచన.

    అబ్బాయి, అమ్మాయీ ఏం మాట్లాడుకుంటారు? మొదటిసారి కలిసినప్పుడేమిటి? తరువాత్తరువాతేమిటి?


                                                               *    *    *


    శంభుమిత్ర తన ఇంటి మేడమీద, పారాపెట్ వాల్ మీద చేతులాన్చి వంగొని రోడ్డుమీద పోయే జనాన్ని చూస్తున్నాడు. రోడ్డు కెదురుగా అవతలిపక్క పార్కు వుంది.

    పచ్చటి గడ్డి, మధ్యన ఎర్రటి మట్టిరోడ్డు.... ఆర్చీల్లా పెంచిన లతలు, దుబ్బులు- పైనుంచి చూస్తూంటే కాన్వాస్ మీద వేసిన బొమ్మలా వుంది పార్కు.

    సాయంత్రం ఆరున్నర అయింది, పిల్లలు ఆడుకుంటున్నారు. దంపతులు పిల్లల్ని చూస్తూ నవ్వుతున్నారు. పల్లీల కుర్రవాళ్ళు హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు.

    "నాన్నగారి దగ్గరనుంచి ఉత్తరాలు వస్తున్నాయా?" అడిగాడు చంద్రం. పారాపెట్ వాల్ కి ఆనుకుని కూర్చున్నాడు అతడు.

    "ఆ, నిన్నే వచ్చింది."

    "ఏమంటారు...."

    "అప్పుడెప్పుడో వ్రాసేను.... అంబాసిడర్ అమ్మేసి ఫియట్ కొనుక్కుంటానని.... అయిదు వేలు డ్రాఫ్టు పంపారు."

    "అదృష్టవంతుడివి" అని కొద్దిసేపు ఆగి "నిన్ను బాగా లైక్ చేస్తారనుకుంటాను కదూ మీ నాన్నగారు" అన్నాడు.

    "అడగ్గానే అయిదువేలు పంపడం లైకింగా?" ఎదురుప్రశ్న వేశాడు శంభు.

    "ఆహా! అది కాదనుకో. ఎలాగైనా ఒక్కడే కొడుకువి కదా."

    "అందుక్కాదు" అన్నాడు మిత్ర. జ్ఞాపకం పొరల్లో ఎక్కడో ఏదో అస్పష్టంగా కదిలి, కంట్లో సన్నటి నీటి తెర. టాపిక్ మారుస్తూ అన్నాడు-

    "మేం ఎప్పుడు కలిసినా పరిపూర్ణ వ్యక్తిత్వం గల మనుషుల్లాగానే మాట్లాడుకుంటాం. ఆయన వ్యాపార దక్షతని నేను మెచ్చుకుంటాను. బాగా చదువుకుని నా కాళ్ళమీద నేను నిలబడి మంచి ఉద్యోగం చేస్తున్నందుకూ, ఏ వ్యసనాలూ లేనందుకూ ఆయన నన్ను మెచ్చుకుంటారు అంతే."

    "అంటే మీ ఇద్దరి మధ్యా ఒక బలమైన లింకు తెగిపోయిందంటావ్" చంద్రం అడిగాడు.

    "అవును."

    "ఏమిటా లింకు!"

    "అమ్మ."

    సాయంకాలపు నీడ అతని లేత చెంపలమీద జాలిగా జారుతోంది. నిటారుగా నిలబడి చూస్తున్నాడు. కృంగిపోతున్న సూర్యుడు.... నలుపులో కలిసిపోతున్న పొడుగాటి నీడ. వ్యక్తిత్వంతో స్థిరపడిన వెన్ను.... తీక్షణమైన కళ్ళు వెతికితే వాడివెనుక కనబడే ఆర్తి.

    "కొంచెంసేపు వాయించు" అడిగాడు చంద్రం. మిత్ర తల త్రిప్పి ప్రక్కనే చాపమీదవున్న సితారువైపు చూశాడు. తల తిప్పుకుంటూ, "ఊహూ.... మూడ్ లేదు" అన్నాడు.

    ఈ లోపుగా హరిదా రెండు కప్పుల టీ ట్రేలో పట్టుకొచ్చాడు.

    "ఏం హరీ! ఎప్పుడు వెళ్తున్నావు కలకత్తా" కప్పు అందుకుంటూ అడిగాడు చంద్రం.

    "బాబుగారిని వదిలి వెళితే అక్కడ అయ్యగారు కాళ్ళిరగకొడతారు బాబూ" అన్నాడు ముసలివాడు.

    చంద్రం మిత్రవైపు తిరిగి "చూస్తూవుంటే ఈ బెంగాలీ వంటవాడు నిన్ను పెళ్ళాడేటట్టు వున్నాడు సుమా" అన్నాడు ఇంగ్లీషులో. మిత్ర నవ్వి వూరుకున్నాడు.

    హరిదా ఖాళీ కప్పులు, ట్రే పట్టుకుని వెళ్లిపోయాడు.

    దూరంనుంచి స్కూటర్ మీద ఆరెస్బా రావటం కనిపించింది. అరవై కిలోమీటర్ల స్పీడుతో వచ్చి సడన్ బ్రేక్ వేసి, గాలిలా దూసుకు వచ్చాడు.

    "గురూ-ఈ ఒక్కసారి నీ ఇల్లు కావాలి. కేవలం రెండు గంటలు. రెండు గంటలు చాలు గురో! లక్ష్మీ ప్రసన్న మంగతాయారని కొత్త స్నేహితురాలు. హోటల్స్ కీ, రూమ్స్ కి రాదు. గౌరవప్రదమైన ఇల్లేదీ అని ఆలోచిస్తే గుర్తుకొచ్చావు. గురూ ప్లీజ్."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS