TeluguOne - Grandhalayam
Love Stories

   
    రంగన్నలో చాలా మార్పు వచ్చింది. ముసలితనం ఛాయలు అతణ్ణి పూర్తిగా ఆవహించినాయి. మనిషి కొద్దిగా వంగాడు. చూపు తగ్గినట్లుంది.

 

    "అయ్యగారు దాటిపోయి అర్నెల్లయిందండి..." అంటూంటే అతని కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.

 

    "అవును, రంగన్నా! లేకపోతే నాకీవాళ ఇక్కడికి రావలసిన అవసరమే ఉండేదికాదు..."

 

    సామంతకు రంగన్న కేవలం తమ తోట కనిపెట్టుకుని ఉండే మనిషి కాదు. అంతకన్న చాలా ఎక్కువ. చిన్నప్పుడు అతని చేతుల మీద పెరిగి, వెన్నెల రాత్రిళ్ళు అతను చెప్పే కథలు విన్నాడు. రంగన్న బ్రతికి చెడ్డమనిషి, రంగన్న త్వరగా తేరుకొని పక్కగదిలోకి నడిచాడు. గాజుల చప్పుడు వినిపించింది సామంతకి.

 

    "చూడు, రంగన్నా! భోజనం రైల్లోనే కానిచ్చాను. ఆ ప్రయత్నాలేం చేయకు..."

 

    రంగన్న గదిలోనుంచి "అలాగే, బాబూ" అన్నాడు.

 

    కాళ్ళూ చేతులూ కడుక్కొని, బట్టలు మార్చుకుని మంచం మీద నడుము వాల్చాడు సామంత. చాలా గంటలు పట్టిన రైలు ప్రయాణం అతనికి విసుగూ, అలసటా - రెండూ కలగజేసినాయి. అందుచేత పడుకోగానే ఒక్కసారి నిద్రముంచుకొచ్చింది.

 

    "అర్జెంటు పనిమీదొచ్చినట్లున్నారు" అడిగాడు రంగన్న.

 

    "అవును, రంగన్నా! తోట అమ్మేసేయాలని నిర్ణయించుకొన్నాను. ఇంచుమించుగా బేరంకూడా కుదిరిపోయింది. రేపు వాళ్ళు మధ్యాహ్నానికల్లా తోట చూడ్డాని కొస్తానన్నారు..."

 

    రంగన్న మాట్లాడలేదు.

 

    "మాట్లాడవేం, రంగన్నా?"

 

    "అమ్మడానికి తొందరపడుతున్నారేమో అని అనిపిస్తూంది, బాబూ!"

 

    "లేదు, రంగన్నా! నాన్నగారి కిష్టం లేకపోవడం మూలాన ఇంత ఆలస్యం అయింది. ఒక్క విషయం ఆలోచించు! నేను అక్కడే ఉద్యోగం చేస్తున్నాను. అక్కడే రిటైరవుతాను. నా పిల్లల సంగతీ అంతే! చదువూ సంధ్యలన్నీ అక్కడే జరుగుతున్నాయి. వాళ్ళసలు ఈ ఊరే చూడలేదు . ఇక ఈ తోట ఒక్కటీ ఇక్కడ ఉంది మాకేం ఉయోగం?8'

 

    "సరే, బాబూ! మీ ఇష్ట ప్రకారమే కానీండి..."

 

    ఉదయం మెలకువ వచ్చేసరికి టైమ్ ఏడు దాటింది.

 

    కాఫీ ముగించి కొబ్బరితోట వేపు బయలుదేరాడు సామంత. తోట చూడ్డానికి మధ్యాహ్నం మూడు గంటలకల్లా రంగన్న ఇంటి కొస్తామన్నాడు. వాళ్ళు. నచ్చితే ఆ వేళే రాతకోతలన్నీ అయిపోవాలని వాళ్ళకి చెప్పాడతను. రంగన్న ఏదో పనిమీద మెయిన్ రోడ్ దగ్గరికెళ్ళాడు.

 

    వర్షం కురవటం లేదుగానీ, ఏ క్షణంలోనయినా దిమ్మరించేసేట్లుంది. నల్లని మబ్బులు ఇంకా దట్టంగా మూసుకొస్తున్నాయి. కాలువ గట్టు వెంబడే నడవసాగాడు సామంత. అతనికి పాత రోజులు గుర్తుకొచ్చినాయి. ప్రతిరోజూ ఆ కాలువగట్టు వెంబడే హైస్కూల్ కెళ్ళేవాడు తను. వర్షాకాలంలో తన పని మరీ అవస్థగా ఉండేది. గట్టు వెంబడి తిరిగే వానపాముల్ని చూస్తే మరీ భయం. చటుక్కున ఓ సంఘటన గుర్తుకొచ్చింది సామంతకి. ఆ రోజు స్కూలు కెళుతూంటే చాలా లావుగా ఉన్న పామొకటి దారికడ్డంగా పడుకొనుంది. అంతే! పావుగంటసేపు తనలాగే నిలబడిపోయాడు. వెనక్కి వెళ్ళడానికీ, ముందుకు పోవడానికీ కూడా ధైర్యం చాలడం లేదు. ఆ పరిస్థితిలో గట్టిగా వెనకనుంచి కన్య నువ్వు వినిపించింది.

 

    ఉలిక్కిపడ్డాడు తను.

 

    "బురదపాముని చూసి భయపడుతున్నావా? ఛీ.... ఛీ...." హేళనగా అంది.

 

    "నేనేం భయపడటం లేదు... ఊరికే చూస్తున్నాను..." పౌరుషంగా అన్నాడు.

 

    "అబ్బో! నేను అంత దూరం నుంచీ చూస్తూనే ఉన్నాను! బిగదీసుకు నిలబడిపోయి ఇంకా అబద్ధాలాడతావెందుకూ?"

 

    నవ్వుతూ వెక్కిరించి , ఉష్" అంటూ ఎగిరి పాముమీదికి దూకింది. పాము సర్రున గట్టు దిగి పారిపోయింది.

 

    ఆ రోజునుంచీ ఎప్పుడూ తనని ఉడికిస్తూనే ఉండేది కన్య.

 

    తోట చేరుకొన్నాడు సామంత. చుట్టూ కాంపౌండ్ గోడలా ఎదిగిన ముళ్ళచెట్లు కనిపించాయ్. గేటు తీసుకుని లోపలికి నడిచాడు. వర్షం కురియడం మూలాన నేలంతా ఇంకా తడిగానే ఉంది. నాలుగెకరాల తోట అది. మధ్యలో ఎత్తుగా, అందంగా తండ్రి కట్టించిన గది కనబడుతూనే ఉంది. ఎండాకాలంలో తండ్రితోబాటు తను కూడా చాలారోజులు ఆ గదిలోనే పడుకొనేవాడు. చల్లగా ఉంటుందక్కడ. గది చుట్టూ అరుగు. పైన బంగళా పెంకు వసారా! ఆ గది అంటే అప్పట్లో తనకి పంచప్రాణాలూను! స్కూల్ కి పోయేప్పుడు, ఇంటికొచ్చేప్పుడు కూడా కాసేపటియినా ఆ గది దగ్గర గడపందే తోచేది కాదు. కన్యకి కూడా ఆ గది అంటే చాలా ఇష్టం! ప్రతిరోజూ అక్కడే కూర్చుని పొద్దుపోయేవరకూ ఆటలాడుకొనేవాళ్ళు. అన్నట్లు, కన్య ఎలా ఉందో? ఆ మధ్యనే వివాహమయిపోయి నట్లు తెలిసింది. ఆమె గురించి రంగన్ననని  అడుగుదామని మరిచేపోయాడు తను. ఇప్పుడెక్కడుందో. ఏమిటో?

 

    గది దగ్గరికి చేరుకొన్నాడు సామంత. చెత్తాచెదారంతో బాగా దుమ్ము కొట్టుకుపోయి ఉందది. రంగన్న ఇచ్చిన తాళం చెవితో గది తలుపు తెరిచాడు. లోపల వెచ్చగా ఉంది. అన్నీ అలాగే ఉన్నయ్! చెక్కమంచం, ఓ మూల టేబులూ, కుర్చీ, టేబుల్ మీద ఫ్రేమ్ లో తన చిన్నప్పటి ఫోటో - ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు సామంత. ఆ ఫోటో ఇంకా అలాగే ఉందే? దీని సంగతి మరిచిపోయాడు తను. గది వెనక తలుపులు తెరిచాడతను. బయట కొంచెం దూరంలోనో ఇటుకతో కట్టిన చిన్న బొమ్మరిల్లు కనిపించింది. అది చూస్తూ కొద్ది క్షణాలు కదలిక లేకుండా నిలబడిపోయాడు. మనసు అడుగున పడివున్న పాత స్మృతులన్నీ సముద్ర కెరటాల్లా ఉవ్వెత్తుగా ఎగిసిపడిపోసాగినాయి. ప్రతిరోజూ తనూ, కాన్యా ఆ బొమ్మరింటి దగ్గర ఆడుకొంటూండేవాళ్ళు. అది తమ ఇల్లు! తను పొలానికి పోయినట్లు పోవడం, కన్య ఇంట్లో అన్నం కూరలు వండినట్లు లక్కపిడతల్లో వండడం, అన్నం సరిగ్గా ఉండకలేదని తను అన్నం వదిలెయ్యడం, తినమని కన్య బ్రతిమాలడం...

 

    సామంత ఇంచుమించుగా పరుగుతో బొమ్మరింటి దగ్గరికి చేరుకొన్నాడు. అది దగ్గరవుతున్న కొద్దీ గుండెలు కొట్టుకునే వేగం హెచ్చింది. ఆ జ్ఞాపకాలు అతనిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బొమ్మరింటి ముందు ఇసుకలో మోకాళ్ళమీద కూర్చుని ఆనందంగా దానివంకే చూడసాగాడతను.

 

    హఠాత్తుగా అతనికి గుర్తొచ్చింది.

 

    బొమ్మరింటి వెనుకే తనూ, కన్యా కలిసి ఓ చిన్న రాధాకృష్ణుల గాజు విగ్రహం భూమిలో పాతిపెట్టేవారు. ఆ విగ్రహం చాలా అందంగా ఉండేది. అదంటే తనకూ, కన్యకూ చాలా ఇష్టం! అందుచేతే నాయనమ్మ పూజగదిలో నుంచి ఎవ్వరికీ తెలియకుండా దొంగిలించుకొచ్చాడు తను రోజూ దానితో ఆడుకొని పొద్దుగూకాక ఇంటి కెళ్ళేముందు బొమ్మరింటి వెనకాల ఇసుకలో చిన్ని గొయ్యి తీసి పాతిపెట్టేవాళ్ళు. ఇంకా ఆ విగ్రహం అలాగే ఉందా?

 

    సన్నగా వర్షం చినుకులు మొదలయినయ్.

 

    బొమ్మరిల్లు వెనుకకి నడిచి, కూర్చుని, తనకు గుర్తున్న ప్రదేశంలో ఇసుక తీయడం మొదలుపెట్టాడు. రెండు నిమిషాలు గడిచిపోయినయ్. మోచేతి లోతున గొయ్యి తయారయిన తరువాత లోపల విగ్రహం కనిపించిందతనికి, సంభ్రమంతో దాన్ని పైకి తీయబోయాడుగానీ, అది మూడు ముక్కలుగా పైకి వచ్చింది. అంతకుముందే ముక్కలయిందో, లేక తను లాగేసరికి ముక్కలయిందో అతనికి అర్థం కాలేదు. ఏదేమయినా ఆ విగ్రహం అలా విరిగిపోవడం అతనికి ఎందుచేతో బాధ కలిగించింది. చాలాసేపు ఆ ముక్కలు అలా చేతిలో ఉంచుకొని వాటివంకే చూస్తూండిపోయాడు. హఠాత్తుగా తన వెనకే ఎవరో నించుని ఉన్నట్లు అనిపించిందతనికి. ఛటుక్కున తల వెనక్కి తిప్పి చూశాడు. అతని ఆశ్చర్యం అవధులు దాటింది. తనకు అతి సమీపంగా నించుని ఉంది కన్య. అనుకోకుండా ఆమెను ఇన్నేళ్ళ తరువాత చూసేసరికి వెంటనే గుర్తించడం కొంచెం కష్టమే అయింది.


Related Novels