Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 2


    ఓ రోజు  మధ్యాహ్నం విరామసమయంలో ఆమె చెట్టుకు చేరగిలబడి కూర్చుండగా వచ్చి "నీకు డబ్బు యిస్తాను. ఇల్లు అమరుసతాను, సమస్త సౌకర్యాలూ సమకూర్చుతాను. నాతో వచ్చేస్తావా?" అని అడిగాడు.

    ఆమెలేచి నిల్చుని తన పెద్ద పెద్ద  కళ్లను ఎత్తి ఆయనవంక సాలోచనగా చూసింది. ఒక్క నిముషంలో అంతా నిర్ణయించుకుంది. "వస్తాను" అంది నెమ్మదిగా.

    అంతే. రాజయ్యగారు ఓ పెంకుటిల్లు తీసుకుని ఆమెను అందులో వుంచాడు. కావలసిన సామాగ్రి అంతా కొన్నాడు. నెలకు యింత అని పైకం యిస్తూ వుండేవాడు. రజని అనేపేరు ఆయన ప్రేమతో పెట్టిందే కావచ్చు.

    యువకుల కల్లోలం ఏమీ తగ్గలేదు.

    రాజయ్యగారు మంచి నిఘా వుంచారు.

    ఈ వంటరితనంలో యీ అక్కా తమ్ముళ్ళు తోడునీడ అయినారు రజనికి. రోజూ యింటికి పోయేటప్పుడు అరగంట కాలక్షేపం యిక్కడ. బిస్కట్లూ, కాఫీ ఇస్తుండేది. వాళ్ళతో ఆ కబుర్లూ యీ కబుర్లూ చెబుతూండేది. ఆమెకు చదువురాదు. నేర్చుకోవాలన్న జిజ్ఞాస లేదు. "చినబాబూ!" అని పిలుస్తూండేది మధుబాబును. ఎంతో ఆప్యాయంగా చూసేది యిద్దర్నీ.

    కొన్నాళ్ళకు సరస్వతి వెళ్లిపోయింది.

    మధుబాబు వంటరిగా మిగిలాడు. మరుసటి సంవత్సరం స్కూలుకి వంటరిగా పోతుంటే ఏడుపు వచ్చేది. ఈ స్థితిలో రజని అతనికి మరింత దగ్గరగా వచ్చింది. ఊరట కలిగేది అతనికి ఆమె సాన్నిధ్యంలో వాళ్ళు ఆప్తమిత్రులయిపోయేవారు. సరస్వతి అప్పుడప్పుడూ యిక్కడకు వచ్చినప్పుడు వెళ్లి రజనిని చూచి వస్తూండేది. నానీ జన్మించినప్పుడు రజని బహుమతులు పంపించింది. ఇప్పుడు నాని మరి లేడు.

    ఆ మరునాడు ఈ విషయం చెప్పటానికి మధుబాబు ఆమెఇంటికి వెళ్ళాడు.

    ఇంటి తాళం పెట్టివుంది.

    ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకున్నాడు. కాసేపు ఎదురుచూశాడు.

    ఎంతకూ రాలేదు రజని.

    ఎదురుగా వున్న కిళ్లీషాపువాడు చెయ్యెత్తి రమ్మని సౌంజ్ఞ చేశాడు మధుబాబు వంక.

    మధుబాబు వెళ్లాడు. "రజని కోసమా?" అన్నాడు షాపువాడు.

    "అవును" అన్నాడు.

    "లేదు. మరి రాదు."

    "ఎక్కడకు వెళ్ళింది?"

    షాపువాడు వక్రంగా నవ్వాడు. "లేచిపోయింది."

    చిన్నపిల్లవాడుకాదు మధుబాబు. అతనికి అర్థమైంది. చికాగ్గా, ఆవేసనగా యింటిదారి పట్టాడు.


                                     3

    తన మొదటి కథను అతడే పత్రికకీ పంపించలేదు. అంటే దీని అర్థం ఆ కథగురించి పూర్తిగా మరిచిపోయాడని కాదు. తర్వాత చదువుకుంటే అందులో ఎన్నో తప్పులు కనిపించాయి. ఏదో తెలియని గొప్పతనం అందులో వున్నట్లు తోచేదిగాని.....అదేమిటో మనసుకి తట్టేదికాదు. అదీగాక అతనికి చిన్నప్పటి నుంచీ పద్యాలంటే తలనొప్పి. వేమన పద్యాలూ, సుమతీ శతకమూ చదవకుండానే అతని ఎలిమెంటరీ స్కూలు చదువు పూర్తయింది. పద్యాలు వంట పట్టక పోవటంవలన భాష స్వాధీనం అయ్యేదికాదు.

    ఎప్పటికప్పుడు కొత్తగా, తడుముకున్నట్లుగా వుండేది. అయితే అతడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో వున్నప్పటి నుంచీ కథలూ, నవలలూ విరివిగా చదివేవాడు. తోపుడుబళ్ళతో అరణాలకొచ్చే నవలలూ, ఇంటింటికి వెళ్లి అమ్ముతూ, అద్దెకిస్తూ వుండేవాళ్ళు. మధుబాబు తల్లిసుందరమ్మగారికి యీ నవలల పిచ్చి జాస్తీగా వుండేది. అప్పట్లో ఎక్కువగా కొవ్వలి జంపన నవలలు వచ్చేవి. మధుబాబు అవి ఆసక్తిగా చదివేవాడు. కర్మంకాలి విశ్వనాథంగారు ఎప్పుడైనా చూడటం తటస్థిస్తే తలవాచేట్లు చివాట్లు పెట్టేవాడు. ఆయనకు తన బిజినెస్ గొడవ, ఊళ్లు తిరగటం యిదితప్ప యీ సాహిత్యం, పుస్తకాలు ఏమీ పట్టేవికావు. కొడుకు యీ పుస్తకాలు చదివితే పాఠాల్లో వెనకపడిపోతాడని భయం. అందుకని ఆయన కంటబడినప్పుడు కోప్పడడమేవాడు. అతనికీ పుస్తకాలు నచ్చుతున్నాయి. గొప్పగా వున్నాయి. అవి చదువుతోంటే ఊహాలోకంలో, ఓ తన్మయత్వంలో తేలిపోయేవాడు. ఈ అనుభూతిని చూస్తూ వదులుకోలేడు, సాయంత్రాలు డాబామీద చేరి, క్రిష్టఒడ్డున కూర్చుని చదువుతూ వుండేవాడు. సుందరమ్మగారు అతన్ని ఎప్పుడూ మందలించలేదు. మధుబాబు చదవటమే గాకుండా పెద్దయి సంపాదనాపరుడయాక యీ పుస్తకాలన్నీ మళ్ళీ తెప్పించి బైండు చేయించి యింటిలో అలంకరించాలని ఉవ్విళ్ళూరుతూ వుండేవాడు.

    ఆ రాత్రి రాసిన కాయితాలు జాగ్రత్తగా డ్రాయరు సొరుగులో దాచుకున్నాడు. స్నేహితులైతే చాలామంది వున్నారుగానీ...... నవ్వుతారనీ, ఎగతాళి చేస్తారనీ ఈ విషయం చెప్పలా. క్లాసులో ఎప్పుడూ పరధ్యానంగా వుండటం, నోట్సులనిండా ఏదో వ్రాస్తూ వుండటం, ఓ మిత్రుడు చూసి "వీడు ఎప్పటికైనా గొప్ప కథకుడు అవుతాడ్రా" అని నిజాయితీగా పలికేసరికి ప్రక్కవాళ్ళంతా "వీడి మొహం, వీడా?" అని ఎద్దేవ చేసేవారు. అందుకని ఎవరికీ చూపించలేదు.

    ఓ రోజున విశ్వనాథంగారు కొడుకు ఇంట్లో లేనప్పుడు పెన్సిల్ కావాల్సి వచ్చి డ్రాయరు సొరుగు వెదుకుతుండగా ఆ కాయితాలు కనిపించాయి. అవేమిటో తెలుసుకొని నిర్ఘాంతపోయి నిలబడ్డాడు. కాస్త చదివాడు. కోపంతో మండిపడి గబగబ భార్య దగ్గరకొచ్చాడు. "చూడు, నీ కొడుకు చేస్తున్నా ఘనకార్యం. వీడు కథలుకూడా అఘోరిస్తున్నాడు. ఇలా అయితే బాగుపడ్డట్లే! ఇదంతా నీ ట్రయినింగ్. నువ్వే  వాడిని పాడుచేస్తున్నావు" అని కేకలు పెట్టాడు.

    వంటచేస్తున్నా సుందరమ్మగారు తెల్లబోతూ ఇటుతిరిగి "మధ్య నేనేం చేశానండీ" అంది లేచి నిలబడుతూ.

    "ఏడిశావ్! ఇదంతా చేసింది నువ్వుకాదూ! అడ్డమైన పుస్తకాలూ తెప్పించి నీ పిచ్చి వాడికికూడా అంటగట్టావు. ఏడిశాడు! ఎక్కడున్నాడు? ఇదిగో చెపుతున్నా, ఈసారి ఆ వెధవపుస్తకాలు చదువుతూ కనిపించారంటే వాటిని చించిపారేస్తాను. ఏమనుకుంటున్నారో" అని పెద్దపెద్ద అడుగులు వేసుకుంటూ అక్కడ్నించి వెళ్లిపోయాడు.

    ఆ తరువాత మధుబాబును శిక్షించడం జరిగింది. అలసట చెందాడు మధుబాబు.

    నానీ చావు తెచ్చిన విషణ్ణ వాతావరణం క్రమంగా  అంతరించింది. దేశంలో  హిందూ -ముస్లిం తగాదాలు కూడా సర్దుకున్నాయి. కులాసాగా వున్నట్లు సరస్వతి ఢిల్లీనుంచి ఉత్తరం రాసింది.

    మధుబాబు స్కూలుఫైనల్ పరీక్షలకు శ్రద్ధగా చదవసాగాడు.


                                       4

    మధుబాబు కాలేజీలో చేరాడు. ఆ వాతావరణం మొదట్లో చాలా కొత్తగా కనిపించింది. కాలేజీలైఫ్ చాలా మధురంగా వుంటుందని ఇదివరకు చాలా మంది అంటుంటే విన్నాడు. మొదటి రెండుమూడు నెలలూ అదేమిటో అతనికి అంతుపట్టలేదు. అదీగాకుండా అతడు తీసుకున్నది సైన్సుగ్రూప్ కాబట్టి బొత్తిగా తీరికలేకుండా, చికాగ్గా వుండేది. మిగతా గ్రూపులవాళ్ళు ఉషారుగా, నిర్లక్ష్యంగా తిరుగుతూ వుండేవాళ్ళు. క్యాంటిన్ లోనూ, చెట్లక్రింద గుంపులుగా కూర్చుని అల్లరి చేస్తూండేవాళ్లు. వాళ్లని చూస్తే అసూయగా వుండేది మధుబాబుకు.

    ఇంతలో కాలేజీ ఎలక్షన్లొచ్చాయి. కాలేజీ అంతా హడావుడిగా నిండి పోయింది. విద్యార్థుల హక్కుల్ని కాపాడటానికంటూ కొంతమంది ప్రతినిధులు బయల్దేరారు. క్లాసుల్లోకి పోవటం, కాళ్ళు ఒణుకుతుండగా ఉపన్యాసాల లాంటివి యివ్వటం, కూర్చున్న వారిలోంచి అవతలి వర్గంవారు లేచి అల్లరి చేయటం, ఉభయపక్షాలవారూ ఒకరికొకరు వార్నింగులిచ్చు కోవటం, తన్నులాటలు, రాజీలు యిట్లావుండేది వాతావరణం.

    మధుబాబుకు యీ తతంగమంతా చికాకు కలిగించింది. ఉభయపక్షాల లోనూ ఎవరుకూడా అతనికి అయినవారు కారు. అందుకని పట్టించుకోకుండా ముభావంగా చూస్తూ ఊరుకున్నాడు.

    అన్నికలు ముగిశాక కాలేజి మేగజైన్ కి విద్యార్థుల్నుంచి సంపాదకుల్ని ఎన్నుకొనే నిమిత్తం పోటీ జరిగింది. మధుబాబుకు వున్న వ్యాపకం తెలిసిన వాళ్లెవరో యీ సంగతి అతనిచెవిలో ఊది "ప్రయత్నించు. పోయినదేముంది?" అని సలహా ఇచ్చారు. అతన్లో ఆశ మొలకెత్తింది. "నిజమే! మంచిసంగతి"

    అతను పోటీలో పాల్గొన్నాడు. అంశం ఏమిటంటే "ప్రజాకవిత్వమంటే ఏమిటి?"

    అతని ఉత్సాహం చచ్చిపోయింది. ఈ కవిత్వంగురించి తనకు బొత్తిగా తెలియదు. ప్రజా  కవిత్వమట. బహుశా ప్రజాసమస్యలకు చేరువగా వున్న కవిత్వమయి వుంటుంది. మరి దాని లక్షణాలమాటో? అతనికి అంతుపట్టలేదు. ఇష్టంవచ్చినట్టు రెండుపేజీలు వ్రాసి బయటికొచ్చేశాడు. ఫలితం ఏమంటే అతను సెలక్టు కాలేదు.

    అతనికి కోపంవచ్చిన మాట నిజమేగాని - వీళ్ళమొహం వీళ్లు నా అర్హతని కొలిచేవాళ్ళా? అన్నట్టు ఫోజుపెట్టి సంతృప్తిపడటం వగైరాలు ఏమీ చేయలేదు. మంచి అవకాశం చేయిజారిపోయినట్లు బాధపడ్డాడు. కాలేజీలో తాను షైన్ అయ్యే ఛాన్స్ చేయి జారిపోయింది.

    ఆ ఛాన్స్ అతనికి వేదికమీద ఎక్కి ఉపన్యాసాలు దంచినా, నాటకాలలో నటించినా వచ్చివుండేది. కాలేజీ వాతావరణంలో నిర్భయంగా స్టేజిమీదకు ఎక్కి నాలుగుముక్కలు చెప్పగలిగిన వాడే స్పీకర్ క్రింద చలామణి అవుతాడు. చెప్పేదాంట్లో పెద్ద స్టఫ్ వుండనక్కరలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టేజిఫియర్ లేకపోతే అతను స్పీకర్ అయిపోయాడన్నమాట. మధుబాబుకు ఈ సమాచారం ఏమీ నచ్చలేదు. ఈ మాట్లాడే వారందరికంటే తనకు చాలా ఎక్కువ విషయాలు తెలుసు. కాని వాటికో స్వరూపం ఇవ్వలేనిస్థితిలో నలుగురి ముందూ బడబడ లాడటం వాచాలత అనిపించుకుంటుందని తన ఉద్దేశం.   


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS