Next Page 
హత్య  పేజి 1

               
                                                          హత్య

 

                                                  -కురుమద్దాలి విజయలక్ష్మి

 

                           

 

    బస్సు రోడ్డువారగా ఆగింది.

 

    ఆయన దిగంగానే మరెవరూ దిగేవారు ఎక్కేవారు లేకపోవటంతో బస్సు దుమ్మురేపుతూ వెళ్ళిపోయింది.

 

    ఓ పర్యాయం నలుదిక్కులాచూసి ఆయన వూళ్ళోకి బైలుదేరాడు.

 

    ఆయన పేరు కైలాస గణపతి. అదేం పేరని ఆశ్చర్యపడనక్కరలేదు. విని ఆశ్చర్యంగా ఇదేం పేరబ్బా!
అనుకునేవి సవాలక్ష వుండగా లేనిది కైలాస గణపతి పేరుకేమీ అమోఘంగను వుంది.... అద్భుతంగను వుంది.

 

    కైలాస గణపతి వయసు అయిదు పదుల పైనేగానీ ఆకింత మాత్రం కాదు. కిందనుంచి పైకి వర్ణిస్తూ పోతే ఆయన ఇలా వుంటాడు.

 

    ఆఫ్ బూట్లు మేజోళ్ళు మోకాళ్ళు దాకాను.... అంచువున్న ధోవతి. ధోవతిలోకి టక్ చేసిన పుల్ హాండ్స్ గీత షర్టు. షర్టు కిందచేతుల బనీను.... షర్టుపైన నేరేడు పండు కలర్ కోటు.... కోటు జేబులో గొలుసు గడియారం. రెండు ముక్కల లోంచి ధారగా కారుతున్న జలుబు నీళ్ళలాంటి మీసాలు... కళ్లకి చిన్న చిన్న అద్దాలున్న పాతకాలంనాటి కళ్ళజోడు... ఎగ దువ్విన క్రాపు వెనక్కి మెడదిగి వుంది. చేతిలో శంఖు చక్రాలు లాగా గొడుగు అడ్డంగా వున్న జిప్పు బ్యాగ్, పెట్టే వున్నాయి. ఓ సారి చూస్తే గుర్తుంచుకో దగ్గ వ్యక్తిలా వున్నాడు కైలాస గణపతి.

 

    రోడ్డుమీద బస్సు ఆగుతుంది. అక్కడ నుంచి పొలాలు కడ్డంబడి పావుగంట నడిస్తే ఊరు వస్తుంది.

 

    ఆ వూరి పేరు ఉరుముకొండ. ఆ వూరికి ఆపేరు వుండటానికి ఓ కధ కమామిషు వున్నాయి. ఉరుముకొండకి వూరుచుట్టూ కొండలు వుండటం వల్ల ఉరుముకొండ అన్న పేరు రాలేదు.

 

    ఇది ఎప్పటి సంగతో ఎవరికీ తెలియదు..... అక్కడ భూమి బాగా వుందని గ్రహించి ఎక్కడి నుంచో వచ్చిన కొందరు అక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. భూమి తల్లిని వాళ్ళు నమ్ముకొన్నందుకు మంచి ఫలసాయం లభించింది. అలా అలా వచ్చి స్థిరనివాసం ఏర్పరుచుకునే వాళ్ళు పెరిగి పల్లెకాస్తా గ్రామమై కూర్చుంది. ఊరు పెరుగుతున్నది పేరే ఏమిటన్నది తెలియలేదు.    

 

    కొండ అవతల పల్లె..... సుబ్బయ్యగారున్న వూరు ఎల్లయ్య వుంటాడే అక్కడ..... ఇలా కొండగుర్తులు తప్ప పేరంటూ లేకపోయింది.... తాముండే వూరుకి మంచిపేరు పెడదామనుకున్నారు కొందరు..... మందివాగు, కొండబల్లి, మంచూరు.... ఇలా తలో పేరు సూచించారు. ఎవడు చెప్పింది వాడికే తప్ప పక్కవాడికి నచ్చలేదు.

 

    సరిగ్గా ఆ సమయంలో....

 

    ఉరుములు మెరుపులు పిడుగులతో పెద్దవాన పడింది. ఆకాశంలో ఓ వురుము వురిమినప్పుడల్లా ఆకాశం హడలిపోయేలా ఆకాశం ప్రతిధ్వనించేలా కొండకూడా ప్రతిధ్వనితో ఉరమటం మొదలుపెట్టింది. అసలు ధ్వని కన్నా ఈ ప్రతిధ్వని భయంకరంగా వినిపించింది.

 

    "ఉరుము శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. ఇదేంటిరా బాబూ! కొండ ఉరుముతున్నది. దీని శిగతరగ చూస్తుంటే యిది ఉరుము కొండలా వుంది" అది చూసి ఎదాలాపంగా ఎవరోవకాయన అంటూ చుట్ట చివర్లు కొరికి తుపుక్కున వూశాడు.

 

    అదే మొదలు.... ఆవూరి పేరు ఉరుము కొండఅయింది.

 

    కైలాస గణపతి బస్సు దగ్గరనుంచి వూరికి బైలుదేరి పదినిమిషాలు అయింది. పొలాలకి అడ్డంబడి నడిచేసరికి రెండు దారులు వచ్చాయి.

 

    "ఇక్కడ రెండు దారులు వున్నాయి. ఇటు నడవాలా!" కైలాస గణపతి రెండు దార్ల మధ్య నుంచుని ఆలోచిస్తుండగా ఓ రైతు అటుగా వస్తూ కనిపించాడు.

 

    "అందరిలాగా కైలాస గణపతి వుండడు.... అలాగే కైలాస గణపతిలాగే అందరూ వుండరు." ఈ దారిన వెళితే ఉరుముకొండ వస్తుందా! అని అడిగితే ఆయన ప్రత్యేకత ఏముంది. ఆ అలాగే తీరుకూడా వింతగా వుండాలి.

 

    రైతు కైలాస గణపతి దగ్గరకొచ్చాడు. ఈ కొత్త శాల్తీ ఎవడబ్బా! అన్నట్లు ఎగాదిగా చూశాడు.

 

    "రైతుగారూ! నమస్కారం....." అన్నాడు కైలాస గణపతి.

 

    ఆ రైతు తెల్లబోయాడు. ఏమండీ! అన్న వాళ్ళు వున్నారు. ఏమయ్యా! అన్నవాళ్ళు వున్నారు. అంతేగానీ రైతుగారూ! అని పిలిచిన వాళ్ళు ఎవరూ ఆయన పుట్టి బుద్ధి ఎరిగింతరువాత ఎదురుపడలేదు.

 

    "నన్నేనా!" అన్నాడు ఆయన ఆగి.

 

    "మిమ్మల్నే రైతుగారూ!" అన్నాడు కైలాసగణపతి వినయంగా.

 

    "నా పేరు రైతుగారు కాదు..... వెంకట సుబ్బయ్య ముఖం చిట్లిస్తూ చెప్పాడు వెంకట సుబ్బయ్య."

 

    "చూడండి వెంకట సుబ్బయ్యగారూ! నా పేరు కైలాస గణపతి. అన్నట్లు మీరు ఈ దోవన వచ్చారుకదా! ఈ దోవన వెళితే ఏ వూరు వస్తుంది?"

 

    "అయిన పల్లి..... మీరెక్కడికి వెళ్ళాలి?"

 

    "ఇటు....." అన్నాడు కైలాసగణపతి.

 

    అసలు విషయం ఆ దోవన వెళితే అయినపల్లి వస్తుంది. కాబట్టి ఈ దోవన వెళితే ఉరుముకొండ వస్తుంది అనుకుంటూ రెండో దేవవైపు రెండడుగులు వేశాడు కైలాసగణపతి.

 

    "దోసకాయల పల్లెలో ఎవరున్నారు?" వెంకటసుబ్బయ్య అడిగాడు.

 

    "దోసకాయల పల్లెలో ఎవరూ లేరు."

 

    "మరి......?"

 

    "మరేమిటి?"

 

    "దోసకాయల పల్లెలో ఎవరింటికి వెళుతున్నారు?"

 

    "చెప్పాలి అంటే ఎవరింటికి వెళ్ళననే చెప్పాలి."

 

    "అదేంటి?"

 

    "అదేంటి ఇదేంటి అంటే ఏం చెపుతాను! నే వెళ్ళేది దోసకాయల పాలెం కానప్పుడు!" ఆగి చెప్పాడు కైలాస గణపతి.

 

    "దోసకాయల పాలెం కాదు. దోసకాయల పల్లె" వెంకట సుబ్బయ్య సరిదిద్దాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS