Next Page 

రెండోమనసు పేజి 1

 

                                           రెండోమనసు

                                                                                 యర్రం శెట్టి శాయి

                       

 

    ఇల్లంతా చాలా హడావుడిగా ఉంది. ఆ రోజే చలపతి ప్రయాణం. చలపతి అత్తయ్య చుట్టూ పక్కల అడాళ్ళందరి నీ పోగు చేసి, అతని కున్న ఒక్క తల్లినీ పోగొట్టుకొన్నాక చలపతిని తాము తీసుకురావడం, నాలుగేళ్ళ పాటు తమ దగ్గరే ఉంచుకొని చదివించడం, చివరకు అతనికి దేవుని దయవలన ఈరోజు ఉద్యోగం లభించడం మొదలయిన వివరాలన్నీ చెప్తోంది.
    అలాచేసినందువల్ల తమకు కలిగిన అర్ధక నష్టాలు, ఇబ్బందులు, ఆ పిల్లాడి మీద దయతో వాటిని తామెలా భరించింది - వర్ణిస్తోంది. అంతా అందరూ ఆమె గొప్పతనాన్ని ప్రశంసిస్తోంటే పొంగిపోతోంది. మధ్య మధ్యలో వాళ్ళందరూ పుస్తకాలు, బట్టలు సర్దుకొంటున్న చలపతిని కూడా పలకరిస్తున్నారు.
    "అదృష్టవంతుడివేలే! ఎక్కువ రోజులు ఎవరిమీదా ఆధారపడకుండా ఉద్యోగం సంపాదించుకున్నావ్!" అంది శ్రీలక్ష్మి.
    "అవునండీ! నాకూ అదే సంతోషంగా ఉంది!" అన్నాడు చలపతి.
    "పాపం! చాలాదూరం వెళ్ళిపోతున్నావ్! అక్కడ ఒకడివి ఎలా వుంటావో ఏమో?" అంది సుభద్ర జాలిపడుతూ.
    "దూరమయితే మాత్రమేం? పెద్ద నగరం కదా! పిలిస్తే పలికే దిక్కుంటుంది!" అంది జానకమ్మ ధైర్యం చెప్తూ.
    "హోటల్ కూడు తినడం కష్టం! హైదరాబాద్ హోటళ్ళు అసలు బాగుపడవట!' అంది అరుంధతి.
    "అది మాత్రం ఎన్నాళ్ళు లెద్దూ! ఎవర్తో ఒక పిల్లని చూసిముడి పెట్టేస్తేసరి!" నవ్వుతూ అంది శ్రీలక్ష్మి.
    ఆ మాటలకూ చలపతి ఉక్కిరిబిక్కిరయ్యాడు . అతనికి సావిత్రి గుర్తుకొచ్చింది . పెళ్ళికూతురు అలంకరణలో ఆమె రూపం కాళ్ళ ముందు కనిపించింది.
    మరుక్షణంలో అతని మనసంతా దిగులుతో నిండిపోయింది.
    అవును? ఎలా> సావిత్రిని చూడకుండా తానెలా ఉండగలడు? పోనీ నెలకో సారి రావడనికయినా వీలుంటుందా? ఆ నెల రోజులు గడవడం కూడా సమస్యే తనకి! ఉద్యోగం దొరికిందన్న ఉత్సాహం , సావిత్రికి దూరమవుతున్నట్లు అనిపించసాగింది.
    అంతకు ముందెప్పుడూ ఎరగని బాధ. పాడు ఉద్యోగం రాకపోయినాబావుండేదని తను గత రెండు రోజుల్నుంచి లోలోపల బాధపడుతూనే ఉన్నాడు.
    మరి ఈ విషయం సావిత్రి కేలా ఉందొ తెలియదు! ఆమె కూడా తనలాగేనే విలవిలలాడుతోందా? తనంత దూరం వెళ్ళిపోతున్నాడని బాధ పడుతోందా? తనలాగానే దిగులు పెట్టుకొందా? రాత్రింబవళ్ళు ఇదే అలోచిస్తోందా?
    ఏమో! తనకు తెలియదు! అసలు సావిత్రితో తీరిగ్గా మాట్లాడే అవకాశం దొరికితేనా? పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చిన ఆ రెండు రోజులునుంచీ తనకు క్షణం తీరికుంటే ఒట్టు. బట్టలన్నీ ఉతుక్కోవడం, ఇస్త్రీ చేసుకోవడం, ఓ జత బట్టలు కుట్టించుకోవడం, స్నేహితులకీ, తెలిసినవాళ్లకీ చెప్పి రావడం - ఇవి కాక ఇంట్లో పనులు, తను వెళ్ళిపోతున్నాడని ఉన్న పనులన్నీ ఇప్పుడే చేయిస్తోంది అత్తయ్య.
    తను ఎప్పుడో అనుకున్నాడు! ఉద్యోగం వచ్చినట్లు తెలిసిన మరుక్షణం ఆ వార్త సావిత్రికే ముందుగా చెప్పాలని! అందుకే పోస్టులో వచ్చిన ఆ కాగితం పట్టుకొని ఎదురుగా ఉన్న సావిత్రి వాళ్ళింటికే పరుగెత్తాడు.
    సావిత్రి అప్పుడు చాలా హడావుడిలో వుంది. తిరగలి ముందు కూర్చుని పిండి విసురుతోంది. చెమటతో ఆమె జాకేట్టంతా తడిసిపోయింది. ఆమె తమ్ముళ్ళూ ఇద్దరూ తిరగలి మీద నుంచీ హైజంప్ చేస్తున్నారు.
    ఆమె క్షణం కూడా తీరిక దొరకనీయని మారుటి తల్లి కుర్చీలో కూర్చుని వారపత్రిక చదువుతోంది. ఆమె తండ్రి శ్రీరాములు బయట వరండాలో కూర్చుని జాతకఫలాలు చూస్తున్నాడు.
    ఆమె పరిస్థితిని చూసి ఎప్పటిలాగానే తన హృదయం ద్రవించిపోయింది. దేముడు ఆమెకి అంతచక్కని రూపం ఎందుకిచ్చేడు? ఇంటర్మీడియట్ లో ఫస్ట్ న పాసయే తెలివితేటలెందుకిచ్చాడు? అంతటి ఓర్పు నెమ్మది, అణుకువ, కపటం లేని మనసూ - ఇవన్నీ ఎందుకిచ్చేడు? ఇవన్నీ ఇచ్చినవాడు ఆమెకు సుఖశాంతు లెందుకివ్వలేదు?
    ఎన్నోసార్లు ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నాడు. మరెన్నో సార్లు ప్రశ్నించుకోకుండా ఊరుకున్నాడు.తనకు తెలుసు!  ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు! సమాధానం కోసం తన ఎదుర్చుడటం లేదు కూడా! తనేప్పుడో - తన తల్లి పొయింతర్వాత మావయ్యతో ఆ వూరోచ్చేసి, మర్నాటి తెల్లారుఝామున వాళ్ళింటి ముందు ముగ్గు లేస్తున్న సావిత్రిని చూసీ చూడగానే - నిర్ణయించుకున్నాడు . ఎప్పటికయినా వివాహం చేసుకుంటే , అది సావిత్రితోనే జరగాలని!
    అంతటి అందం అమెది. ఆకర్షణ అమెది. ఆమెని వాళ్ళ సవతి తల్లి పెట్టె బాధలు ప్రత్యక్షంగా చూశాక ఆ నిర్ణయం మరింత బలపడింది. సావిత్రి మీద ప్రేమతో పాటు జాలి కూడా మొదలయింది. ఆమెని వీలయినంత త్వరలో తనదాన్ని చేసుకొని కాలుకింద పెట్టనీయకుండా , కష్టాల నీడ దరిదాపులకు రాకుండా కంటికి రెప్పలా చూసుకోవాలని అనుకున్నాడు. తన కౌగిట్లో సావిత్రి నిశ్చింతగా , సర్వస్వం మరచి పోతుందని ఊహించుకొన్నాడు.
    అసలు సావిత్రిని సుఖ పెట్టటానికే తనని దేముడు సృష్టించెడని , ఆమెను పువ్వుల్లో పెట్టి పూజించుకోవాల్సిన బాధ్యత తనకుందనీ భావించాడు. తన అలోచనలన్ని , అభిప్రాయాలనీ, ఎన్నోసార్లు మాటల్లో సావిత్రికి నివేదించాడు . అందుకే తనంటే సావిత్రికి ప్రాణం.
    తన చేతిలోని కాగితం చూసి కళ్ళతోనే ఏమిటి?" అన్నట్లు ప్రశ్నించిండామే.
    "హైద్రారాబాద్ లో ఉద్యోగం వచ్చింది సావిత్రీ! అది చెబుదామనే వచ్చాను......"
    సావిత్రి ముఖంలో సంతోషం. ఆశ్చర్యం వెలిగిపోయినాయ్!
    "నిజంగానా?" అనడిగింది విసరటం ఆపి.
    "అవును! ఎల్లుండే బయల్దేరాలిఇక్కడి నుంచి!"
    సావిత్రి పిన్ని వారపత్రికలో నుంచే సంభ్రమంతో చూస్తోంది. తామిద్దరూ ఆమె ఎదుట ఇంత చనువుగా పలకరించుకోవటం అదే మొదటిసారి!
    కొద్దిక్షణాలు తన వంకే చూసింది. సావిత్రికి తనకు తెలుసు! అ చూపుల్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అర్ధాలు, ఎన్నో భావాలు ఉన్నాయ్! కానీ, ఇంకేమీ మాట్లాడుకోవటానికి వీల్లేని పరిస్థితి!
    "వెళతాను సావిత్రీ! ఊరెళ్ళే ముందు మళ్ళీ కనబడతాను!" అనేసి అక్కడి నుంచి వచ్చేశాడు.
    "రైలు ఎన్ని గంటలకి?" ఎవరో అడిగేసరికి ఆలోచనలోంచి బయట పడ్డాడు చలపతి.
    "రాత్రి పదకొండింటికీ !" అంటూ జవాబిచ్చాడు.
    సామాను సర్దటం పూర్తయింది.ఒకపాత పెట్టె, రెండు దుప్పట్లతో చుట్టిన బెడ్డింగ్, ! అంతే! తన సర్వస్వం అవే! నిజానికి తనింక చేయాల్సిన పనేమీ లేదు. అయినా ఏదో మర్చిపోయినట్లు అనిపిస్తోంది. అది సావిత్రితో మాట్లాడటం.
    ఉదయం నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ సావిత్రి క్షణం తీరిక లేకుండా పని చేస్తుంది. ఆమె మారుటి తల్లి బంధువులెవరో దిగారు. అందరికీ సపర్యలు సావిత్రే చేయాలి. చీకటి పడేవరకు బయట తచ్చాట్లాడుతూనే గడిపాడు చలపతి.
    ఊహు! సావిత్రి జాడే కనిపించడం లేదు. సావిత్రి కనబడకుండా, ఆమెతో మాట్లాడకుండా ఊరు వదలడం తనవల్ల కాదు! ప్రయాణం రద్దయి ఉద్యోగం పోయినా సరే! ఈ విషయంలో తను మొండివాడు! పెందలాడే భోజనం ముగించేశాడు చలపతి.
    "ఇదిగో! ఈ వందరూపాయలు ఖర్చు కోసం ఉంచుకో!" పది రూపాయల కాగితాలు అందిస్తూ అన్నాడు మావయ్య.
    అందుకొని జేబులో ఉంచుకున్నాడు చలపతి. మావయ్యకు తనంటే అభిమానం వుంది. అందుకే అత్తయ్యకే మాత్రం ఇష్టం లేకపోయినా నాలుగేళ్ళ పాటు ఇంట్లో ఉంచుకొని పోషించేడు. ఆదరించాడు. డిగ్రీ చదువు పూర్తీ చేయించాడు. డిగ్రీ తీసుకొన్న సంవత్సరం వరకూ ఎలాంటి వుద్యోగం దొరక్కపోయినా సహించాడు.
    "అక్కడ ఆరోగ్యం అదీ జాగ్రత్త! సినిమాలకూ వాటికీ తిరగకు ........" అన్నాడు మావయ్య కొద్దిసేపాగి. తలూపాడు చలపతి.
    "వెళ్ళగానే ఉత్తరం పడేయ్!"

Next Page