Next Page 
హౌస్ సర్జన్ పేజి 1


                                హౌస్ సర్జన్

                                                                              __కొమ్మూరి వేణుగోపాలరావు

                         



    హౌస్ సర్జన్ ల అటెండెన్స్ బుక్ లో సంతకం పెడుతూంటే చెయ్యి కొద్దిగా  వొణికింది. గర్వమని చెప్పలేనుగాని  నేను కూడా డాక్టర్నయా నన్న  సంతృప్తి  నరనరాల్లో  ఆవహించి చైతన్యం  కలిగింది. సంతకం పెట్టి  వరండా  దాటి బయటకు వచ్చి, ఎదురయే వాళ్ళని చిరునవ్వుతో విష్ చేస్తూ ఫిమేల్ ఓ.పి. వైపు నడిచాను.

    మెట్లెక్కి లోపలకు  పోబోతూ తలుపుదగ్గర  హఠాత్తుగా ఏదో సంకోచం తోచి ఆగిపోయాను. విద్యార్ధిగా ఎన్నోసార్లు  యిందులోకి వచ్చాను. ఎన్నో కేసులు పరీక్షచేసి  ప్రొఫెసర్  ముందు సబ్ మిట్ చేశాను. కాని యిప్పుడు హౌస్ సర్జన్ గా లోపలకు  అడుగిడబోతూన్న  తొలి అనుభవం కాస్త కలవర పరిచింది. తల  ఎత్తి చుట్టూ చూసేసరికి  హాలులో చుట్టూరా పేర్చి వున్న  బల్లలమీద  అందరూ ఆడవాళ్ళే. ఆ క్యూ ఓ.పి.గదిలోకి కూడా సాగింది. తెల్లటి ప్యాంటులో షర్ట్  టక్ చేసుకుని, చేతిలో స్టెతస్కోప్ ను  అప్రయత్నంగా  ఊగిస్తూ  నిలబడి వున్న  నా వంక వాళ్ళంతా ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్ళలో  చాలామందికి  హౌస్ సర్జన్ కూ, పెద్ద డాక్టర్ కూ వున్న  తేడా తెలియదు., డాక్టరుగారు వచ్చారనే వార్త వారిలో  కాస్త సంచలనం  కలిగించింది. పాపం, వారిలో ఉదయం  ఏడింటికే  వచ్చి కూర్చున్నవారుకూడా  వుంటారు.

    గుమ్మందగ్గర  తటపటాయిస్తూ  నిలబడి వున్న  నన్ను  చూసిందిగావును, లోపల నుంచి  సిస్టర్  వచ్చి  చిరునవ్వుతో  "గుడ్ మార్నింగ్, డాక్టర్ !" అంటూ  పలకరించింది.

    "గుడ్ మార్నింగ్." అని జవాబిస్తూ  ఆమెకేసి  చూశాను. సన్నగా, పొడవుగా, నాజూగ్గా వుండి యూనిఫారంలో తెల్లగా మెరుస్తోంది. సాధారణంగా  యూనిఫారం  ధరించినప్పుడు  మెడదగ్గరా, వీపు దగ్గరా, నడుం దగ్గరా కనిపించే  అవలక్షణాలేమీ  కనిపించలేదు. మోచేతికి పైన రెండు ఆకుపచ్చని స్పైప్సు వున్నాయి.

    "మిమ్మల్నిక్కడ  పోస్ట్ చేశారా?" అనడిగింది, నవ్వుతూ.

    "అవునండి. జాయినింగ్ రిపోర్ట్  యివాళే ఇచ్చాను. అంటే ఒకరోజు ఆలస్యంగా వచ్చి చేరానన్నమాట" అన్నాను.

    "లోపలకు రండి!"

    ఆమెను అనుసరించాను.

    "చూశారా ! ఎంతమంది  పేషెంట్స్  మీ కోసం  ఎదురు చూస్తున్నారో !! ఇదిగో  యిది మీ కుర్చీ. ఎదురుగుండా  వున్న సీట్లో  అసిస్టెంట్ కూర్చుంటారు. పిలవమంటారా పేషెంట్లని ?"

    "అసిస్టెంట్ రాలేదా యింకా ?" అనడిగాను, నా సీటులోకి పోయి కూర్చుంటూ.

    "ఈవేళ మీ పని అయింది  లెండి ! నాయుడుగారు  సెలవు పెట్టారు. వీళ్ళందర్నీ  మీ రొక్కరే  చూసుకోవాలి !!" అంది. ఆమె కళ్ళలో చిలిపితనం గోచరించింది.

    గతుక్కుమన్నాను. 'మొదలు పెడుతూనే  ఓ.పి. లో _ అందులో ఆడవాళ్ళ  ఓ.పి. లో _ చిక్కుకున్నానేమిటి  భగవంతుడా' అనుకున్నాను.

    నా బిక్కమొహం చూసి  సిస్టర్ నవ్వుతూ, "అదేమిటలా  అయిపోయారు ? ఇది రోజూ వుండే తతంగమే. దీనికింత  భయపడక్కర్లేదు. అయినా మీ బ్యాచిలో  మరీ అంత  తక్కువ  ప్యాసయారేమిటండీ ? ఒక్కొక్క  యూనిట్ లో ఇద్దర్నే వేసినట్టున్నారు. మేల్ సైడ్ ఎవరేమిటి?" అంది.

    "జగన్నాధరావు  అనుకుంటాను. సరిగ్గా తెలియదు."

    "అదృష్టవంతుడు. ఈ నెలంతా  సుఖపడతాడు. వచ్చేనెలలో మీరిద్దరూ స్థానాలు  మారుతాయి. అప్పుడు మీరు సుఖపడుదురు గాని లెండి. పిలవనా పేషెంట్స్ ని ?" అంది సిస్టర్.

    "ఉండండి. అలా కంగారు పెట్టకండి. ఈ పుస్తకాలు వగైరా ప్రొసిజర్  చెప్పండి."

    సిస్టర్ కొంచెము  ముందుకువచ్చి, బల్లమీద చేతులు ఆనుస్తూ, ముందుకు  వొంగి "వాళ్ళు తెచ్చిన  ఓ.పి. చీటీమీద కంప్లెయింటూ, మీ ఫైండింగ్సూ, డయాగ్నసిస్, ట్రీట్ మెంటూ  రాయండి. ఈ పెద్ద పుస్తకంలో పేషెంటుల  పేరు వ్రాసి దానికెదురుగా  డయాగ్నసిస్ వ్రాసెయ్యండి ఇవిగో స్లిప్స్. వీటిమీద మందులు వ్రాసి సైన్ చేసి యిస్తే, వాళ్ళు తెచ్చుకుంటారు" అని ఒక్కొక్కటిగా  బోధపరిచింది.

    నేను అర్ధమయినట్లుగా  తల ఊపి, "యిహ పిలవండి ఒక్కొక్కర్ని" అన్నాను.

    వాళ్ళు రావడం మొదలుపెట్టారు. నేను రొటీన్ ప్రకారం హిస్టరీ తీసుకోవటం మొదలుపెట్టాను. "నీ పేరేమిటి, వయసెంత, బాదేమిటి, ఎప్పట్నుంచీ, మొదట ఎలా వచ్చింది, యిదివరకేమయినా  జబ్బులు చేశాయా, ఎలాంటి  ఆహారం తీసుకుంటావు, పెళ్ళయిందా, పిల్లలెందరు....ఏదీ, నాలిక చూపించు !"

    ఇలా ప్రశ్నలడిగి  స్క్రీన్ వెనక్కి తీసుకువెళ్ళి  పరీక్షచేసి  పంపిస్తున్నాను. అప్పటికీ చాలా త్వరత్వరగా  పని పూర్తిచేస్తున్నాననుకుంటున్నాను. అరగంట గడిచేసరికి  నలుగురు పేషెంట్లని మాత్రం పంపించి వేయగలిగాను. నాలుగో పరీక్ష చేసి యివతలకు  వస్తూంటే "చూడండి" అని పిలిచింది ,వెనక నుండి సిస్టర్ నెమ్మదిగా.

    నేను ఆగి ప్రశ్నార్ధకంగా  చూశాను.

    ఆమె కొంచెం  ముందుకువచ్చి  రహస్యం చెబుతున్నట్లు  "మీరిలా తీరిగ్గా  హిస్టరీ తీసుకుంటూ., ప్రతివార్ని ఎగ్జామిన్ చేస్తువుంటే  రేపు తెల్లారేదాకా  యిద్దరం యిలా కూర్చునేవుంటాం. క్లుప్తంగా హిస్టరీ తీసుకుని, గబగబ పంపించేస్తూ వుండండి. ఎంతో అవసరమైతేగాని ఎగ్జామిన్ చెయ్యటం పెట్టుకోవద్దు" అంది.

    "అలా అయితే ఎలా?" అందామనుకుని, అప్రయత్నంగా  ఊరుకుని సీటులోకి  వచ్చి కూర్చున్నాను.

    ఆడవాళ్ళలో కలకలం బయల్దేరింది. ఒకర్ని రాసుకుని  ఒకరు ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ముందంటే నేను ముందని కీచులాడుకుంటున్నారు. ఒక చేపల మార్కెట్టులా తయారయింది.

    "ఏమమ్మా, యిది  మీ ఇల్లనుకున్నారా హాస్పిటలనుకున్నారా ? యిళ్ళదగ్గర గంటలకొద్ది  ఊసులాడుకుంటూ టైము వేస్టుచేస్తే లేదుగాని, యిక్కడొచ్చిందీ తొందర? కాసేపు నిశ్శబ్దంగా వుంటే  అందర్నీ  గబగబ పంపించేస్తారు. ఊ, ఊరుకోండి" అంది సిస్టర్, గదమాయిస్తూ.

    సిస్టర్ అలా గట్టిగా కోప్పడగలిగినందుకు  మనసులో  అభినందిస్తూ నేను పనిలో పడ్డాను.

    ఓ దండయాత్రకు  వస్తున్నట్లు  వస్తున్నారు వరుసగా. అవసరమున్న  కేసుకు బ్లడ్ ప్రషర్ చూడటం, యిన్వెస్టుగేషన్స్ ఓ.పి. కాయితం మీద వ్రాసి చేయించుకు రమ్మనటం _ ఇవన్నీ  చేస్తున్నాను.

    ప్రతి ముగ్గురికీ  ఒకరి కంప్లెయింట్ _ గుండెదడా, ఆయాసం, శరీరంలో ఏమీ దోషం కనిపించదు. ఇంకా కొంతమందికి  నీరసం ,కాళ్ళు పీకటం అయితే  మందులుకూడా ఏవి బడితే  అవి వ్రాయటానికి వీలులేదు. అవి హాస్పటల్ లో దొరకద్దూ ? హాస్పటల్ లో లభించే  మందుల లిస్ట్ అంటించివున్న అట్ట ఎదురుగా వుంది. అది చూసుకుని  ప్రిస్క్రిప్షన్ చేయాలి. అయినప్పటికీ ,కొన్ని మందులు  అయిపోయినాయనో, మార్చి వ్రాసియ్యమనో  కొంతమంది తిరిగివస్తున్నారు.

    ఈ పేషెంట్లలో రెండు రకాలవాళ్ళు  కనబడ్డారు నాకు. కొంతమంది సూదిమందు  వ్రాయమని  కాళ్ళూ, గడ్డం  పుచ్చుకుని  బ్రతిమాలేవారు. "అవసరం లేదు మాత్రలు  వేసుకోమ్మా" అంటే వినరు. బాబ్బాబూ! నీకు పుణ్యముంటుంది, వ్రాద్దూ" అని ప్రాణాలు  తోడేసేవారు. మరికొంత మందికి అరకు మందు పిచ్చి. వారి పరిభాషలో  సీసామందు, ఇంజక్షన్లు, టాబ్లెట్లు ఏమయినా  వ్రాయనీ _ సీసామందు, ముఖ్యంగా ఎర్రమందు వ్రాస్తేనేగాని తృప్తిపడేవారు కాదు.

    మూడు నాలుగు కేసులదాకా  ఎడ్మిట్  చేయాల్సివచ్చింది. ఎడ్మిట్ చేయటానికి  అసిస్టెంట్ ను గాని, చీఫ్ నిగాని అడగాలా  అని సిస్టర్ని అడిగాను. అఖ్కర్లేదు, అవసరముంటే  చేసేయమంది. "కాని మీ వార్డులో బెడ్స్ ఎన్ని వున్నాయో కనుక్కోవటం మంచిది. ఎమర్జన్సీ కోసం  కొన్ని బెడ్లు వుంచుకోవటం  మంచిది. రేపు  ఉదయం ఎనిమిది గంటలవరకూ ఎడ్మిట్ అయ్యే ప్రతి మెడికల్ కేసూ మీ వార్దుకే వస్తుంది" అన్నది.

    బెల్ నొక్కి ,వార్డ్ బాయ్ రాగానే, వార్డుకు  వెళ్ళి ఎన్ని  బెడ్లు ఖాళీగా వున్నాయో చూసిరమ్మని కబురుచేశాను.

    ఒక పది  నిమిషాల్లో  వార్డు  బాయ్ వచ్చి  పది బెడ్సుదాకా  ఖాళీగా వున్నాయన్న  వార్త చెప్పాడు.

    ఎండాకాలమేమో - చుట్టూ క్రమ్మివేసిన అంతమంది ఆడవాళ్ళ మధ్య ఊపిరాట్టం లేదు. బి.పి. కఫ్ చేతికి కట్టటం, టెంపరేచర్ చూడటం మొదలైన పనులన్నీ  సిస్టర్ చకచకా  చేస్తోంది. ప్రతివాళ్ళూ  బాధలున్నాయని  చెప్పుకుంటున్నా, చెప్పుకోదగ్గ  కేసులు  అయిదారుకంటే  ఎక్కువ లేవు. రెండు హార్డు కేసులూ, ఫెరిఫరల్ న్యూరై టిస్ ఒకటి, నెప్రైటిస్ ఒకటి, సిరోసిస్ ఆఫ్ ది లివర్  ఒకటి. మరో కేసు  డయాగ్నసిస్ ఇదమిత్దమని తేలలేదు. ప్లూరసీ కావచ్చుననిపించింది, ఇవన్నీ ఎడ్మిట్ చేశాను.

    పదిన్నర ప్రాంతంలో  మేల్ ఓ.పి. నుండి జగన్నాధం, అసిస్టెంట్ డాక్టర్ రామదాసూ వచ్చారు. చీఫ్ వార్డుకి వెళ్ళిపోయాడుట. "అరె! పాపం ఒక్కడూ బాధపడుతున్నాడే  యింతమందితో. మేము కూడా సాయంచేస్తాం వుండండి" అని వాళ్ళిద్దరూ  చెరో కుర్చీలో  కూర్చుని చకచక కేసులు చూడటం  మొదలుపెట్టారు. క్యూ గబగబ జరిగిపోతూంది.

    మొగవాళ్ళవైపు  అట్టే రద్దీ వుండదు. చీఫ్ అక్కడే కూర్చుంటారు సాధారణంగా పదిన్నరలోపలి జనం ఖాళీ అయిపోతారు.
    అసిస్టెంట్ రామదాసుని  చూస్తే నాకు మొదటినుంచీ గిట్టదు. నల్లగా, పొట్టిగా, జిడ్డుకారుతూ  వుంటాడు. నవ్వుతే నల్లటి ముఖంలో తెల్లటిపళ్ళు వికారంగా మెరిసి  ఎదుటివాళ్ళను  ఎద్దేవా  చేసినట్లుంటాయి. నా విద్యార్ధి దశలో ఓ సందర్భంలో  జవాబు కొంచెం తప్పుచెప్పేసరికి అతను ప్రదర్శించిన వికారమైన నవ్వూ ,ఎద్దేవాచేసి  మాట్లాడిన పద్దతీ గుర్తొచ్చినప్పుడల్లా  పళ్ళంతా  దహించిపోతూ  వుంటుంది. అతని వార్డులోనే పని చేయటంవల్ల రెండు మూడుసార్లు  చిన్న చిన్న వాగ్యుద్దాలు  కూడా  జరిగాయి.       


Next Page 

  • WRITERS
    PUBLICATIONS