TeluguOne - Grandhalayam | Online Book Store | Novel Reading | Telugu Novels | Telugu Kathalu | Famous Telugu Writers | Chandu Sombabu | Yandamuri Veerendranath | Merlapaka Murali | Vasireddy Seeta Devi | Samaram Novels
అశ్రుతర్పణ


                                                                  అశ్రుతర్పణ


                                             - శారదా అశోకవర్ధన్       

 

                                                                     

 

     "నుమతీ ! సుమతీ..." గట్టిగా అరుపుల్లాంటి పిలుపులతో గదులన్నీ వెతుకుతున్నాడు గోవింద్.

    "ఆఁ... వొస్తున్నా" అంటూ చేతిలోని, పాలగిన్నె పక్కకి పెట్టి, 'స్టౌ' ఆపుచేసి ఒక్కఅంగలో పరుగులాంటినడకతో ఒచ్చింది సుమతి.

    అంతలోనే గదులన్నీ వెతికి సుమతి ఎక్కడా కనబడలేదని చెప్పి సరాసరి వంటింట్లోకే వస్తున్న గోవింద్ హడావిడిగా ఒస్తూన్న సుమతిని 'ఢీ' కొన్నాడు. "అబ్బా ... అంతాతొందరే" అంది చేత్తో సుదురు రాసుకుంటూ.

    "అయినా నేనింటి కొచ్చే సమయానికి, ఎదురు రాకుండా వంటింట్లో ఏంచేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాను" "ఎదురుగ్గా నుంచుని కబుర్లు చెబుతే, మరిటిఫిన్ ఎవరుచేస్తారు?" కొంటెగా అంది.

    "టిఫినోద్దు, ఏమొద్దుకానీ, ముందు నేసుచెప్పేదివిను" "ఆహాఁ..వినను. ముందు నేనుచేసిన టిఫిన్ తినాలి" గబగబా లోపలి కెళ్ళి ప్లేట్లోబజ్జీలు పెట్టి, కాఫీకప్పు మంచినీళ్ళ గ్లాసూ ట్రేలో పెట్టింది సుమతి.

    "ఇందండి" అంటూ బజ్జీల ప్లేటు నందించింది. "అరటికాయ బజ్జీలే! వండర్ పుల్" అంటూ ప్లేటు నందుకున్నాడు గోవింద్."

    ఆ బజ్జీలంటే గోవిందుకి ఎంతోఇష్టం. సుమతి వేస్తూవుంటే తింటూ పోతాడు. అతనలా తృప్తిగా తినడం సుమతికెంతో ఇష్టం. బలవంతంచేసి మరీవేస్తుంది. ఒద్దంటూనే తింటాడు గోవింద్. మధ్య మధ్య సుమతి నోట్లోకూడా పెడుతుంటాడు. అందుకేసుమతి మరో ప్లేటు తెచ్చుకొదు. అలాంటిది, గబగబా నాలుగు బజ్జీలుతినేసి, సుమతి నోట్లో కుక్కేశాడు. సుమతి ఉక్కిరి బిక్కిరయింది. వెంటనే మంచినీళ్ళ గ్లానందించాడు. ఎలాగో మింగి నీళ్ళుతాగింది. తనూ నీళ్ళు తాగేసి, కాఫీకప్పు నందుకున్నాడు.

    "అదేమిటి? ఇంక తినరా" ఆశ్చర్యంగా అడిగింది సుమతి.

    "ఊహుఁ....నీకోమాట చెబుతాను విను" అన్నాడు కాఫీ కప్పు బల్లమీద పెడుతూ.

    "ఏమిటో? చెప్పండి, అప్పటినుంచీ ఊరిస్తున్నారు" అంది దగ్గిరగా జరుగుతూ.

    ఆమె అడిగిన తీరుచూస్తే కాస్సేపు ఏడిపించాలనిపించింది గోవింద్ కి.

    "ఊఁ, చెప్పుకో చూద్దాం" అన్నాడు కొంటెగా.

    "సినిమాకి రిజర్వేషన్ చేశారు... ... "

    "ఊహూ..."

    "చీరకొన్నారు?

    ఊహూఁ....కాదు."

    "అబ్బ .... నాకుతెలీదు. మీరేచెప్పండి" గోముగా అంది.

    జేబులోంచి కాగితంతీసి చూపించాడు. చదివి ఆలోచిస్తూ కాయితాన్ని మడిచేస్తున్న సుమతిని చూస్తూ ఆశ్చర్యబోయాడు గోవింద్. 'ఆర్డర్స్' చూసి ఎగిరి గంతేస్తుందనుకున్నాడు కానీ అలా జరగలేదు. సుమతీ, ఏమిటాలోచిస్తున్నావ్? నీకుసంతోషంగా లేదా?"

    "ఉంది. మీ సంతోషమే నాసంతోషం" కాయితాన్ని కవరులోపెడుతూ గోవింద్ కళ్ళల్లోకి చూస్తూఅంది.

    "లేదు. నువ్వు అబద్దంచెప్పినా నీ కళ్ళు నిజంచెబుతున్నాయి ఏదో సందేహిస్తున్నావు"

    సుమతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

    కంగారుపడిపోయాడు గోవింద్.

    "ఏడుస్తున్నావా?" దగ్గరకు తీసుకుని తలనిమురుతూ అడిగాడు.

    "ఏమండీ! ఇక్కడ మనజీవితం ప్రశాంతంగా సాగిపోతోంది. మిలటరీ ఉద్యోగం. ఆ వాతావరణం ఎలావుంటుందో ఏమో! అడుగడుగునా యుద్దభయం ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బతకాలి. ఎందుకొచ్చినగొడవ ఇప్పుడేం తక్కువయిందని?" అతని గుండెలమీద తల అనించి అంది. పకాలువ నవ్వాడు గోవింద్. "పిచ్చిదానా!మనిషి పుట్టినప్పటి నుంచీ, పోయేంతవరకూ ప్రాణభయం. ఎప్పుడూ వుంటూనే వుంటుంది. బ్రతుకేభయం. అలాఅని బతకడం మానేస్తామా? బతికినంత సేపూ హాయిగా బతకాలి. సో ... మైడియర్ .... డోంట్ వర్రీ. నువ్వుకూడా నాభార్యగా,  నాలాగే  వుండాలి ... ఓ...కే....? నవ్వాలిమరి, ఏదీ....నవ్వూ ....ఊఁ ...." "పాండీ మీ కెప్పుడూ అంతా వేశాకోళమే." మృదువుగా అతని గుండెలమీద కొడుతూ అంది.

    "మైడియర్. ఇకనుండి నువ్వొక ఆర్మీ ఆఫేసరు పెళ్ళానివి. నవ్వుతూ, నవ్విస్తూ హాయిగా వుండాలిగానీ, ఒకమామూలు ఆడదానిలా కళ్ళనీళ్ళు పెట్టడం, ప్రతిదానికీ భయపడి పోవడం మానెయ్యాలి. తెలిసిందా" గడ్డంపట్టుకుని ఆమెతల పైకెత్తి మెల్లగా పెదవులమీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె నడుం చుట్టూ చెయ్యివేసి గుండెల కదుముకున్నాడు. మరి మాట్లాడలేక పోయింది సుమతి.

    "తయారవ్వు సినిమాకెళదాం?" అన్నాడు సిగరెట్టు వెలిగించుకుంటూ.

    అస్సలు పనవ్వలేదు. వంటచెయ్యాలి, టైముండదేమో" అనుమానంగా అందిసుమతి.

    "వంటా గింటా ఏమొద్దు. బయటహొటల్లో భోంచేద్దాం పద రెడీ అవ్వు" చెయ్యిపట్టుకుని లాగి, బాత్ రూమ్ వైపు తోశాడు. "గబగబా మొహం కడుక్కో "అంటూ. అతని ఉత్సాహన్ని చూస్తూంటే కాదనలేక పోయింది సుమతి" అసలే గడబిడ మనిషి. దానికితోడు, ఈరకమైన ఉద్యోగాల్లో ఇంకా చిలిపితనం అల్లరి ఎక్కవవుతుంది. అందరూ ఎక్కడెక్కడి నుంచో ఒచ్చి ఒక్క చోట కలుసుకుంటారు. భాషవేరైనా, భావాలొక్కటేనని, కుల, మత భేదాలన్నీ మరచి, హొదా , అంతస్తూ, ఆస్తీ. అనే సరదాలను  తొలగించి, అందరూ ఏక దృష్టితో కార్యసాధనలో మునుగుతారు. నవ్వుతూ, నవ్విస్తూ పనిచేస్తారు. అందుకే నేవీ, ఏర్ పోర్సు, మిలటరీ వాళ్ళకున్న జాతీయభావం, సమైక్యతాభావం, చొరవ, మనలో వుండదు "ఆలోచిస్తూ పరధ్యాన్నంగా వున్న సుమతి, తనరెండు చెంపలమీద, సబ్బు నురుగతో మొహం రుద్దుతూన్న గోవింద్ తాకిడికి ఉలిక్కి పడింది. "ఏమిటది?" గోముగా అంది. "మరి తమరేమో దీర్ఘలోచనలో ఏదో లోకాల్లో వున్నారాయె. తమరు తేరుకుని, ముస్తాబయ్యేలోగా పిక్చరు స్టార్టయి పోతుంది అందుకనీ నేనేమొహం కడిగేద్దామనీ...." పకాలున నవ్వింది సుమతి అతని మాటలకి, అతనూ నవ్వేశాడు.

    గులాబిరంగు మీద పొడుం రంగు చిన్నచిన్న పూలప్రింటు నైలామ చీర, అదేరంగు బ్లౌజూ, వేసుకుంది. చెవులకి ముత్యాల దుద్దులు పెట్టుకుంది. కళ్ళకి సన్నగా కాటుక, కనుబొమ్మల మధ్యన చిన్నగా గుండ్రటి బొట్టు, వదులుగా అల్లుకున్న పొడవైన వాలుజడ, ఆ అలంకరణలో సుమతి ఎంతో అందంగావుంది. మొదటిసారిగా ఆమెను చూస్తూన్నట్టు, కన్నర్పాకుండా చూస్తున్నారు గోవింద్.

    "ఏమిటలా చూస్తున్నారు ఏదో కొత్తగా చూస్తూన్నట్టు" కళ్ళు తిప్పుతూ చిరునవ్వుతో అంది సుమతి. "నిజమే సుమతీ! నువ్వు  ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తావు ఇదివరకెప్పుడూ చూడనంత అందంగా కనిపిస్తావు.

    పోండీ....నా సంగతేమోకానీ, మీరే ఈ పింకు బుష్ కోటూ, బ్రౌను పాంటులో, కొత్త  పెళ్ళికొడుకులా వున్నారు. అసలే అందరికళ్ళూ మీ మీదే వుంటాయి. ఇంకా....."

    మరి చెప్పనివ్వకుండా చుట్టేసి, ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. రుమాలుతో మొహం తుడుచుకుంటూ, "సినిమా ఇక్కడే అయిపోయేలా వుంది" అంది నవ్వుతూ.

    ఇంటికి తాళంపెట్టి ,  ఇద్దరూ స్కూటర్ మీద బయల్దేరారు 'సంగీత్ ; రియేటరుకి.

    ఆ రోజంతా గోవింద్ ఎంతో ఆనందంగా వున్నారు. సినిమా తరవాత 'సిద్దార్ధ' హొటల్లో భోంచేశారు. ఆ తరువాత చల్లగాలికి 'టాంక్ బండ్ ' మీద కూర్చున్నారు. పగలంతా కార్లతోటీ, బస్సులతోటీ, మరెన్నో వాహనాలతోటీ ఎంతో హడావిడిగా వుండే ఆ రోడ్డు, పది దాటినప్పటినుంచీ ప్రశాంతంగా వుంటుంది. ఒక వైపున ఇందిరా పార్కులోని చెట్లు గుంపులు గుంపులుగా చక్కగా  అలంకరించుకున్న ముత్తయిదువులు ఒక్కచోట గుమిగూడినట్టు కలకలలాడుతూ వుంటే, మరోప్రక్క ప్రశాంతంగా ప్రవహించే హుప్సేను సాగరు, చిన్నచిన్న అలలతో నీరు మెల్లగా కదులుతూ వుంటే, చుట్టూవున్న బంజారాకొండల విద్యుత్ దీపాలూ, ఏర్  పోర్టు, బేగం పేటలోని విద్యుత్ దీపాలు తోరణాల్లా కనబడుతూ, ఎంతో అందాన్నిస్తాయి. ఒకపక్కన బోటుక్లబ్బు బిల్డింగు మెరుస్తూ వుంటే, మరోవైపున పాలరాయి వెలుగులో బోలెడన్ని ఎలక్ట్రిక్ దీపాల నడుమ, కళకళా మెరిసిపోతూ, పరవశింప జేస్తుంది బిర్లా వారి వెంకటేశ్వరస్వామి ఆలయం. నగరంలో ఏ  మూలనుంచి చూసినా  విభ్రాంతి కలిగేలా , ఒకేలా కనిపించే ఈ ఆలయం  ప్రతి మనిషి దృష్టినీ ఆకర్షించక మానదు. ఆ ఆలయంవైపూ, దీపాల వైపూ, నీళ్ళవైపూ చూస్తూ చల్లనిగాలి ఉయ్యాల లూపుతున్నట్టుంటే, కాళ్ళు జాపుకుని బెంచీమీద కూర్చున్న గోవింద్ కి మరింత దగ్గరగా జరిగి కూర్చుంది సుమతి, అతని గుండెలమీద తలఅనిస్తూ. "దస్ పై సి .... దస్ పై పే .... మల్లే పూల్ ...." అంటూ ఒక కుర్రవాడు దగ్గరకొచ్చాడు. జేబులోంచి రూపాయినోటు తీసి వాడిచేతిలో పెట్టి  పూలిమ్మాన్నాడు. వాడు సంతోషంతో రూపాయిని మడిచిజేబులో  పెట్టుకుని పదిదండలు తీసి గోవింద్ చేతిలో పెట్టాడు. ఒక్కసారి బాగా ఊపిరిపీల్చి వాసన  చూసి, ఒక్కొక్కదండా సుమతి తల్లో పెట్టాడు. "నేను పెట్టుకుంటా నివ్వండి" అంటూ జరగబోయిన సుమతిని, మరింత గట్టిగా పట్టుకుని తనే  పూలన్నీ పెట్టాడు. అతని ఇత్సాహనికీ, చిలిపి చేష్టలకీ పులకించి పొతూ, "ఏమండీ! మీ కిప్పుడేమనిపిస్తోంది" అంది కొంటెగా అతని కళ్ళల్లోకి చూస్తూ.    


Related Novels


 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.