TeluguOne - Grandhalayam
సిగ్గేస్తోంది!

               

                                   సిగ్గేస్తోంది
   
                                                                           --యండమూరి వీరేంద్రనాథ్
   
   
                                         
   

    

   

 

                               

 

    ఆ రోజు సోమవారం!
   
    క్రితంరోజు 'శలవు బద్ధకం' లోంచి బయటపడటానికి ఇష్టం లేనట్లుగా మత్తుగా పడుకుని ఉన్నారు కొంతమంది.
   
    సూర్యుడికీ, గృహిణికీ అది కుదరదు కదా!
   
    ఉదయభానుడు ఉరుకులూ పరుగులూ మీద పైకి పొడుచుకొచ్చేస్తున్నాడు. ప్రాతఃకాలానే లేచి, రాత్రి పెరట్లో కురిసిన పారిజాతాలు ఒళ్ళో నింపుకుంటూ- ముంగిట్లో రంగవల్లులు తీర్చే అతివలు ఆ లొకాలిటీలో లేరు!
   
    గేట్లమీద పాలపాకెట్లు చూస్తున్నాయి. మెట్లమీద న్యూస్ పేపర్లు అడ్డంగా పడివున్నాయి.
   
    కిలకిలరావాల్తో నిద్రలేచి, కూనిరాగాలతో పనులు ప్రారంభించాల్సిన కుందరదనలు ఆదరాబాదరా పనుల్లో జొరబడి...... తిరిగిపోతున్న గడియారపు ముళ్ళకేసి నిస్పృహగా చూస్తున్నారు.
   
    కలలు కంటూవేంటే, నిద్రలేని రాత్రి కరిగిపోయి..... మండే కళ్ళతో పగలు ఆఫీసుల కెళ్ళాల్సొస్తుందని కలలను సైతం త్యాగం చేసే ఉద్యోగస్తురాళ్ళు!
   
    మధ్యతరగతి గృహిణులు!!
   

                                                                 *    *    *

    "మమ్మీ.... ఇంకొంచంసేపు పడుకొంటాను ప్లీజ్!" దుప్పటి నిండా ముసుగు పెట్టుకుంటూ గారాలు పోతున్న తొమ్మిదేళ్ళ పూజని, బలవంతంగా లేపి బాత్ రూంలోకి నెట్టడానికి ధరణి తాలూకు తల్లి మనసు అడ్డుపడుతోంది. కానీ తప్పదు! ఇంకో గంటలో స్కూల్ బస్ వచ్చేస్తుంది.
   
    "మా పూజ బంగారుతల్లి కదూ!" కూతురి జుట్టు నిమురుతూ ముందుకు వంగి చెవిలో గుసగుసగా "మమ్మీ చెప్పినమాట వింటుంది. పూజా లవ్స్ మమ్మీ...యామై కరెక్ట్!" అంది ధరణి.
   
    పూజ ఆ బ్లాక్ మెయిలింగ్ కి లొంగిపోయినట్టుగా మత్తుగా లేచి కూర్చుంటూ "అభి లేచాడా?" అని తమ్ముడి గురించి అడిగింది.
   
    అంతలో "అబ్బా.....ధరణీ! వీడు మళ్ళీ పక్కతడిపేశాడు.....ముందు వీడ్ని ఇక్కడ నుండి తియ్యి...." శ్రీధర్ గొంతు పక్కగదిలోంచి వినిపించింది.

    ధరణి పూజని వదిలి భర్త గదిలోకి పరిగెత్తింది. అప్పటికే అభినవ్ ఏడుస్తూ లేచి కూర్చున్నాడు.
   
    శ్రీధర్ తడిగా ఉన్న జాగా వదిలి దూరంగా పడుకుని వున్నాడు.
   
    "అభీ.....లేమ్మా..... బాత్ రూంలోకి వెళ్ళి నిక్కర్ మార్చుకో!" మృదువుగా అంది.
   
    తను చేసిన పనీ తనే ఎంతో సిగ్గుపడ్తున్నట్లుగా ఏడేళ్ళ అభినవ్ బాత్ రూంలోకి వెళ్ళాడు.
   
    "లేవండి.....దుప్పటి మారుస్తాను" అంది ధరణి.
   
    "ఇప్పుడు కాదు.....ముందు కాఫీ పట్రా" ఆమె వైపు తిరక్కుండానే చెప్పాడు శ్రీధర్. ధరణి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
   
    పక్క ఇంట్లోంచి పంచరత్నాలు వినిపిస్తున్నాయి. ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గొంతు వింటూ కాఫీ కలుపుతున్న ధరణికి రణగొణ ధ్వనిగా వార్తలు వినిపించసాగాయి. శ్రీధర్ లేచినట్లున్నాడు అనుకొంటూ కాఫీ కప్పులో పోసింది.
   
    "మమ్మీ..... అక్కని స్నానం త్వరగా చెయ్యమను..... నాకు టైం అవుతోంది" అభి కంప్లైంట్ చేస్తున్నట్టు అన్నాడు.
   
    ధరణి కాఫీ కప్పు శ్రీధర్ ముందు పెట్టి "పూజా .... త్వరగా బయటికి రా!" అని అరిచింది.
   
    "బాడీఫ్రాక్ హుక్ పెట్టుకోవడం రావడం లేదమ్మా" చెప్పింది లోపల్నుంచి పూజ.
   
    "తలుపు తియ్యి, నేనొచ్చి పెడ్తాను" తలుపుమీద మునివేళ్ళతో కొడ్తూ అంది ధరణి.
   
    లోపల్నుంచి పూజ "నో.... వద్దు" కంగారుగా అంది.
   
    "ఏం?"
   
    "నాకు సిగ్గు"
   
    ధరణికి నవ్వొచ్చింది. తొమ్మిదేళ్ళ కూతురికి అప్పుడే సిగ్గుకి అర్ధం తెలిసినందుకు!
   
    "సరే.... టైం అవుతోంది. త్వరగా కానివ్వు. బస్ మిస్ అవుతే కష్టం" అని వెళ్ళిపోయింది.
   
    పేపర్ చదువుతూన్న శ్రీధర్ "ధరణీ.....ధరణీ!" ఆతృతగా పిలిచాడు. బాత్ రూమ్ దగ్గిర్నుంచి కంగారుగా వెళ్ళి "ఏమిటండీ?" అంది.
   
    "మరీ ఇంత ఘోరమా?" కళ్ళద్దాలు పైకి తోసుకుంటూబాధగా అన్నాడు.
   
    "ఏం జరిగింది?"
   
    "నూట పదమూడు పరుగుల తేడాతో భారత్ ను ఓడించిందా పాక్? ఇంత అన్యాయంగా ఆడకపోతేనేం మనవాళ్ళు? ఇంట్లో కూర్చోవచ్చుగా?" కసిగా పేపర్ మడిచి టీపాయ్ మీద పడేస్తూ అన్నాడు.
   
    ధరణి కోపంగా ఏదో అనబోయింది. ఇంతలో 'సు.....య్....' అన్న శబ్దం అవడంతో "అయ్యో......పాలు పొంగినట్లున్నాయి" అంటూ వంటింట్లోకి పరుగెత్తింది.
   
    టైమ్ ఎనిమిదయింది!
   
    స్కూల్ బాగ్స్ సర్ది, పూజకి తలదువ్వుతూ "తమ్ముడు జాగ్రత్త. రాత్రి పడుకోబోయే ముందు టాయ్ లెట్ కి తీసుకెళ్ళు!" అంది ధరణి.
   
    పూజ తల ఊపింది.
   
    సోమవారం పొద్దుట పంపితే మళ్ళీ శనివారం సాయంత్రందాకా పిల్లల్ని ఉంచుకొంటారు శుభోదయా రెసిడెన్షియల్ స్కూల్ లో!
   
    ఫీజులూ, డొనేషన్లు కూడా మధ్యతరగతి వాళ్ళకి అనువుగా ఉండటంతో ఉద్యోగాలు చేసే తల్లిదండ్రుల పాలిట అది కల్పవృక్షమైంది. ఆ కాలనీలో ఐదు ఇళ్ళనుండి పిల్లలు ఆ శుభోదయా స్కూల్ కి వెళ్తారు. మళ్ళీ శనివారం సాయంకాలం పిల్లల్ని బస్ లో తెచ్చి దింపుతారు.
   
    మొదట్లో ఏడ్చినా పిల్లలకి క్రమేణా అది అలవాటై పోయింది. పరిస్థితుల ప్రభావం వల్ల తప్పించి, ఇష్టంగా ఏ తల్లీ బిడ్డల్ని వదిలి ఉండాలనుకోదు! ధరణి పరిస్థితి కూడా అంతే! ఆమె ఆర్ధిక పరిస్థితికి ఉద్యోగం చాలా అవసరం!
   
    ..... అబినవ్ కి షూష్ వేసి ముద్దు పెట్టుకుని, "వెళ్ళి డాడీకి టాటా చెప్పిరా!" అంది.
   
    అభి పరుగెత్తాడు.
   
    "మమ్మీ! తిరుపతి వెళ్దాం అన్నావుగా!" పూజ అడిగింది.
   
    "వెళ్దాం అమ్మా. ఆఫీసులో నాకు లీవ్ దొరకడం కష్టంగా ఉంది. దొరకగానే వెళ్దాం!" లాలనగా చెప్పింది.
   
    మరో ప్రక్కనుంచి అభినవ్ వచ్చి స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకోగానే "ఇంక వెళ్దామా?" అడిగింది అటు తిరిగి.
   
    ఈ లోపులో "ధరణీ! నా షేవింగ్ బాక్స్ యిచ్చి వెళ్ళు" అని శ్రీధర్ పిలిచాడు.
   
    ధరణి వెళ్ళి షేవింగ్ బాక్స్ ఇచ్చి వెనక్కి తిరుగుతుండగా.....

Related Novels