Next Page 
ప్రేమ తరంగం పేజి 1


                                                          ప్రేమ తరంగం


                                                                                                    మైనంపాటి భాస్కర్.

 

                 

 

హొటల్ అశోకా,
దాని ముందు ఆగిందో జీపు.
సన్ గ్లాసెస్ తీసి చేతిలో పట్టుకుని కర్చీఫ్ తో మోహం తుడుచుకుంటూ పార్కింగ్ వైపు చూశాడు శ్రీహర్ష.
ఒక్క క్షణం నిరుత్సాహంగా అనిపించింది.
అంతలో పసుపుపచ్చటి ఒపెల్ కారు టర్న్ చేసుకుని లోపలికి ప్రవేశించింది. మృదువుగా పోర్టికోలో ఆగింది. కారులోంచి దిగితున్న అమ్మాయిని చూడగానే శ్రీహర్ష మొహంలోకి అప్రయత్నంగా చిరనవ్వు తొంగిచూసింది.
దేవకన్యలు కార్లలో తిరుగుతుంటే ఎంత అసహజంగా ఉంటుందో అంత అసహజంగా ఉంది ఆ అందమైన అమ్మాయి సుతారంగా కార్లోంచి నేలమీదకు అడుగు పెడుతుంటే.
లావణ్య ఓరకంటితో, అందమైన ఆడపిల్లలకు సహజంగా ఉండే కొద్దిపాటి గర్వంతో చుట్టుతా చూసి , శ్రీహర్ష చూపులతో తన చూపులు కలవగానే కళ్ళతోనే నవ్వింది.
"నువ్వూ లేటేనా? నాలాగా? ఏడింటికి వస్తానని చెప్పి ఏడున్నరకి వచ్చినందుకు నీకు బ్రహ్మాండంగా కోపం వచ్చేస్తుందేమో అనుకున్నాను" అన్నాడు శ్రీహర్ష, తెరిపిన పడ్డట్టు నిట్టూరుస్తూ.
"ఇప్పుడు కోపం రాలేదని మీకెలా తెలుసు? అయినా నేను కూడా- మీలాగా లేటుగా వచ్చానని ఎలా అనగలిగారు? అసలెందుకు లేటయింది మీకు?" అని గబగబ అంది, చిరుకోపంగా ముఖం చిట్లిస్తూ.
"నేను అదృష్టవశాత్తు ఇవాళ కాస్త టైములో బయలుదేరగలిగాననుకుంటే నా జీపుకి మూడ్ బాగాలేదు. గారేజ్ కి తీసుకెళ్ళమని గారం చేసింది. అది సరే! నువ్వు టైంలో వచ్చానంటావేమిటి? నా కళ్ళెదురుగా ఇప్పుడు కార్లో దిగుతూ?" అన్నాడు.
"నేను మాట అంటే మాటే! సరిగ్గా ఏడు గంటలకి మూడు సెకండ్ల ముందుగా ఇక్కడికి వచ్చాను. మీ వాహనం లేదు. లోపల బేరర్స్ ని అడిగాను. మీరు రాలేదని చెప్పారు. చెప్పిన టైంలో రావడం మీ సద్గుణాల్లో ఒకటి కాదు కాబట్టి. 'ఎలాగా ఈయన చాలసేపటిదాకా రారులే' అని చైనీస్ బ్యూటి పార్లర్ కెళ్ళి ఐబ్రోస్ సెట్ చేయించుకుని వచ్చాను" అంది.
శ్రీహర్ష లావణ్య కనుబొమ్మల వైపు చూశాడు. అందంగా అర్ధచంద్రాకారంలో తీర్చిదిద్ది ఉన్నాయి.
"లావణ్యా! నీ కనుబొమ్మలు సహజంగానే తీర్చిదిద్దినట్లు ఉంటాయి. ప్రత్యకంగా వాటిని సెట్ చెయ్యాల్సిన అవసరం లేదు."
సంతోషంగా నవ్వింది లావణ్య.
"మీరలానే అంటారు. కనుబొమ్మల దగ్గర్నుంచి కాలిగోళ్ళ దాకా బ్లేమిష్ లెస్ గా, మచ్చలేకుండా ఉండాలి. మనుషులం అలా ఉండాలి. పరిసరాలు అలాగే వుండాలి. లేకపోతే నాకు చిరాకు, బంగారికైనా మెరుగు పెడితేనే అందం. అలానే ఎంత అందమైన అమ్మాయికైనా అలంకారం అవసరం" అని ఒక్క క్షణం ఆగి, "బావున్నానా?" అంది.
"బావున్నావ్ అని ఒక్క మాటతో చెప్పెస్తే నీ అందానికి పూర్తీ న్యాయం చేసినట్లవదు. నిన్ను వర్ణించాలంటే కనీసం గంట పడుతుంది. ఇక్కడే నిలుచుని వర్ణించాననుకో. జనం హొటల్లో కెళ్ళడం మానేసి మన చుట్టూ చేరతారు. అందుకని ఓ లావణ్యావతి! లోపలికి నడు. కట్ లెట్టు తింటూ కబుర్లు చెప్పుకుందాం" అన్నాడు.
కారు తలుపు లేసి , లాక్ చేసి , కారు తాళాలు పెదాల కానించుకుని చూస్తూ "జీప్ లాక్ చేశారా?" అంది.
అతను అసూయగా తాళాల వైపు చూశాడు.
"ఏమిటలా చూస్తున్నారు?" అంది.
"కీస్.....కిస్...." అన్నాడు.
"కాస్త మానవ భాషలో చెబితే బావుంటుంది. నాకు పిట్టల భాష తెలియదు."
"కీస్.....అంటే తాళం చెవులు. కిస్ అంటే నీ పెదాల్ని ముద్దు పెట్టేసుకుంటున్నాయని అసూయ పడుతున్నాను.'    అందంగా మూతి విరిచింది లావణ్య.
"అడిగిందానికి జవాబు చెప్పకుండా మాట దాటేస్తారు" అంది.
"ఓ! అదా! నా జీప్ లాక్ చెయ్యాల్సిన అవసరం లేదు అమ్మాయీ! దాని సంగతి తెలిసిన వాడెవడు ఎత్తుకెళ్ళే సాహసం చెయ్యడు. తెలియనివాడు ఎత్తుకెళ్ళాడనుకో, 'దేముడా' అంటూ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే వదిలి వెళ్తాడు- బాధ భరించలేక."
నవింది లావణ్య. అంతలోనే కాస్త సీరియస్ గా మొహం పెట్టి "ఆ ఆశ్రద్దె వద్దు. ముందు లాక్ చేసి రండి" అంది.
హోంవర్క్ చేసేసిన కుర్రాడు టీచరు అడగ్గానే చటుక్కున పుస్తకం చూపించినట్లు, జేబులోంచి జీప్ తాళాలు తీసి చూపించాడు శ్రీహర్ష.
"మరి ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా! అనవసరంగా చివాట్లు తిన్నారు పాపం!" అంది లావణ్య.
"నీతో చివాట్లు తినడం నాకు సరదా!"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS