Previous Page Next Page 

ఆఖరి ఘడియలు పేజి 3


    విశ్వామిత్రుడి లాంటి వాడిని ఆ ఒక్క పిలుపుతోనే గాల్లో పద్నాలుగదుగులు ఎగిరిపడేలా చేసే అద్భుతమైన తీయదనం వుందా గొంతులో.
    షాపు కుర్రాడితో పాటు భవానీశంకరం కూడా ఆటోమేటిగ్గా వెనక్కు తిరిగి ఆ గొంతు తాలుకూ ఓనర్ ని చూశాడు. చూసి కొద్ది క్షణాలు తనని తను మర్చిపోయాడు.
    సుమారుగా ఇరవై ఏళ్ళుంటాయా యువతికి. భవానీశంకర్ కెమెరా ల్లాంటి కళ్ళతో ఆ అమ్మాయిని కొన్ని లక్షల స్నాప్ లు తీసేశాడు. ఆ కొద్ది క్షణాలలోనే . ఎంత అద్భుతమైన అందం? ఎంత చల్లటి ఫోటో జేనిక్ ఫేస్? తను చూసిన వేలకొద్దీ అందమైన అమ్మాయిలలో ఇంతటి బ్యూటీ ఎక్కడా కనిపించలేదు.
    అతగాడలా స్నాప్ లు తీస్తున్నట్లు చూడటం గమనించి ఆ అమ్మాయి చెక్కిళ్ళు ఒక మోస్తరు సైజు సిగ్గుతో ఎరుపెక్కినాయ్. అతని కళ్ళల్లోకి ఓసారి చూసి, చురుగ్గా చూపులు మరల్చుకుని స్టూడియో కుర్రాడి వేపు చూసింది మళ్ళీ.
    "యస్ మేడమ్, ఏం కావాలి?" అడిగాడు కుర్రాడు.
    ఆమె తన బ్యాగు లో నుంచి ఫిలిమ్ రీల్ తీసి టేబుల్ మీద వుంచింది.
    "ప్రింట్లు వేసివ్వాలి" మళ్ళీ వీణ మీటిన గొంతు.
    "బాగా వచ్చినా రాకపోయినా అన్నీ వేయాలా, బాగా లేకపోతే వద్దా."
    అతను డ్రాయర్ లో నుంచి రిజిస్టర్ తీశాడు.
    "పేరు చెప్పండి"
    "జె. స్మితా రాణి."
    భవానీ శంకర్ ఉలిక్కిపడ్డాడు.
    చాలా కాలంగా కోమాలో ఉండి ఒకే ఒక్క సెకెండు బయట పడినట్లుంది పరిస్థితి.
    "స్మిత స్మిత స్మిత స్మిత స్మిత స్మిత........." అనుకున్నాడు వివరాల కోసం -- ఓ లక్షసార్లు.
    ఎంత ఆలోచించినా ఏమీ గుర్తుకు రాలేదు.
    మరో రెండు సార్లు స్మిత పేరుని తిరగేసి "తస్మి తస్మి" అనుకుని ఆలోచించాడు. అయినా లాభం లేకపోయింది.
    అతనికి ఒక్కసారిగా చిరాకు పుతుకొచ్చింది. తన మెదడు మీద ఇంత ముఖ్యమైన విషయం గురించి ఇన్ ఫర్మేషన్ అందించలేక పోతూన్న మెదడు ఉంటేనేం ఊడిపోతేనేం అనుకుని, ఉంటేనే మంచిదని వెంటనే డిసైడ్ చేసుకున్నాడు.
    ఏదేమైనా ఇంత అందమైన ఈ అమ్మాయికి కూడా ఫోటో గ్రఫీ హాబీగా ఉండటం ఎక్కడలేని అనందం కలిగించింది. ఇలా ఎక్కడ లేని అనందం కలిగించిన సందర్భాలలో అతను సాధారణంగా చేసే పని ఒక్కటే!
    హుషారుగా విజిల్ వేయటం!
    అందుకే ఇప్పుడూ అదే పని చేశాడు. కానీ ఈ తలతిక్క ప్రపంచంలో దురదృష్టవశాత్తూ యువకులు వేసే హుషారు మార్క్ విజిల్స్ ని హర్షించి ప్రోత్సహించే వారి సంఖ్య కంటే నిరుత్సాహపరిచే వారి సంఖ్యే ఎక్కువ.
    స్మిత ఆ రెండో కేటగిరికి చెందిన యువతి కావటం వాళ్ళ కోపంగా భవానీశంకర్ వేపు చూసింది. భావనీశంకర్ తన తప్పు తెలుసుకుని నాలిక్కరుచుకున్నాడు. గానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆమె ఆ కుర్రాడడిగిన అయిదు రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మరోసారి కోపంగా భావానీశంకర్ వేపు చూసి చకచక అడుగులు వేస్తూ బయటకు నడిచింది.
    "రేపు సాయంత్రం రండి మేడమ్" అరిచాడు కుర్రాడు మాటలు వినిపించుకోలేదు.
    "నాకు ఓ విషయం అర్ధం కావటం లేద్సార్" అన్నాడు స్టూడియో కుర్రాడు ఆగిపోయిన తన సంభాషణను పునరుద్దరిస్తూ.
    "ఏమిటి బ్రదర్ అదీ."
    "నే వ్రాసిన మిగతా ముప్పై ఆరు నాటికలూ ఎవరూ స్టేజ్ చేయటం లేద్సార్. ఎంతమంది నడిగినా స్క్రిప్టు చూసి మళ్ళా కనబడకుండా పోతున్నారు. ఎందుకనంటారు?"
    ""అన్సర్ ఈజ్ వెరీ సింపుల్ బ్రదర్! వాళ్ళందరూ ఇంకా నీ రచనల స్థాయికి ఎదగలేదు డియర్! బహుశా ఏ రెండు వందల సంవత్సరాల తర్వాతో - వీటి విలువ తెలుసుకుంటారు ప్రజలు. అప్పుడు ఊరూరా, వాడవాడలా - నీ ఫోటోలు పెట్టి, దండలు వేసి "తొందరపడి ఓ కోయిల ముందే కూసింది" అన్న పాటలు పాడి "కాలాని కంటే ముందు పరుగెత్తి రచనలు చేసిన కామ్రేడ్ శివన్నారాయణ" అని బిరుదులు తగిలిస్తారు బ్రదర్."
    "నా పేరు శివన్నారాయణ కాద్సార్".........
    "కాదా?"
    "కాదండీ!"
    "మరేమిటి?"
    "విక్రమార్కారావు సార్."
    "ఓహో విక్రమార్కారావు కదూ! రెండింటికీ పెద్ద తేడా లేదు కదా! అందుకని కొంచెం కన్ ఫ్యూజన్--"
    "ఇంతకూ నా నాటికలన్నీ మునిసిపాలిటీ వాళ్ళ చెత్తకుండిలో పారేయాల్సిందేనా సార్?" దిగులుగా అడిగాడు విక్రమార్కారావు.
    భావానీశంకర్ ఓ క్షణం ఆలోచించాడు.
    "ఆ - వండర్ ఫుల్ అయిడియా బ్రదర్! అలాంటి స్టఫ్ ని ఆదరించే వారున్నారన్న విషయమే మర్చిపోయాను. అసలు ఇలాంటి రచనల కోసమే ఆ సంస్థలు నెలకొల్పారు."

  Previous Page Next Page