Next Page 

బొమ్మా - బొరుసూ పేజి 1


                                బొమ్మా-బొరుసూ
    
                                                                          ----యర్రంశెట్టి సాయి
    
                                

        "హలో" డబుల్ డెక్ బస్ లో పైన కూర్చుని ఉన్న శ్రీనివాసరావును పలకరించాడు సుధీర్. "ఎక్కడికి బయల్దేరావ్?" అడిగాడు శ్రీనివాసరావు చిరునవ్వుతో.
    "అబిడ్స్ కి!"
    "రా ఇక్కడ కూర్చో!" తన సీట్లో కొంచెం స్థలంయిస్తూ ఆహ్వానించాడతను.
    "వద్దులే! నా వెనుక మా తాలూకు జనం కూడా నిలబడేఉన్నారు!" వారిస్తూ అన్నాడు సుధీర్.
    "ఎవరువాళ్ళు?" అతని వెనుకవేపుకి తల తిప్పి చూస్తూ అడిగాడు శ్రీనివాసరావు.
    "ఏకవచనమేలే! బహువచనంకాదు! మా మామయ్యగారమ్మాయ్" నవ్వుతూ అన్నాడతను.
    సుధీర్ వెనుకే నిలబడ్డ అమ్మాయిని చూస్తూనే అప్రతిభుడయిపోయాడు శ్రీనివాసరావు. ఆ యువతి అందం అతనిని పూర్తిగా మొదటిచూపులోనే వశం చేసుకొంది. మరోసారి వెనక్కు తిరిగి చూడాలన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాడు. అంతఅందమయిన యువతి మామయ్య కూతురవడంనిజంగా సుధీర్ అదృష్టం!
    "మళ్ళీ నాటకం వేయనా?" నవ్వుతూ అడిగాడు సుధీర్.
    "ఆ ఒక్కసారికే బుద్దివచ్చింది గురూ! ఇంకొద్దు!" తనూ నవ్వుతూ అన్నాడు శ్రీనివాసరావు. "ఎందుకని?"
    "ఎందుకనేమిటి? అందరితో చివాట్లుతినడమే! రిహార్సల్ అన్ని రోజులూ డైరెక్టర్ విసుక్కొనేవాడు! మిగతా ఆర్టిస్ట్ లు విసుక్కొనేవారు. నా మూలాన తన డైలాగ్స్ దెబ్బతింటున్నాయని హీరోయిన్ చివాట్లు పెట్టేది. స్టేజి ఎక్కాక జనం కేకలు-తిట్లు!...."
    తనమాటలు వింటోన్న ఆ యువతి బలవంతంగా నవ్వాపుకోవడం ఓరగా గమనించాడు శ్రీనివాసరావ్. అతని గుండెలు వేగంగా కొట్టుకొన్నాయ్. తన మాటలు ఆమెను ఆకర్షిస్తున్నాయా? ఎక్కడలేని ఉత్సాహం పొంగుకొచ్చిందతనికి. ఆ అమ్మాయిని ఆకర్షించడానికి ప్రయత్నించడం తప్పని తనకు తెలుసు. కానీ మనసుని అదుపులో ఉంచుకొనడం ఎంతమందికి సాధ్యమవుతుంది?
    ఆమె తన స్నేహితుడు సుధీర్ మావయ్యకూతురు. అంచేత అసలామె మీద అలాంటి అభిప్రాయమే కలుగకూడదు. సరిగ్గా అప్పుడే ముందున్న సీటు ఖాళీ అవడం వాళ్ళిద్దరూ వెళ్ళి అందులో కూర్చోవడం జరిగింది. శ్రీనివాసరావ్ నిరుత్సాహపడ్డాడు. అతని మనసంతా అసంతృప్తితో నిండిపోయింది. ఆ యువతితో పరిచయం కలిగితే ఎంత బావుంటుంది? తన జన్మ తరించినట్లే భావించవచ్చు! ఒక్కసారి ఆమె తనని పలుకరిస్తే చాలు. తనామెతో ఒక్కమాట మాట్లాడితేచాలు! ఆ మాటలను తన డైరీలో రాసుకుంటాడు. జీవితాంతం స్మరిస్తాడు.
    బస్ అబిడ్స్ చేరుకుంది. అయ్యో! వాళ్ళు దిగిపోతున్నాడు. ఊహు! ఈ అవకాశాన్ని వదులుకోవడం తనవల్లకాదు. చటుక్కున లేచినుంచున్నాడు శ్రీనివాసరావ్. "నువ్వూ ఇక్కడే దిగుతున్నావా?" అడిగాడు సుధీర్. "అవును!" అబద్దమాడేశాడు శ్రీనివాసరావు. నిజానికి తను కోఠీలో దిగాల్సి వుంది. వాళ్ళ వెనుకే బస్ దిగి నిలబడ్డాడతను. "నువ్వెందాకా వెళ్ళడం?" అడిగాడు సుధీర్.
    "ఇక్కడే కొంచెం షాపింగ్ చేద్దామనీ..."
    "వెరీగుడ్! అలాగయితే పద! మేమూ ఆ పని మీదే బయల్దేరాం!" నవ్వుతూ అన్నాడు సుధీర్.
    ముగ్గురూ ముందుకు నడవబోతూండగా సుధీర్ కి ఠక్కున గుర్తుకొచ్చింది. "నీకు మా హేమని పరిచయం చేయలేదుకదూ! పూర్తిపేరు హేమలత బి.యస్సీ. బ్రాకెట్లో సెక్రటరీ, నారీ విప్లవసంఘం కాకినాడ!...."
    "చాల్చాల్లే బావా! ఇంక ఆపెయ్..." కోపంగా అన్నది హేమ. "సరే! ఆపేస్తాను! ఇక ఇతను శ్రీనివాసరావ్! మా డిపార్ట్ మెంటేగాని వీళ్ళ ఆఫీస్ వేరేవుంది. ఊరవతల! నాలాగానే నాటకాలంటే ఇష్టం! కాని బెదిరిపోయాడు మొదట్లోనే...."
    "నమస్తే!" నవ్వుతూ  ఆమెకు నమస్కరించాడు శ్రీనివాసరావు. "నమస్తే!" చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేస్తూ అందామె.
    "మా బావకూ నాకూ క్షణం పడదులెండి! అందుకని నామీద మా బావచెప్పే మాటలేవీ నమ్మకండి!" సుధీర్ వంక చిరుకోపంతో చూస్తూ అంది హేమ. ముగ్గురూ రద్దీగా ఉన్న ఫుట్ పాత్ మీద నడవసాగారు. ఆమె అందాన్ని తనివితీరా చూస్తున్నాడు శ్రీనివాసరావు.
    తను హైద్రాబాద్ వచ్చి అయిదేళ్ళవుతోంది. ఎంతో మంది అందమయిన అమ్మాయిలను చూశాడు ఈ అయిదేళ్ళల్లోనూ. కాని ఎవ్వరూ తననింత ఉన్మాదుడిని చేయలేదు. ఎవరి అందమూ తననింతగా ఆకట్టుకోలేదు. ఒకే ఒక్క చూపులో తనెందుకిలా అయిపోయాడో తలచుకొంటే విచిత్రమనిపిస్తోంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది.
    ముగ్గురూ ఓ పెద్ద చీరల షాపులోకి నడిచారు. "ఏ చీరలుచూపమంటారు?" అడిగాడు కౌంటర్ దగ్గరున్న వ్యక్తి. "అమెరికన్ జార్జెట్- ప్రింటెడ్...." చెప్పింది హేమ. మరుక్షణం కౌంటర్ నిండుగా గుట్టలు గుట్టలుగా పేర్చేశాడు ఆ చీరలు. "ఏం బావున్నాయో చూడు బావా!" అందామె సుధీర్ తో.
    "అదేమిటి? మగాడు స్త్రీని అణగదొక్కేస్తున్నాడు, బానిసగా చేసుకొని హింసిస్తున్నాడు అంటూ మీ నారీ విప్లవ సంఘంలో ఉపన్యాసాలిస్తారు కదా! మళ్ళీ చీరల సెలక్షన్ కి మగవాడెందుకు?" ఆమెని ఉడికిస్తూ అన్నాడు సుధీర్. శ్రీనివాసరావు నవ్వేశాడు.
    "సరే! నువ్వు సెలక్ట్ చేయవద్దులే! శ్రీనివాసరార్ గారే చేస్తారు.....అందామె కోపంగా. "అంటే శ్రీనివాసరావ్ మగవాడు కాదా?" ముగ్గురూ నవ్వేశారు.
    శ్రీనివాసరావు ఆమెకు ఎంతో బావుంటాయనుకొన్న రెండు చీరలు బయటకులాగాడు. "ఈ రెండూ బాగున్నాయినాకు! వీటిలో ఏదయినాసరే నీకు అద్భుతంగా సూటవుతుంది" అన్నాడు హేమతో. ఆమె కళ్ళు సంతృప్తితో మెరిసినయ్.
    "థాంక్ యూ! నాకు ఇవే నచ్చాయ్! ఏం బావా! రెండూ తీసుకోనా?"
    "బావుంది! నా ఇష్టమేముంది? నేనుకొని ఇవ్వడం లేదుకదా!"
    "అయ్యో! నీ చేతులతో నాకు ఎప్పుడేనా కొనిచ్చావ్ కనుకనా, ఇప్పుడు కొనిస్తావనుకోవడానికి? నా దగ్గర డబ్బుందిలే గాని ఈ రెండూ కొనేయమంటావా, వద్దంటావా చెప్పు! తరువాత అమ్మ కేకలేస్తే నీ పేరు చెప్పేస్తాను అందుకు?" అన్నది హేమ.
    "నాకుముందే తెలుసులే! ఆ విషయం!" అన్నాడు సుధీర్.
    "రెండుకొనండి హేమగారూ! రెండూ బావున్నాయ్- "తను కల్పించుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు.
    "సరే! రెండూ ఇవ్వండి!" అని ఆ సేల్స్ మేన్ కి చెప్పింది హేమ. పాకెట్ తీసుకుని బయటకువస్తూ.
    "చూడు బావా! నువ్వే మీ ఫ్రెండ్ ద్వారా బలవంతం చేయించికొనిపించావని అమ్మతో చెప్పేస్తాను"...నవ్వుతూ అన్నది హేమ.
    "చూశావా! అందుకే నేను మాట్లాడలేదు. ఎప్పుడయినా వాళ్ళ ఊరు వెళితే నన్ను మా అత్తయ్య అరగంటతోమేస్తుంది- అంత డబ్బు ఖర్చు చేయించినందుకు!" శ్రీనివాసరావుతో అన్నాడు సుధీర్.
    "అంతేకావాలి?" వెక్కిరిమ్పుగా అన్నదిహేమ. శ్రీనివాసరావు ఆ మాటలేమీ వినే స్థితిలో లేడు.....వివిధభంగిమల్లో ఇనుమడిస్తున్నట్లు కనబడుతున్న ఆమె అందాన్నే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. మరి నీ సంగతేమిటి? నువ్వేవి కొనాలి?" అడిగాడు సుధీర్ శ్రీనివాసరావుని "నేను?....ఆ! నేనూ ఓ షర్ట్ పీస్ కొనాలనుకొన్నాను...." అబద్దమాడేస్తూ అన్నాడు అతను.
    "మరింకేం! పద! ఈ షాప్ లో కొందాం!" పక్కనే ఉన్న ఇంకో షోరూం లోకి అడుగుపెడుతూ అన్నాడు సుధీర్. తమ ముందుపడవేసిన రకరకాల డిజైనులు చూసి "ఏది తీసుకోమంటావ్?" అంటూ సుధీర్ నడిగాడతను. అతని ఉద్దేశ్యం హేమేతనకి షర్ట్ సెలెక్టు చేయాలని కానీ ఆమె నడగడం సుధీర్ కి ఎబ్బెట్టుగా కనబడుతుందేమోనని అతనినే అడిగాడు.
    "ఇదిబావుంది! తీసుకోండి!" తనే చొరవగా ఓ చారలడిజైన్ లాగుతూ అంది హేమ. శ్రీనివాసరావు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. "థాంక్ యూ!" అన్నాడు చిరునవ్వుతో ఆమె వంక చూస్తూ. ముగ్గురూ బయటికొచ్చారు.
    "నీ ప్రోగ్రామేమిటిప్పుడు"? అడిగాడు సుధీర్.
    "ఏం లేదు ఇంటికి వెళ్ళటమే! మీరు" అడిగారు శ్రీనివాసరావ్.
    మేమూ ఇంటికే! పద! కాఫీ తాగి ఎవరిదారినవాళ్ళు పోదాం" ఎయిర్ కండిషన్ రెస్టారెంట్ లో కూర్చున్నారు. వారికి పక్కనే దంపతులు వారి పిల్లలతో కూర్చుని ఉన్నారు. పలహారంతినడం ముగించినపిల్లలను వాష్ బేసిన్ దగ్గరకు తీసుకువెళ్ళి చేతులు కడిగి తీసుకొచ్చిందామె.
    "అదిగో చూడు బావా! అక్కడే నాకు వళ్ళు మండేది. మన పక్కన కూర్చున్న ఆ భార్యా భర్తలున్నారు కదా? ఆ పిల్లలు ఇద్దరికి చెందుతారు కదా? కానీవారికి సేవలు చేయాల్సివచ్చేటప్పుడు పెళ్ళానికి చెందుతారు వాళ్ళు. అవన్నీ ఆడదే చేయాలి మగవాడికేం సంబంధంలేదు. బయటికివెళ్ళేప్పుడు షోగ్గాజేబులో నుంచి పర్సుతీసి బిల్లుచెల్లిస్తే బాధ్యత తీరిపోతుంది కాబోలు..." కసిగా అందామె. శ్రీనివాసరావు ఆశ్చర్యపోయాడు.
    అంతవరకూ సుధీర్ హేమనారీ విప్లవ సమగతి గురించి ఎగతాళి చేయడం కేవలం పరిహాసం కోసమే అనుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు హేమ మాటలు వింటుంటే ఆమెలో పురుషులను ఎదిరించి తమ హక్కులను సాధించుకోవాలనే ఆధునిక యువతి తత్త్వం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఆ దంపతుల విషయం అంత తీవ్రంగా ఎందుకు పరిశీలిస్తుంది. శ్రీనివాసరావుకు నవ్వు వచ్చింది.
    ఇలాంటి అమ్మయిలను చాలామందిని చూశాడు తను. పెళ్ళి కాక ముందు ఇలాగే ఎన్నో కబుర్లు  చెప్తారు. మీటింగుల్లో మాట్లాడుతారు కేకలువేస్తారు. ఉపన్యాసాలిస్తారు. ఆ తరువాత షరా మామూలే! పెళ్ళవగానే భర్తే సర్వస్వం అయిపోతాడు. మిగతా అందరిలాగానే అదే రొటీన్ లో పడిపోయి "తీర్ధయాత్రలకు బృందావనమేలనో" అంటూ పాటలు పాడేస్తారు.
    తన పిన్ని కూతురు శారద, ఆమె ఫ్రెండ్స్ కూడా ఇలాంటికబుర్లు చెప్పినవాళ్ళే! ఇప్పుడు వాళ్ళందరకూ వివాహాలయేసరికి ఆ కబుర్లన్నీ కూడా మర్చిపోయారు. తనే ఎప్పుడయినా గుర్తుచేస్తే శారద సిగ్గుపడిపోతుంది.

Next Page