TeluguOne - Grandhalayam
సిగ్గేస్తోంది!

  

     "కొద్దిగా ఫాన్ వెయ్యి" అన్నాడు.
   
    ధరణి ఫాన్ ఆన్ చేసి "ఇంకా ఏమైనా చెయ్యనా?" అడిగింది.
   
    "ఆఁ ... వీపుమీద దురదేస్తోంది. కొద్దిగా గోకుతావా?" అని అడిగాడు.
   
    "గుల్ మొహర్ చెట్టుని మేకలు తినకుండా చుట్టూ ముళ్ళకంచె వేశాను. వెళ్ళి వీపుని డానికి రాసుకోండి. వీధినపోయే దున్నపోతులన్నీ అలాగే చెయ్యడం చూశాను!" అంది చిరాగ్గా.
   
    శ్రీధర్ భార్యవైపు చూసి "రాకాసీ!" అన్నాడు.
   
    "ఔను! పెళ్ళికాకముందు రాకా శశిని! ఇప్పుడు రాకాసిలా కనిపిస్తున్నాను. ఛత్! సిగ్గు లేకపోతే సరి! పిల్లల్ని స్కూటర్ మీద తీసుకెళ్ళి  స్కూల్ బస్సు దగ్గర దించాల్సిందిపోయి, వాళ్ళకి లేట్ అవుతుందన్న జ్ఞానం కూడా లేకుండా నాకు పనులమీద పనులు పురమాయిస్తున్నారు!" కోపంగా గొంతు పెంచుతూ అంది.
   
    భార్యకి కోపం వచ్చిందని తెలిసి కామ్ అయిపోయాడు శ్రీధర్. "ఇదిగో ఫైవ్ మినిట్స్ ఆగమను.... గెడ్డం చేసుకుని దింపేస్తాను" అన్నాడు.
   
    "అక్కర్లేదు. పేపర్ చదువుకోండి! వార్తలు వినండి! అవి రెండూ ఎలాగూ నేను చెయ్యలేను. ప్రపంచబ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వానికి వందకోట్లు ఇస్తుందా లేదా అని నేను ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ కిలో ఇరవై ఎనిమిది రూపాయలు పెట్టి కొన్న కందిపప్పు కాస్తా బొగ్గులా మాడిపోతుంది. శ్రీలంక మీద ఈసారైనా మనదేశం క్రికెట్ లో విజయం సాధిస్తూందా అని విచారిస్తూ కూర్చుంటే ఆఫీస్ లో లేట్ మెమో ఇచ్చి జీతం కొస్తారు. వస్తా...." విసవిసా వెళ్ళిపోయింది. శ్రీధర్ అవాక్కయ్యాడు.
   
                                      2
   
    "రాజూ..... బస్ వచ్చేస్తుంది. త్వరగా తెములు" కమల అరిచింది.

    "వస్తున్నానమ్మా". అద్దంలో అన్ని కోణాల నుండీ తనని చూసుకుంటూ బదులిచ్చాడు పదమూడేళ్ళ రాజేష్. అతను ఆ సంవత్సరమే తొమ్మిదో తరగతిలోకి వచ్చాడు. పెదవిమీద కొత్తగా మొలుస్తున్న నూనూగు మీసం వేలితో రాసుకున్నప్పుడల్లా అతనికి ఏమిటో అలజడిగానే అనిపిస్తుంటుంది. అందులోనూ రాత్రి 'పారిపోదాం పద!', (లేచిపోదాం రా!' అనే రెండు సినిమాలు టీవీలో చూశాడు.
   
    దేవుడి గదిలోంచి గంట మోత వినపడింది.
   
    "నాన్నగారి పూజ పూర్తయినట్టుంది. వెళ్ళి హారతి తీసుకో" వంట గదిలోంచి కమల అరిచింది.
   
    "ఆ... ఆ..." అన్నాడు కానీ అద్దం ముందునుంచి కదలలేదు. ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు.
   
    "అమ్మా... అన్నయ్య ఏం చేశాడో చూడూ?" డాలీ ఏడుస్తూ వంటింట్లోకి వచ్చింది.
   
    "ఏం చేశాడూ?" విసుగ్గా ప్రశ్నించింది.
   
    "మరే.... మన వరండా మెట్లు దిగగానే నాన్నారు స్కూటర్ పెడ్తారుగా....."
   
    "ఆ ... స్కూటర్ లో గాలి తీసేసాడా?" ఆతృతగా అడిగింది.
   
    "కాదు. స్కూటర్ పక్కనున్న పిట్టగోడ నువ్వు పూల కుండీలు పెడ్తావు చూడూ....."
   
    "ఆ ... కుండీలు విరక్కొట్టాడా?" గడియారం వైపు చూస్తూ అసహనంగా అడిగింది.
   
    "ఆహా.... ఆ మధ్య కుండీలో అత్త బెంగుళూరునుండి తీసుకొచ్చి యిచ్చిన వైట్ రోజ్ చెట్టు పెట్టావుగా!"
   
    "అదికానీ ఎవరికైనా ఇచ్చేసాడా? త్వరగా చెప్పి ఏడు! నాకు ఆఫీస్ టైం వుతోంది" డాలీ నెత్తిమీద మొట్టికాయవేస్తూ అరిచింది.
   
    డాలీ మళ్ళీ రాగం ప్రారంభిస్తూ "ఆ .... ఆ.... దాని పువ్వుఇ ఈ రోజు పెట్టుకుందామనుకున్నాను. దాన్ని కోసేసాడు...." అంది.
   
    "అంతేకదా. నేను అడిగి ఇప్పిస్తాలే ఏడవకు!" చపాతీలు వత్తుతూ అంది.
   
    "ఇవ్వడుగా!" డాలీ కాళ్ళు నేలకేసి బాదుతూ అంది.
   
    "ఎందుకివ్వడు? ఒరే రాజూ! చెల్లాయిని ఏడిపించకు! ఆ గులాబీ పువ్వు ఇచ్చెయ్" గట్టిగా అరిచింది.
   
    విశ్వనాథం గంట ఇంకా గట్టిగా మ్రోగుతోంది.
   
    "నైవేద్యం టైం అయింది కాబోలు!" కమల హడావుడిగా అన్నీ సర్దుతూ అనుకుంది.
   
    "అమ్మా ... అన్నయ్య చూడవే" డాలీ మళ్ళీ ఏడుపు ప్రారంభించింది.
   
    "ఏం? పువ్వు ఇవ్వలేదా?" కమల బైటకి వచ్చి కోపంగా అడిగింది.
   
    "ఇచ్చాడు".
   
    "మరి మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావే?"
   
    "చూడు ఎలా ఇచ్చాడో?" డాలీ చూపించింది. రేకలన్నీ తీసేసిన ఒట్టికాడ మాత్రం ఆమె చేతిలో వుంది.
   
    "పోనీలే ఏడవకు.. వాడెలాగూ మళ్ళీ శనివారందాకా రాడు!" కమల ఓదార్చింది.
   
    "అసలు అన్నయ్యకి ఆ గులాబీ పువ్వు ఎందుకూ? జడలేదుగా పెట్టుకోవడానికీ!" ఏడుస్తూనే అడిగింది డాలీ.
   
    భర్తకి నైవేద్యానికి సిద్దం చేస్తున్న కమల ఆలోచనగా "ఔను...ఎందుకు వీదికా పువ్వు?" అనుకుంది. ఆమెకేదో చిలిపి వూహ స్ఫురించి పెదాలమీద చిరునవ్వు కదలాడింది అంతలో.
   
    "హారతి అందుకో" విశ్వనాథం పట్టుపంచెతో వచ్చి హారతి పళ్ళెం అందించాడు.
   
    నుదుటికీ, జబ్బలకీ విభూతితో ఉన్న భర్త అర్ధనగ్న దేహాన్ని చూస్తూ నిట్టూర్చింది కమల.
   
    ఆమెకి ఎప్పుడైనా సరదాగా రొమేంటిక్ గా భర్తని గురించి ఆలోచిద్దామన్నా అతను ఇలాగే విభూతి కట్లతో, పంచెకట్టుతో కనబడి మూడ్ పోతుంది.
   
                                    3
   
    "హాయ్ ధరణీ!" బస్ స్టాప్ లో నిలబడ్డ నీలూ పలకరించింది. ఆమె పక్కనే ప్రియ బుట్టబొమ్మలా స్కూల్ డ్రెస్ లో నిలబడి వుంది!
   
    "హాయ్ నీలూ.... హలో ప్రియా!" పాప బుగ్గ పట్టుకుంటూ పలకరించింది ధరణి.
   
    ప్రియ వెంటనే పెద్దగా ఏడుపు మొదలెట్టింది.
   
    "ఊర్కో, ఊర్కో...." అని పాపని ఎత్తుకుని ఊరడిస్తూనే "బుగ్గ పట్టుకుంటే చాలు ఏడ్చేస్తోంది. బహుశా స్కూల్లో అందరూ తెగ ముద్దులు పెట్టి విసిగిస్తున్నారేమో?" అంది నీలూ.
   
    "బుగ్గలు బూరెల్లా వుంటే అంతే?" నవ్వింది ధరణి.
   
    "చిన్నప్పటినుంచి దాని స్వభావమే అంత! ఇష్టం లేకుండా నేను ముట్టుకున్నా ఊరుకోదు" అంది పాప వీపు మీద రాస్తూ తల్లి.
   
    ధరణి సీరియస్ గా "ఔను! అసలు తన ఇష్టం లేకుండా ఎవరైనా ఎందుకు ముట్టుకోవాలీ? మనమైతే ఊరుకుంటామా? చిన్న పిల్లలనేగా పాపం అలుసూ?" అంది.
   
    నీలూ నవ్వి, "అందులోనూ వారంరోజులు హాస్టల్లో ఉండాలన్న బెంగ కొంతా!" అంది.
   
    అభినవ్, పూజలవైపు దిగులుగా చూసుకుంది ధరణి. "మనం చాలా అన్యాయంగా పిల్లల్ని జైల్లోకి తోసినట్లుగా తోసేస్తున్నాం నీలూ!" అంది బాధగా.
   
    నీలూ నవ్వి "మరీ సెంటిమెంటల్ గా ఆలోచించకు! శుభోదయా స్కూల్ అయిడియా ఆ యోగిగారికి రావడం మన అదృష్టం! హాయిగా వీక్ డేస్ అంతా మనం నిశ్చింతగా మన పని చూసుకోవచ్చు! లేకపోతే మనం ఇళ్ళకు చేరేటప్పటికి ఈ పిల్లలు ఎక్కడ తిరుగుతుండేవాళ్ళో! ఏం వెధవ పనులు నేర్చుకునేవాళ్ళో! కనీసం వారంలో రెండురోజులైనా మనతో గడుపుతున్నారుగా అందుకు సంతోషించు! అదేగానీ, ఏ హాస్టల్ లోనైనా చేర్పించి వుంటే మూడు నెలల కొకసారి గానీ పంపించరు" అంది.
   
    అధీ నిజమే. వారానికి అయిదు రోజులు తమతో వుంచుకుని, శని ఆదివారాలు తల్లిదండ్రుల దగ్గరికి పంపటం అన్నది నిజంగా చాలా మంచి ఆలోచన! ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే, ఈ విదానం నిజంగా ఒక వరమే! దంపతులు ఆదరాబాదరా ఇంటికి వచ్చే అవసరం వుండదు. అలా అని, పిల్లలు మరీ నెలల తరబడి దూరంగా వుండరు.
   
    ధరణి సంఘమిత్ర ఇంజనీరింగ్స్ లో పనిచేస్తుంది. నీలూ ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో నర్స్. ఆమె భర్తకి మోటార్ మెకానిక్ షాప్ వుంది. దాదాపు ఆ కాలనీలో అందరూ ఒకేలాంటి ఆర్ధిక స్థితిగల మధ్యతరగతి మనుషులు.
   
    "కమల కొడుకు పెద్దవాడైపోతున్నాడు. ఆ స్టయిలు చూడు!" వస్తున్న రాజేష్ ని చూపిస్తూ అంది నీలూ.
   
    ధరణి రాజేష్ ని చూసి నవ్వుతూ "హాయ్ రాజేష్.... హౌ ఆర్ యూ?" అంది.
   
    "ఫైన్ ఆంటీ!" రాజేష్ కొద్దిగా సిగ్గుపడ్తూ అన్నాడు.
   
    "అరె.... నీ గొంతుకూడా మారిపోయిందే!" ఆశ్చర్యంగా అంది నీలూ. ఆ మాటకి రాజేష్ ఇంకా సిగ్గుపడ్తూ తలవంచుకున్నాడు. "మగపిల్లలు గొంతు మారుతున్నప్పుడు చాలా సిగ్గుపడ్తారు! బస్ వస్తోంది." పూజ చెయ్యిపట్టుకుని, అభినవ్ ని ఎత్తుకుంటూ అంది ధరణి.
   
    పిల్లలకి మరోసారి జాగ్రత్తలు చెప్పి బస్ ఎక్కించి అందరూ వెనుతిరిగారు.
   
                                      4
   
    రాజేష్ ముందు సీట్లో కూర్చుంది స్వీటీ. ఆమె ఏడో తరగతి చదువుతోంది. చిన్న చిన్న రెండు జడలు బిగించి వేసినా ఇంకా ఆమె ముంగురులు గాలికి ఎగుర్తూనే వున్నాయి. స్కర్ట్ క్రింద నుండి కనిపిస్తున్న కాళ్ళు తెల్లగా, బలంగా వున్నాయి. స్వీటీ ముద్దబంతి పువ్వులా వుంటుంది.
   
    రాజేష్ చెయ్యి నెమ్మదిగా ఆమె మోచేతిని తాకింది.
   
    స్వీటీ 'ఏంటన్నట్లు' చూసింది.
   
    రాజేష్ ఓ మడత పెట్టిన కాయితం అందించాడు.
   
    స్వీటీకి తెలుసు అదేంటో. అప్పటికే చాలాసార్లు అందుకుని వుంది. నెమ్మదిగా అది అందుకుని చేతిలోని హిస్టరీ బుక్ లో పెట్టేసింది. నిమిషం తర్వాత పుస్తకం తెరిచి ఎవరికీ కనబడకుండా రాజేష్ ఇచ్చిన ఉత్తరం చదవసాగింది. మరి దాన్ని ప్రేమలేఖ అనచ్చో లేదో!
   
    "స్వీటీ ఐ లవ్ యూ!
   
    నీ పెదవులు రేపర్ విప్పిన క్యాడ్ బరీస్ లా వుంటాయి. నీ బుగ్గలు చెర్రీ పండ్లలా ఎర్రగా వుంటాయి. నీ పళ్ళు స్ట్రాంగ్ పిప్పర్ మెంట్లలా మెరుస్తూ వుంటాయి. నీ జడలోకి తెల్లగులాబీ తెద్దామానుకుంటే విలన్ లా మా చెల్లెలు అడ్డుపడింది. ప్రస్తుతానికి ఈ రేకలు వుంచుకో! వచ్చే సోమవారం తప్పకుండా మొత్తం పువ్వు తెచ్చి ఇస్తాను. నీతో ఇంకా చాలా మాట్లాడాలి! ఇంటర్వెల్ లో టాయ్ లెట్స్ దగ్గరికి రా! ప్రేమించుకుందాం.... యువర్స్ లవింగ్ లీ రాజేష్!"
   
    ఉత్తరం చదివేశాక దాన్ని ఉండగా చుట్టి బ్లౌజ్ లో పెట్టుకుంది స్వీటీ. తనవైపు చూస్తుందేమోనని రాజేష్ ఆతృతగా చూడసాగాడు.
   
    స్వీటీ తల తిప్పి చూడలేదు. కిటికీలో నుంచి బైటికి చూడసాగింది. దూరంగా కనబడుతున్న కొండల్లో తనూ, రాజేష్ డ్యూయెట్ పాడుకుంటూ పరిగెత్తుతున్నట్లుగా ఊహించుకోసాగింది.
   
       
                                 -- * * * --

Related Novels