Previous Page Next Page 
శిక్ష పేజి 3


    పూర్వం పిల్లలకి ఉదయం దొరికే పాలకి బదులు యిప్పుడు కప్పు టీ నీళ్ళు దొరుకుతాయి. తొమ్మిది గంటలకి ఇదివరకు తినే భోజనం యిప్పుడూ వుంది గాని కప్పులతో రెండు కప్పులు అన్నం-నీళ్ళ పప్పు లేక పులుసు ఓ కూర మాత్రం వుంటాయి. బజారులో అన్నింటికంటే చవగ్గా దొరికే కూరే ప్రతిరోజూ వుంటుంది. తోటకూరే కూర అదే పులుసు-లేదంటే వంకాయే-గుమ్మడికాయో-ఇంత పల్చగా జావలా చేస్తాడు ఆ వంటవాడు-ఆకలికి గిల్లిలలాడే ఆ ప్రాణాలు అదే అమృతం అన్నట్టు ఆశగా తింటారు. ఉదయం తొమ్మిదికి తిని సాయంత్రం స్కూలునుంచి రాగానే ఆవురావురుమనే ఆ పిల్లలకి కప్పు టీ-ఆ రెండు బిస్కెట్లు-లేదా గోధుమజావలాంటి ఉప్మా అనే పదార్ధం ఓ గరిటి లభిస్తుంది. తిరిగి రాత్రి భోజనం రెండు కొయ్యముక్కల చపాతీలు, నీళ్ళలో తేలే బంగాళాదుంప ముక్కలు రెండు-మజ్జిగ అనబడే తెల్ల నీళ్ళలో గుప్పెడు అన్నం అది భోజనం. తెస్తున్న పదార్ధాలు ఏమయ్యాయి అని అడిగేవారు లేరు. కాస్త ఏధైర్యసాహసాలు గల పిల్లలో ఏరోజున్న ఆకలికి ప్రాణం వుసూరుమని అడిగితే తరువాత వాళ్ళపాట్లు దేముడి కెరుక! "రోడ్లమీద అడుక్కు తినవలసిన దానిని రెండు పూట్ల యింత తింటున్నావు. సంతోషించు-నీ మొహానికి యీ భోజనం చాలదా, మహారాణి గార్కి ప్రత్యేకం వండి వారుస్తాం" లాంటి సూటిపోటి వ్యంగ్యోక్తులతో పనివాళ్ళంతా తిరగబడ్తారు- శిక్షగా మేనేజరుతో చెప్పి ఓరోజు భోజనం మానిపిస్తారు-లేదంటే ఏదొంగతనమో మరే నేరమో అంటగట్టి నలుగు రెదుట నిలబెట్టి శిక్షిస్తారు-ఆ అవమానం, ఆ హింస సహించలేక పిల్లలెవరూ ఏం అడిగే ధైర్యం చెయ్యరు-నిజమే-నిర్భాగ్యులం- యీ మాత్రం ఆశ్రయం దొరికిందే భాగ్యం అనుకుని నిర్లిప్తంగా బతకడానికి అలవాటు పడతారు.
    భోజన ఏర్పాటులు అలా వుంటే కనీసం స్నానం చెయ్యడానికి ఓ సబ్బు ముక్కకూడా దొరకదు. వారానికి ఓసారి గుమస్తా దయతల్చి ఆడపిల్లలకి ఓ సబ్బూ, మగపిల్లలకి ఒక సబ్బు యిస్తాడు, పిల్లలు అదే అపురూపంగా దాంతో ఆదివారం కాస్త తలకడుక్కుని అరిగిపోతుందన్నట్టు కాస్త కాస్త పాముకుని వళ్ళు రుద్దుకుంటారు. ఆదివారం పిల్లలంతా బట్టలుతుక్కోవాలి వంటాయన్ని అడిగి గంగాళం వేడినీళ్ళు పెట్టించుకుని గుమాస్తాగారిని బతిమిలాడి చాకలి సోడా ఇప్పించుకుని అందరి బట్టలు సోడాలో నానబెట్టి ఉతుక్కుంటారు. శరణాలయాధికారులు ప్రతి పిల్లకి స్కూలు డ్రస్సు రెండు జతలుయింట్లో కట్టుకుందుకు రెండు జతలు యిస్తుంది. సంవత్సరానికి ఆ నాలుగు బట్టలులనే అతి పొదుపుగా వాడుకుని కట్టుకోవాలి పిల్లలు.
    శరణాలయంలో జరిగే అక్రమాలు, అన్యాయాలు చూసేందుకు, ఆపేందుకు ఎవరూలేరు. అంచేత ఆపిల్లలంతా ఒకరి కష్టం ఒకరు చెప్పుకుంటూ ఒకరి కొకరు చేదోడు వాదోడుగా ఒక తల్లి బిడ్డల్లా అక్కా-చెల్లి-అన్న-తమ్ముడు అని ఆపాయంగా పిలుచుకుంటూ ఏక కుటుంబంలాగ కలిసి మెలిసి వుంటారు. వాళ్ళల్లో అందరికంటే వయసులో పెద్ద ఆ అమ్మాయి ఆ పిల్లలందరికీ పెద్ద, అందరు ఆ అమ్మాయి మాట వినాలి. ఆ పిల్ల వాళ్ళందరి మంచి చెడ్డలు చూస్తుంది. ఆ అమ్మాయి చదువయ్యో, పెళ్ళి చేసుకునో వెడితే తరువాత అమ్మాయి పెద్దక్క అవుతుంది. ఎవరెక్కడ పుట్టారో ఎవరేకులమోగాని ఆ పిల్లలంతా అంతలా కలిసిపోయి పెరగడానికి పరిస్థితులే దోహదం చేస్తాయి.
    సంవత్సరానికి ఒకసారి జమీందారుగారు, జమీందారిణితో శరణాలయం చూడడానికి విచ్చేస్తారు. ఆ శుభసమయంలో మాత్రం అనాధశ్రమం కళకళలాడుతూంటుంది. జమీందారుగారు వచ్చే ముందు మాత్రం సిబ్బందిలో చైతన్యం వస్తుంది. అంతా చకచక పనులు చేసేస్తారు. పిల్లలందరిచేత గదులు తుడిపించి, కడిగించి- పక్క బట్టలు, పిల్లల బట్టలు చాకలికి వేసి తోటంతా శుభ్రం చేయించి వంట గదులు పామించి- గిన్నెలు తోమించి- ఓ వారం చకచక పనులు జరుగుతాయి. ఆరోజు వంటగదినుంచి ఘుమ ఘుమ వాసనలు వస్తాయి, శరణాలయం అంతా తిరిగిచూసే జమీందారు దంపతులు సంతృప్తిగా తల ఊపుతారు. పిల్లలకి ఆరోజు పండగ. జమీందారిణి పిల్లలకి తల ఒక జత బట్టలు, మిఠాయిలు పంచిపెడుతుంది. ఆ రోజు పిల్లల మొహాలు కళకళలాడ్తాయి. మేనేజరు-గుమాస్తాలి, నౌకర్లు అంతా వినయవిధేయతలు వలగబోస్తారు. సంతృప్తిపడి పిల్లలని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. పిల్లల మొహాలు వాడిపోయి కలకరిగిపోయినట్టు నిస్పృహపడ్తారు. మళ్ళీ రాబోయే సంవత్సరం కోసం ఆరాటంగా ఎదురు చూడటం మినహా వారేం చేయగలరు. ఏడాది కోసారి ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేదట్టు గత ఏడాదిగా జమీందారు శరణాలయం దర్శించడం లేదు. ఆయన భార్యా బిడ్డలు పోయిన దుఃఖంలో మునిగివున్నారు.
    మాజీ జమీందారు రంగారావు నలభై ఏళ్ల మనిషి భారీ విగ్రహం రాజరికపు హుందా అడుగడుగునా కన్పిస్తుంది. చూసే వాళ్ళకు గౌరవం మర్యాదలతోపాటు హడలు పుట్టించేలాగా వుంటారు. అంతకన్నా ముఖ్యం ఆయన మనసు. ఒకసారి వెన్న కన్నా మెత్తబడితే అవసరం వచ్చినప్పుడు వజ్రంకన్నా గట్టి పడుతుంది. ఎంత ఔదార్యం సహృదయత వున్నాయో ఆయనలో అంత పట్టుదల మూర్ఖత్వం వున్నాయి, పరువు ప్రతిష్టల కోసం ప్రాణం పెడ్తాడు. చీకు చింతా లేకుండా అష్ట ఐశ్వర్యాలతో, భార్యాబిడ్డతో హాయిగా సాగిపోయే ఆయన జీవితంలో విధి హఠాత్తుగా చీకటి కురిపించింది. ప్రతి సంవత్సరంలో వేసవికి కుటుంబంతో సహా ఆయన ఊటీలో రెండు నెలలు గడుపుతారు, ఆ ఏడాది అలాగే కారులో కుటుంబంతో సహా బయలుదేరారు, కాలేజీలో చదువుకుంటూ శెలవులకు వచ్చిన రంగారావుగారి తమ్ముడు మాధవరావు జమీందారు తల్లితో సహా అందరూ బయలుదేరారు. త్రోవలో కారు లారీకి గుద్దుకొని ఘోర ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం అంతా పచ్చడి అయిపక్కకి పల్టీకొట్టి దూరంగా పల్లంలోకి దొర్లిపోయింది ముందు సీట్లో కూర్చున్న డ్రైవరు మాధవరావు, పదేళ్ళకొడకు అక్కడికక్కడే చనిపోయారు. వెనుక సీటులో కూర్చున్న రంగారావు, ముసలి జమీందారిణికి కొద్ది దెబ్బలు తగిలాయి. రంగారావు గారి భార్య మోపయిన గాయాలతో స్పృహలేక ఆస్పత్రిలో చేర్చినా స్పృహ రాకుండానే రెండు రోజుల తర్వాత మరణించింది.
    భార్య, బిడ్డ, తమ్ముడు పోగానే ఒక్కసారి అంతటి దుఃఖానికి తట్టుకోలేక
 రంగారావు యించుమించు మతి చెలించినట్లు అయిపోయారు. వృద్ధ జమీందారిణి అయితే ఆ షాకుకి తట్టుకోలేక పక్షవాతంతో మంచం పట్టేసింది. కలకలాడే ఆ భవనంలో స్మశాన శాంతి ఆవరించింది రంగారావు నిర్లిప్తంగా రోజులు వెళ్ళదీస్తున్నారు. కళ్ళూ తెరచిన మూసినా ఆయనకి రక్తం మడుగులో మక్కుపచ్చు లారని పదేళ్ళబిడ్డ కనిపిస్తాడు. ఒళ్లంతా గాయాలతో తెలివిలోకి రాకుండానే కన్ను మూసిన భార్య కనిపిస్తుంది. ఆయన తల కారు చక్రంలా గిర్రున తిరుగుతుంది. భరించలేని ఆవేదనతో తల రెండు చేతులతో పట్టుకొని కూలిపోతాడాయన. బాధ మరచి పోవటానికి రోజల్లా తాగుతూ మత్తులో పడివుండడం ఆయన అలవాటు చేసుకున్నాడు. యజమాని దుఃఖాన్ని చూసి ఏమని చెప్పి ఓదార్చాలో కూడా తెలియక పనివారంతా యింట్లో బిక్కు బిక్కుమని తిరుగుతున్నారు. పోయిన వారందరూ పోగా వున్న ఒక్క కొడుకు స్థితి చూస్తూ జమీందారిణి కన్నీళ్ళు పెట్టుకుని వ్యధ చెందడం మినహా ఏం చెయ్యలేక పోతూంది. ఆ యింట్లో భార్యబిడ్డలు మసిలిన పరిసరాలలో వుండలేక రంగారావు తరచూ గ్రామం వదిలి ఏ ఏ పట్టణాలలో తిరగసాగారు. నెల కిరవై రోజులు అలాపిచ్చిగా ఆ గమ్యం లేకుండా పట్టణంలో తిరుగుతూ క్లబ్బులనీ తన బాధ మరచి పోవడానికి జీవితంలో ఏర్పడ్డ శూన్యాన్ని మరచి పోవాలని ప్రయాసపడేవారు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS