Previous Page Next Page 

బొమ్మా - బొరుసూ పేజి 2


    "అప్పుడు ఒకేవైపు ఆలోచించే వాళ్ళమన్నయ్యా! నిజానికి భార్యా భర్తలు అన్న తరువాత అన్యోన్యంగా ఉండడం ముఖ్యం. హక్కులూ, సమానత్వం అంటే ఎలా కుదురుతుందీ? ఇద్దరి విధులూ వేర్వేరు. ఇద్దరి భాధ్యతలూ వేరు. సమానత్వం కావాలి ఆ తరువాత ఆపదానికి అర్ధంలేదు....." అంటుంది. హేమమాత్రం శారదలాంటి ఆడపిల్ల కదా? ఆమెను తనవేపు ఆకర్షించుకోవాలంటే ఆమె ఆలోచనల్ని అభిప్రాయాల్ని సమర్ధించాలి అంతే!
    "మీరన్నమాట నిజమే హేమగారూ! మగాడికి మరీ స్వార్ధం ఎక్కువయిపోతోంది. "ఒప్పుకుంటున్నట్లు అన్నాడు శ్రీనివాసరావ్. హేమ శ్రీనివాసరావ్ వేపు మెరుస్తున్నకళ్ళతో చూసింది. సుధీర్ రెండు చేతులతో తల పట్టుకున్నాడు.
    "ఇంక ఆమెను భగవంతుడే రక్షించాలి ఇంత కాలం ఈ విషయంలో మావయ్య ఒక్కడే ప్రోత్సహిస్తున్నాడనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా తోడయ్యావన్నమాట!" శ్రీనివాసరావు నవ్వేశాడు. బేరర్ తెచ్చినకాఫీలు అందుకున్నారు ముగ్గురూ.
    "అవును ఆడది ఆలోచించడం మొదలు పెడితే, ఏదో విపరీతం జరిగినట్లు కేకలేసేయాలి. లేకపోతే మగవాడికి ప్రమాదంకదా!" ఉక్రోషంగా అంది ఆమె.
    "ఇదిగో చూడమ్మాయ్ ఇందులో మగాళ్ళకొచ్చిన ప్రమాదమేమీ లేదు. ఏదో పాపం మామ కూతురు కదాని జాలి! అంతే! ఇదే ఇంకే ఆడపిల్లయినా అయితే గోవిందా కొట్టేసి ఊరుకునేవాడిని...." నవ్వుతో అన్నాడు సుధీర్. "నీకూ నాకూ ఎప్పుడూ చుక్కెదురేగా! ఇంక నీతోవాదించడం కూడా దండగ. కానీ ఓ విషయం గుర్తుంచుకోబావా! ఎప్పటికయినా మగాళ్ళ ఆటకట్టేది ఖాయం! ఇంక పద" లేచి నిలబడుతూ అందామె.
    సుధీర్ నవ్వుతూ మాట్లాడుతున్నా ఆమె మాత్రం సీరియస్ గా మాట్లాడుతున్నట్లు తెలిసిపోతూనే ఉంది శ్రీనివాసరావుకి. సుధీర్ కి ఆమెకూ ఎప్పుడూ ఈ విషయంలో వాగ్వివాదాలు జరుగుతూనే ఉంటాయనీ, అంచేత వారిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలనీ కూడా అర్ధమవుతోంది. మరి అతని అభిప్రాయాలతో ఏ మాత్రం ఏకీభవించిన ఆమెని సుధీర్ వివాహం చేసుకొంటాడా? ఊహు! అలా జరగదనే అనిపిస్తోంది తనకి. ఒక వేళవారిద్దరికీ వివాహం జరగని పక్షంలో మరి ఆమె తనను చేసుకోవడానికి ఒప్పుకొంటుందా ఏమో! వప్పుకోవచ్చు! వప్పుకోకపోవచ్చు! అది తన అదృష్టం మీద ఆధారపడి వుంటుంది తన ఆలోచనలకి నవ్వు వచ్చింది శ్రీనివాసరావుకి.
    "ఏమిటిది? అప్పుడే హేమతో వివాహం వరకూ వెళ్ళిపోయాడు తనవి పగటి కలలు! పిచ్చి ఆలోచనలు! హేమలాంటి అందమయిన మామకూతుర్ని సుధీర్ చేసుకోకుండా ఉంటాడా? ఏదో సరదాగా వాదించుకొన్నంత మాత్రాన వారు విరోధులయిపోతారా? తనంత తెలివితక్కువ మనిషి ఇంకెవ్వడూ ఉండడు. రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చారు ముగ్గురూ.
    "నేనింక వెళ్తాను మరి...." రోడ్డు పక్కగా నిలబడిపోతూ అన్నాడు శ్రీనివాసరావ్.
    "ఓ.కే! థాంక్స్ ఫర్ యువర్ కంపెనీ!" నవ్వుతూ అన్నాడు సుధీర్.
    "నేనే మీకు థాంక్స్ చెప్పాలి! చాలా సరదాగా గడిచింది సమయం" తనూ నవ్వుతూ అన్నాడు శ్రీనివాసరావ్! సుధీర్ ముందుకు నడిచాడు.
    "వస్తానండీ!" అంది ఆమె శ్రీనివాసరావువంకచూస్తూ.
    "సీయూ ఎగైన్...."మనసంతా విలవిలలాడుతూండగా అన్నాడు శ్రీనివాసరావ్.
    ఆమె మందహాసం చేసి వెళ్ళిపోయింది. కొద్దిక్షణాలు అక్కడే నిలబడిపోయాడు శ్రీనివాసరావ్. హేమవెళ్ళిపోతుంటే తన సర్వస్వం పోగొట్టుకున్నట్లు అనిపించసాగిందతనికి, తలచుకుంటే ఆశ్చర్యంగా వుంది. రెండు గంటల క్రితంవరకూ అసలు హేమ అంటే ఎవరో తనకు తెలీదు. ఆ అమ్మాయిని అంతకుముందెప్పుడూ చూడనూలేదు. కాని ఇప్పుడు ఆమె లేకపోతే తన జీవితమే వృధా అనిపించేంతగా గాఢమయిన అనురాగం అల్లుకుపోయింది! ఇలాంటి సంఘటనలు కేవలం కథల్లో చదివాడు తను, అప్పుడు అవి ఎంతో అసహజం అనిపించాయి. కానీ ఇప్పుడు ఆ సంఘటనలు కేవలం కల్పితాలు కావనీ వాటి వెనుక అనుభవాలు ఉన్నాయనీ తెలుస్తోంది. అందుకే"రవి గాంచనిచో కవిగాంచున్" అన్నారు.
    ఇంతకూ ఇప్పుడెక్కడికి వెళ్ళడం? ఎటూ తోచటంలేదతనికి నిజానికి ఆవేళ ఆఫీసుకి శెలవు రోజు కావడంవల్ల మలక్ పేటలో ఉంటున్న పిన్నిగారింటికి వెళ్ళిసాయంత్రం వరకూ అక్కడే కాలక్షేపం చేయాలనుకొన్నాడు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపించడంలేదు. కొద్ది సేపు ఎక్కడయినా ఏకాంతంగా కూర్చుని ప్రశాంతంగా గడపాలని ఉంది. నెమ్మదిగా పార్కువైపు నడవసాగాడతను.
    నిర్మానుష్యంగా ఉన్న పార్కులో నీడగా ఉన్నచోట గడ్డిమీదపడుకుండి పోయాడు. చేతిలోని పాకెట్ కొద్దిగా చింపి అందుకోని షర్ట్ పీస్ బయటకులాగాడు. అది చూస్తుంటే అతనికి ఆనందం పొంగి పొరలింది. హేమ సెలక్ట్ చేసిన షర్ట్ ఇది. ఈ షర్టుకి ఓ అనుభూతి ముడిపడి వుంది. దాన్ని ముద్దు పెట్టుకొని మళ్ళీ పాకెట్ లోకి తోసివేశాడు.
    ఆలోచిస్తున్న కొద్దీ అతని హృదయం బాధతో నిండిపోతోంది. "హేమ మీద ఆశలు పెట్టుకోవడం ఎండమావులనునమ్ముకోవడం వంటిదో. ఆ నిజంతనకు తెలుసు. ఒకవేళ సుధీర్ చేసుకోకపోయినా తనను చేసుకుంటుందన్న ఆలోచన హాస్యాస్పదమైంది. తను గొప్ప అందగాడుకాదు. ఆస్తిపరుడూ కాదు. ఒక హోదా, అంతస్తూ ఇవేవీ కూడా లేవు. మరి హేమలాంటి అందాలరాశి ఇంకేం చూసి తననువరిస్తుంది? అలాంటి అందగత్తె ఏ ఆఫీసరు భార్యో అవుతుంది! స్కూటర్ల మీదో, కారుల్లోనో షికార్లు చేస్తుంది. మరీ బంగళాల్లో కాకపోయినా, అందమయిన ఇంట్లో ఉంటుంది. ఇదీ హేమ భవిష్యత్తు. చాలాసేపటికి బరువెక్కిన మనసుతో తన గదికి చేరుకొన్నాడు శ్రీనివాసరావ్.
    సుధీర్, హేమ ఇల్లు చేరుకొనేవరకూ ఏమీ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వాడు మునిగిపోయాడు. సుధీర్ కి ఇది కొత్తేంకాదు. అంతకుముందు చాలాసార్లు ఆమెహో 'స్త్రీలకు సమాన హక్కులు' అన్న విషయం మీద వాగ్వివాదం జరిపాడు. ఆమె ఆలోచనలు మరీ సంకుచిత ధోరణిలో పడినట్లు అతనికి అర్ధమయిపోయింది. అంతవరకూ ఆమె మీద అల్లుకొన్న అనురాగాన్ని గురించీ, తమమధ్య ఏర్పడబోయే బంధాన్ని గురించీ పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
    హేమా, తనూ తామిద్దరి పెద్దలకోరిక మీదా వివాహం చేసుకొంటే ఆ వివాహం ఎంతకాలం సజావుగా వుంటుందో తను తేలిగ్గా ఊహించగలడు. అందుకే ఎన్నోరోజులు అలోచించి తను హేమను వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ తన నిర్ణయం ఆమెకు గానీ, మావయ్యకు గానీ ఎలా తెలియజేయాలో తోచటం లేదు. హేమకు తన నిర్ణయం ఆనందాన్నే కలిగిస్తుందని తన నమ్మకం. కానీ మామయ్య మాత్రం క్రుంగిపోతాడు. తమ రెండు కుటుంబాల మధ్య కలతలు ప్రారంభమవుతాయ్. అదే తనకు బెరుకు కలిగిస్తున్న విషయం. మొదటినుంచీ తను హేమనువివాహం చేసుకొనే విషయంలో విముఖత్వం చూపితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదికాదు. కానీ మరి ఆనాటిహేమ వేరు! ఈ రోజు హేమ వేరు.
    ఆ హేమలో అమాయకత్వం ఉండేది. తను కోరుకునే లాలిత్యం, సౌకుమార్యం తనంటే అభిమానం అన్నీ ఉండేవి. కానీ ఈ హేమవీటన్నిటికీ భిన్నం! స్త్రీ పురుషుడికి అణగిమణగి పడి వుండాలన్న భావన తనకూ లేదు. కానీ సంఘంలో ప్రస్తుతం స్త్రీకున్న స్థానంలో ఎలాంటిలోపమూ కనిపించలేదు. ఎక్కడో కొంతమందిమగాళ్ళు స్త్రీకివ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే అది స్త్రీ జాతి అంతటికీ సంబంధించిన విషయంగా  తీసుకోవడం తప్పని తన అభిప్రాయం.
    ఏదేమయినా తనను అర్ధం చేసుకొని అన్ని విధాలా కలిసి మెలసి ఉండే భార్య తనకు కావాలి. ఎలాంటి సమస్యలూ, చికాకులూ ఉత్పన్నం కాని వైవాహిక జీవితాన్నే తనుకోరుకుంటున్నాడు. మరి హేమతో అలాంటి జీవితం తనకు లభించదు! హేమ మనసులో ఈ ఆలోచనలేమీ లేవు. ఆమె తను అంతకు ముందు రోజు హాజరయిన ఇంటర్ వ్యూ గురించే ఆలోచిస్తోంది తను సెలక్టవుతుందా లేదా అనేదే ఆమెకు తెలీటం లేదు.
    అసలు తనకు ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. కాని ఉద్యోగం చేయాలన్న కోరిక చాలాకాలం నుంచీ ఉంది. ప్రతి స్త్రీ ఉద్యోగం చేయాలి ఆర్ధికంగా పురుషుడి మీద ఆధారపడకుండా ఉండాలి వివాహం చేసుకోకపోయినా జీవితం సాఫీగా గడచిపోతుందన్న నమ్మకం ఏర్పడాలి. అప్పుడు గాని మగాడి మనస్తత్వం మారదు. 'ఆడది వంటింటికుందేలు, పిల్లల్ని కనే యంత్రం' అన్న ఆలోచన అప్పుడే రూపు మాసిపోతుంది.
    "ఏం కొన్నావే కోడలా?" దేవకి నవ్వుతూ హేమకు ఎదురొచ్చి అడిగింది. "రెండు చీరలు కొన్నానత్తా! అంతే! వాటికే డబ్బంతా అయిపోయింది! అందుకనే ఇంటికిచక్కా తిరిగి వచ్చేశాము......" తన చేతిలోని పాకెట్ ఆమెకందిస్తూ అందిహేమ. "డబ్బు అయిపోతే వాడినడిగి తీసుకోవాల్సింది." చీరలు పాకెట్ లో నుంచి బయటకులాగి పరీక్షగా చూస్తూ అందామె.
    "అయ్యో! బావా నాకు డబ్బిస్తావా? నేనెక్కడ అడుగుతానోననిపదపద అంటూ త్వరత్వరగా ఇంటికి లాక్కొచ్చేశాడుగా!" చిలిపిగా అంది హేమ సుధీర్ వంక చూస్తూ. "సరే! నిజమే! నేను షైలాక్ ని. పిల్లికిబిచ్చం పెట్టనివాడిని సరేనా?" తనూ నవ్వుతూ అన్నాడు సుధీర్.
    "ఇప్పుడు దాచినా, రేపయినా ఆ డబ్బు దానిదే అవుతుందిగా? అప్పుడేం చేస్తావ్?" హేమను సమర్ధిస్తూ అంది దేవకీ. ఈ మాటతో హేమ సిగ్గుపడింది కాని అలా సిగ్గుపడినట్లు సుధీర్ తెలీడం ఆమె కిష్టం లేకపోయింది. అందుకే వెంటనే సంభాషణ మార్చి వేసింది.
    "మరి రేపు ఉదయం బస్ కి రిజర్వేషన్ చేసుకోవాలి కదు బావా నేను?"
    "సాయంత్రం బస్ స్టాండ్ కెళ్ళి ఆ పని చూద్దాం!" అన్నాడు సుధీర్.
    తన తల్లి మాటలు అతనికీ ఇబ్బంది కలిగించినయ్. అందుకని వెంటనే అక్కడినుంచి తనగదివేపు నడిచాడు.
    "ఇప్పుడే తొందరేముంది? మరో రెండు రోజులుండి వెళ్ళకూడదటేహేమా?" అడిగింది దేవకి.
    "ఊహు! కుదరదు అత్తా! బోలెడు ఉద్యోగాలకి అప్లయ్ చేశాను. ఎప్పుడే ఉద్యోగం తాలూకు ఇంటర్ వ్యూ వస్తుందో తెలీదు. అయినా మొన్న ఇక్కడ అయిన ఇంటర్ వ్యూలో సెలక్టయితే ఇక హైద్రాబాద్ లో ఉండాలి కదా! అప్పుడిక రెండురోజులేమిటి? జీవితం ఇక్కడే గడిచిపోతుంది...." నవ్వుతూ అంది హేమ.
    దేవకి ఏవేవో కుటుంబ విషయాలు మాట్లాడుతోంటే 'ఊ' కొడుతోంది హేమ. కానీ ఆమె మనసంతా. అదివరకటికీ ఇప్పటికీ సుధీర్ ప్రవర్తనలో ఏదో మార్పు కనబడుతోంది. మూడేళ్ళ క్రితం తను ఇక్కడి కొచ్చినప్పుడు అతను తన మీద గుమ్మరించిన ఆప్యాయాభిమానాలు ఇప్పుడు కనిపించడంలేదు. అసలు తనని ఒక్కక్షణం కూడా వదిలి ఉండేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. కొంత రొమాంటిక్ గాకూడా ఉండేవతని చేష్టలు. మరిప్పుడు.....చాలామామూలుగా తామిద్దరూ బంధువులేగాని, అంతకంటే ఎక్కువ సంబంధాలేమీ లేవన్నట్లు మసులుతున్నాడు. ఆ మధ్య ఓసారి తామిద్దరూ ఓ బంధువు అమ్మాయి పెళ్ళిలో కలుసుకొన్నప్పుడు' స్త్రీలు, పురుషులు అనుభవిస్తున్నబాధలు' గురించి వాదించుకొన్నారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు నిరసించుకున్నారు. ఆ పెళ్ళికొచ్చిన అమ్మాయిలందరూ తన పక్షం వహించేసరికి అతను తగ్గక తప్పలేదు. తామిద్దరికీ అనేక విషయాల్లో అభిప్రాయభేదాలుండవచ్చు. అంత మాత్రాన అవి తన మధ్య ఉన్న ప్రేమాభిమానాలకు అంతరాయం ఎందుకవాలి?

 Previous Page Next Page