Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 3


    ఆ రచయితకి మంచి అసైన్ మెంట్ ఏదన్నా ఇచ్చి ఎన్ కరేజ్ చెయ్యాలనిపించింది అతనికి. టేలంటు ఎక్కడున్నా గుర్తుపట్టి ప్రోత్సహించడంతో అతనికి అతనే సాటి!
    దానితో, అతనికి అప్పటిదాకా కలిగిన మానసికగ్లాని తొలిగిపోయి ఉల్లాసంగా అయింది మనసు. ఒక్కసారి చేతులు గబగబ రుద్దుకుని మళ్ళీ పనిలో జొరబడబోతుండగా -
    ఒకతను నెమ్మదిగా లోపలికి వచ్చాడు. చాలా సాదా సీదాగా ఉన్నాడతను.
    "కూర్చోండి" అన్నాడు ఎడిటర్.
    అతను కూర్చున్నాడు.
    "చెప్పండి!"
    అతను వెంటనే మాట్లాడలేదు. అనుమానంగా అటూ ఇటూ చూసి, తర్వాత తగ్గుస్వరంతో అన్నాడు.
    "నాకు ఒక నిధి రహస్యం తెలుసు"
    భగ్గున వళ్ళు మండినట్లయింది ఎడిటర్ కి.
    విశ్వప్రయత్నం మీద తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు.
    పనీ పాటా లేనివాళ్ళందరూ వచ్చి తన టైమునీ, మెదడునీ తినేస్తున్నారు. సమ్ థింగ్ హాజ్ టూ బీ డన్ టూ చెక్ డిస! సర్టేన్లీ సమ్ థింగ్ హాజ్ టూ బీ డన్!
    తన టేబుల్ మీద ఉన్న ప్లేక్ వైపు చేతిలోని బాల్ పాయింట్ పెన్నుతో చూపించాడు ఎడిటర్.
    "ఇది చదివారా?" అన్నాడు సీరియస్ గా.
    ఆ వచ్చిన వ్యక్తీ ప్లేక్ మీద రాసివున్న వాక్యాలు చదివాడు.
    "IF YOU HAVE NOTHING TO DO, PLEASE DONT DO IT HERE'
    అతను దెబ్బ తిన్నట్లు చూశాడు.
    "నేను చాలా ఇంపార్టెంటు ఇన్ ఫర్మేషన్ చెబుతున్నాను. మీరు నమ్మట్లేదు."
    "ఈ నిధి గురించి నేను చాలా అన్వేషణ జరిపాను. అది చివరి స్టేజిలో ఉంది ఇప్పుడు. ఇంక ముందుకు సాగడానికి నాకు అంగబలమూ, అర్ధబలమూ లేవు. మీకు ఎక్స్ పెరిమేంట్స్ చెయ్యడం అంటే ప్రాణం అని విన్నాను. మీరు స్పాన్సర్ చేస్తే, నేను నా అన్వేషణ కొనసాగిస్తాను. నాకు ఎదురయ్యే అనుభవాలే సీరియల్ గా రాసి మీకిస్తాను నిధిని సాధించి తీరతాను నేను. అది తప్పదు. ఈ ఎక్స్ పెరిమేంట్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. ప్రపంచంలో ఇంతవరకూ ఎవరూ చేసి ఉండరు ఇలాంటి అడ్వెంచరు. ఇది నిజంగా సీ........రియల్ అవుతుంది."
    ఎడిటర్ వాచ్ చూసుకున్నాడు. లేచాడు. మీరిక వెళ్ళవచ్చన్నట్లుగా.
    "నౌ ఇఫ్ యూ ఎక్స్యుజ్ మీ! నాకొక అర్జెంట్ మీటింగు ఉంది. వెళ్ళాలి."
    ఆ వ్యక్తీ నిరాశగా నవ్వాడు.
    "అల్ రైట్! నేను చెబుతోంది మీరు సీరియస్ గా తీసుకోవడం లేదని అర్ధం అవుతూనే వుంది. సరే! మీకు ఎప్పుడన్నా ఈ సబ్జెక్టు మీద ఇంట్రస్టు కలిగితే, దయచేసి నాకు కబురంపండి" అంటూ తన అడ్రసు రాసిన కాగితం అందించి, లేచి నిలబడ్డాడు.
    తలపంకించి షేక్ హాండ్ ఇచ్చాడు ఎడిటర్.
    ఆ వ్యక్తీ వెళ్ళిపోయాడు.
    మళ్ళీ కవరు పేజీ గురించి ఆలోచించడం మొదలెట్టాడు ఎడిటర్. ప్రింటింగు పర్ ఫెక్టుగా వస్తుందా? వస్తేనే తన ఎక్స్ పెరిమెంటు విజయవంతం అయ్యేది. ప్రిటింగు సరిగ్గా రాకపోతే తన ప్రయోగం విజయవంతం కావడం మాట అటుంచి, చాలా వికృతంగా కనబడుతుంది కవరు పీజీ. ఎక్స్ పెరిమెంటులో ఎప్పుడూ రిస్క్ ఉండదు. కానీ ఆ రిస్క్ లోనే థ్రిల్ కూడా వుంటుంది. చాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ ని అధికమించడంలో తృప్తి ఉంటుంది. ఇవన్నీ లేకపోతే ఇక బతుకు ఉత్త రొటీన్ కాదూ?
    ఫోన్ మోగింది.
    ప్రింటింగ్ సెక్షన్ నుంచా! కవరు పీజీ గురించేనా? తను అనుకున్న ఎఫెక్ట్ రాదని చెబుతారా? టెక్నికల్ డిఫికల్టీనా?
    చెప్పలేనంత టెన్షన్ ఫీలవుతూ రిసీవర్ ఎత్తాడు సారధి.
    ""ఎడిటరా!" అంది లైన్లో అవతల గొంతు.
    "ఎస్! ఎవరు?" అన్నాడు ఎడిటరు.
    "సదానంద్ నీ దగ్గరికి వచ్చాడా?"
    "ఏ సదానంద్?"
    "అదే........నిధి గురించిన ఇన్ ఫర్మేషన్?"
    "నిధా?" అని నొసలు చిట్లించాడు ఎడిటరు. నిధి సంగతి అప్పుడే అతని స్మృతిపధంలో నుంచి తొలగిపోయింది. అతని మెదడు కంప్యుటర్ లాంటిది. అవసరమయిన ఇన్ ఫర్మేషన్ ఇంక జీవితాంతం మర్చిపోకుండా మెమరీ సెక్షన్ లో స్టోర్ చేసిపెడుతుంది. అనవసరమయిన దాన్ని ఎప్పటికప్పుడు డిస్ కార్డ్ చేసేస్తూ వుంటుంది.
అతను గుర్తు పెట్టుకోవలసిన విషయాలే శతకోటి ఉంటాయి. అనవసరమయిన విషయాలకి మెదడులో స్థలం చాలదు.
    "బుకాయించకు. ఇందాక సదానంద్ నీ దగ్గరికి వచ్చాడు. నిధి గురించి చెప్పాడు. నాకు తెలుసు."
    అప్పుడు అతనికి చటుక్కున గుర్తొచ్చింది. "ఓ....అవును.......నిధి.........ఎవరో వచ్చారు. పంపించేశాను. మీరెవరు?"
    "నేనెవరో నీకనవసరం! నిధి సంగతి మర్చిపో! ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు ప్రొసీడ్ అయ్యావో, కాళ్ళు నరికేస్తాను."
    "హలో.....హలో......ఎవరు మాట్లాడుతోంది?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS