TeluguOne - Grandhalayam
Mandu Vennela


                            మండు వెన్నెల

                                                                      - మైనంపాటి భాస్కర్

 

                                               


    విమానంలా ఎయిర్ పోర్ట్ వైపుకి దూసుకుపోతోంది ఫియట్ కారు.


    విండ్ షీల్డ్ మీద పడుతున్న వర్షపు చినుకులని యాంత్రికంగా అటూ ఇటూ జరుగుతూ తుడిచేస్తున్నాయి వైపర్లు.


    ఆసక్తిగా వాటి కదలికనే చూస్తున్న భానురేఖ, డ్రయివింగ్ సీట్లో కూర్చున్న తల్లితో అంది. "నేను సిక్త్స్ క్లాసులో స్కూల్ ఫస్టు వచ్చినానని నాన్నగారికి తెలుసా అమ్మా?"


    రోడ్డు మీద నుంచి దృష్టి మరల్చకుండానే చిరునవ్వుతో చెప్పింది సుమిత్ర.


    "తెలుసు డార్లింగ్! ఆరోజే ట్రంకాల్ చేసి చెప్పానుగా!"


    "అది ఉత్త ట్రంకాల్ అనరమ్మా! ఓవర్ సీస్ కాల్! అమెరికాకి కదా?"


    "అవును డార్లింగ్! అవును!" అంది సుమిత్ర నవ్వుతూ.


    "మరి స్కూల్ ఫస్టు వచ్చినందుకు నాకేం ప్రజెంటేషన్ తెస్తారమ్మా?"


    "మీ నాన్నగారు నీకోసం ఏం ప్రెజెంటేషన్ తెచ్చినా చాలా గ్రాండ్ గా వుండేదే తెస్తారు. అవునా?"


    "గ్రాండ్ గా ఉండేదంటే, గ్రాండ్ కాన్యాన్నే తెచ్చేస్తారా అమ్మా?" అంది భానురేఖ అల్లరిగా.


    గ్రాండ్ కాన్యన్ అంటే అమెరికాలోని అపురూపమైన దృశ్యాలలో ఒకటి. బ్రహ్మాండమైన కత్తితో భూమిని కొన్ని కిలోమీటర్ల మేర చీల్చేసినట్లు కనబడే లోతైన లోయ అది.


    ముచ్చటగా ముద్దులొలికేలా మాట్లాడుతున్న కూతురివైపు మురిపెంగా చూసుకుంది సుమిత్ర. బంగారపు బొమ్మలా ఉంది భానురేఖ. వయసు పదేళ్ళే అయినా అంతకు పదింతలు ఉంటాయి ఆ అమ్మాయి తెలివితేటలు.


    ఇంత ఐక్యూ ఉన్న తమ కూతురు ఎంత గొప్పదవుతుంది పెద్దయ్యాక? ఐ.ఏ.ఎస్.కి చదివించినా లిస్టులో ఫస్టు వచ్చి తీరుతుందా?


    ఆకాశంలో ఉరుములాంటి చప్పుడు వినబడింది. ఎగ్జయిట్ మెంటుతో కిటికీలోంచి పైకి చూస్తూ, "బోయింగ్ 737! దీన్లోనే వస్తారేమో నాన్నగారు! కెనెడీ ఎయిర్ పోర్టు నుంచి బాంబేషార్ ఎయిర్ పోర్టుకి బహుశా జంబోజెట్ లో వచ్చి వుంటారు. అవునా?" అంది భానురేఖ.


    "అయుండొచ్చు డార్లింగ్!" అంది సుమిత్ర ఒక్కక్షణంపాటు కళ్ళెత్తి విమానాన్ని చూసి, మళ్ళీ వెంటనే రోడ్డు మీదికి దృష్టిసారిస్తూ.


    ఆ ఒక్కక్షణంలోనే రాష్ గా మోటార్ సైకిల్ ని నడుపుతూ, కారుని ఓవర్ టేక్ చేసేశాడు ఒక టీనేజర్.


    కంగారుపడిపోయి స్టీరింగుని గబగబా తిప్పేస్తూ కారుని ఎడమవైపుకి తీసుకెళ్ళిపోయింది సుమిత్ర. అక్కడ ఒక మనిషి పార్కులో నడుస్తున్నట్లు తీరిగ్గా రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. అతన్ని తప్పించడానికి స్టీరింగుని త్వరత్వరగా తిప్పి కారుని కుడివైపుకు మళ్ళించింది సుమిత్ర. కారు రోడ్డు మధ్యకు వచ్చేసింది. స్పీడుగా ఎదురు వస్తోంది రాక్షసిలాంటి లారీ ఒకటి.


    మరుక్షణంలో, విసురుగా దాన్ని గుద్దేసింది కారు. గుండెలు జలదరించే శబ్దం వినబడింది. వెనువెంటనే హృదయవిదారకంగా ఆక్రందనలు.


    క్షణాలలో పెద్ద గుంపు పోగయిపోయింది అక్కడ.


                                                                * * * *


    అతికష్టంమీద కనురెప్పలు తెరిచి, కళ్ళు చిట్లించి దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నించింది భానురేఖ.


    ఎటుచూసినా కళ్ళు చెదిరిపోయేలా తెల్లటి తెలుపు కనబడుతోంది. తెల్ల గోడలు, తెల్ల షెల్పులు. తెల్ల యూనిఫారంలో వున్న నర్సు ఒకామె వెనక్కి తిరిగి నిలబడి సిరెంజిలోకి మందు ఎక్కిస్తోంది.


    ఒక ప్రయివేట్ హాస్పిటల్లో స్పెషల్ రూమ్ అది.


    తను పుట్టిన తర్వాత పలికిన మొదటి మాటనే పునర్జన్మ ఎత్తినట్లు స్పృహలోకి వచ్చిన తర్వాత పలికింది భానురేఖ.


    "అమ్మా!"


    ఉలిక్కిపడి తిరిగి చూసింది నర్సు. అనుకోని అద్భుతమేదో చూస్తున్నట్లు ఆశ్చర్యం కనబడుతోంది ఆమె కళ్ళలో. దాన్ని అణుచుకుంటూ "ఎలా ఉందమ్మా?" అంది ప్రయత్నపూర్వకంగా.


    "అమ్మేదీ?" అంది భానురేఖ మళ్ళీ.


    "ఫోన్ చేస్తాను. అమ్మ వస్తారు." అని బయటికి పరిగెత్తింది నర్సు.


    వింతగా చూస్తూ ఉండిపోయింది భానురేఖ. ఎందుకలా కంగారుపడిపోతోంది ఈ నర్సు? తనని ఎప్పుడు చేర్చారు హాస్పిటల్లో? యాక్సిడెంటులో బాగా దెబ్బలు తగిలాయా? అసలు అమ్మేదీ?"


    ఆతృతగా వెళ్ళి డాక్టర్ కోసం చూసింది నర్సు. ఉన్న ముగ్గురు డాక్టర్లూ మేజర్ ఆపరేషన్ ఏదో అటెండ్ అవుతూ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు.


    ఏం చెయ్యాలో తోచక, భానురేఖ ఇంటికి ఫోన్ చేసింది నర్సు.


    "హలో?" అని పలికింది ఒక స్త్రీ కంఠం.


    "మీ అమ్మాయికి స్పృహ వచ్చింది!" అంది నర్సు. "చనిపోయిన మీ అమ్మాయి తిరిగి బతికింది!" అన్నంత ఉత్సుకతతో.


    లైన్లో అవతల ఉన్న స్త్రీ ఒక్కసారి గట్టిగా ఊపిరి లోపలికి తీసుకున్న శబ్దం.


    "డాక్టరుగారు చూశారా?"

Related Novels