Next Page 

శుభోదయం పేజి 1

 

                                        శుభోదయం

                                                               ---డి. కామేశ్వరి

 

                          

    శ్యామ్ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ తన రంగు చూసి తనే నిట్టూర్చాడు. భగవంతుడు తననింత నల్లగా అనాకారిగా ఎందుకు పుట్టించాడో! రోజుకి కనీసం ఒకసారన్నా ఆ మాట అనుకునే శ్యామ్ ఆరోజు పదిసార్లు ఆ మాట అనుకున్నాడు. ఈ రంగే ......ఈ రంగే తనకి శత్రువయింది. లేకపోతే ..... రేఖ ....నిట్టూర్చి తల దువ్వుకోసాగాడు. వెనక నించి తల్లి వచ్చిన నీడ అద్దంలో కన్పించింది.
    "శ్యాం ! టిఫినుకి రా రా, యింకా ముస్తాబవలేదా? ఏనాడనగా స్నానం చేశావు? దోసెలు చాల్లారిపోతున్నాయి " అంది.
    "వస్తున్నానమ్మా" వెనక్కి తిరిగిన కొడుకు మొహం అదోలా వుండడం చూసి, "శ్యామ్ అలా వున్నావేం, ఏం జరిగింది? వంట్లో బాగులేదా" అంది ఆదుర్దాగా.
    "ఏం లేదమ్మా పద వస్తున్నాను." షర్టు టక్ చేసుకుంటూ ఆమె వెనక డైనింగ్ రూములోకి నడిచాడు.
    "ఊహూ ....ఏదో ఉంది. ఏం జరిగిందో చెప్పాలి" కొడుకు అన్యమనస్కంగా తింటున్న తీరు చూడగానే రాధాదేవికి అర్ధం అయి అడిగింది.    
    శ్యామ్ కాసేపు మౌనంగా ఉండి , కళ్ళెత్తి తల్లివంక చూస్తూ "అమ్మా! నేనింత నల్లగా ఎందుకు పుట్టనమ్మా? నీవంత తెల్లగా వుంటావు. నాకీ రంగు ఎలా వచ్చిందమ్మా...." కొడుకు గంబీరంగా అడిగిన తీరు చూడగానే రాధాదేవికి నవ్వు వచ్చింది. "ఒరేయ్! ఎన్నిసార్లు అడిగావురా యిప్పటికి ఆ మాట. నీకీ రంగు పిచ్చేమిట్రా..... బాహ్య సొందర్యం కాదు శ్యామ్ కావలసింది. ఆత్మ సౌందర్యం కావాలిరా నాన్నా! అది నీకుంది అని నాకు తెలుసు. లేని రంగుకోసం నీకెందుకురా ఆ బాధ...... యింతకీ నీవేమన్నా ఆడపిల్లవా అందంగా లేకపోతే దిగులు పడడానికి ఏం, మళ్ళీ ఎవరన్నా నిన్ను హాస్యం ఆడారా కాలేజీలో ...." రాదాదేవి కొడుకు మనసులో బాధ గుర్తించకుండా ఎప్పుడు అడిగే పప్రశ్నే అని తేలిగ్గా జవాబు చెప్పింది.
    హాస్యం! హు .....! హాస్యం అయితే తను స్పోర్టివ్ గా తీసుకోగలదు. అపహాస్యం! హేళన అవమానం. రేఖ ......ఏ రేఖనయితే తను ఆరాధిస్తాడో , ఏరేఖనయితే హృదయంలో ప్రతిష్టించుకున్నాడో ఆ రేఖ ఎంత చులకనగా యెంత హేళనగా మాట్లాడింది! తన అనాకారితనాన్ని నల్గురిలో ఎంతలా యిసడించి మాట్లాడింది. "వసేయ్ నీరూ , ఈ జీడిగింజ ఏమిటే మనవెంట యిలా జీడిపప్పు పాకంలా తగులుకున్నాడు ." అమ్మాయిలంతా కిసుక్కున నవ్వారు. "నీగ్రో నయమే బాబూ. ఆ నలుపుకి తోడు తెల్లటి బట్టలు కడ్తాడు , ఆ నలుపు మరింత కొట్టవచ్చినట్లు కనబడుతుందే."
    "పాపం ఎందుకే? నిన్నేం చేశాడే అలా ఏడిపిస్తావు ఆ అబ్బాయిని...." ఎవరో అమ్మాయి జాలిగా అంది    "మహా జాలిపడ్తున్నావు . ఏం కధ?" రేఖ హేళనగా అంది. ఆ అమ్మాయికి కోపం వచ్చింది. "కూరోండుకుందుకు కావాలా కాకరకాయలు కధలు. నీకున్నాయేమో . రంగు చూసి ఒకర్ని ఎద్దేవా చేయడం సంస్కారం కాదంటాను" తీవ్రంగా అంది. "నీవు తెలుపు. నేను చామనచాయ, యింకోడు నలుపు రంగు. నీవు, నేను కావాలంటే వచ్చేది కాదని కూడా తెలియకుండా ఎందుకలా ఆ అబ్బాయిని అవమానపరచాలి" తీవ్రంగా అంది. రేఖ కాస్త తగ్గి ....."వాడి రంగెలా వుంటే ఎవరికి? వాడి చూపులు .....కొరుక్కుతినేటట్లు చూస్తాడే.....ఆ చూపు చూస్తే వంటిని తేళ్ళు, జెర్రులు పాకినట్లుంటుంది. అందుకే అసహ్యం నాకు. ఆ అందగాడిని చూసి వరించాలని కాబోలు వెధవ ఫోజులు, నవ్వులూను. చూస్తుంటే తిక్క రేగుతుంది నాకు...." రేఖ గొంతులో తిరస్కారం.
    "పోనీలే పాపం. నల్లగా వున్నాడు కనక తెల్లటి వాళ్ళంటే వీక్ నెస్ ఏమో నిన్నేం చెయ్యలేదు కదా. చూసి తృప్తి పడితే నీ సొమ్మేం పోయింది."
    "వీక్ నెస్ .....నిజమే .....తెల్లటి వాళ్ళంటే ఆరాధనా భావం! ఎంత పుణ్యం చేసుకు పుట్టారోననిపిస్తుంది తనకి! అందులో రేఖ .....ఆ గులాబిరంగు, గీత గీసినట్లుండే ఫిగర్.... నల్లటి వంకుల జుత్తు . భగవంతుడు అంత అందమూ ఒకరికే యీయకపొతే తనలాంటి వాళ్ళకి కాస్త పంచకూడదు అనుకున్నాడు మొదటిసారి కాలేజిలో చూసినప్పుడు . రేఖ రంగు చూసి ఆమె మీద ఆరాధన పెంచుకున్నాడు. ఆమె తనకందదని తెల్సు....అసలలాంటి అత్యాస లేదు! అయినా ఆమె అంటే అదో ఆరాధన. అభిమానం. తన భావాలు తనలోనే పుంచుకున్నాడు తప్ప పైకి వ్యక్తపరిచే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. అయినా రేఖ తన చూపులలో భావం పసికట్టిందంటే తనకి తెలియకుండానే తన కళ్ళల్లో ఆమె పట్ల ఆరాధన కన్పించింది కాబోలు! తనకీ వీక్ నెస్ ఏమిటి..... ఛా...ఛా. తన పట్ల అమెకెంత చుల్కన ఏర్పడింది? ..... అయినా .....పోనీ తన బలహీనత గుర్తించి సానుభూతి చుపోచ్చు. అవహేళన చెయ్యాలా? అందరిలో చులకన చెయ్యాలా? చిన్నపుచ్చుకుని , విషణ్ణ వదనంతో ఇల్లు చేరి, రాత్రి నిద్రపోకుండా పదేపదే ఆ మాటలనే గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు. అతని మోహంలో ఆవేదన తల్లి గుర్తుపట్టకుండా ఎలా వుంటుంది?
    "శ్యామ్ ....ఏమిటా ఆలోచన. టిఫిను తిను ముందు. నీలో యీ యిన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎలా పోగొట్టాలో నాకు తెలియడం లేదు. రంగు నీ చేతిలో , నా చేతిలో వుందా....." రాధాదేవి అనునయిస్తూ అంది.
    "కాని నాన్నగారు , నీవు తెల్లాగా వుంటే నేనింత నలుపు ఎలా వచ్చానసలు?"
    "బాగుంది ప్రశ్న......తల్లి తండ్రి తెల్లగా వున్న నల్లటి పిల్లలు ఎందుకు లేరు? శ్యాం. శ్రీకృష్ణుడు నల్లటివాడు. శ్రీరాముడు నల్లటివాడు.....అంత మాత్రాన వాళ్ళని పూజించలేదా? ఆ నల్లనయ్యని ఎందరు గోపికలు అరాధించలేదు......అవతార మూర్తులే నల్లటివారయినప్పుడు మనం ఎంత...."
    "అరాధించవద్దు. పూజించవద్దు అపహాస్యం చెయ్యకుండా వుంటే చాలమ్మా......నీకేం తెల్సు కాలేజిలో అంతా నన్ను చూసి ఎలా నవ్వుకుంటారో ...." శ్యామ్ నల్లటి మొహం మరింత నల్లబడింది. అది చూసిన రాధాదేవి మనసు గిలగిలలాడింది. శ్యామ్ ని చూసి చిన్నప్పుడు అందరూ హేళనగా మాట్లాడితే తను బాధపడింది. ఈరోజు శ్యామ్ బాధపడటంలో వింత ఏముంది? కాని....తనేం చెయ్యగలదు? ఏం చెప్పి కొడుకుని ఒదార్చగలదు!

Next Page