Previous Page Next Page 

కొత్తమలుపు పేజి 3

    విసురుగాతలెత్తి తండ్రిని చూసి "తెలిస్తేనన్నడగడం ఎందుకు? అవును సురేష్, నేను ప్రేమించుకున్నాం, ఏం నాకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే హక్కు నాకులేదా?" చెంపపట్టుకుని పౌరషంగా అంది. ఆమె చెప్పిన తీరుకి, ఆ ధైర్యానికి ఒక్క క్షణం విస్తుపోయారు విశ్వనాధం.
    "నీ కూతురు ఎంత ప్రయోజకరాలైందో చూసి సంతోషించు. ప్రేమించానికి హక్కు లేదా అని నిలేసి అడుగుతుంది. జవాబు చెప్పు " ఆవేశంతో విశ్వనాధంగారి గొంతువణికింది.
    "ప్రేమించడానికి ఎందుకు హక్కులేదు. మహారాజులా ప్రేమించు. వాడితో షికార్లు తిరుగు. అనక వాడు పెళ్ళి చేసుకోనంటే ఏడ్చే హక్కు వుంది నీకు. ఇంకా ముందుకు వెళ్ళితే ఏదన్నా అయితే ఏ నుయ్యోగొయ్యో చూసుకునే హక్కూ వుంది నీకు" కసిగా కూతుర్ని చూస్తూ కర్కశంగా అన్నారాయన.
    రూప తలదించుకుంది.
    "ఇంతకీవాడెవడు?" వ్యంగ్యంగా అడిగారాయన. రూప ఉక్రోషంగా చూసింది.
    పద్మావతి కల్పించుకుని   "ఏమిటండి ఆ మాటలు ఇదేనా అడిగే తీరు" కాస్త కఠినంగా అంది.
    "ఇలాకాకపోతే ఇంకెలా అడగాలి? అదంత కుండబద్దలుకొట్టినట్టుమన మొహాన ప్రేమించాను తిరుగుతాను అని చెప్పగా లేంది నేను అడగడం తప్పా, ఫారినర్స్ లా బెల్ బాటమ్స్ వేసుకోవడం, జుట్టు కత్తిరించుకోడంతో సరిపెట్టుకోకుండా బాయ్ ప్ర్హెండ్స్, దేటింగులు పెళ్ళికి ముందే అన్ని అనుభవాలు పూర్తి చేసుకుంటుండగా నేనడగడం తప్పా! పద్మ నీ కూతురికి ఒక్క విషయం మాత్రం చెప్పు. ఫారినర్స్ లా బాయ్ ఫ్రెండ్స్ తో లవ్ ఎఫైర్ జరపవచ్చునని, ఆ తరువాత వాడు కాదంటే ఈ దేశంలో మగ వెధవన్నవాడు ఎవడు దాన్ని పెళ్ళాడడని, పెళ్ళికి ముందేదన్నా అయితే దాని బతుకు అదోగాతేనని, అలాంటి ఆడదాన్ని ఈ దేశంలో ఏ మగాడు ఉద్దరించడని, ఆ తరువాత దాని గతి బజారు పాలేనని తెలియచెప్పు.   
    వాడు కాదంటే తనబతుకు అది బతికే అవకాశం కూడా యీ సంఘం ఇవ్వకుండా కాకుల్లా పొడిచి చంపుతుందని పాపం దానికి తెలియనివన్ని విడమర్చి చెప్పు. మనదేశంలో ఆడదాని శీలానికి ఎంత విలువ ఇస్తారో, ప్రతి మగాడు అందినంత మేరకు అనిభావిద్దామని తప్ప, నిజాయితీగా పెళ్ళాడేవాడు నూటికి ఒకడన్నా వుండడని కూడా చెప్పు. మన అభ్యున్నతి, మన పురోగతి అంతా బెల్ బాటమ్స్ , బాబ్ డ్ హెయిర్ లతోనే ఆగిపోయింది కాని ఒకసారి తప్పడడుగు వేసిన ఆడదాన్ని అర్ధం చేసుకు, ఆ బలహీనతని క్షమించి ఔదార్యం చూపే సంస్కారం, ఔన్యత్యం మన దేశంలో మగాళ్ళకి లేదన్నది దానికి అర్ధం అయ్యేట్టు చెప్పు. అన్ని చెప్పక ఆ ప్రేమించిన వాడెవడో, ఆ ప్రేమ పెళ్లిదాకా వేడ్తుందో లేదో అడుగు. ఇది హిందు దేశం కానక కూతురి అవసరం కనక అన్ని అడుగు. అక్కరలేదు దాని పెళ్ళి అదే చేసుకుంటానంటే మరి మంచిది ఖర్చు తగ్గిందనుకుంటాను."
    "మీకు మతిపోయింది. ఏది అడగకుండా ఏది వినకుండా ఈ గొడవేమిటి?" పద్మావతి కాస్త తీక్షణంగా అంది.
    "అవును మతిపోయింది. ప్రతి వెధవా వచ్చి నీ కూతురు హోటల్లలో, పార్కుల్లో, సినిమాల్లో ఎవడితోనో తిరుగుతోంది అని చెప్పిన క్షణంలోనే మతిపోయింది."
    "రూపా! పద్మావతి కూతురు వంకతిరిగి తీక్షణంగా చూస్తూ అరిచినట్లే పిలిచింది.
    "చెప్పు-ఎవరా కుర్రాడు? ఎన్నాళ్ళబట్టి మీ పరిచయం? ఇన్నాళ్ళ బట్టి ఎందుకు నేనెన్ని సార్లు అడిగినా అబద్దాలు చెప్పావు.......మీ నాన్న ఇలాగ, నీవలాగా? మధ్య నేను చస్తున్నాను. పద్దెనిమిదేళ్ళ పిల్లవు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లెదూ- ఇన్ని పుస్తకాలు చదువుతూ, ఇన్ని సినిమాలలో ఈ ప్రేమలు నమ్ముకుని మోసపోయిన ఆడపిల్లల గతి చూస్తూ కూడా జ్ఞానం లేకుండా మమ్మల్ని ఇలా మోసం చేస్తావా? ఊరంతా తెలిసేవరకు మాకు తెలియనే లేదు." పద్మావతి ఆవేశంగా దులిపేసింది.
    తండ్రి, ఆ తరువాత తల్లి వరుసగా తిడ్తోంటే గుడ్లప్పగించి చూస్తూ వూరుకుంది రూప
    "ఏంమాట్లాడవేం?" గద్దించింది పద్మావతి.
    "ఏంమాట్లాడాలి?" రూప తలెత్తి సూటిగా చూసింది నిర్భయంగా.
    "అదేమా దగ్గర ఎందుకు దాచావు? ఎందుకు చెప్పలేదు?"
    "ప్రేమించుకునేవాళ్ళు అందరికి చెప్పి ప్రేమించుకోరు" మొండిగా అంది రూప.
    "చూశావా దాని పొగరు ...." విశ్వనాధంగారు ఆవేశంగా అన్నారు.
    "పోగరేముంది ఇందులో! అతను నాకు నచ్చాడు ఇద్దరం పెళ్ళి విషయంలో నిర్ణయించుకున్నాక మీకు చెబుదామనుకున్నాను. ఏం నా అంతట నేను నాకు కావాల్సినా వాడిని నిర్ణయించుకోకూడదా? ఆమాత్రం స్వాతంత్రం నాకు లేదా?" రూప రోషంగా అడిగింది తండ్రి వంక చూస్తూ.
    "అంత స్వాతంత్రం వుందనుకున్నదానీవి, నీవు చేస్తున్నదానిలో తప్పు లేదనుకున్నదానివి అలా రహస్యంగా చాటుగా తిరుగుతూ అబద్దాలెందుకు ఆడావు. ధైర్యంగా ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి మాకు చూపిస్తే చాలా సంతోషించే వాళ్ళం, తప్పకుండా మీ ఇద్దరికీ పెళ్ళి చేసేవారం...."పద్మావతి అంది.
    "మేం ఇంకా పెళ్ళిమాట నిర్ణయించుకోలేదు నిర్ణయించుకున్నాక చెబుదామనుకున్నాను."
    "రూపా! మతిలేని మాటలు మాట్లాడకు. నీవు ఇష్టం వచ్చినట్టు అతనితో ఆర్నెల్లు తిరిగాక అతను చేసుకోనంటే ఏం చేస్తావు?"
    "ఎందుకు చేసుకోడు" రెట్టించింది రూప.
    "అంతా మిరనుకున్నలాంటివాళ్ళు గాదు.....సురేష్ అలాంటివాడు కాదని నాకు తెల్సు...."
    "మంచిదేనీకంత నమ్మకం వుంటే కాని కీడెంచి మేలెంచాలీ. ఒకవేళ ఈ ఆర్నెల్లు తిరిగాక అతను ఈ వ్యవహారాన్ని పెళ్ళి వరకు తేవడానికి ఇష్టపడకపోతే అప్పుడు నీ గతి ఏమవుతుందో ఆలోచించావా? అప్పుడు నీవేం చెయ్యగలవు అదంతా ఆలోచించావా....?" పద్మావతి శాంతంగా నచ్చ చెప్పే ధోరణిలో అంది.
    "ఇందాకే మీనాన్న అన్నట్టు డేటింగ్ లు చేసి నచ్చకపోతే వదిలేసి మరొకడ్ని కట్టుకోవడానికి ఇదేం దేశం కాదు. ఇప్పటికే మీ ఇద్దరి సంగతి వూరువాడ తెల్సింది. రేపొద్దున అతను కాదంటే నీకింక ఈ జన్మలో పెళ్ళికాదు. అది తెల్సునా నీకు" తీక్షణంగా అంది పద్మావతి.
    "పోనీకాకపోతే! పెళ్ళి కాకపోతే చచ్చిపోం ఏ ఉద్యోగం చేసుకునో బతకగలను....."రోషంగా అంది.
    "మొండి వాదన మాను . అదంతా తర్వాత సంగతి. ముందసలు అతనెవరు? నీకెలా పరిచయం- అది చెప్పు" విశ్వనాధం గద్దించారు . రూప ఇబ్బందిగా కదిలింది.
    "నేను అడుగుతాలెండి. మీరు వెళ్ళండి.  ఎనిమిదిన్నర అయింది. ముందు భోజనానికి పదండి" ఇంక ఇప్పటికి వూరుకొండన్నట్టు భర్తకి కళ్ళతో సైగ చేసి వంటింట్లోకి వెళ్ళింది పద్మావతి. విశ్వనాధం రూప వంక తీక్షణంగా ఓ చూపు విసిరి పడక గదిలోకి వెళ్ళి పోయాడు. రూప అప్పటికి గండం గడిచినందుకు తేలిగ్గా ఊపిరి తీసుకుంది.
    విశ్వనాధంగారు స్టేట్ బ్యాంకులో ఆఫీసరు. రెండు వేల జీతం.....ఫోను, మంచి ఇల్లు హంగులు అన్ని వున్నాయి. ఆయనకి నలబై ఎమినిదేళ్ళు, పాతికేళ్ళ క్రితం బ్యాంకులో గుమస్తాగా చేరి అలా పరిక్షలు పాసయి స్వశక్తితో పైకి వచ్చిన మధ్య తరగతి సంసారి. గుమస్తాగా వున్నప్పుడు మూడు నాలుగు వదల జీతంతో అట్టేవేషాలకి పోకుండా ఎలా సంసారం నేట్టాడో , ఈనాడు రెండువేల వచ్చినా రాబడితో పాటు ధరలు, ఖర్చులు అన్నీ పెరిగి మామూలు మధ్య తరగతి సంసారుల జాబితాలోనే వున్నారు వారు. అయన భార్య పద్మావతి మెట్రిక్ వరకు చదువుకుంది. అందగత్తె కాకపోయినా చామనచాయ రంగులో కళకళలాడుతూ వుంటుంది. వారి మొదటి సంతానం రూప.

  Previous Page Next Page