Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 2

 

    అమ్మా! ప్రయాణాలు ఎక్కడో ఒకచోట ముగుస్తాయి. మనుషుల జీవితం కాల ప్రవాహం మీద తేలియాడే నావలాంటిది. ఆ ప్రయాణం ఎక్కడో ఒక చోట ముగుస్తుంది.
    కానీ ఆ ప్రయాణంలో ఎదురయిన కొన్ని మధురమయిన అనుభవాలు మాత్రం మిగిలివుంటాయి.
    ఈ పూటకు ఈ పడవ ప్రయాణం ముగిసింది అనుకో, కాని చిత్రమయిన ధోరణిలో కన్పించిన నీవు మాత్రం చాలా కాలం జ్ఞాపకంగా మిగిలిపోతావు.
    దిగిపోతాను తల్లీ ......!
    కానీ దిగిపోయే ముందుగా ఒక ప్రశ్న అడుగుతాను.
    నీవు చూస్తె రెండు పదులు దాటిన వయసున వున్నావు. ఇలా స్టీమ్ లాంచి నడుపుతూ వుంటే నీకు భయమనిపించదా! పనివారిని పెట్టుకోవచ్చు. పడవ సరంగును నియమించుకోవచ్చు. నీవే ఎందుకు చేస్తున్నావి పని?" అని అడిగిందామె.
    ఆమె మాటలు విన్న తరువాత పకాలున నవ్వింది జ్యోతి.
    "అమ్మా! నామీది సానుభూతితో ఇలా అడుగుతున్నందుకు కృతజ్ఞాభివందనాలు. నేను మీనుంచి ఆశించేది సానుభూతి మాత్రం కాదు. కేవలం నది దాటించినందుకు కొన్ని రూపాయలు మాత్రమే! అవి లాంచీలో కాలు పెట్టగానే మీరిచ్చేశారు."
    మీరు నాకు రుణపడింది లేదు కాబట్టి నా గురించి ఆలోచించవలసింది కూడా లేదు. సాటివారుగా అడిగారు కాబట్టి చెప్తాను."
    "నేను చేయవలసిన పనులను మరొకరి మీద ఆధారపడటం నాకు అంతగా తృప్తిని కలిగించదు, ఈ బ్రతుకు యిచ్చిన తల్లి దండ్రులు నన్ను ఒదిలిపోయినారు. వారి ప్రేమకు చిహ్నంగా ఈ పడవ మాత్రమే మిగిలింది. ఇదే నా యిల్లూ, తల్లీ అయి నన్ను కాపాడుతోంది. అనాధలయిన మావంటి వారి కంటి నీరులా జలజల పారే ఈ కృష్ణమ్మ నాకు పంచ ప్రాణాలు.
    ఈ పడవనూ, ఈ కృష్ణమ్మనూ వదిలి నే నెక్కడకూ పోను. ఈ నది మీదే నాకు తెల్ల వారుతుంది. ఈ పడవ పైనే నాకు ప్రొద్దుగూకుతుంది. ఈ రెండింటిని వదులుకుంటే నాకు మిగిలేది శూన్యమే!
    అందునించి పడవనే నడుపుకుంటాను. విశ్రాంతి దొరికినప్పుడు పట్టెడు మెతుకులు తిని పడవలోనే పడుకుంటాను " అని బదులు చెప్పిందామె. ఆ మాటలను శ్రద్దాపూర్వకంగా విన్నది ప్రయాణికురాలు.
    "నీ పేరేమిటమ్మా?" అని అడిగింది ప్రేమగా!
    "జ్యోతి " అన్నది జ్యోతి.
    "బహుశా తెలుగింటి యువతులకు భవిష్యత్తులో నీవు అశాజ్యోతివి కాగలవనుకుంటాను. నిస్సారమయిన చదువులవల్లా, నిరర్ధకమయిన సామజిక వాతావరణం వల్లా నిష్పయోజకులుగా తయారవుతున్న ఈ తరం యువతులకు నిజంగానే నీవు ఆశా జ్యోతివి కాగలవనుకుంటాను. తల్లీ నది దాటించినందుకు కొన్ని రూపాయలు మాత్రం యిచ్చాను.
    కాని అద్భుతమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నందుకు మాత్రం మన పూర్వకమయిన ఆశీస్సులు అందిస్తున్నాను వెళ్ళి వస్తాను తల్లీ" అని వెళ్ళేందుకు సంసిద్దురాలయింది ప్రయాణికురాలు.
    ఆమె చిత్తశుద్దికి సహృదయతకూ ఆకర్షితురాలయింది జ్యోతి.
    "అమ్మా! అకారణంగానే నా మీద ప్రేమ వర్షం కురిపించారు. నా గురించి అడిగి తెలుసుకున్నారు. మీ గురించి మాత్రం యేమీ చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు." అన్నదామె.
    నాలుగున్నర పదుల వయసు నిండిన ప్రయాణికురాలు ముందుకి సాగించిన ఒక్క అడుగుతోనే ఆగిపోయింది.
    'అమ్మా! నా పేరు శ్రద్దాదేవి. యూనివర్శిటి లో ప్రొఫెసరు గా పనిచేస్తున్నాను. నా నివాసం విజయవాడలోనే !" అని చెప్పింది.
    "శ్రద్దాదేవి: చిత్రమయిన పేరు" తనలో తనే అనుకుంటూన్నట్లుగా పైకి అన్నది జ్యోతి.
    "అవునమ్మా, నా తండ్రి అమలాపురం దగ్గరలోని ఓ చిన్న కుగ్రామంలో వుండేవారు. అయన వేద విద్యలో ఉపాద్యాయుడు. అలికి ముగ్గులు పెట్టిన అరుగు మీద కూర్చుని విధ్యార్ధులకు వేద పనసలు చెప్తూ వుంటే పరిసరాలన్నీ పవిత్రత నిండినట్లుగా అయేది. తాను ప్రాచీన సంస్కృతీకి మరో రూపు అయినా మారే కాలాన్ని మనసుకు పట్టించుకున్నారు. నాకు విద్యాబుద్దులు చెప్పించారు. నేను ఒక్క తరగతిలో అయినా డుమ్మా కొట్టలేదు. చదువులో నాకున్న శ్రద్దాసక్తులు గమనించి వారు కాలేజీకి పంపించారు. యూనివర్శిటీకి వెళ్లి ఫిలాసఫీలో ఎం.ఏ పట్టా పుచ్చుకున్నాను. లెక్చరర్ గా జీవితం ప్రారంభించాను. ఇంతకూ చెప్పవచ్చే దేమంటే ఆర్ష విద్యల మీది ఆసక్తి వల్లనే నా తండ్రి నాకిలాంటి పేరు పెట్టారు. శ్రద్దా మనువుల సంయోగేమే కదా ఈ మానవ సృష్టి. నేను సంపూర్ణమయిన స్త్రీ మూర్తిగా రూపొందాలన్నది వారి ఆకాంక్ష అయి వుండవచ్చు" అంటూ తన పేరు వెనుక వున్న కధను వివరించింది శ్రద్దాదేవి.
    అంతటి విద్యాధి'కురాలు తనపై అంతగా ప్రేమ వాత్సల్యాలను చూపుతున్నందుకు ఎంతగానో పొంగిపోయింది జ్యోతి. కొద్ది క్షణాలు గడిచాక "అమ్మా! నీ మాటా తీరూ చూస్తే చదువుకున్న దానిలా అనిపించావు. నీకన్నా పెద్దదాన్ని కనుక అడుగుతున్నాను. మరొకలా అనుకోకుండా చెప్పు. నీవు ఎంత వరకూ చదువుకున్నావు?" అని అడిగింది శ్రద్దాదేవి.
    రవంత సంశయమూ, రవంత సిగ్గూ కలియ బోసిన భావంతో కొంచెం తల వొంచుకుంది జ్యోతి.
    "బి.ఎ మొదటి సంవత్సరంతోనే నా చదువు నిలిచిపోయింది " అన్నది హీనమైన స్వరంతో. ఆ మాట విన్న శ్రద్దాదేవి కన్నులు తరళాయితం అయినాయి.
    "గట్టు మీదికి చేరేందుకు నాకు సాయం చేస్తావా?" అని అడిగిందామె. సూటిగా చూచింది జ్యోతి.
    "మెట్టు మీద కాలు పెడితే గట్టు మీదికి సులభంగానే చేరిపోవచ్చును. కాని నేను మీ వెంట వచ్చేలా చేసేందుకు అలా అంటున్నారు" అన్నదామె నవ్వుతూ. "అవును" అన్నది శ్రద్దాదేవి ముఖమంతా నవ్వు నింపుకుని. ఇద్దరూ ముందుకి కదిలారు.
    డెక్ మీది నుంచి డైరెక్టు గా ఘాట్ మెట్ల మీదికి దిగేందుకు నిచ్చెన అమర్చి వుంది. దాని మీదుగా ముందు జ్యోతి దిగిపోయింది. మెట్టు మీద నిలిచి శ్రద్దాదేవి దిగేందుకు సాయం చేస్తూ చేయి అందించింది. క్రిందికి దిగిన శ్రద్దాదేవి జ్యోతి భుజం మీద చేయి వేసి "థాంక్స్" అంది. జ్యోతి ఆమెతో కలిసి నడుస్తోంది.
    ఏటిగాలి విసురుకు పయ్యేదలు రెపరెప లాడుతున్నాయి. కొండ మీది దీపాల కాంతులు కృష్ణ ధారల్లో ప్రతిఫలిస్తున్నాయి. దూరం నించి పడవ సరంగు ఎవరో పాడుతున్న పాట గిరాకీలు కొడుతూ ఏటిగాలి అలలపై తేలివస్తోంది.
    హృదయాలను కదలిస్తోంది. చెవిలో దూరుతున్నది. దూరం నించి వినిపించే ఏటి పడవ సరంగు పాట గిరికీలే అయినా, మనసులో మెదలుతున్నది మాత్రం జ్యోతి గురించిన ఆలోచనలే!
    "అమ్మాయీ! నువ్వు మంచి దైర్యం కల్గిన ఆడపిల్లలాగున్నావు. లేకపోతే యిలా పడవ నడుపుతూ ప్రయాణికుల్ని ఏరు దాటించగలవా? బాగానే వుంది. ఎవరి విద్యుక్తధర్మాన్ని వారు చేసుకోవటం తప్పు కాదు. కానీ నీవంటి ధైర్యం కలిగిన మంచి ఆడపిల్లలు ఇవాళ యువతీ లోకానికి చాలా అవసరం. ఆదర్శవంతమయిన వ్యక్తిత్వం, నీర్బీతి.
    ఇంత మంచి సుగుణాలు కలిగినదానవు ఇలా పడవ నడుపుతూ బ్రతికేయటం నాకేమీ నచ్చలేదు. నీవు ఇంతకన్నా గొప్ప పనులు చేయగలదానావు అనిపిస్తోంది" అన్నది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    జ్యోతి అభిమానపూర్వకంగా ముఖాన్ని రవ్వంత అవగతం చేసుకుని మెల్లిగా అడుగులు కదుపుతోంది. ఆమెతో పాటు ముందుకు సాగుతోంది. మెట్లన్నీ ఎక్కి రోడ్డు మీదికి వచ్చేశారు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS