Next Page 
సంధియుగంలో స్త్రీ  పేజి 1


                              సంధియుగంలో స్త్రీ
                                                                   - వాసిరెడ్డి సీతాదేవి.

                             
    యుగ యుగాలుగా తనేమో, తన సంసారం ఏమో గాని ఇంటి నాలుగు గోడల మధ్య కాలం గడిపిన స్త్రీ ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టడం నేర్చుకున్నది. ఇంటా, బయటా సమన్వయం కుదరక సతమతమైపోతున్నది. ఈ ఇరవయ్యవ శతాబ్దం భారత స్త్రీ జీవితంలో సందియుగం. ఈ సంధియుగంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని గురించి చర్చించి తెలుసుకునే ముందు స్త్రీకి మనదేశంలో అనాదిగా లభించిన స్థానం ఏమిటో కొంతవరకైనా తెలుసుకోవడం అవసరం.
    మాతృస్వామిక యుగాన్ని వదిలేస్తే అనాదిగా స్త్రీ శారీరక బలంలో పురుషుడి ముందు తలవంచుతూనే వచ్చింది. స్త్రీని ప్రకృతి శారీరకంగా బలహీనురాలిగా సృష్టించింది. ఆమెకు మాతృత్వాన్ని ప్రసాదించి, హృదయంలో సంవేదననూ, కళ్ళలో ఆర్ద్రతనూ, శరీరంలో కోమలత్వాన్నీ పొదిగింది.
    "స్త్రీని (అదితిని) ఆది దేవతగా కొల్చిన సంస్కృతి మనది" అంటూ ఈనాటికీ ఎందరో గర్వంగా చెప్పటం వింటూనే ఉన్నాం. అదితిని ముఖ్య దేవతగా కొల్చారు. నిజమే, ఆమె బిడ్డలే దేవతలు..... అజేయులు. అయినా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే-- ఋగ్వేదంలో కూతురు పుట్టాలనే కోర్కె ఎక్కడా కనిపించింది.
    అధర్వణ వేదంలో మంత్రోచ్చారణచేసి కడుపులో ఉన్నది ఆడబిడ్డ అయితే మగబిడ్డగా మార్చమని కోరినట్టు ఉన్నది. ఆత్రేయ బ్రాహ్మణంలో ఆడపిల్ల పుట్టుక అరిష్టంగా చెప్పబడింది. ప్రాఫెట్ మహ్మద్ జన్మించిన ముందు ఆడపిల్ల పుడితే అరబ్బులు ప్రాణంతో పాతిపెట్టేవారట.
    ఈ సృష్టిలో అంత సుకుమారమైన వస్తువును రెండురకాలుగా చూడటం జరుగుతున్నది. దానికి సౌకుమార్యాన్నీ, సౌందర్యాన్నీ ఆపాదించి పూజ్య వస్తువు గానో, లేక భోగ్యవస్తువుగానో చూస్తారు. లేదా దాన్ని పనికిమాలిన వస్తువుగా భావించి ఈసడిస్తారు. అదృష్టమో, దురదృష్టమో కాని ఈ దేశంలో స్త్రీ రెండు రకాల భావాలకూ గురి అయింది. ఒకవైపు మాతృమూర్తిగా పూజల్ని అందుకున్నది. మరోవైపు సుందరీ సుకుమారీ అంటూ ప్రశంసల్ని పొందింది. ఇంకోవైపు ఆడది, అబల అంటూ ఈసడింపులకు గురి అయింది.
    ఆదిమకాలంలో స్త్రీ పురుషుని శారీరక బలం ముందు తల వంచింది. సంఘర్షణతో అతన్ని లొంగదీసుకోవటం సాధ్యంకాదని తెలుసుకున్నది. తలలో పువ్వులు పెట్టుకొనీ, చెవులకు లేత ఆకులతో అలంకరించుకొనీ పురుషుడి హృదయం మీద ఆధిపత్యాన్ని సంపాదించడానికి ప్రయత్నించింది. కాని, ప్రేయసిగా మాత్రమే ఆమె ఉండిపోవడం కుదరలేదు. మాతృత్వ భారాన్ని వహించాలి.   
    భర్తకు బలవంతులైన కొడుకుల్ని ప్రసాదించి గౌరవాన్ని పొందాలి. ఆమె శరీరాన్నీ, మనసునూ నిత్య నూతనంగా చూడాలనే కోర్కె మగవాడికి ఉంటుంది. స్త్రీ ప్రేయసి నుంచి భార్య. భార్య నుంచి తల్లిగా మారింది. సమాజం ఆమెకు సంబంధం లేదు. ఇంటి నాలుగు గోడలమధ్యనే ఆమె నివాసం.
    పురుషుడు తన ప్రేయసిని తన మానసోల్లాసం కొరకు అద్దీపన వస్తువుగా తయారు చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఆమె ఆడడం, పాడడం నేర్చుకున్నది. గంగాజలం మదిరకంటే అన్ని విధాలా శ్రేష్ఠమైనదని పురుషుడికి తెలుసు. కాని, తనను తాను విస్మరించాలని కోరేవాడు గంగాజలాన్ని వదిలి మదిరనే స్వీకరిస్తాడు. స్త్రీ భార్యగా, తనపిల్లలకు తల్లిగా, గృహిణిగా, పురుషుడి కామదాహాన్ని పూర్తిగా తీర్చలేకపోయింది. అందుకే కొందరు స్త్రీలపై చెప్పిన స్థానాల నుంచి దూరంగా ఉంచారు. వారినే స్వర్గంలో అప్సరసలనీ, ఇహంలో వారకాంతలనీ అన్నారు.   
    ఋగ్వేదంలోనే అప్సరసల ఉదంతం ఉన్నది. వారు స్పెషల్ క్లాసు దేవతలు. అప్సరస అంటే నీటిలో విహరించేది అని అర్థం. వారు గంధర్వుల్ని ప్రేమిస్తారు. హాయిగా, మత్తెక్కించేలా నవ్వుతారు. ఆడతారు, పాడతారు. శతవథబ్రాహ్మణంలో అప్సరసల్ని ఆటకూ, పాటకూ, అందానికీ ప్రతినిధులుగా చెప్పబడింది. ఋగ్వేదంలో గంధర్వులే కాక, అప్పుడప్పుడు వేరే పురుషులు కూడా అప్సరసలతో సంబంధం పెట్టుకున్నట్టు చెప్పబడింది.   
    పురాణాలలో ఇంద్రుడు అప్సరసల్ని తన కార్యసాధనకోసం పురుషుల దగ్గిరకు పంపించినట్టు తెలుస్తున్నది. ఈ ఇరవయ్యవ శతాబ్దంలో కూడా స్త్రీలను తమ కార్యసాధనకోసం ఉపయోగించుకోవడం అందరికీ తెలిసిన విషయమే.    
    దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు దేవాలయాల్లో ఉన్నట్టు చెప్పబడే దేవదాసీలకూ, ఈ అప్సరసలకూ ఎన్నో విషయాల్లో పోలికలు కనిపిస్తాయి.   
    భారత స్త్రీ గౌరవ గాథలతో ఆకాశం ప్రతిధ్వనించి ఉండవచ్చు. పాతాళం కంపించి ఉండి ఉండవచ్చు. కాని ఆమె కళ్ళలోని శ్రావణ మేఘాలు మాత్రం విచ్చిపోలేదు. హిమాలయపర్వతాన్ని తల వంచేలా చేసిన ఆమె గౌరవ గాథల్ని సముద్రంలోతుల్ని ఛాలెంజి చేసే ఆమె సహనాన్ని ఆమె కన్నీటితోనే రాయడం జరిగింది. ఇప్పటికీ అదే జరుగుతూ ఉన్నది. ఇంకెంత కాలం జరుగుతుందో చెప్పలేం. ఆమె చేసిన త్యాగాలనూ, ఆత్మ సమర్పణలనూ ఆమె బలహీనతలుగా తలంచింది లోకం.  
    అగ్నిలో దూకి భర్తకు తన పవిత్రతను చాటి చెప్పిన స్ఫటికంలా స్వచ్ఛమైన సీతలో యుగయుగాలనారీ ఆవేదన కనిపించలేదా? సీత ఎందుకు ఎదురు తిరగలేకపోయింది? అగ్నిలో తనెందుకు దూకాలని ప్రశ్నించలేకపోయింది?  
    అలా ప్రశ్నించే స్వాతంత్ర్యం ఆనాడు స్త్రీకి లేదు.
    "స్త్రీ స్వాతంత్ర్యం అర్హత" అన్నది శాస్త్రం. ఆమె నమ్మింది.
    పసితనంలో తండ్రి రక్షణా, యవ్వనంలో భర్త రక్షణా, వృద్ధాప్యంలో కొడుకు రక్షణా స్త్రీకి అవసరం అన్నారు. అదీ ఆమె నమ్మింది.
    భర్త చనిపోతే అతనితో పాటు చస్తే మోక్షం వస్తుందన్నారు. ఆమె అలాగే చేసింది.
    భర్తలేని స్త్రీ వికృత రూపాన్ని ధరించాలన్నారు. కడుపునిండా తిండి కూడా తినకూడదన్నారు. ఆమె అదీ చేసింది.
    దీనికంతకూ కారణం ఒకరకంగా నారీ దౌర్బల్యమే. దాన్నే సౌకుమార్యం అంటూ అందమైన పేరుతో పిలిచారు. ఆమె మనసులోని దౌర్బల్యమే శరీరంలో సౌకుమార్యంగా మారింది. కావాలంటే ఆమె వాటిని జయించగలదు. పొగడ్తలతో మైమరచిన స్త్రీ దాన్ని వదులుకోలేకపోయింది. అది లేకపోవడం ఆమె స్త్రీత్వానికే లోపంగా భావించింది. ఆ దౌర్బల్యమే ఆమెకు శాపంగా పరిణమించిందని గుర్తించలేక పోయింది.
    హిందూ స్త్రీకి సమాజంలో ఎటూ స్థానం లేకపోయింది. ఇంట్లో ఆమెకు ఉన్న స్థానం ఎటువంటిది? తండ్రి ఇంట్లో ఆమె ఒక దుకాణంలోని బొమ్మ. దుకాణదారుడికి తనబొమ్మను అమ్మిందాకా నిద్ర పట్టదు. అలాగే తండ్రికి తన కూతుర్ని ఇంటి నుంచి పంపించేంత వరకూ నిద్రపట్టదు. దుకాణ దారుడికి బొమ్మను అమ్మితే లాభం వస్తుంది. ఇక్కడ ఈ ప్రాణంతో ఉన్న బొమ్మకు అంత విలువ కూడా లేదు. ఈ బొమ్మతో పాటు తండ్రి ఎదురు ధనం ఇచ్చి ఆమెను వదిలించుకోవాలి. అత్తవారింటికి ఆమెను పంపిస్తూ పంపకాల్లో చెప్పే నీతుల్లోనే ఆమె స్థానం ఆ ఇంట్లో ఏమిటో తెలుస్తుంది.   
    కాల ప్రవాహంలో ఎన్నో సామ్రాజ్యాలు కొట్టుకుపోయాయి. అనేక సంస్కృతులూ. జాతులూ కాలగర్భంలో కలిసిపోయాయి. అసంభవాలుగా ఒకనాడు భావించినవి ఎన్నో ఈనాడు సంభవాలు అయ్యాయి. కాని ఈ పవిత్ర భారతదేశంలో స్త్రీ జీవితంలో పెద్దగా చెప్పుకోతగ్గ మార్పు రాలేదు. ప్రాచీనతను గౌరవించవలసిందే కాని ఆ ప్రాచీనతనే అంటి పెట్టుకొని, ఆ ప్రమాణాలతోనే నేటి స్త్రీని కొలవడం న్యాయం కాదు.  
    గతం నుంచి నేర్చుకున్న అనుభవంతో నూతన వాతావరణానికి అనుకూలంగా నడవడంలోనే స్త్రీకి విముక్తి లభించగలదు. రాజా రామ్ మోహన్ రాయ్, గాంధీజీ, వీరేశలింగం వంటి మహానుభావులు స్త్రీ విముక్తి కోసం కృషి చేశారు.   
    స్త్రీలో జాగృతి వస్తూంది. నిద్ర మేల్కొన్ననాడు ఎంతో కాలం నిద్ర పోతున్నట్టు నటించలేదు. స్త్రీ నిద్ర మేల్కొన్నది. స్త్రీ చైతన్యవంతురాలు అవుతూంది. అన్ని రంగాల్లోనూ పురుషులతో పాటు సముఉజ్జీగా నడవటానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఈ ప్రయత్నంలోనే ఆమె ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఆమెకు స్వాతంత్ర్యం వచ్చింది. కాని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదంటున్నారు కొందరు.
    ఆధునిక స్త్రీ గురించి ప్రఖ్యాత కవయిత్రి శ్రీమతి మహాదేవి వర్మ అన్న ఈ మాటలు చూడండి. "అది చీకటి రాత్రి. అదొక మహానగరం. నగరం నడిబొడ్డున దేదీప్యమానంగా వెలుగుతున్న విద్యుద్దీపాలు, రకరకాల దుకాణాలు, కార్లూ, బళ్ళూ, రిక్షాలు, బస్సులూ వీటన్నింటినీ తోసుకుంటూ హడావిడిగా తిరిగే జనం. ఆడా మగా వింత వింత అలంకరణలతో ఎప్పుడూ టౌన్ కూడా చూడని పల్లెటూరి వ్యక్తిని ఎవరో కళ్ళకు గంతలు కట్టి అక్కడికి తీసుకొచ్చారు. చౌరస్తాలో కళ్ళ గంతలు ఊడదీశారు. అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది?
    ఆ వెలుగులో అతని కళ్ళు చిడతలు ఆరిపోతాయి. కళ్లు నులుముకుంటాడు. తాను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. గాభరాపడి పోతాడు. నాలుగు మార్గాల్లో ఎటు వెళ్ళాలో తెలియక తికమక పడతాడు. చుట్టూ జనం అతన్ని వింత మృగాన్ని చూసినట్టు చూస్తారు. హేళన చేస్తారు. చాలా కొద్దిమంది సానుభూతి చూపిస్తారు. ఏ ఒకరిద్దరో సహాయపడే ప్రయత్నం చేస్తారు. ఈనాడు మహానగరంలోని స్త్రీ బ్రతుకు కూడా ఇలాగే ఉన్నది."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS