Next Page 

హ్యూమరాలజీ-1 పేజి 1


                            హ్యూమరాలజీ

                                                                       ---యర్రంశెట్టి శాయి

                                        

                                 దొంగలొస్తున్నారు! స్వాగతం చెప్పండి!
              

 

    అబ్బో! అబ్బో! తెలుగుజాతి చరిత్ర ఎంత గొప్పదో? తెలుగునాడులోనే రత్నాలు వీధుల్లో కుప్పలుగా పోసి అమ్మారుట! ప్రజలంతా ఎలాంటి కంప్లెయింట్సూ లేకుండా సకల సౌభాగ్యాలతో తులతూగారట!
    మరిప్పుడో! "ఆంద్రప్రదేశ్" అ హ్హ హ్హ హ్హ - టు ది పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ!
    
                                     *    *    *
    
    నిర్భయ్ నగర్ కాలనీ చాలా హడావిడిగా ఉంది. కాలనీ వాళ్ళందరూ కాలనీ మధ్య పార్కులో చేరారు.
    "సోదరులారా!" అన్నాడు గోపాల్రావ్ - అని చుట్టూ చూశాడు. ఆడామగా పిల్లా పీచూ అతనేం చెప్తాడా అని ఎదురు చూడసాగారు. గోపాల్రావ్ జర్నలిస్టు. అంచేత ఎప్పుడూ ఒకరు చెప్పింది రాసుకోవడమే గాని మాట్లాడడం తెలీదు. అందుకని ఆ తరువాతేం మాట్లాడాలో తెలీలేదు. రెండు క్షణాలాగి మళ్ళీ "పెద్దలారా" అన్నాడు. మరుక్షణం ఆగి "పిల్లలారా!" అన్నాడు.
    "పోనీలే - మామూలుగా మాట్లాడు" అన్నారెవరో. ఆ మాటతో గోపాల్రావ్ ఉత్సాహం పుంజుకున్నాడు.
    "మన కాలనీ కూడా ఊరికి చివరగా వుంది కాబట్టి ఏ క్షణాన్నయినా దొంగలు "క్యూ" కట్టి దోచుకోవచ్చని అనుమానంగా ఉంది. ఎందుకంటే మాన్యూస్ పేపర్ల వార్తలను బట్టి దొంగలు ఇప్పటికే హైదరాబాదులోని ఊరి బయట కాలనీలన్నీ పూర్తి చేశారు. వాళ్ళ లిస్టులో మన  కాలనీ ఒక్కటే మిగిలిపోయింది. కనుక మనం ముందే చోరనిరోధక చర్యలు తీసుకుంటే బావుంటుందని ఇవాళ ఇక్కడ కలుసుకున్నాం! కనుక ఏ చర్యలు తీసుకోవాలో ఎవరికితోచింది వారు చెప్పితే బాగుంటుంది" అంటూ ముగించాడు.
    శాయీరామ్ లేచి నిలబడ్డాడు.
    "సోదరులారా! మన కాలనీని మనం రక్షించుకోవాలి. 'యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్' అన్నారెవరో. ఎందుకన్నారామాట? ఇదిగో - ఇందుకే - ఈ దొంగలబాధ పడలేకే అన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. కనుక అందరూ తమ తమ సలహాలను అందజేయవలసిందిగా కోరుతున్నాను - అని అందరివంకా సలహాల కోసం చూశాడతను.
    జనం మధ్యలోనుంచి వెంకట్రావ్ లేచి నిలబడ్డాడు.
    "ఈ సమస్యకు బెస్ట్ సొల్యూషన్ ఏమిటంటే మనందరం రాత్రుళ్ళు కాలనీకి కాపలా కాయటం" అన్నాడు సీరియస్ గా.
    "మనమందరమూనా!" ఎవరో అడిగారు.
    "మనందరం అంటే నా వుద్దేశ్యం రోజుకి కొంతమంది చొప్పున కాలనీకి కాపలా కాయలన్నమాట."
    అందరూ "అవునూ" అంటూ అరిచారు.
    "ఇదే చాలా పర్ ఫెక్ట్ సిస్టమ్" అన్నాడు రంగారెడ్డి.
    ఓ మూలనుంచి శంకర్రావు లేచి నిలబడ్డాడు.
    అందరూ చిరాగ్గా అతనివేపు చూశారు. ప్రతి విషయానికీ ఏదో ఒక అడ్డుచెప్పటం అతనికలవాటని అందరికీ తెలుసు.
    "కానీ ఆ రామగిరికాలనీలో దొంగలు, ముందుకాపలా తిరిగేవాళ్ళని కత్తితో పొడిచి తరువాత దోచుకున్నారుగా?" అనుమానంగా అడిగాడతను.
    దాంతో అందరూ నిశ్శబ్దమయిపోయారు.
    శాయిరామ్ కేం మాట్లాడాలో తెలీలేదు. తను చెప్పిన సూచనని అతనలా ఒకమాటతో కొట్టిపారేయడం అస్సలు నచ్చలేదు.
    "అదివేరే - ఇదివేరే" అన్నాడు చిరాగ్గా!
    "అవును - అదివేరు-ఇదివేరు" అన్నాడు రంగారెడ్డి పుంజుకుంటూ.
    "ఏది వేరు?" అడిగాడు శంకర్రావు.
    "అదే-రామగిరి కాలనీలో సంగతి వేరయ్యా! అక్కడ కాపలా తిరిగింది ఇద్దరే! అందుకని దొంగలు అంతధైర్యం చేయగలిగారు. మనకాలనీలో రోజుకి నలుగురు తిరుగుతూంటారు."
    "ఒకవేళ దొంగలు ఎనిమిదిమంది వస్తే?" మళ్ళీ అడిగాడు శంకర్రావ్. దాంతో అందరూ మళ్ళీ నిశ్శబ్దం అయిపోయారు. అందరికీ శంకర్రావు మీద వళ్ళుమండిపోతోంది. ఇలా ఆదిలోనే హంసపాదు పెట్టేసాడనే అతనిని మీటింగ్ కి పిలువలేదు. అయినా వచ్చి అందరినీ చెరిగేస్తున్నాడు.
    "దొంగలు సాధారణంగా నలుగురే వస్తారని పేపర్లో చదివాను" అన్నాడు శాయీరామ్ ఓ క్షణం ఆలోచించి" అంతకంటే ఎక్కువమంది ఉంటే వాళ్ళకే వర్కవుట్ అవదు."
    "అవును" అన్నాడు రంగారెడ్డి.
    "కనుక సోదరులారా-మనం అమలు చేయబోతున్న మొదటి సూచన ఏమిటంటే" అంటూ శంకర్రావుని బైపాస్ చేయబోయాడు శాయీరామ్. కానీ శంకర్రావు మళ్ళీ అడ్డుపడి పోయాడు.
    "మొన్న కాంతినగర్ కాలనీలో ఎనిమిదిమంది దొంగలొచ్చేకదా నానా రభసాచేసి, పదిమందిని పొడిచి వెళ్ళింది?"
    మళ్ళీ అంతానిశ్శబ్దం అయిపోయింది.
    చివరకు శాయీరామే కోలుకున్నాడు.
    "వస్తేరానీయవయ్యా! అంతగా ఎక్కువమంది వస్తే వాళ్ళకు అడ్డుతొలిగిపోతేసరి! గొడవుండదుగా!"
    "అయితే మరింక రాత్రుళ్ళు అలా నిద్రలు పాడుచేసుకుని తిరగటం ఎందుకు?"
    రంగారెడ్డి తల రెండుచేతులతో పట్టుకున్నాడు.
    "ఎందుకేమిటి? దొంగలు నలుగురు కంటే తక్కువ వచ్చినప్పుడు ఉపయోగం కదూ?" అన్నాడు గోపాల్రావ్.

Next Page