Next Page 
అందమైన అపశృతి పేజి 1


                                              అందమైన అపశృతి


                                                                    -కురుమద్దాలి విజయలక్ష్మి.



   
    ఆకాశం మేఘావృతమైవుంది. ఉండిఉండి ఒకటీ అరచినుకులు పడుతున్నాయి.

    "ఒక వురుము వురిమింది" నవల చదువుతున్న శృతి చదవడంఆపుచేసి నవ్వుకుంది. "బాగుంది నవలలోనేమో ఒకటీ ఆరా చినుక మాత్రమే పడుతున్నది. బైటమాత్రం ధారాపాతంగాకురుస్తుంది వర్షం. ఇంకానయం  ఈవానకి గాలితోడు కాలేదు" అనుకుంటూ నవలను తలగడమీద పెట్టి మంచం మీంచి లేచి కిటికీ దగ్గరకు.

    కిటికీ కమ్ములు పట్టుకుని బైటకి చూస్తుంటే వాన హొరు వినిపిస్తూ చీకటిలోంచి అప్పుడప్పుడు మెరుస్తూ ఆ మెరుపు వెలుగుకి కన్నులపండుగగా వుంది శృతికి.

    ఎక్కడో పిడుగు పడిన శబ్దం.

    శృతి వులిక్కి పడింది.

    శృతికి పిడుగు శబ్దం అంటేభయం. కిటికీ తలుపుమూసి మంచంవద్ద కొచ్చి కూర్చొంది. "ఒక వురుము వురిమింది" నవల  చదవబుద్ధి కాలేదు.

    టైమ్ పన్నెండు అయిదు నిమిషాలు.

    టైమ్ పీస్ టిక్ టిక్ శబ్దం చేస్తున్నది.

    పావుగంట గడిచిపోయింది.

    అప్పుడే నిద్రపడుతున్నది శృతికి.

    దడదడమంటూ తలుపుపై తట్టిన శబ్దం గట్టిగా వినిపించింది.

    ఒక్క వుదుటున మంచం మీదనుంచి లేచివెళ్ళి తలుపు తీసింది శృతి.

    శృతిని నెట్టుకుంటూ ఓ యువకుడు లోపలికొచ్చి తలుపు లోపల గడియవిగించి, తలుపుకానుకుని నుంచుని జేబులోంచి రివాల్వర్ తీశాడు. ఇదంతా చాలా క్విక్ గా జరిగిపోయింది.

    హఠాత్తుగా జరిగినదానికి బిత్తర పోయింది శృతి. అతని చేతులో రివాల్వర్ సూటిగా తనవేపే వుండటం గమనించి కెవ్వున కేకేయబోయి నోరు తెరిచిందిగాని నోట్లోంచి భయంతో ఎటువంటి శబ్దం రాలేదు.

    "ఇంట్లో నువ్వేనా ఇంకెవరయినా వున్నారా?" అడిగాడతను.

    "ఎ......ఎ.....ఎవరూలేరు" భయంతో బిగుసుకుపోతూ ఎలాగో చెప్పింది.

    అతను తేలికగా నిట్టూర్పు విడిచాడు. అది గమనించింది శృతి. వచ్చింది ఎవరని అడక్కుండా తలుపు తీసినందుకు తనను తాను తిట్టుకుంది.

    "గుడ్! నువ్వు నా గురించి భయపడే పనిలేదు. నేను దొంగనికాదు, ఆడదానిమీద అఘాయిత్యం చేసేవాడిని కాదు, ఓ ఆపద తరుముకొస్తుంటే పారిపోతూ ఇలా వచ్చాను"

    అతను చెబుతుంటే కళ్ళప్పచెప్పి వింటున్నది.

    "నే చెప్పేది జాగ్రత్తగా విను. పోలీసులు వెతకుక్కల్లా నా వెంట పడ్డారు. మరి కాసేపటికి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళొచ్చి అడిగితే ఈ యింట్లోకి ఎవరూ రాలేదనే చెప్పాలి. ఈ లోపల నీవు చేయాల్సింది ఒకటుంది. అది నన్ను దాచడం"

    "నాకు పోలీసులంటే భయం. నీవు వెళ్ళిపో" ఎలాగో ధైర్యం తెచ్చుకుని  తెగించి చెప్పేసింది శృతి.

    అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం జేవురించింది. "స్టాపిట్" అంటూ అరిచాడు.

    గతుక్కుమంది శృతి.

    "నే చెప్పేది విను. నాకు సలహాలివ్వడం, ఆజ్ఞాపించడం నీ సుకుమార శరీరానికి మంచిదికాదు. నా కన్నా నా చేతిలో రివాల్వర్ చాలా చెడ్డది. నాకైనా జాలి, దయ వున్నాయి గాని నా రివాల్వర్ కి బొత్తిగా జాలి,  దయ, మంచి, మర్యాద లేవు. దీనిపని కోపమొస్తే నిప్పులు కురిపించటమే. నీ నా అని చూడదు. సుందరమైన శరీరం తూట్లుపడితే ఏం బాగుంటుంది?" అంటూ ఆగాడు అతను.

    "నన్నేం చేయమంటావ్!" బొంగురుపోయినస్వరంతో అడిగింది శృతి.

    గుడ్ మంచి ఆడపిల్ల లక్షణం అది. నేను దాక్కుంటాను. పోలీసులొచ్చి అడిగితే అప్పుడే నిద్రలేచినట్లు లేచి వెళ్ళి ఎవరూ రాలేదని చెప్పు. నీ మాటలుపై వాళ్ళకి నమ్మకం కలగాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. అది నీ  ప్రవర్తనలో, నీ చాకచక్యంలో వుంది. వాళ్ళకేమాత్రం అనుమానం కలిగినా నా  ప్రాణానికేకాదు, నీ ప్రాణానికికూడా ముప్పు. గుర్తుంచుకో. నీవల్లనే నేనుపోలీసులకు పట్టుబడ్డాననుకో నాకేం ఫరవాలేదు. ఎలాగోలా ఆతర్వాతయినా తప్పించుకుంటాను. తప్పించుకున్న నిమిషంనుంచీ నీకు మనశ్శాంతి వుండదు. నా రివాల్వర్ నిన్నో, నీ వాళ్ళనో ముద్దు పెట్టుకుంటుంది."

    వచ్చే ఏడ్పుని బలవంతాన బిగపట్టుకుని "నన్ను బెదిరిస్తున్నావ్! నేను నీకేం అపకారం చెయ్యలేదు" అంది శృతి.

    "నాకపకారం తలపెట్టినవాళ్ళు బతికి బట్టకట్టలేరులే. ఆ పని నీవు చేయవద్దని హెచ్చరిస్తున్నాను. ఈసరికి ఆ కుక్కలు వచ్చేస్తూ వుంటాయి. నావల్ల నీకుగాని నీ వాళ్ళకు గాని అపకారం జరగరాదని గుర్తుంచుకుంటే చక్కగా నటించి వాళ్ళను పంపిస్తావు. నేను ఆకనబడే వెనుకగదిలో దాక్కోనా? అవసరమయితే పారిపోవటానికి ఆ గదిలోంచి వెనుకవైపు మార్గం వుందా?"

    "ఉంది కాని....."

    "కాని లేదు అర్థణా లేదు. ఇప్పుడు చెలామణిలో వున్నవి పైసలు. సరేనే చెప్పినట్టు చేస్తావుగా?

    "వాళ్ళు వెళ్ళింతర్వాత నీకు నాకు అపకారం చేస్తే?"

    "నేను అపకారం చెయ్యనని నమ్మాలి అంతే. ఈ పరిస్థితులలో అంతకన్నా గత్యంతరము లేదు. ఉపకారికి అపకారం చెయ్యకూడదు. నేను అపకారం చెయ్యనని మాటిస్తున్నానుకదా? నా హెచ్చరిక మాత్రం మార్చిపోకు. నీవల్లనే నేను పోలీసులకి చిక్కానో ఇది నీమీద, నీవాళ్ళమీద నిప్పులు కక్కుతుంది. ఇంక నే దాక్కుంటాను." అంటూ వెనుదిరిగి గుమ్మందాకా వెళ్ళి ఆగాడు. గిర్రున వెనుదిరిగి శృతిని చూస్తూ "నీ నోట్లోంచి ఓ.కె. రాలేదు" అన్నాడు.

    పచ్చి వెలక్కాయ గొంతుకడ్డంగా పడినట్లయింది శృతికి. క్రితం రాత్రి చూసొచ్చిన సినిమా కళ్ళముందు కనిపించింది. "ఒక చీకటిరాత్రి" అనే సినిమాలో పోలీసులు తరుముతుంటే ఓ హంతకుడు ఓ అమ్మాయి ఇంట్లో ప్రవేశిస్తాడు. పోలిసులనుంచి తన్ను రక్షించకపోతే చంపుతానని బెదిరించి లొంగదీసుకుంటాడు. ఆ అమ్మాయి, హంతకుడు భార్యభర్తలుగా ఓ పక్కమీద పడుకుని సరసాలాడుకుంటూ వుండాలి.  పోలీసులు కిటికీలోంచి చూసి వెళ్ళిపోతారు. హంతకుడలా ప్లాన్ చెపుతాడు. గత్యంతరం లేక సరేనంటుంది ఆ అమ్మాయి కిలకిలలాడటం విని భార్యాభర్తలనుకునివెళ్ళిపోతారు. పాముకి పాలుపోసినట్లు పోలీసులు వెళ్ళింతర్వాత హంతకుడు వెళ్ళిపోక ఆ అమ్మాయిని బలాత్కరిస్తాడు. ఆ తర్వాత చాలా కథ జరుగుతుంది. ఆ సీన్లన్నీ శృతి కళ్ళముందు గిరగిర తురుగుతున్నాయి.

    "ఏమిటి నీ ఉద్దేశ్యం?"  రివాల్వర్ సూటిగా శృతివైపు తిప్పి  అడిగాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS