Previous Page Next Page 

టు హెల్ విత్ లవ్ పేజి 2


    "అదికాదు. కన్ ఫర్మేషన్ అయ్యాక"
    "మన కన్ ఫర్మేషన్స్ తోనే మేడమీద డబుల్ బెడ్ రూమ్ కట్టించింది డాక్టర్. సిజేరియన్ బిల్డింగ్స్ లో కన్ ఫర్మేషన్ బెడ్ రూమ్! బావుండలేదూ?"
    "అయినా తప్పదు. ఈ కన్ ఫర్మేషన్ మీదే మన ప్రోగ్రామ్ ఆధారపడి వుంది."
    "అంటే కన్ ఫార్మ్ అయితే ఏం జరుగుతుంది?'
    "వెంటనే పెళ్ళి చేసుకోవాలి"
    సురేష్ త్రుళ్ళిపడ్డాడు.
    "మైగాడ్! పెళ్ళా?"
    "అవును" కొద్దిక్షణాలు ఆలోచించాడతను.
    "సరే....నువ్ కాదు కూడదంటే చేసుకుంటాను. కానీ ఆ అమ్మాయిని ముందోసారి నేనుచూడాలి"
    పక్కనే ఉన్న హాండ్ బాగ్ తో అతని నెత్తిమీద కొట్టిందామె.
    "మన పెళ్ళి! నీ పెళ్ళి కాదు."
    "ఓహో! మనపెళ్ళా! ఇప్పుడు పెళ్ళికి డబ్బెక్కడిది?"
    "బాంకులో ఉంది కదా?"
    "నోనో! దాంతో మన కాపురం సెటిలవ్వాలి! లేకపోతే గంగాభవానీ ఎక్కువగా ఉంది."
    "ఆల్ రైట్! రేపొద్దున్న డాక్టర్ దగ్గర కెళ్దాం. ఈలోగా నీ అనుమానం నిర్ధారణకోసం రాత్రంతా విశ్వప్రయత్నాలు చేద్దాం. లేకపోతే రేపు డాక్టర్ బిల్ వృధా అవుతుంది"
    ఆమె పరవశంతో అతని హృదయానికి హత్తుకుని కళ్ళుమూసుకుంది.
    నిమిషమయినా గడిచిందో లేదో బయట బోలెడు మంది మాట్లాడుతున్న ధ్వనులు, వాహనాల శబ్దాలూ వినిపించేసరికి ఆశ్చర్యంగా లేచి కూర్చున్నారిద్దరు.
    "ఇంత రాత్రివేళ ఏమిటా హడావుడి?" అనుమానంగా అడిగాడు.
    ఆమె కిటికీకొంచెంగా తెరిచిచూసి పగలబడినవ్వేయ సాగింది.
    "ఏమిటీ? మన కిటికీ దగ్గర ట్రాఫిక్ జామ్ అవలేదు కదా?"
    "రా! నువ్వేచూడు"
    తనూ కిటికీ దగ్గరకెళ్ళి చూశాడు.
    బయట ఎండ మండిపోతుంది.
    నమ్మలేనట్లు గడియారం వైపు చూసాడు.
    "మైగాడ్! ఇది పగలు పదకొండా?"
    తులసి అతని జుట్టుపట్టుకుని నగ్నంగా వున్న ఛాతిమీద మృదువుగా కొరికింది. ఆమె వంటింట్లో కెళ్ళగానే పైజామాతో బయటికొచ్చాడతను.
    గంగా భవాని నిచ్చెన ఎక్కి ఇంటిమీదకు పాకిన తీగనుంచీ బీన్స్ కోసి సంచీలోవేస్తోంది.
    "హలో గంగాభవానిగారూ! నేనునిచ్చెన కదలకుండా పట్టుకుంటాను"
    అంటూ నిచ్చెన దగ్గరకొచ్చాడు.
    ఆమె ఎర్రబడిన మొఖంతో తడబడుతూ కంగారుగా నిచ్చెన దిగేసింది.
    "సిగ్గుండాలి! ఆడాళ్ళు నిచ్చెనమీదుంటే చావడానికి!"
    "బాయ్స్ స్కౌట్ బుద్ది! ఏం చేయమంటారు? అదీగాక ఇంటి ఓనర్ సేవయే అద్దెకున్నాడి కర్తవ్యం అని మన మత గ్రంథాల్లో రాసి ఉందిట! మన వేంకటేశ్వర స్వామి గుళ్ళోపూజారిగారు చెప్పారు" ఆమె నవ్వింది.
    "మీ మొఖం అంత పోలికల్లేకుండా ఎలా మారింది?"
    "అద్దె ఇవ్వకపోతే మొఖం చూపించవద్దన్నారు కదా! అందుకని కొత్త మొఖం ఏర్పాటు చేయించుకున్నాను....."
    "అంతా అబద్దం!"
    'యాక్సిడెంట్! డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారు.....మీకీ మొఖం నచ్చితే చెప్పండి.....మనం హాయిగా....."
    "మొఖం మారితే ఏం లాభం? బుద్ది మారుస్తే బాగుండేదా డాక్టర్లు......"
    సురేష్ ఆనందంగా ఆమెవేపు అడుగువేశాడు.
    "బుద్దికూడా చాలా మారిపోయింది ఇప్పుడు తులసి మీద అది వరకంత 'ఇది'లేదు......
    ఆమె కంగారుగా రెండడుగులు వెనక్కు వేసింది.
    "ఇదిగో! దగ్గరకొచ్చారంటే మర్యాదగా వుండదు......"
    "మరి దూరంనుంచి ఎలా? అప్పుడెప్పుడో రామాయణ భారతకాలంలో ఉండేవట ఆ ఏర్పాట్లు"
    "ఏం ఏర్పాట్లు?" అనుమానంగా అడిగింది.
    "అదే టెస్ట్ ట్యూబ్ బేబీ వ్యవహారం! అప్పట్లో టెస్ట్ ట్యూబ్ బేబీలా ఎక్కువగా పుడుతూండేవారు. ఇదికూడా వెంకటేశ్వరస్వామి గుడిపూజారిగారే చెప్పాడు....."
    ఆమె మొఖం సిగ్గుతో ఎర్రబడింది.
    "ఇలాంటిచెడ్డమాటలు మాట్లాడ్డానికి సిగ్గులేదూ?"
    "నిజం చెప్పాలంటే సిగ్గుగానే ఉంది. కానీ మాటలేమీ లేకుండా మనం చేతల్లోకి దిగటం మీకు నచ్చుతుందోలేదోనని........"
    ఆమెకు కోపంతోపాటు నవ్వుకూడా వచ్చిందిగానీ బలవంతంగా అణుచుకుంది.
    "ఇలాంటి బుద్దులుండబట్టే దేవుడలా మొఖంచెక్కేశాడు....."
    "దేవుడుకాదు! డాక్టరు! అరె! మీ పాదులు బాగా కాపుకొచ్చేసినట్లున్నాయే! మనం షేర్ చేసుకోవచ్చా? అన్నట్లు నేను ఆ సన్న చిక్కుడు తినను. ఇంకోసారి ఆ విత్తనాలు నాటకండి......"
    "వాటిమీద చేయివేశారంటే మర్యాదగా ఉండదు. ముందే చెపుతున్నాను......"
    "అబ్బే చెట్లమీదా, చేమలమీదా చేతులు వేసేంత పిచ్చివాడిని కాదులెండి."
    ఆమె కళ్ళల్లో డేగ కనిపించిందతనికి.
    "హు!" అనేసి లోపలి కెళ్ళిపోయింది.
    "హు" అంటూ తనూ ఆమె వెనుకేవెళ్ళబోయాడు గానీ ఆమె దభాలున తలుపుమూసేసరికి ఆగిపోయాడు.
    అప్పటికే తులసి రెడీ అయింది.
    "నేను రడీ!" అందామె.
    "మైగాడ్! ఇంత పొద్దున్నేనా? ఓ.కే. నేనూ రడీయే" ఆమెను ఎత్తుకోబోయాడు.
    "ఇదేమిటి?" అతనిని వెనుకకు తోసివేస్తూ అంది.
    "రడీ అన్నావుగా......"
    'షటప్! నేను రడీ అయింది డాక్టర్ దగ్గర కెళ్ళటానికి."
    "ఓ! అదా! మరి క్లియర్ గా చెప్పకపోవటం నీ తప్పే! ఓ ఫైవ్ మినిట్స్ టైమివ్వు...."
    ఇద్దరూ ఆటోలో వెళ్తోంటే చెప్తోంది తులసి.
    "ఈ మధ్యనా కాలేజ్ మేట్ సుశీల కనిపించింది"
    "నా గిన్నీస్ బుక్ ఆఫ్ మెజర్ మెంట్స్ లో అలాంటి పేరున్నట్లు గుర్తులేదే? అడ్రసేమిటి?"
    "నీకనవసరం! పాపం ఎక్కడా జాబ్ దొరకలేదట! అందుకని బ్రోకర్ గా వర్క్ చేస్తోంది......

 Previous Page Next Page