Next Page 
రుధిర మందారం పేజి 1

   
                                 రుధిర మందారం   
                                          __ కురుమద్దాలి విజయలక్ష్మి

                                                           
    సాయంత్రం ఆరు గంటల సమయం__
    స్ట్రీట్ లైట్స్ గప్పున వెలిగాయి
    రంగూన్ పెద్ద బజారు ఆ వెలుగులో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది. ఉండి ఉండి తుప్పర పడుతున్నది. అయినా షాపులు కిటకిటలాడుతున్నాయి. బజారులో జనం, షాపుల్లో జనం నేల ఈనినట్లున్నారు.
    రెయిన్ కోటు ధరించి, చప్పుడు చేయని మెత్తని బూట్లు, తలపై ఈవెనింగ్ హేటు, చేతిలో బరువుగా ఉన్న సూట్ కేసు. వేగంగా ముందుకు అడుగులేస్తున్నాను.
    ఎవరయినా నన్ను గమనిస్తారేమో అని, టోపీ ముఖం మీదకు లాక్కుని తల వంచుకుని ముందుకు సాగాను.
    అరగంట నడిచి చిన్న సందులోకి ప్రవేశించాను.
    పేరుకి చిన్న సందయినా జనం రాకపోకలు ఎక్కువగానే ఉన్నాయి. చైనా వాడు నడుపుతున్న చిన్న హోటల్ ఎక్కడో, అని గమనిస్తూ పది అడుగులు వేశానో, లేదో ఆ హోటల్ కనపడింది. 
    హోటల్ ముందున్న నాలుగు మెట్లు ఎక్కి హోటల్లో ప్రవేశించాను.
    హోటల్ అంత రష్ గా లేదు.
    నన్ను చూస్తూనే బట్లర్ చకచక నా వద్దకు వచ్చాడు.
    "రండి సార్! మీకు కావలసినవి వేడిగా రెడీగా ఉన్నాయి" అన్నాడు వినయంగా.
    చేతినిండా పని లేని బట్లర్ ని చూస్తుంటే, హోటల్ పరిస్థితి అంతంత మాత్రంగా నడుస్తున్నదని తెలిసిపోతున్నది.
    నాకేం అక్కరలేదు అన్నట్లు చిరునవ్వుతో తల అడ్డంగా తిప్పాను.
    నేనెందుకొచ్చానో బట్లర్ కి అర్ధంకాలేదు. అయోమయంగా చూచాడు.
    "అర్జంట్ గా మేనేజర్ ని కలుసుకొని మాట్లాడాలి. ఆ కౌంటర్ లో ఉంది హోటల్ మేనేజరేనా?"
    "అవును. అతనే మేనేజరు, ఓనరు సమస్తం" అన్నాడు బట్లర్, నన్ను కిందనుంచి పైదాకా పరీక్షగా చూస్తూ.
    "అతడి పేరు?"
    "వాంగ్ యీచూ."
    "థాంక్స్."
    గబగబా కౌంటర్ వేపు నడిచాను.
    నేను, బట్లరు మాట్లాడటం అంతవరకు గమనిస్తున్న వాంగ్ యీచూ నన్ను చూడనట్లు ముఖం పక్కకు తిప్పి, నిఠారుగా కూర్చున్నాడు కుర్చీలో.    
    "మిష్టర్ వాంగ్ యీచూ, అర్జంట్ గా రూం కావాలి" అన్నాను.
    "మా హోటల్లోని మొత్తం రూమ్స్ పది. ఆ పది ఎప్పుడో ఫిలప్ అయిపోయాయి, సారీసర్. మరోచోట ప్రయత్నించండి."
    "అర్జంట్ అని ముందే చెప్పాకదా! నేనెప్పుడు ఈ వూరొచ్చినా పెద్ద హోటల్స్ లోనే దిగుతాను. కాని...ప్రస్తుతం ఓ మారుమూలగా ఉన్న చిన్న హోటల్లో చిన్న గది ఉంటే చాలు. అన్నట్లు మీ హోటల్లో రూమ్ రెంట్ ఎంత?"
    "రోజుకి అయిదు."
    "ఆహా"
    దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి, "ఈ విషమ సమస్యనుంచి తప్పించుకోవటం ఎట్లా అబ్బా!" అన్నట్లు మునిపంటితో పెదవి కొరుకుతూ నొసలు ముడివేశాను.
    వీడు ఎలాంటి రకమా? అని వాంగ్ యీచూ నన్నే గమనిస్తున్నాడు.
    "మిష్టర్ వాంగ్ యీచూ! రోజుకి పాతిక ఇస్తాను. రూమ్ చూడండి. రూమ్ ఇరుకయినా ఫరవాలేదు సర్దుకుపోతాను."
    "రోజుకి పాతికా?" నోరు తెరిచాడు వాంగ్ యీచూ.
    "ఆఁ. పాతిక, అక్షరాలా పాతిక ఇస్తాను."
    వాంగ్ యీచూ ముఖంలో బాధ చోటు చేసుకుంది.
    "ఒకే ఒక్క రూమ్ నాలుగు రోజులనుండీ ఖాళీగా వుంది? గంటకు క్రితమే ఒకతను వారం రోజులకు బుక్ చేసుకున్నాడు."
    "మీరుండేది ఎక్కడ?"
    "మేడ మీద. కింద హోటలు పైన మేముండే హౌస్."
    "రోజుకి యాభై ఇస్తాను. మీరుండే హౌస్ లో చిన్నగది వుంటే ఇవ్వండి. సరీగా ఒక నెల మాత్రమే ఉంటాను. అవసరం, అర్జంట్" అవసరం, అర్జంట్ అన్న మాటలు నొక్కి పలుకుతూ అన్నాను.
    వాంగ్ యీచూ ఆలోచనలో పడ్డాడు. నెలకి ఎంత పెద్ద మొత్తం అవుతుందో ఆలోచించి లెక్క వేశాడు. చాలా పెద్ద అంకె కళ్ళముందు కదులాడింది. వెంటనే దీనిలో ఏదయినా మోసం ఉంటుందా అని చిన్న అనుమానం ప్రవేశించింది.
    వాంగ్ యీచూని పరిశీలనగా చూస్తున్న నాకు అతని మనస్తత్వం బాగా అర్ధం అయింది. డబ్బు మనిషి. నాకు కావలసింది అదే.
    "అర్జంట్, అన్నమాట మీకు అనుమానం కలిగించి ఉంటుంది. అవునా?" వాంగ్ యీచూ కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ అన్నాను.
    "అబ్బెబ్బె! అదేం లేదు. మీకు తప్పక రూమ్ కావాలంటున్నారు. నాకూ ఇవ్వాలనే ఉంది. ఎలానా, అని ఆలోచిస్తున్నాను. పైన మేముండేది నాలుగు గదులు సామానుతో నిండివుంటాయి ఆ గదులు నాలుగు..."
    "మీరెంత మంది ఉంటారు?"
    "నేనూ, నా వైఫ్. సామానే ఎక్కువ!"
    "ఇహ మీరేం చెప్పొద్దు. మీఇరువురే కాబట్టి ఎలాగో అలా ఓ నెల సర్దుకోండి" అంటూ సూట్ కేస్ కొద్దిగా తెరిచాను.
    వాంగ్ యీచూ చూపులు తెరిచిన నా సూట్ కేస్ పై పడ్డాయి. సూట్ కేస్ నిండా కొత్తరూపాయల కట్టలు. మేలి ముత్యాలహారం. విలువయిన రత్నాలు రెండు ఉన్నాయి. సూట్ కేస్ మూత కొద్దిగా తెరిచినా సూట్ కేస్ లో ఏముందో చూచే ఉంటాడు. ఈ విషయం గమనించాను.
    వాంగ్ యీచూ చేతిలో "ఎడ్వాన్స్" అంటూ నాలుగు పెద్ద కాగితాలు సరికొత్తవి పెట్టాను. "ఇప్పుడే వస్తాను" అంటూ ఓ పక్కనే ఉన్న మేడమెట్లకేసి వెళ్ళి వేగంగా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాడు వాంగ్ యీచూ.
    నా సంభాషణ ఎవరైనా విన్నారా? నన్నెవరయినా గమనిస్తున్నారా? అని నలువైపులా చూచాను.
    ఎవరి దోవన వారు తినటం, తాగటంలో మునిగిపోయి ఉన్నారు. తృప్తిగా శ్వాస పీల్చుకున్నాను.
    తుప్పర్లు పడుతున్న వాన పెద్దదయింది.
    వాంగ్ యీచూ నిరాశగా అతి నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు. కౌంటర్ వద్దకు రాగానే తల వంచుకుని నా నోట్లు నా చేతిలో ఉంచుతూ, "సారీ! రూమ్ ఇవ్వటానికి నా వైఫ్ వప్పుకోవటం లేదు. కాని..." అర్ధోక్తిగా ఆగిపోయాడు.
    "సంశయించవద్దు. చెప్పండి" ఆతృతగా అడిగాను.
    "నా వైఫ్ సంగతి మీకు తెలియదు. అనుమానం పెద్దమ్మ. పెద్ద పెద్ద హోటల్స్ కిచ్చే చార్జీ ఇచ్చి మనింట్లో ఉంటానంటే ఏదో పెద్ద కారణం ఉండే వుంటుంది. మీరేమో ఆ హోటల్లో పడి వుంటారు. మనింట్లో గది ఇవ్వటమంటే ఆలోచించాల్సిన విషయం. అతనంతగా ప్రాధేయపడుతున్నాడంటున్నారు గాబట్టి ఎడ్వాన్స్ ఇచ్చిన డబ్బు వదులుకొని ఏ రోజు కారోజు ఓ గంట కూడా ఆలస్యం కాకుండా డబ్బు ఇస్తాడేమో కనుక్కోండి అంది. మీ అవసరం కొద్దీ ఇప్పటికే రూం రెంట్ ఎక్కువిస్తున్నారు. ఇంకా ఎడ్వాన్స్ వదులుకోమంటే ఏం బావుంటుంది చెప్పండి. నా వైఫ్ సంగతి చెప్పా కదా! మొండిది. ఆశ ఎక్కువ. దయచేసి మరో చోట ప్రయత్నించండి." అన్నాడు వాంగ్ యీచూ.
    నా మనసు తేలిక పడింది.
    "మనం చాలా తేలికగా తీసుకునే విషయాలు ఆడవాళ్ళు సీరియస్ గా తీసుకుంటారు. రూపాయొస్తే మనం సంతోషపడతాము. ఆడవాళ్ళకు రూపాయి వచ్చేచోట అయిదు రూపాయలొచ్చినా తృప్తి పడరు. సిల్లీ ఎడ్వాన్స్ తిరిగి ఇవ్వక్కరలేదు. తొందరగా రూమ్ ఖాళీ చేయించండి. కాస్త విశ్రాంతి తీసుకోవాలి" చేతిలో నోట్లు వాంగ్ యీచూ ముందు వుంచాను.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS