Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 1


                                                 తరిగొండ వెంగమాంబ
                                                                                 డా|| ముక్తేవి భారతి
    ఉదయ సంధ్యారాగం మంగమాంబ నుదుటి కుంకుమపై తళుక్కున మెరిసింది. దొడ్లో ఆవుదూడ తల్లి పొదుగును అదేపనిగా కుమ్ముతోంది. మంగమాంబ కాస్సేపు తదేకంగా అటే చూస్తూ ఉండిపోయింది. అంతలోనే చూపు మరల్చుకుని చేతిలో ఉన్న పంచపాత్రలో నీళ్ళు తులసిమొక్కలో పోసి కొన్నినీళ్ళు నెత్తిన జల్లుకుంది. మళ్ళీ పాలుతాగుతున్న దూడవైపు కళ్ళు తిప్పింది. దూడ పాలుతాగుతున్న దృశ్యాన్ని ఎంతసేపైనా అలా చూడాలనే అనిపిస్తుంది మంగమాంబకి. ఆ దృశ్యాన్ని అదోరకమైన పారవశ్యంతో పాటు అంతులేని విషాదమూ కలిగిస్తూ ఉంటుంది ఆమెకు.
    ఆవు పొదుగు బరువు తగ్గింది. దూడ తల్లికి దూరంగా వెళ్ళి చెంగు చెంగున గంతులేస్తోంది. మేడలో చిన్న మువ్వలపట్టెడతో ఎంత ముద్దు గొలుపుతోందో! నల్లని కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ, కుప్పించి ఎగురుతూ, తోక ఊపుతూ ఎంతో ఉత్సాహంతో తిరుగుతున్న ఆ దూడను చూస్తే పిల్లలకు ఎంత సంబరంగా ఉంటుందో! అదే తనకు తీరని కొరత అనుకుంటూ మంగమాంబ నిట్టూర్చింది.
    లేత ఎండపడి తులసికోటలో ఉన్న కృష్ణతులసి నల్లనిఆకులు నిగనిగలాడుతున్నాయి. గుబురుగా పెరిగిన ఆ ముక్కను తాను రోజూ దర్శించుకుంటూనే ఉంది. ప్రదక్షిణ నమస్కారం చేసుకుంటూనే ఉంది. రోజూ తులసి తీర్థం శిరస్సున జల్లుకుంటూనే ఉంది. కానీ ఈ రోజేదో తెలియని పారవశ్యం కలుగుతోంది. తులసికోట గుమ్మంలో కూర్చుని తులసీధ్యాన శ్లోకం పఠించుకుంది.
    యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతా
    యదాగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నామామ్యహం
    తను రోజూ చేసే సేవే చేస్తున్నా ఈ రోజు; తనకు కొత్తగా, వింతగా ఉంది అనుకుంది మంగమాంబ. మనసులో చిత్రమైన ఆలోచనలు దొంతరలు దొంతరలుగా కదులుతున్నాయి. తనూ, తన భర్తా మొక్కని దేవుడు లేడు. మెట్టని తీర్థప్రదేశం లేదు. అయినా ముక్కోటిదేవతలున్నా, ఒక్కరికీ తమపై అనుగ్రహం కలగలేదెందుకో! తనకీ, తన భర్తకీ ఎల్లప్పుడూ శ్రీనివాసుని స్మరణే. అయినా స్వామికి దయకలగలేదు. తన కడుపు పండలేదు. ఓ బాలకృష్ణుడు చిట్టిచిట్టి పాదాలతో నట్టింట నడయాడే భాగ్యానికి నలుగురిలో నవ్వులపాలు కావలసిన రాతే భగవంతుడు తనకు రాసిపెట్టాడు. తమ దంపతులిరువురూ పున్నామనరకంలో చిత్రహింసలు పడక తప్పేలా లేదు. మంగమాంబ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    ఇది నిత్యమూ ఉన్న దిగులే అయినా ఈ రోజెందుకో ఆ దిగులు వెనుక ఏదో ఆశారేఖ తొంగి చూస్తున్నట్లనిపించింది మంగమాంబకి. అశాంతిలో నుంచే ఏదో శాంతి ఆవరిస్తోంది. విచిత్రమైన అనుభూతితో సతమతమవుతూ కూర్చుండిపోయింది.
    అప్పుడే శ్రీవేంకటేశ్వరస్తోత్రం పఠిస్తూ కృష్ణయ్య పూజగదిలోంచి తులసి కోటవైపు  వచ్చాడు. మంగమాంబను చూశాడు. జారుముడిలో మందారం, నుదుట కుంకుమ, మెడలో కుతికంటు, పాదాలకు  అందెలు , కడియాలు, కళ్ళకు కాటుక, ముఖాన పసుపు ఛాయగా మెరుస్తుండగా పరధ్యానంగా కూర్చుని ఉన్న మంగమాంబ ఎదుటికి వెళ్ళి నిలబడ్డాడు.
    మంగమాంబ సంభ్రమంతో, తత్తరపడుతూ లేచి నిలబడి సాష్టాంగ దండ ప్రణామం చేసింది. ఇది కలో నిజమో తనకే తెలియడంలేదు. సాక్షాత్తు శ్రీనివాసుడే తనం ముందు ప్రత్యక్షమయ్యాడు. తన మనసులోని చింత తీర్చడానికి స్వయంగా వచ్చాడు అనుకుంది. అంతలో "మంగా' అన్న పిలుపు విని ఈ లోకంలోకి వచ్చింది. ఎదురుగా భర్త!
    "ఇదేమిటి? మీరెప్పుడు వచ్చారు?" ఇప్పుడే కదా శంఖచక్రాలు ధరించిన ఆ ఏడుకొండలవాడె నా ముందు నిలబడ్డాడు...' అంటూ ఆత్రంగా నలువైపులా చూసింది.
    కృష్ణయ్య భార్యవైపు చూసి జాలిగా నవ్వాడు. భుజంమీద చేయి వేసి  "నీ ధ్యాసంతా శ్రీనివాసుడిమీద ఉంది. అందుకే ఎదురుగా ఉన్న నేను, ఈ కోటలోని తులసి, అక్కడున్న ఆవుదూడ, ఆ చెట్టుపైని చిలకా, అది కోరుకుతున్న జామపండు, ఈ రాగిచెంబు అన్నీ నీకు పరమాత్మలానే కనిపిస్తున్నట్టున్నాయి. ఇక లోపలికి వెళ్లి వంట ఏర్పాటు చూడు" అన్నాడు కాస్త మందలింపు స్వరంతో.
    మంగమాంబ చటుక్కున లేచింది. అవును, బారెడు పొద్దెక్కింది. పొయ్యి రాజేయనేలేదు. అయినా ఈ రోజు నాకీ వింత పరిస్థితి ఏమిటి? అనుకుంది.
    కృష్ణయ్య భార్యనైతే మందలించాడు కానీ, తన అనుభవం కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. తలచుకున్న కొద్దీ ఆశ్చర్యం ముంచెత్తుతోంది.తను పూజామందిరం ముందు కూర్చుని ఉండగా వేంకటేశ్వరుడు తన ఎదుటికొచ్చి నిలచినట్లు కనిపించింది. అది కూడా క్షణకాలం. అది భ్రమే అనుకున్నా, ఎప్పుడూలేని భ్రమ తనకీరోజు ఎందుకు కలిగినట్టు! స్వామి నిజంగానే కనిపించాడనుకున్నా, అంతటి భాగ్యానికి తను అర్హుడుకాడే! ఏవో నాలుగు తీర్థాలు మెట్టినంత మాత్రాన, నాలుగు పుణ్యక్షేత్రాలు దర్శించినంత మాత్రాన తను మహాభక్తుడైపోతాడా? మొత్తానికి ఇందులో ఏదో విశేషముంది. ఈ విషయం మంగతో చెబుదామని ఇవతలికి వస్తే ఈ పిచ్చిది నన్ను చూసి స్వామే అనుకుంది. నాకు స్వామి కనిపించడమేమిటి? మంగకు నాలో స్వామి కనిపించడమేమిటి? ఎవరైనా వింటే మా ఇద్దరికీ పిచ్చి పట్టిందనుకుంటారు.
    మంగమాంబ వంటింటి పనిలో మునిగిపోయింది. కృష్ణయ్య ఆలోచనలతో తలమునకలవుతూనే వీథి గుమ్మంలోకి వెళ్ళి నిలబడ్డాడు. వీథిలో నలుగురు పిల్లలుఆడుకుంటూ కనిపించారు. వాళ్ళల్లో ఒకపిల్లవాడు పరుగు పరుగున కృష్ణయ్య ఇంట్లోకి దూసుకొచ్చాడు. "ఎక్కడికిరా?" అని కృష్ణయ్య అడుగుతున్నా వినిపించుకోలేదు. ఆ కుర్రాడు నేరుగా మంగమాంబ దగ్గరకు  వెళ్ళాడు.
    "అమ్మా ఆకలేస్తోంది. ఏమైనా పెట్టవా?" బతిమాలుతున్నట్టు అడిగాడు.
    "అమ్మా" అన్న పిలుపు విని మంగమాంబ శరీరం జలదరించింది. తలతప్పి చూస్తే ఎదురుగా ఆ కుర్రాడు. చేయిచాచి అడుగుతున్న పాలబుగ్గల పసివాడు. 'మానాయనే, మాబాబే' అనుకుని మనసులోనే మురిసిపోతూ మంగమాంబ దేవుడికి నైవేద్యం పెట్టిన దధ్యోదనంలోంచి కొంతతీసి గిన్నెలో వేసి "ఇంద, తిను" అంటూ ఆ పిల్లవాడి చేతికి ఇవ్వబోయింది.
    "ఊహుఁ, అది నాకేం చాలుతుంది. మొత్తం నేనే తింటాను" అంటూ తనే తీసుకుని మొత్తం దధ్యోదనం తినేసి, వచ్చినట్టే బయటకు పరుగెత్తాడు ఆ పిల్లవాడు.
    మంగమాంబ విస్తుపోయింది. అంతలోనే తేరుకుని భర్తను పిలిచి "వాణ్ణి నీళ్ళతో మూతికడుక్కుని వెళ్ళమనండి" అని కేకేసింది. భర్త నుంచి జవాబు రాకపోవడంతో  వీథిగుమ్మంవైపు చూసింది. ఆ పిల్లవాడూ లేడు. భర్తా కనిపించలేదు.
    "ఇదేమిటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు! ఎవరి పిల్లవాడబ్బా" అని ఆలోచించింది. ఎంత ఆలోచించినా ఆ  పిల్లవాడెవరో పోల్చుకోలేకపోయింది. అంతలో ఒక ఊహ చటుక్కున మెరిసింది. "ఆ యశోదమ్మ కొడుకు కాదుగదా!" ఆ ఊహరాగానే మంగమాంబ ముఖం వేయి దీపకాంతులతో వెలిగిపోయింది. సరిగ్గా అప్పుడే కృష్ణయ్య లోపలికి అడుగుపెట్టాడు.
    మంగమాంబ సంతోషంతో భర్తకు ఎదురుగా వెడుతూ, "ఇదిగో, చూశారా! మనింటికి ఆ బాలకృష్ణుడొచ్చాడండీ" అంది. కృష్ణయ్య ముఖం చిట్లించాడు. నిజానికి  ఉదయం నుంచి అతడు కూడా ఏదో కలగాపులగపు ఆలోచనలతో సతమతమవుతున్నాడు. సంతానం లేదన్న దిగులు మంగమాంబను కుంగదీసినట్టే అతణ్ణీ కుంగదీస్తోంది. దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కినా, నిత్యం ఇరువురూ దైవధ్యానంతోనే గడుపుతున్నా, తమకో నలుసునెందుకివ్వడంలేదన్న భావం అతనిలో అప్పుడప్పుడు దైవం పట్ల ఆగ్రహాన్ని, అలక్ష్యాన్ని రెచ్చగొడుతోంది. తమ పూజలూ, వ్రతాలూ వ్యర్థ మానిపించి తీవ్ర నిరాశానిస్పృహల్లోకి జారిపోతున్నాడు. మంగమాంబ ఇలా అనేసరికి ఒకవిధమైన కోపం అతనిలో  ఉబికి వచ్చింది. అయినా నిగ్తహించుకుంటూ, "మంగా! నీకు మతిపోతున్నట్లుంది. పొద్దున్న నన్ను చూసి బాలకృష్ణుడంటున్నావు. ఊహల్లో ఊరేగడం మాని వంటపని చూడు" అన్నాడు.
    "లేదండీ! నిజంగా వచ్చడు. నైవేద్యం పెట్టిన దధ్యోదనం అంతా తినేసి వెళ్ళిపోయాడు" అంది మంగమాంబ, భర్త మాటలకు జావగారిపోతూనే.
    "మంగా! నీకు నిజంగానే పిచ్చి పట్టింది. కొన్నాళ్ళు పూజలూ, వ్రతాలూ  మానేసెయ్... దేవుణ్ణి మరచిపో , పిచ్చికుదురుతుంది" అనేసి కృష్ణయ్య అక్కడినుంచి విసవిసా వెళ్లిపోయాడు.
    ఆ తర్వాత ఇంట్లో నిశ్శబ్దం రాజ్యం చేసింది.
    యాంత్రికంగా మంగమాంబ వంట ముగించింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS