Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 3


    "వ్యవసాయాధికారి నివేదిక. ఇది చూడండి. మీ మందువల్ల పురుగులు చావకపోగా, అభివృద్ధి చెందాయని వ్రాశారు."

 

    కిసుక్కున ఎవరో నవ్వారు. భూషణరావు దూరంగా వున్న తన పి.ఏ. వైపు చూశాడు. అతడు విలేకరుల మధ్య చోటుచేసుకుంటూ దగ్గరికి రావటానికి ప్రయత్నిస్తున్నాడు. విలేకర్లు గబగబా వ్రాసుకుంటున్నారు.

 

    "ఆ నివేదిక నేను చూడలేదు. ప్రభుత్వం నుంచి నా వరకూ వచ్చాక పరిశీలిస్తాను." అక్కడినుంచి కదలడానికి ప్రయత్నించాడు.

 

    "మీకు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ వుందా.....?"

 

    పాము పాడగా మీద  కాలు వేసినట్టు ఆగిపోయాడు సర్పభూషణరావు. అతడి మొహంలో రంగులు మారాయి.

 

    "ఆ అనుమానం మీకెందుకు వచ్చింది......?" నవ్వడానికి ప్రయత్నించాడు.

 

    "న్యూయార్క్ నుంచి వస్తూ మీరు జూరిచ్ లో ఆగినట్టు ఇక్కడ విమానాశ్రయపు అధికారిని ఎంక్వయిరీ చేస్తే తెలిసింది."

 

    "నా సెక్రెటరీకి స్నో ప్లవర్ అంటే ఇష్టం.  అందువల్ల జూరిచ్ లో ఆగాంకొంచెంసేపు."

 

    "మీ సెక్రెటరీల్ని రెండు సంవత్సరాల కొకసారి మార్చడంలో అంతరార్థం ఏమైనా వుందా......?"

 

    అతడి మొహం ఎర్రబారింది. విలేకరి నొచ్చుకుంటున్నట్టు మొహం పెట్టాడు. "అయామ్ సారీ సర్.... కేవలం ఆమె పువ్వులకోసం విమానం ఆపారు అంటే, ఆమె పర్మినెంట్ సెక్రెటరీనా? రెండు  సంవత్సరాల్లోగా మిగతా వారిలాగా వెళ్ళిపోతుందా అని సంశయం."

 

    "అది నా వ్యక్తగతం."

 

    "ఇప్పటివరకూ మీ పర్సనల్ సెక్రెటరీలుగా పనిచేసిన పదహారు మంది అమ్మాయిల్లో తొమ్మిదిమంది ఉద్యోగం పోయిన రెండు నెలలకాలంలోనే ఏదో ఒకరకంగా మరణించారు. దీనిమీద మీ వ్యాఖ్యానం.....?"

 

    పి.ఏ. ఈ లోపు తోసుకుంటూ వచ్చి "సార్ మీకు అర్జెంటు అపాయింట్ మెంట్ వుంది. మర్చిపోయారా....?" అంటూ హడావిడిగా అక్కడినుంచి తీసుకెళ్ళి కారు ఎక్కించాడు.

 

    "ఎవరతను...?" కారెక్కుతూ అడిగాడు సర్పభూషణరావు.

 

    ".......కరస్పాండెంట్ సార్"

 

    "ఆంధ్రా అరుణ్ సౌరి అనుకుంటున్నట్టున్నాడు. కాస్త చూడు."

 

    పి.ఏ. ఆగిపోయాడు. కారు కదిలింది. సర్పభూషణరావు పక్కన సెక్రటరీ కూర్చుంది.

 

    "ఆ కుర్రాడెవరో చాలా తెలివైనవాడిలా వున్నాడు కదూ......." అన్నాడు. ఆ అమ్మాయి మాట్లాడలేదు, ఏం మాట్లాడితే ఏం ప్రమాదమొస్తుందోనని.

 

    "నా మీద చాలా డిటెక్షన్ చేసినట్టున్నాడు. స్విస్ బ్యాంక్ అకౌంట్ లూ, పొగాకు మందులూ, నివేదికలూ, విమానాశ్రయంలో ఎంక్వయిరీలూ, చాలా వివరాలు సంపాదించాడు" సాలోచనగా అన్నాడు.

 

    'వచ్చే కొత్త సెక్రటరీలు, పోయే పాత సెక్రెటరీలు, రహస్యాలు తెలిసిన అమ్మాయిల్ని భూమ్మీద వుంచకపోవడాలూ, వీటి గురించి కూడా ఆ విలేకరి వివరాలు సంపాదించాడు, అని మాట్లడడేం తన బాస.....?' అనుకోలేదా అమ్మాయి. అలా ఆలోచించడానికి భయపడింది.

 

    కారు స్లో అయింది. సర్పభూషణ రావు ఇంటిముందు, కుడి పక్క జనం గుమికూడి వున్నారు.

 

    "ఏం జరిగింది డ్రైవర్......" అడిగాడు.

 

    "యాక్సిడెంట్ అయినట్టుంది సార్."

 

    అట్నుంచి ఓ పోలీసు హడావిడిగా వస్తున్నాడు. సర్పభూషణరావుని చూసి సెల్యూట్ చేశాడు. "సారీ సర్...... ట్రాఫిక్ ఇటువైపు క్లోజ్ చేశాం. స్కూటరిస్టు చచ్చిపోయాడు. హిట్ అండ్ రన్ కేసు."

 

    వెనుకవైపు నుంచి వెళ్ళడం కోసం కారు పక్కకి తిరుగుతూ వుండగా తన ఇంటిముందున్న జనానికి అవతల వైపు నిలుచున్నా పి.ఏ.ని చూశాడు. పి.ఏ. కొద్దిగా తలవంచి పైకి ఎత్తాడు సూచనగా.

 

    "ఎవరు పాపం చనిపోయింది......?" అని అడిగాడు పోలీసుని.

 

    "ఏదో పత్రిక కరస్పాండెంట్ సార్. కుర్రవాడు. వయసు కూడా ఎక్కువ లేదు. మీ ఇంటిముందే చనిపోవడంతో మీకీ అసౌకర్యం కలిగింది."

 

    "దానిదేముంది...... ఇటు రూట్ బ్లాక్ అయింది. అటు వెళ్తాను అంతేగా."

 

    కారు వేగం పుంజుకుంది. అతడి పక్కనున్న సెక్రెటరీ నిశ్చేష్టురాలై కూర్చునివుంది. మూగి వున్న జనం కాళ్ళమధ్యనుంచి ఆ కుర్రవాడి శరీరం తల, తలలోంచి కారిన రక్తం ఆమెకు కనబడింది. "కాస్త చూడు......" అన్న సర్పభూషణరావు సూచన- అతడు తన కారులో ఇంటికొచ్చే లోపు...... ఆ కరస్పాండెంట్ ఎటువైపు వెళ్తాడన్న ఎంక్వయిరీ జరిగిపోవడం, ఆక్సిడెంట్ కోసం లారీ ఏర్పాటు, సర్పభూషణరావు సూచన అమలు జరగడం..... ఆమెని దిగ్భ్రాంతిలో పడేసినయ్. తన యజమాని ఎంత గొప్పవాడో ఆమెకి అర్థమైంది.

 

    అతడి గొప్పతనంలో ఆమెకి తెలిసింది పాతికశాతమే అని ఆమెకి తెలియదు. తెలిసుంటే తన బోయ్ ఫ్రెండ్  దగ్గిర ఆ సాయంత్రం జరిగినది చెప్పి నోరు జారి వుండదు. చేజేతులా మరణాన్ని కొనితెచ్చుకుని వుండదు.

 


                                     *    *    *

 

    ఇండియాకి రెండువేల మైళ్ళ దూరంలో ....... అదేరోజు-

 

    పాకిస్తాన్ జనరల్ ఇయాసత్ ఖాన్ తన కుర్చీలో అసహనంగా కదిలాడు. సైన్యాధికారి సోయాబ్ అహ్మద్, సెకండ్ లెఫ్టినెంట్ కరీముల్లా బేగ్, డిఫెన్స్ సలహాదారు రెహమాన్ అతడి చుట్టూ కూర్చుని వున్నారు.

 

    దేశపు ప్రెసిడెంట్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత ఆదేశ పరిస్థితుల్లో చాలా మార్పులు జరిగాయి. ప్రజాస్వామ్యం రావడం మిలటరీకి అసలు ఇష్టంలేదు. దాంతో కూ(ప్) జరిగింది. జనరల్ ఇయాసత్ ఖాన్  పదవిలోకి వచ్చాడు.

 

    మరణించిన ప్రెసిడెంట్ అంత తెలివైన వాడుకాదు. ప్రస్తుత జనరల్ ఇయాసత్ ఖాన్ ఆఫ్ఘన్ పేరు చెప్పి అమెరికా సాయం పొందలేక పోతున్నాడు. రష్యాతో వైరం లేకుండా చూసుకోలేక పోతున్నాడు

 

    ఆర్థికస్థితి రోజు రోజుకి దిగజారి పోతూంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా రద్దు చేయబడిన రాజకీయ పక్షాలు ప్రజల్లో అలజడి లేపుతున్నాయి. ఎక్కడ చూసినా డెమొక్రసీ పేరు వినపడుతూంది. ఈ సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటే ఆయుధం- యుద్ధం.

 

    భారత దేశపు సరిహద్దు ప్రాంతాల్లో అలజడి  సృష్టించి యుద్ధ వాతావరణం సృష్టిస్తే తప్ప లేకపోతే తన అధికారానికే ముప్పు వచ్చేలా కనపడింది.

 

    కానీ...... ఇందులో ఒక ప్రమాదం వుంది. ఇంకో పది సంవత్సరాలు పొయినా(ఆటంబాంబు తయారయితే అది వేరే సంగతి) భారత సైన్యంతో తలపడడం కష్టం. దాదాపు నాలుగు మిలియన్ల సైనికులున్న ఆ సైన్య దళాన్ని ఏదో విధంగా బలహీనపరిస్తే తప్ప యుద్ధం ప్రకటించడానికి వీల్లేదు. దానికన్నా ముందు ఆ దేశపు సైనిక సామర్థ్యాన్ని అంచనా వేయాలి. ఆ పనికి సమర్ధుడు ఏజెంట్ క్యూ ఒక్కడే.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS