Next Page 
నేను పేజి 1


                                         నేను
                                                                         కొమ్మూరి వేణుగోపాలరావు

 

                                        


    ఆశలుండటం తప్పు కాదు. కాని అవి అతిగా ఉండటం, అర్థం లేకుండా ఉండటం మాత్రం తప్పే.


    మనిషి ఆశాజీవి కాకూడదని ఎవరంటారు? కాని కుటిల భాష్యంతో జరిగిపోయే జీవితంలో ఈ ఆశావాదం ఎంతవరకు సార్థకత పొందుతుంది.     


    నేనెప్పుడు జీవితాన్ని ప్రేమిస్తాను. దాని పరిమళాన్ని ఆస్వాదించటానికే ప్రయత్నించాను.


    చాలామంది చెబుతూ ఉంటారు. గతించిన రోజులే బావున్నాయి. ఆ రోజుల్లో.... అబ్బో.... అలా చేశాం ఇలా చేశాం అంటూ ఇతరులకి కనిపించని గతాన్ని గురించి గొప్పలు చెప్పుకుని, ఆవో మధుర స్మృతులుగా నెమరువేసుకుంటూ ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు.     


    ఇంకో వర్గం వారున్నారు. అబ్బ! ఆ రోజుల్లో ఓ వెలుగు వెలిగాం. ఇలాంటివి ఎన్ని చూశాం! ఇదో లెక్కా జమా! అంటూ గతంలోని చెడుని కొన్ని యాదృచ్చిక సంఘటనలని అపురూపంగా చెప్పుకుని మురిసిపోతుంటారు.   


    ఈ రెండు రకాల మనస్తత్వాలూ నాకు నచ్చవు. గతం ఎంత గొప్పదయినా అవుగాక, మనిషి అప్పటికన్నా వర్తమానంలో మానసికంగా ఎదిగి ఉండాలి. ఆలోచనా సరళిలో పరిపక్వత ఉండాలి.       


    నా బాల్యం నాకు బాగా గుర్తుంది. ముఖ్యమైనవి గాని, మామూలివి గాని కొన్ని సంఘటనలు మనసులో ముద్రపడిపోతాయి. అవెందుకు గుర్తుంటాయో కూడా తెలియదు. ఆరేళ్ళు వయసప్పుడు మా చుట్టాలింట్లో పెళ్ళికి ఓ పల్లెటూరు వెళ్ళాను. బస్తీలో పుట్టి పెరుగుతున్న ఆ పల్లెటూరి వాతావరణం, పొలాలు ఓ ప్రక్క నుంచి సన్నగా ప్రవహిస్తోన్న నీరు, దూరంగా కనిపించే ఆకుపచ్చటి కొండలు, ఊరికంతా ఉన్న ఒకే ఒక పిండిమర. కుమ్మరి కొలిమి, చాలా చిత్రంగా, ఆసక్తికరంగా ఉండేవి. సాయంత్రాలు రైతులు కొందరు గుమికూడి రకరకాల కబుర్లు చెప్పుకొనేవారు. వారిలో ఓ యాభై యేళ్ళ మనిషి నాకెందుకో నచ్చేవాడు. పల్లెటూరి పాటలు, జానపద గీతాల్లాంటివి పాడేవారు.     


    తర్వాత ఆ ఊరు ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ మనిషిని ఎప్పుడూ చూడలేదు. బ్రతికున్నాడో లేదో కూడా తెలీదు. కాని కనీసం వారానికోసారయినా ఆయన రూపం కళ్ళముందు మెదుల్తూ ఉండేది. అలా జ్ఞాపకం రావడానికి ఓ సందర్భం, కారణం ఉండేది కాదు.  


    అలాగే ఓసారి పెద్ద గాలి వాన ఎంత పెద్ద గాలి వానో! చిన్న చిన్న ఇళ్ళ మీద నుంచి పెంకులు, సిమెంట్ రేకులు, తాటాకులు వెర్రి వేగంతో ఎగిరిపోతూ ఉండటం, ప్రకృతి ప్రపంచాన్ని కోపంతో చుట్టేస్తున్నట్లు. ప్రచండ వేగంతో వీస్తున్న గాలి చేసే చప్పుడు, ఎక్కడో ఏవేవో కూలిపోతూన్నట్లు గుండెలు జలదరించేలా పెద్ద పెద్ద శబ్దాలు.   


    మాది పాతకాలం నాటి చిన్న మేడ. బహుశా అంతా కలసి వంద గజాలకి మించి ఉండదు. ముందు చిన్న వరండా ప్రక్కన మరో గది అందులో అటక. దాన్ని అటక గది అని పిలిచేవాళ్ళం. ఆ తర్వాత హాలు, లోపల వంటిల్లు, వసారాలో అమరి ఉన్న గది..... అందులో భోజనాలు చేసేవాళ్ళం. అక్కణ్ణించి చిన్న గదిలోంచి పైకి దారి. దాన్ని మెట్ల గది అనేవాళ్ళం. పైకి వెళ్ళగానే డాబా. అటువైపు సిమెంట్ రేకులతో ఓ షెడ్. ఇటుకేసి పెద్ద గది. ఆ గదిలో పడుకునేవాళ్ళం. వేసవయితే డాబా మీద పడుకునే వాళ్ళం. పెద్దగదిలోంచి రోడ్డుకేసి పొడవాటి వరండా.    


    ఆ వరండాలో నిలబడి చాలాసేపు తుఫాను వైపరీత్యాన్ని చూస్తూ నిలబడ్డాను. గోడలు ఎత్తైనవి కావడంవల్లా, వసారా వెడల్పు కావడం వల్లా గాలి మరో వైపుకు వీస్తుండటం వల్లా.... లోపలికి గాలి వాన విసురు తాకిడి తెలీటం లేదు. కొంతసేపటికి జల్లు వేగంగా పడటం గాలి బలంగా త్రోసెయ్యటం మొదలయినాయి. అమ్మ వచ్చి కోప్పడి, రెక్క పుచ్చుకొని లాక్కు వెళ్ళి తలుపులన్నీ బిడాయించింది.     


    అమ్మతో బాటు క్రిందికి దిగొచ్చాను.


    ముందుగదిలో ఒకతను కూర్చుని ఉన్నాడు. ముప్ఫయ్యేళ్ళుంటాయి.


    ఎవరన్నట్లు అమ్మకేసి చూశాను.


    "బయట చూరు క్రింద వానలో తడుస్తూ నిలబడి ఉంటే నాన్నగారు లోపలికి రమ్మని, బట్టలిచ్చారు కట్టుకోటానికి. ఈ ఊరు కాదట. పనిమీద ఈ ఊరొచ్చి గాలివానకి ఇరుక్కుపోయారు" అన్నది అమ్మ.     


    ఎందుకో ఆ అబ్బాయి వంక పరీక్షగా చూశాను. మనిషి ఆ విధమైన పరాధీనస్థితిలో పడటం నాకిష్టం ఉండదు. కాని మన ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండానే పరాధీనస్థితి అన్నది అప్పుడప్పుడు నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడుతూంటూందన్న సత్యం తర్వాతెప్పటికో బోధపడింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS