Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 29


    రాజకీయాల్లో మొదలయి స్పోర్ట్సు వైపుకి వెళ్లి, మద్యనిషేధం మీదుగా- వారపత్రికల్లో వచ్చే కథలూ ఫాషన్లూ, కాలేజీ చదువుల మీదికి వెళ్ళింది సబ్జెక్టు.
    గంట గడిచేసరికి ఆమెకి అతడెంతో దగ్గర స్నేహితుడిలా కనిపించాడు. ట్రైన్ ఏదో స్టేషన్ లో ఆగి, కూతపెట్టి ముందుకు సాగింది. చల్లటిగాలి నెమ్మదిగా వస్తోంది. రాఘవరావు సిగరెట్ వెలిగించుకున్నాడు. రైలు కుదుపుకి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది శైలజ. మళ్ళీ చిన్న జర్కుతో రైలు ఆగటంతో ఆమె కళ్ళు విప్పేసరికి లైట్ల వెల్తుర్లో పట్టపగల్లా విజయవాడ ప్లాట్ ఫాం కనిపించింది. ఆమె తలతిప్పి చూస్తే, అప్పటివరకూ తననే చూస్తున్న రాఘవరావు కనబడ్డాడు.
    జుట్టుపాయని చెవి వెనక్కి తోసుకుంటూ నిద్రకళ్ళతోనే నవ్వింది.
    "మాట్లాడుతూనే నిద్రపోయారు" అన్నాడు.
    ఆమె టైం చూసుకుంది- ఒంటిగంట.
    దాదాపు మూడు గంటలు నిద్రపోవటం వల్ల తేలిగ్గా వుంది. లేచి కళ్ళు మొహం కడుక్కుని వచ్చింది. కంపార్టుమెంట్ లో నుంచి ఒకరు దిగిపోయారు.
    "టీ తాగుతారా?"
    ఆమె వద్దన్నట్లు తలూపింది.
    "మీకు బ్రదర్స్, సిస్టర్స్ వున్నారా?" అడిగాడు.
    "లేరు."
    "అదృష్టవంతులు."
    "మీకు-"
    ఆమె సర్దుకుని కూచోవటంతో చీర కుచ్చిళ్ళు అతని కాలి మీద పడ్డాయి.
    "ముగ్గురు చెల్లెళ్ళు" అన్నాడు.
    "అయితే మీకు చాలా కట్నం కావాలన్నమాట" అందామె.
    "లేదు. మా ఫాదర్ చాలా ప్రిన్సిఫుల్డ్" అన్నాడు కాజువల్ గా కాలు ముందుకు జరుపుతూ.
    ఆమె కాలు వెనక్కి తీసుకుని "మరి మీరు?" అంది.
    "నేను ఆలోచించవలసింది-నా కొడుకుల సంగతి. నాకింకా పెళ్లికాలేదు కదా...." నిజానికి రెండో వాక్యం ఇక్కడ వాడాల్సిన పనేలేదు.
    ఆమె తలతిప్పి బైటకి చూడసాగింది. చీకట్లో ఎక్కడో దూరంగా దీపం వెనక్కి కదుల్తుంది. పై బెర్తుమీది నుంచి ఎవరో "ఏలూరొస్తోందా" అని అడిగారు.
    "ఆ, ఇంకో పావుగంటలో."
    పైనున్న వాళ్ళు దిగి, బెడ్డింగులు సర్దుకునేసరికి స్టేషన్ వచ్చింది. ఇద్దరు దిగిపోయారు. పక్కన కూర్చొన్న ముసలతను పైకి వెళ్ళి పడుకున్నాడు.
    ట్రైన్ కదిలింది.
    "నేను చాలా ఆదృష్టవంతుణ్ణి" అన్నాడు రాఘవరావు.
    ఆమె కొద్ది ఆశ్చర్యంతో "ఎందుకు" అని అడిగింది.
    "ఈ ఒంటరి ప్రయాణంలో ఇలా ఒక మంచి స్నేహితురాలు దొరికినందుకు".
    "ఆ మాట నేననాలి-"
    అతను వప్పుకోను అన్నట్టుగా తల అడ్డంగా ఊపేడు.
    "పోనీలెండి. ఇక ఆ పరస్పర పొగుడుకోవతాలు వదిలి పెడదాం" అన్నదామె నవ్వుతూ.
    "ఒక విషయం మాత్రం నిజం".
    "ఏమిటి?"
    "మిమ్మల్ని చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు".
    ఆమె సిగ్గుతో - "ప్లీజ్! ఇక ఆ సంగతి వదిలిపెట్టండి" అంది.
    ఆమె దిగాల్సిన ఊరు దగ్గర పడుతున్న కొద్దీ అతడిలో అదోలాంటి దిగులు ఆవరించసాగింది. కొంచెంసేపట్లో ఆమె దిగిపోతూ వుందంటే అతని కెలాగో వుంది. ఈ రైలు ప్రయాణం ఇలానే సాగిపోతే బావుణ్ణు అన్న భావన.
    అతనన్నాడు...
    "మొదట్లో మిమ్మల్ని పలకరిద్దామా, వద్దా అని చాలాసేపు తటపటా యించాను. రెండు మూడు ప్రశ్నలకి ముక్తసరి మీ జవాబు చూసి నా మీద మీకు సదభిప్రాయం ఏర్పడలేదేమో. నేను మిమ్మల్ని ఇంప్రెస్ చెయ్యలేదేమో అనుకున్నాను".
    ఆ మాటలకు నొచ్చుకుంటున్నట్లు "సారీ" అంది.
    "దీంట్లో క్షమాపణ ప్రసక్తేముంది. నలుగురు మగవాళ్ళ మధ్య పనిచేసే వాళ్ళు ఆ మాత్రం రిజర్వ్ డ్ గా వుండకపోతే కష్టం."
    ఆ మాటలు ఆమెకి నచ్చినట్లు "మీరు చెప్పింది నిజమే...." అంది.
    కొంచెం సేపు నిశ్శబ్దం.
    అంతసేపూ మాట్లాడిన వాడికి గమ్యం దగ్గరపడి విడిపోవాల్సిన టైమ్ వచ్చేసరికి మాటలే దొరకటం లేదు.
    "విడిపోవటం బాధాకరం" అన్నాడు.
    "అవును. ఎక్కడో కొటేషన్ చదివేను. టాగూర్ ది అనుకుంటా" అందామె ఆలోచిస్తూ.
    "మీవీ, నావీ- భావాలు చాలావరకు కలుస్తాయి" అన్నాడతను. కిటికీలో నుంచి బయటకు చూస్తున్నదల్లా తలతిప్పి అతడి వైపు చూసింది. మాట్లాడలేదు.
    తూర్పు బాగా ఎర్రబడింది.
    షుగర్ ఫ్యాక్టరీ గొట్టం దాటిపోయింది.
    రైలు ఫ్లాట్ ఫారం మీదికొచ్చి ఆగబోతూ వుంటే "నాన్నగారొచ్చారు" అంది చిన్నపిల్లలా సంబరపడ్తూ.
    రైలు ఆగింది.
    ఆమె "వెళ్ళొస్తానండీ, నమస్తే" అంది చేతులు జోడించి.
    అతడు విషాదంగా "మళ్ళీ రావటం ఏముంది? వెళ్లిపోతున్నారుగా" అన్నాడు.
    ఆమె నవ్వి ముందుకు కదిలింది.
    "శైలజగారూ" అన్నాడు.
    ఆమె వెనక్కి తిరిగింది.
    కరస్పర్శ కోసం అన్నట్లుగా చెయ్యి సాచాడు. ఆమె క్షణం విస్తుపోయినా అతడిమీదున్న గౌరవంతో, తన తటపటాయింపు కనబడ నివ్వకుండా చెయ్యి అందించి దిగిపోయింది.
                    *    *    *
    రాఘవరావు కాకినాడ చేరుకునేసరికి ఎనిమిదయింది. స్నానం చేసి పడుకుంటే క్రితం రాత్రి నిద్రలేకపోవటం వల్ల దాదాపు మూడింటికి మెలుకువ వచ్చింది.
    హోటల్ రూమ్ నుంచి ఫోన్ చేశాడు.
    అతడు టిఫిన్ తిని, రెడీ అయ్యేసరికి ఒకాయన వచ్చారు. బక్క పల్చగా వున్నారు. నలభై అయిదేళ్ళుంటాయి. పరస్పర పరిచయాలయ్యాక "వెళ్దామా" అన్నారు. రాఘవరావు తలూపేడు.
    టాక్సీ చిన్న బంగళా ముందు ఆగింది. చుట్టూ ప్రహరీగోడ, గులాబీ చెట్టు.
    ఇద్దరూ వెళ్ళి ముందుగదిలో కూర్చున్నారు రాఘవరావుతో రెండు నిమిషాలు మాట్లాడి- ఆయన లోపలికి వెళ్ళి వచ్చారు. ఐదు నిమిషాలు తర్వాత అమ్మాయొచ్చింది.
    ఆమె వచ్చే సమయానికి రాఘవరావు గుప్పెటతో మిక్చర్ నోట్లో వేసుకోబోతున్నాడు. ఆమెని చూడగానే అతడికి పొలమారింది, ఆమె శైలజ.
    శైలజ కూడా అతడిని చూసి ఆశ్చర్యపోయింది. అంతలోనే సర్దుకుంది. ఆమె పెదవుల మీద విరిసీ విరియనట్లు నవ్వు నాట్యం చేసింది.
    పది నిమిషాలు కూర్చుని రాఘవరావు లేచాడు. ఆయనతో కలిసి బయటకొచ్చి టాక్సీ ఎక్కి హోటల్ కి వచ్చేశాడు.
    ఆ రోజే బయలుదేరి తన ఊరు వచ్చేశాడు....
    హైదరాబాద్ రాగానే తండ్రికి ఉత్తరం వ్రాసి, ఆఫీసుకి వెళుతూ వెళుతూ పోస్ట్ చేశాడు. ఆఫీసులో విశ్వం కనబడ్డాడు.
    స్నేహితుణ్ణి పలకరిస్తూ "పెళ్లి చూపులకి వెళ్ళావట కదోయ్- ఏమైంది?" అడిగేడు రాఘవరావుని.
    "నచ్చలేదని వ్రాసేశానోయ్".
    "ఏం? బాగాలేదా?"
    "అమ్మాయి బాగానే వుంది కానీ చాలా ఫాస్టోయ్, మనకి సరిపోదు" అన్నాడు రాఘవరావు.
                       * అయిపోయింది *
        (30వ ఎపిసోడ్ నుంచి ఉత్థిష్టంతు అనే కథ వస్తుంది.)


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS