Next Page 
శశిరేఖ పేజి 1


                                                                   

                             శశిరేఖ

                                               -చలం

                                                            

   ఒకనాడు సాయంకాలము ఆరుగంటలప్పుడు  పదునారేళ్ళ బాలిక యొకతె,కడవ చేతులో పట్టుకొని కాలవవైపు పోవుచుండెను. ఆ బాటదట్టముగ పెరిగిన మర్రి  చెట్లచే పందిరివలె కప్పబడ్డది.భూదేవత దాల్చిన నూత్న  వస్త్రములవలె రెండు వేపులను పెద్ద పచ్చిక బయళ్ళు,  ముడిలో లొంగక ముఖముపై,మెడపై చెవులపై గుంపులుగ వేలాడు ఆ బాలిక  జుట్టులో చిక్కుకుని ప్రకాశించుచున్నవి సూర్యకిరణములు.నల్లని ఆమె  కన్నులలోపడి  మార్పుచెంది, పెధవులనుండి  చిరునవ్వు రూపమున ప్రతి ఫలించినదా అనునట్లు లేయెండ ఆమె మోమును ఆకుల సందులలో నుండి స్పృశించుచుండెను. యవ్వన జనితమగు సంతోషము ఆమె యవయవముల  నుండి నిగనిగ లాడుచుండెను. కారణ రహితముగపోడము  ఆనందము ఆమె యిడు ప్రతి  అడుగునుండి యు, వ్యక్తమగు చున్నది.ముందుఇతరులకిచ్చి తాననుభావింపగల ప్రేమ ఆమెయందు సృష్టిచే సేకరింపబడుచుండెను కాబోలు! కాకున్నఆ విసురు నడకలూ చంచలములగు చూపులూ, నిష్కారణముగ కలుగు చిరునవ్వులూ- వాని అర్ధమేమి?
ఆమె శరీరము పలచనగను,కొంచెము పొడగుగనున్నదికాని, ప్రతి అవయవమును గుండ్రముగా నున్నది.ఆటంక రహితముగ, స్వేచ్చగా పెరిగిన ఆమె దేహము అప్పడే సంపూర్ణము నొందు యవ్వనమును సూచించుచున్నది. అచ్చటి సృష్టిసాందర్యమును గ్రోలుచున్నట్లు సంపూర్ణముగ  తెఱచికొని యున్నవి ఆమె నల్లని విశాల నయనములు. యెర్రని ఆమె పెదవులును,వొంపు తిరిగిన అందమ్తెన ఆమె ముక్కును నిర్మల వాయువును రుచి చూచుచున్నవి. అట్లానుకోనుటకు ఆధారము వెతుకు తీగవలె, ఆమె హృదయ జనితమగు ప్రేమ నలుదిక్కులను కళ్ళలో నుంచి వెతుకుచున్నదా!లేకున్న ఒక్కచో నిలువని ఆ చూపులెందుకు? ఆనంద ప్రవాహము రక్తమున కలిసి పోంగుచున్నదా? లేకున్న అపరాని చలనమెందుకు,దేహమున?
లాకులవద్ధకు ఆమె పోవునప్పటికి అచ్చట, తలుపుపై కూర్చుని యుండిన బాలుడొకడు, చివాలునలేచి, పట్టలేని సంతోషముతో ఆమెను సమీపించెను. ఇద్దరును కలిసి అచ్చటనున్న తురాయి చెట్లు కిందికిపోయి, సిగ్గును, విచారమును భయమునులేని పసిపిల్లలవలె పచ్చికపై కూర్చుండి పరస్పర స్పర్శన సుఖమున  మ్తెమరచిరిఒకరి హస్తము నొకరు గ్రహించుట తోడనే వారికే తెలియని ఆనందము, ఆ యిద్దరి హృదయములను కలిపివేసినది.రెండు లేత హృదయముల సమ్మేళనమునకన్న ఆనంద జనకమ్తెనది లోకమున నేది!ఎర్రటి పుష్పములను వారిపై చెట్టు విదిల్చేను.గాలి వారిరువురి  నొకటిగ కౌగాలించెను. ఒక్కొక్క నక్షత్రమే వారిపై ప్రకాశింప  నారంభించెను ఆకసమున మబ్బుల అంచులను సూర్యుడు మెరుగు పెట్టుచుండెను. కాలము నేరుంగక  యొడ  లేరుంగక సమస్తమును మరచి వారిరువురు నట్లే యుండిరి.తుదకు బాలిక పోద్దుపోయినదని లేవగా అతడు కడవను జలమున ముంచి ఆమె భుజముపై పెట్టెను.
బాలు- నీకు బలుపుకాదూ?
బాలి - నాకు బలువైతే ప్రతిరోజూ ఎవరు  సహాయము చేశారో?
బాలు- ఏది, బుజము చూడని, కందిందేమో! బాలిక పలుకలేదు.
బాలు- కోపం వచ్చిందా? పోగొట్టనా?
బాలి- వద్దులే.
కొంత తడవు మాటలు లేవు.
బాలు - ఈ రాత్రి వాళ్ళతో తప్పక మాట్లాడతావు కదూ?
బాలి - తప్పకుండా.
బాలు - నా ప్రాణం నీ చేతుల్లో వుందని మరిచిపోకూ!మళ్ళి చెప్పు,ఏం మాట్లాడుతావు?
బాలి - నేనంతా చేస్తానుగా. నా మీదంత మాత్రం నమ్మకం లేదూ?
బాలు- నా భయం అట్లా అనిపిస్తుంది.
అని తటాలున ఆమె త్రోవకడ్డముగా నిల్చుని చేయిపట్టుకొని
బాలు - నా మీద నీకు ప్రేమ ఉంది? నిజంచెప్ప.
బాలి- లేదూ?
బాలు - చాలాసార్లు నువ్వు నా ప్రేమతో ఆడుకుంటున్నావేమో అని భయం వేస్తుంది.
బాలి - పోనిలే, ఒకళ్ళ లోపల ఉద్దేశ్యాలు ఇంకొకళ్ళలో ఉన్నాయనిపిస్తుంది.
బాలు - అట్లాగా?ఇంకా సందేహమే?
బాలి - సందేహింపబడిందేవరు కృష్ణా?
అని నవ్వుచు ఆమె చీకటిలో మాయమైపోయెను.
బాలు- శశి!
దూరముగ నవ్వు మాత్రము వినపడెను.
బాలు - ఒక్కసారి.     


Next Page 

  • WRITERS
    PUBLICATIONS