TeluguOne - Grandhalayam
Srushti


    "అయ్యో రామా! మీ ఆర్టిస్టులంతా మూడీ ఫెలోస్ ప్రపంచంలో ఎవరూ వుండరండి బాబూ! మధురీ తెలీదు. ప్రియాంకా  తెలీదు. కనిపించే మనిషిని గుర్తపట్టలేరు. విన్పించే గొంతును పసికట్టలేరు. ఎవరండీ బాబూ! బుద్ధుడి ఆరో అవతారంలాగా."

 

    ఆ మాటలకు కంగారుపడిపోయాడు అభినవ్.

 

    "సారీ! రాంగ్ నెంబర్! మీక్కావలసిన వ్యక్తిని నేను కాదనుకుంటా" రిసీవర్ ని పెట్టెయ్యబోతుండగా-

 

    "అయ్యా! మహానుబావా! నేనూ కావ్యని. హైద్రాబాద్ నుంచి" అన్న మాట వినబడడంతో అప్పుడు కావ్య అనే ఆకారం కళ్ళ ముందు కొచ్చింది అభినవ్ కి.

 

    "మీరా! ఇంకెవరో అనుకున్నాను. మాధురీ దీక్షిత్, ప్రియాంకా గాంధీ వాళ్ళెవరు? మీ ఫ్రెండ్సా" నిజంగా మేధావులే కావచ్చు. వాళ్ళకి వాళ్ళ కళ తప్ప మిగతా ప్రపంచం గురించి ఆలోచించే తీరిక, అవసరం వుండదు.

 

    ఆ మాటలకు  కావ్య పెద్దగా నవ్వింది. ఆ నవ్వుకి దృశ్యరూపం ఇస్తే కొబ్బరాకుల మీద వెన్నెల మెరుపుల్లా వుంటుంది.

 

    "చెప్పండి" అడిగాడు అభినవ్.

 

    "ఏం చెప్పడం. మీరే చెప్పాలి. ఎంతవరకొచ్చింది మీ పని? మనకు ఇంకో నలభై ఎనిమిది గంటల టైముంది. జ్ఞాపకం వుందా?" అతని జీవితానికి సంబంధించిన అతిముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకంచేసిందామె.

 

    "అవును జ్ఞాపకం వుంది. కానీ కావ్యగారూ నౌ అయామ్  ఇన్  హెల్ప్ లెస్ కండిషన్. అయామ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీ ఇన్ స్పిరేషన్ హియర్ అనవసరంగా మీరిచ్చిన డబ్బును ఖర్చు చెయ్యడం తప్ప" అతని గొంతులో ధ్వనించిన నిజాయితీకి ఆమె ఒక్క క్షణం మాట్లాడలేక పోయింది.

 

    "యూ నో అభినవ్! దిసీజ్  ఎ ప్రెస్టేజ్ క్వశ్చన్ ఫర్ మి. అండ్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఫర్ యూ! మీకు తెలుసు ప్రతీ ఏటా మా యాడ్  ఏజెన్సీ నుంచి వెళ్ళే పెయింటింగ్ కి ఏదో  ప్రైజ్ రావడం. ఈసారి బెస్ట్ పెయింటింగ్ అవార్డు మీ పెయింటింగ్  కి వస్తుందన్న నమ్మకం నాకు వుంది. పోనీ ఇప్పటికిప్పుడు మీరు వేయలేకపొతే మీ ఓల్డ్ పెయింటింగ్స్ దేన్నో దాన్ని పంపుదాం. ఏవంటారు?"

 

    ఆ సలహాకు అభినవ్ దగ్గర్నించి మౌనం తప్ప మరేం జవాబు లేదు.

 

    "చూడండి అభినవ్! టైమ్ కీ, ఆర్ట్ కీ సంబంధం లేదు. కానీ ఆర్టుని నిర్దేశించేది టైమ్. ఆ విషయం నాకన్నా మీకు బాగా తెల్సు. ఓ పని చెయ్యండి.... ఈవెనింగ్ ప్లైట్ కి వచ్చెయ్యండి. మీ కోసం వెయిట్ చేస్తుంటాను" ఫోను కట్ అయింది.

 

    అభినవ్ మనసంతా గజిబిజిగా అయిపోయింది.

 

    ఆచేతనంగా సోఫాలో కూలబడిపోయాడు.

 

    ఏవేవో ఎడతెగని ఆలోచనలు, మంచం మీద మౌనంగా బొమ్మలా నిద్రపోయే చెల్లి..... బాధకుగానీ, సంతోషానికిగానీ నిర్లిప్తంగా కళ్ళతో జవాబు చెప్పే చెల్లి.....

 

    తుళ్ళుతూ, నవ్వుతూ పరుగెత్తే చెల్లి..... అయిదేళ్ళ క్రితం జబ్బుతో క్రుంగిపోవడం, మంచాన పడటం, బ్రతుకంతా హాస్పిటల్ పాలవడం.... చెల్లి జబ్బేమిటో తెల్సుకోవాలంటే కనీసం లక్ష రూపాయలు కావాలి. ముందు చెల్లి జబ్బేమిటో తెలుసుకోవాలి.

 

    తనకి సంతోషాన్ని ఇచ్చే కళను చెల్లి జబ్బుని గురించి తెల్సుకోవడము కోసం వుపయోగిస్తున్నాడు తను.

 

    తన మూడ్  సరిగ్గా  కుదిరితే తను అద్భుతంగా పెయిటింగ్ వేస్తాడు. తనకి ఢిల్లీ పెయింటింగ్ కాంపిటీషన్స్ లో బెస్ట్ ప్రైజ్ రావడం ఖాయం.

 

    కానీ....

 

    కుంచె కదలడం  లేదు. మనసులో భావం పలకడం లేదు. తాళ్ళన్నీ చిక్కుపడిపోయినట్టు మెదడంతా గజిబిజిగా అయిపోయింది.

 

    మరొక్క క్షణం....

 

    పాండిచ్చేరిలో వుండదలుచుకోలేదు అభినవ్.


    
    హోటల్ రూమ్ ఖాళీచేసి టాక్సీలో మద్రాస్  బయలుదేరాడు. మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషనుకి చేరేసరికి రెండు గంటలు దాటింది.

 

    మద్రాస్ ఎక్స్ ప్రెస్ కి టిక్కెట్ దొరకలేదు.

 

    సాయంత్రం ఆరుగంటలకు హైద్రాబాద్ వెళ్ళే చార్మినార్ ఎక్స్ ప్రెస్ కి టిక్కెట్ కోసం ప్రయత్నించాడు.

 

    టిక్కెట్ కలెక్టర్ ని ప్రాధేయపడితే ఒక సీటు ఎడ్జెస్ట్ చేశాడు- సెకండ్ క్లాస్ కంపార్టుమెంట్లో.

 

    తన సీట్లో కూర్చున్నాడు.

 

    సరిగ్గా ఆరూ పదిహేను నిమిషాలకి ట్రైన్ మద్రాసు సెంట్రల్  స్టేషన్లో బయల్దేరింది.

 

    బాగా అలసిపోవడం వల్ల సీటుకి చేరబడగానే కళ్ళ మీదకు నిద్ర ముందుకొచ్చేసింది అభినవ్ కి.

 

    మూడు గంటల తర్వాత మెలకువ వచ్చిందతనికి.


    
    కళ్ళిప్పి చూశాడు.

 

    పరిగెడుతున్న ట్రైను నీలపు వెల్తురుకి కళ్ళు ఎడ్జస్టు కావడానికి అయిదు నిమిషాలు పట్టింది.

 

    రిజర్వేషను కంపార్టుమెంట్లో జనం  కిక్కిరిసి వుండటం చూడటం అదే మొదటిసారి అభినవ్ కి. అది పెళ్ళిళ్ళ సీజనని తెలీదు అతనికి.

 

    బెర్త్ ల చివర అనుకుని, నడిచే దారిలో సూట్ కేస్  ల మీద, మోకాళ్ళతో కూర్చుని జోతుగూ నిద్రపోతూ.... కళ్ళిప్పి పక్కకి చూసిన అభినవ్ కి కన్పించిన దృశ్యానికి ఆశ్చర్యపోయాడు.

 

    రెండు బెర్త్ లకు మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో కుడివేపు బెర్త్ కి అనుకుని ఒకమ్మాయి నిద్రపోతోంది. ఆ అమ్మాయి పక్కన విఐపి సూటుకేసు.

 

    కాళ్ళు చాపుకుని కుడికాలి మీద ఎడంకాలు వేసుకుని నిద్రపోతోంది. ఆ కాళ్ళకున్న వెండి పట్టాలు  నీలపు వెలుగులో వింతగా మెరుస్తున్నాయి. గాలికి ఎగురుతున్న విశాలమైన జుత్తు, గుండ్రటి ముఖం, పొడవాటి ముక్కు ముక్కుపుడక మిలమిలమని  మెరుస్తోంది. చెదిరిన పైట, ముడుచుకున్న ఎంచక్కటి పెదిమలు, రైలు కదలికను వూగుతున్న కాళ్ళు, మంద్రముగా సవ్వడి చేస్తున్న  పట్టీలు వైపు చూసిన అభినవ్ అక్కడ కనిపించిన వింత దృశ్యానికి మరింత ఆశ్చర్యపోయాడు.

 

    కుడికాలు పట్టీని నోట్లో పెట్టుకుని ఓ అబ్బాయి ఆడుకుంటున్నాడు. వాడికి పూర్తిగా రెండేళ్ళుండవు.


    
    విచిత్రంగా వుందా దృశ్యం. వెంటనే అభినవ్ దృష్టి ఆ అమ్మాయి కంఠం మీదకు వెళ్ళింది.

Related Novels