Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 2


    టి.వి.యస్. మీద షాపింగ్ కి వచ్చింది యశోద, తల్లికిసాయం చెయ్యటానికి. షాపింగ్ సాధారణంగా తనే చేస్తుంది.
    జయవర్థన్ షాపులో తల్లి రాసిచ్చిన లిస్ట్ ప్రకారం ఒక్కొక్కటీపేక్ చేయిస్తోంది. ఎందుకో పక్కకి తిరిగింది.
    అక్కడ నిలబడ్డ వివేక్ గభాలున తలదించుకుని ఎవరో తరుముకొస్తున్నట్లు అక్కడి నుండి రోడ్డు మీదికి నడిచాడు. అతను అప్పటివరకూ తననే చూస్తున్నట్లు గ్రహించింది యశోద.
    "జయవర్ధన్ ఈ పేకెట్స్ ఇక్కడే ఉంచు! మళ్ళీ వస్తాను" అని అతడి వెనకాలేతనూ పరుగు లాంటి నడకతో నడిచింది.
    అప్పటికే అతను మోటార్ సైకిల్ ఎక్కేసి పోలీస్ లను తప్పించుకుని పారిపోతున్న దొంగలా నడపటం మొదలు పెట్టాడు. యశోద తన టి.వి.యస్.మీద ఎక్కి అతడిని ఛేజ్ చేసి పావుగంటలో ఓవర్ టేక్ చేసి టి.వి.యస్ మోటార్ సైకిల్ కి అడ్డంగా తీసుకొచ్చింది.
    బేలన్స్ తప్పి కింద పడిపోయాడు వివేక్. అలా పడతాననిముందే తెలిసినవాడిలా చాలా జాగ్రత్తగా పడ్డాడు... మోటార్ సైకిల్ పాడు కాలేదు. అతడికి దెబ్బలు తగలలేదు. బట్టలకి దుమ్మంటింది అంతే! అయినా కిందపడ్డవాడు లేవలేదు. దెయ్యాన్నో, భూతాన్నో చూసినట్లు యశోదని చూస్తూ అలాగే రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు.

    టి.వి.యస్. రోడ్డు పక్కగా ఆపి వివేక్ ఉన్నచోటుకి వచ్చింది.
    "మోటార్ సైకిల్ మీదినుంచిపడటం ప్రాక్టీస్ చేసినవాడిలా అతి జాగ్రత్తగా పడ్డారు. లేవండి!" అంది నవ్వుతూ.
    అతడు లేవలేదు. యశోద మీదినుంచి చూపులు తిప్పుకున్నాడు. అతడి కాళ్ళు వణుకుతున్నట్లు అనిపించింది యశోదకి.   

    పడటం వల్ల కలిగిన షాక్ ఏమో? చెయ్యి ముందుకుచాపి అందిస్తూ "లేవండి!" అంది బెదురుతూ.
    ఆ చెయ్యి పట్టుకుని షాక్ తగిలినట్లు వెంటనే వదిలేశాడు.
    ఆశ్చర్యం కలిగింది యశోదకి. అతని అరచెయ్యి చమటతో అతి చల్లగా ఉంది. బాగా భయపడుతున్నాడు. ఈలోగా చుట్టూ జనం పోగయ్యారు.
    ఇద్దరు మగవాళ్ళు ముందుకువంగి లేవదియ్యబోతే వద్దని అతడేలేచి నిలబడ్డాడు. దెబ్బలేం తగలలేదు. ఓదార్చవలసిన అవసరంలేదు. తెలుసుకోవలసిన విషయాలు లేవు. కొంచెం నిరుత్సాహంతో పోగయిన జనం వెళ్ళిపోయారు. ఒకళ్ళిద్దరు మొగగాళ్లు మాత్రం ఉండిపోయారు.
    పోకిరిగాయశోదను చూస్తూ "ఇలా మా వాడిని పడెయ్యటం అన్యాయమండీ!" అన్నాడు ఒకడు రెండర్ధాలు ధ్వనించేలా. అని ఊరుకోలేదు. వెకిలిగా నవ్వాడు.
    వెంటనే అతని చెంప ఛెళ్ళుమంది. కళ్లముందు చీకట్లు కమ్మి కింద పడ్డాడు.
    అతడిని కొట్టింది వివేక్! పిడికిలి బిగించి "దొంగరాస్కెల్! నోరెత్తావంటేతోలు వలిచేస్తాను" అన్నాడు ఉగ్ర నరసింహమూర్తిలా.
    వెకిలిగా నవ్వుతూ నిలబడ్డ మిగిలిన ఇద్దరూ మొగవాళ్ళు పారిపోయారు.
    నివ్వెరపోయింది యశోద. ఇంత ధైర్యసాహసాలున్నమనిషిలో నిష్కారణంగా ఆ భయమేమిటీ?
    "థాంక్స్!" అంది వివేక్ తో.
    "వెల్ కమ్!" లో గొంతుకతో అన్నాడు. ఆ గొంతు వణుకుతున్నట్లు అనిపించింది.
    మరోమాటకి అవకాశమివ్వకుండా వెళ్ళిపోయాడు వివేక్.
    "ప్లీజ్!" అంది ప్రాధేయపడుతున్నట్లు ఆగాడు. సూటిగా కళ్లలోకి చూడటం లేదు.
    "నిష్కారణంగా నేనే మీకు అడ్డుగా వచ్చాను ఆయామ్ సారీ!" అంది.
    "ప.....పర్వాలేదు!"
    "దెబ్బలేం తగలలేదు కదా?"
    లేదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు.
    "నాలో మరో దురుద్దేశం లేదు. మీతో మాట్లాడాలని వస్తే మీరు వెళ్ళిపోతున్నారు! అందుకని..."
    "నాతో... ఏ... ఏమిటి మాట్లాడాలనుకుంటున్నారూ?"
    "నేను... నేను... ఆ 'ఓల్డ్ మాన్ అండ్ దసీ' నేను చదివాను. నాకు సరిగ్గా అర్ధం కాలేదు. మీరేమైనా ఎక్స్ ప్లెయిన్ చెయ్యగలరేమోనని...."
    ఇంతసేపటికి సూటిగా యశోద మొహంలోకి చూశాడు వివేక్.
    "మీరు అబద్ధమాడుతున్నారు. మీరు మాట్లాడాలనుకుంటున్నది అది కాదు!"
    "మీరెలా చెప్పగలరు?"
    "నిజం నాకు తెలుసు కాబట్టి!"
    "ఏమిటది?"
    "మిమ్మల్ని చూడగానే నే నెందుకు చూపులు తిప్పుకుంటున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారు."
    తెల్లబోయింది... నవ్వి అంది..." కరెక్ట్ కారణం చెప్పండి మరి!"
    "సారీ ఆ కారణం నాకూ తెలీదు."
    మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు.
                                        2
    పార్వతి మిడిల్ స్కూల్ టీచర్. ఆమె భర్త దక్షిణామూర్తి. 'దుర్గా మెడికల్ స్టోర్స్ లో'సేల్స్ మెన్. ఇద్దరూ చదువుకోకపోయినా చదువు విలువలు తెలిసిన వారు. అందుచేత మొగ పిల్లవాడైనా ఆడపిల్లయినా ఒక్కరు చాలని అనుకుని యశోద పుట్టగానే ఫామిలీ ప్లానింగ్ పాటించారు.
    యశోదని ఎలా అయినా బాగా చదివించాలనేదే ఆ దంపతుల ఏకైక ధ్యేయం... యశోదని డాక్టర్ చెయ్యాలనుకుని ఇంటర్ లో బై.పి.సి. చదివించాడు దక్షిణామూర్తి. యశోద మంచి మార్కులతో క్లాస్ లో పాసయింది.
    కానీ సైకాలజీ చదవాలనుకుంది. దంపతులిద్దరిలో ఎవరూ యశోదని బలవంతం చెయ్యటానికి ప్రయత్నించలేదు... ఆ అమ్మాయిని ఎప్పుడూ ఏ విషయంలోనూ బలవంతం చెయ్యరు ఆ దంపతులు.
    ఇంటివాకిట్లో టి.వి.ఎస్' హారన్ వినిపించి కాంపౌండ్ గేటు దగ్గరికి వచ్చి నిలబడింది పార్వతి.
    "ఇంత ఆలశ్యమయిందేం?" అడిగింది.
    "లోపలికి రానియ్యి..."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS