Next Page 
వెన్నెల వేట పేజి 1


                                                      వెన్నెల వేట

                                                                        యర్రంశెట్టి శాయి

                                 


    అగర్వాల్ అగర్వాల్ కంపెనీ బెజవాడలో గవర్నరుపేట సెంటర్లో వుంది. పద్దెనిమిదేళ్ళు క్రమశిక్షణకు అలవాటుపడిన ఆ కంపెనీ గత పదిరోజులుగా గాడితప్పినట్లు మేనేజర్ బంగారయ్యకు అనుమానంగా వుంది. తను ఏ సమయంలో ఆఫీసుకొచ్చినా తలలు వంచుకుని నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ కనిపించే స్టాఫ్ గత పదిరోజులుగా తన మేనల్లుడు భవానీశంకర్ చుట్టూచేరి గట్టిగా నవ్వులు, అరుపులతో నానా గొడవగా తయారయ్యారు. అలా ఇంకోసారి జరిగితే సహించేది లేదని భవానీశంకర్ ని తను హెచ్చరించాడుగానీ ఏమీ లాభం కనిపించటంలేదు. ఆఫీస్ సూపర్నెంట్ చలపతి రోజూ తనకు భవానీశంకర్ నడత గురించి పితూరీలు చేస్తూనే వున్నాడు.
    బంగారయ్య నిశ్శబ్దంగా ఆఫీస్ మెట్లెక్కాడు. అద్దాల్లోనుంచి కనబడుతోన్న దృశ్యం అతనికి పిచ్చెక్కించేసింది.
    భవానీశంకర్ ఓ టేబుల్ మీద కూర్చుని ఏదో ఉత్సాహంగా చెబుతున్నాడు. మిగతా స్టాఫ్ అంతా అతని చుట్టూ చేరి పగలబడి నవ్వుతున్నారు.
    "ఒక గొడుగులో ఆరుగురు నిలబడ్డారు. అయినా ఒక్కరు కూడా తడవలేదు. ఎందుకని? ఎవరయినా చెప్పగలరా?" అడిగాడు భవానీశంకర్.
    అందరూ ఓ క్షణం ఆలోచించారు. గాని ఏమీ తట్టటంలేదు.
    "ఓ.కే. నేనే చెప్పేస్తాను. ఎందుకు తడవలేదంటే అసలు వర్షం లేదు కాబట్టి"
    అందరూ ఘొల్లున నవ్వేశారు.
    "దటీజ్ సిల్లీ" అంది వసుంధర.
    "ఆల్ రైట్ ఇంకోటి చెప్పండి! చీకట్లో చూస్తే అసలేమాత్రం కనిపించనంత నలుపురంగు వ్యక్తి ఓ రోడ్డుమీద వస్తున్నాడు. దానికితోడు నల్ల డ్రస్ వేసుకున్నాడు. మరోవేపు నుంచి ఎదురుగ్గా నల్లని కారు వస్తోంది. ఆ కారుకి హెడ్ లైట్స్ లేవు. సౌండ్ ప్రూఫ్__ అయినాగానీ ఆ వ్యక్తి తేలిగ్గా తప్పుకోగలిగాడు. ఎలా?"
    అందరూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు.
    "వెరీ బాడ్ మైడియర్ ఫ్రెండ్స్! మీ ఐక్యూ_ జీరో అని తెలిసిపోయింది. ఎలా తప్పుకోగలిగాడు. ఆమాత్రం ఊహించలేరా? వెరీ ఈజీ బ్రదర్స్ అది రాత్రి కాదు పట్టపగలు! అంచేత తప్పుకోగలిగాడు..."
    "ఓ! సిల్లీ" అంది వసుంధర మళ్ళీ.
    "ఆల్ రైట్. ఏనుగులు ఏ విషయమూ మర్చిపోవట! ఎందుకనో చెప్పగలరా? ఓ.కే. ఎందుకంటే అసలు ఏనుగులకెవ్వరూ ఏమీ చెప్పారు కాబట్టి_"
    మళ్ళీ నవ్వులు.
    "ఓ.కే. రెండు చేతులు, రెండు రెక్కలు, ఎనిమిది కాళ్ళు, రెండు తోకలు, మూడు తలలు, మూడు శరీరాలు __ వేటికుంటాయో చెప్పగలరా?"
    "తెలీదు..."
    "ఆ మాత్రం తెలీదా? ఓ పావురాయిని చేత్తో పట్టుకుని, గుర్రం ఎక్కిన మనిషికి?"
    బంగారయ్య ఇంక సహించలేకపోయాడు. నెమ్మదిగా లోపలికొచ్చి భవానీశంకర్ దగ్గరగా నిలబడ్డాడు.
    "వన్ మినిట్ అంకుల్! అయిపోవచ్చింది. బైదిబై కొంచెంకూడా తడవకుండా సముద్రాల మీద ప్రయాణించిన బస్ ఏదో చెప్పగలవా అంకుల్?"
    బంగారయ్య మొఖం ఎర్రబడిపోయింది.
    "చెప్పలేవుకదూ! ఆ బస్ పేరు క్రిస్టోఫర్ కొలంబస్ అంకుల్"
    "పోనీ ఇది చెప్పండి ఎవరయినా చూద్దాం! ప్రైడే థర్స్ డే కంటే ముందెప్పుడు వస్తుందో తెలుసా?"
    "భవానీ..." కోపంగా అన్నాడు బంగారయ్య.
    "నీకు తెలీదు కదంకుల్. నేనే చెప్పేస్తాను. డిక్షనరీలో వస్తుంది."
    అంతా నవ్వులు.
    "భవానీ_ ఇలా రా ఒకసారి_" తన రూమ్ లోకి నడిచాడు బంగారయ్య. భవానీశంకర్ అతని రూమ్ లోకెళ్ళాడు చిరునవ్వుతో.
    "యస్ అంకుల్! ఎనీ ప్రాబ్లమ్?"
    "భవానీ నీకు మొన్నే చెప్పాను! ఆఫీస్ అవర్స్ లో ఎవరినీ డిస్టర్బ్ చేయగూడదని_"
    "అఫ్ కోర్స్ చెప్పావంకుల్! కానీ నా పాలసీ వేరు. స్టాఫ్ ఎంత సరదాగా నవ్వుతూ వుంటే ఆఫీస్ పని అంత త్వరగా అయిపోతుంది. వెస్ట్ జర్మనీలో విల్సన్ మూండ్సే అనే పెద్ద ఫరమ్ ఎగ్జిక్యూటివ్ కనిపెట్టాడంకుల్ ఈ పద్ధతి. ఈ పాలసీ ప్రకారం రెండ్రోజుల్లో చేసేపని ఒక రోజులో చేసేస్తారు."
    "భవానీ! వర్క్ కంటే నాకు డిసిప్లిన్ ముఖ్యం. నన్ను పద్దెనిమిదేళ్ళు ట్రాన్స్ ఫర్ లేకుండా అగర్వాల్ ఇక్కడే ఎందుకుంచారో తెలుసా? నేను మెయింటెయిన్ చేసే డిసిప్లిన్ వల్ల"
    "అఫ్ కోర్స్_ అగర్వాల్ కి విల్సన్ మూండ్సే ఎక్స్ పెరిమెంట్ గురించి తెలిసి వుండదంకుల్. తెలిస్తే తప్పక ఆ పాలసీకి షిప్టయిపోయేవాడే!"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS