Next Page 

భామ కలాపం పేజి 1

 

                                                           భామాకలాపం

 

                                                                                                                   మైనంపాటి భాస్కర్.

 

                           


    కోర్టు ఆవరణ బయట పత్రికా విలేఖరులు కిక్కిరిసి పోయి ఉన్నారు.


    సంచలనం కలిగించే కేసు ఇది. కానీ, వాళ్ళెవరు ఆ కేసు ప్రోసిడింగ్స్ చూడడానికి వీల్లేదు ఆ విషయాలని తమ పత్రికలలో ప్రచురించడానికి వీలులేదు.


    కేసు విచారణ 'ఇన్ కెమెరా ' పద్దతిలో, గోప్యంగా జరుగుతోంది. అంటే, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులూ, వాళ్ళ లాయర్లు, కోర్టువారు తప్ప ఇంకెవ్వరూ అక్కడ ఉండకూడదు.


    స్మార్ట్ గా డ్రెస్ చేసుకుని , హాండ్సమ్ గా , చాల తెలివిగా కనబడుతున్న లాయర్ సారధి తన ఆర్గ్యుమెంట్ పూర్తీ చేస్తున్నాడు. పొడుగ్గా ఉన్నాడతను. విశాలమైన నుదురు, చెంపమీద , కణత మీదా మానిన కత్తి గాట్లాలా ఉన్న గాయాల మచ్చలు కనబడుతున్నాయి. టైలరు చాలా శ్రద్ధగా కత్తిరించి కుట్ట్టిన కోటు అతని భుజాల బలాన్ని చాటుతోంది.


    "ఇప్పటిదాకా నేను వివరించిన కారణాలన్నీటి వల్లా హిందూ వివాహ చట్టం కింద నా క్లయింటు శ్రీమతి సుదీరకి, శ్రీ విజయ భరత్ కి జరిగిన వివాహం చెల్లదని, అది రద్దు చేయాలని కోర్టువారికి విన్నవిస్తున్నాను."

    మాన్లిగా వుంటుంది అతని గొంతు. చక్కటి ఉచ్చారణతో, మాడ్యులేషన్ తో, వినేవాళ్ళు ఆకర్షితులైపోయేలా మాట్లాడగల చాకచక్యం ఉంది అతనికి.


    చెప్పడం పూర్తీ చేసి సుదీర వైపు చూశాడు సారధి.


    "ఈ ప్రపంచాన్నంతా నా చిటికిన వెలికి చుట్టేసుకోగలను" అన్నంత నిర్లక్ష్యంగా కూర్చుని ఉంది సుదీర. సారధి కాక,  ఆమె తాలూకు లాయర్లు ఇంకో ఎనిమిది మంది ఆమెకు దగ్గరలోనే కూర్చుని ఉన్నారు. నల్లకోట్లు వేసుకున్న ఆ లాయర్లు మధ్య హంస రెక్కలా ఉన్న తెల్లటి జార్జేట్ చీర కట్టుకుని రాయంచలా ఉంది ఆ అమ్మాయి.


    చాలా అందంగా ఉంది తను. విశాల నయనాలకు పోగరునే కాటుకగా దిద్దికున్నట్లు దర్పంగా ఉన్నాయి చూపులు. కానీ, కొద్ది క్షణాల కోసారి ఆ పెద్ద కళ్ళలో బెదురు కూడా కనబడి మాయమై పోతోంది. ఎదుటి పక్షం లాయరు తనని ఎంత ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతాడో అన్న సంకోచం సుదిరని వేధిస్తోంది.


    మొన్నటి దాకా ఆమె భర్తగా చెలామణి అయిన భారత్ దూరంగా కూర్చుని ఉన్నాడు.  సింపుల్ గా ఉంది అతని డ్రస్సు. తెల్లటి చుడిదార్ పైజమా, తెల్ల లాల్చి , కల్లా కపటం లేని మొహం, చంద్రుడు కందిపోతే ఎలా ఉంటాడో అలా ఉన్నాడతను.


    ఆ రోజుకు కోర్టు ముగిసి కేసు వాయిదా పడింది. లాయర్ సారధి సుదీర పక్కన నిలబడ్డాడు. "మనం వెళ్దామా మేడమ్ !" అన్నాడు. గొంతులో మర్యాదా వినయం ప్రకటిస్తూ.


    మాట్లాడకుండా లేచి నిలబడింది సుదీరా. వాళ్ళు బయటకు వచ్చి రాగానే ప్రెస్ ఫోతోగ్రాఫర్లు, రిపోర్టర్లు మిడతల దండులా చుట్టేశారు. నలభై , యాబై కెమెరాలు ఆమె మీదకి ఫోకస్ అయ్యాయి.


    అది గమనించాడు సారధి. సుదిరకు రక్షణ ఇస్తున్నట్లు అడ్డంగా నిలబడి, తన చేతిలోని బ్రీఫ్ కేసుని ఎత్తి పట్టుకుని ఆమె మొహానికి ఎదురుగా పెట్టాడు ఫోటోల్లో ఆమె మొహం కనబడకుండా.


    నిర్లక్ష్యంగా ఎడమ చేత్తో ఆ బ్రీఫ్ కేసుని తోసేసింది సుదీర. "ఫోటోలు తిసుకోనివ్వు. ఐ డోంట్ కేర్"

    "మీకు తెలియదు వద్దు!" అన్నాడు సారధి బ్రీఫ్ కేసుతో మళ్ళీ మొహాన్ని కవర్ చేస్తూ.


    ఈ హడావుడిలో ఒక్క క్షణం సేపు సుదీర మొహం మేఘాల చాటున చంద్రుడి లాగా కనబడగానే, తన కెమెరాను క్లిక్ మనిమించాడు ఒక ఫోటో గ్రాఫర్.


    సారధి పెదవులు బిగుసుకున్నాయి. దగ్గరలోనే నిలబడి ఉన్న ఛోటు వైపు సాభిప్రాయంగా చూసాడు. ఛోటూ సుదీరకి బాడిగార్డ్, డ్రైవరు కూడా.


    మరుక్షణంలో ఆ ఫోటో గ్రాఫర్ మీదికి దూకాడు ఛోటూ. కెమెరా గుంజుకుని, ఓపెన్ చేశాడు. ఫిల్మ్ రీలుని బయటికి లాగి, ఎక్స్ ఫోజ్ చేసేశాడు. తరువాత కెమెరాని కింద పడేసి, రెండు కళ్ళతో కసిగా తొక్కి నుగ్గు నుగ్గు చేసేశాడు.


    డానికి అభ్యంతరం తెలుపుతూ తక్కిన ఫోటోగ్రాఫర్లు , రిపోర్టర్లు కేకలు వేశారు. తోసుకోవడం, తొక్కిసలాట మొదలయింది.


    చాకచక్యంగా సుదీరని తీసుకెళ్ళి ఆమె "అల్పా రోమియో' కార్లో ఎక్కించాడు సారధి.  పక్కన తను కూర్చున్నాడు.


    ఛోటూ తన జేబులో ఉన్న ఇంపోర్తేడ్ స్మిత్ అండ్ వేస్సన్' రివాల్వర్ ని తడిమి చూసుకుని కారు స్టార్ట్ చేశాడు. తుపాకి గుండులా దూసుకు పోయింది కారు.


    సుదీర పరివారం. ఆమె లాయర్లూ మరో ఆరు కార్లలో ఆమెని అనుసరించారు. ఆ కార్లన్నీ సుదీరవే. కొన్న మోడలు మళ్ళీ కొనకుండా కొత్త కొత్త రకాలు కొనడం ఆమెకి సరదా. ఆ కార్లలో ఒక ఫోర్డ్ ఫాల్కన్, డాట్సన్, ఫ్యుజియో, మారుతి, అంబాసిడర్, ఒక ఇటాలియన్ బక్ ఫియటూ ఉన్నాయి.


     ఉరేగింపులా సాగిపోయాయి ఆ కార్లన్నీ.


    అవమానం, నిస్పృహ మోహంలో కనబడుతూ ఉండగా కోర్టు బిల్డింగు తాలుకూ మెట్లు దిగి, గేటు దగ్గరికి వచ్చాడు భరత్.


     సుదీరా వాళ్ల కార్లు లేపిన దుమ్ము ఇంకా గాలిలో అవ్రించుకునే ఉంది. కర్చీఫ్ తో మొహం తుడుచుకుని , మెల్లిగా బస్ స్టాప్ వైపు నడవడం మొదలెట్టాడు అతను.


    
                                                                             ------------

 

    అంతకు ముందు మూడు నెలల క్రితం....


    హైదరాబాద్ కి నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గార్డెన్ లో ఫంక్షన్ జరుగుతోంది. గార్డెన్ లో ఒక వైపు అనాబ్ షాహి ద్రాక్ష పందిళ్ళు ఉన్నాయి. ఇంకొక వైపంతా పెద్ద పెద్ద వృక్షాలు విశ్రుంఖలంగా పెరిగి ఉన్నాయి. మరో వైపు రకరకాల పూల మొక్కలు.  


    వీటన్నిటిమధ్యా ఒక రెండు వేల గజాల మేర ఖాళి స్థలం ఉంది. అక్కడంతా అపురూపమైన పర్ఫియన్ కార్పెట్ పరిచినట్లు మృదువుగా పెరిగిన గడ్డి. అక్కడే వెదురు బొంగులతో నిర్మించిన చిన్న కాటేజీ ఉంది. దాని ముందు అలికి, రంగవల్లులు తీర్చి ఉన్నాయి.


    లాన్ లో పెద్ద షామియానా, దాని కింద ఒక వేదిక, దానికి ఎదురుగా వంద కుర్చీలు.

    ఆ గార్డెన్ సుదీరా వాళ్ళది.


    గుండెని మీటేలా గిటార్ వినబడింది. వేదిక మిదినించి అందరూ తలలు తిప్పి చూశారు.


    మెడ మీద దాకా పడుతున్న జుట్టుతో, సూట్ వేసుకుని ఉన్న ఒకతను గుసగుస మాట్లాడుతున్నట్లు చిత్రమైన ఇంగ్లీషు ఉచ్చారణతో మైక్ లో చెప్పడం మొదలెట్టాడు.


    "గుడివినింగ్ లేడిస్ అండ్ జెంటిల్మన్! మిసెస్ అండ్ మిస్టర్ రత్నాకరరావు గారి కూతురయిన మిస్ సుదీర చదువు పూర్తీ చేసుకుని స్టేట్స్ నుంచి తిరిగి వచ్చారు. మీకు తెలిసే వుంటుంది. ఆమె కోర్నెల్ యూనివర్శిటి స్కూల్ ఆఫ్ హొటల్ అడ్మినిస్ట్రేషన్ లో ఆనర్స్ డిగ్రి తీసుకుని, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు. మిస్ సుదీర ఇండియాకు తిరిగి వచ్చిన సంతోష సందర్భంలో ఏర్పాటు చెయ్యబడింది ఈ పార్టీ!" అతని గొంతులో ఉత్సాహం ఎక్కువయింది.


    "వెల్ కమ్ బాక్ టు ఇండియా, మిస్ సుదీరా! వెల్ కమ్!


     వెంటనే బాండ్ హుషారుగా అందుకుంది.


    అందరూ చప్పట్లు కొట్టారు.


    "వెల్ కమ్, సుదీ!" అన్నాడు స్మార్ట్ గా ఉన్న కుర్రాడు ఒకతను సుదీర దగ్గరికి వస్తూ.


    సుదీర అతని వైపు కొద్ది క్షణాలు పరీక్షగా చూసి తరువాత గుర్తుపట్టింది. "హయ్ , సతీష్! హౌ డూ యూ డూ? ఏం చేస్తున్నావిప్పుడు?" అంది పలకరింపుగా. అతను తనకి చిన్నప్పుడు క్లాస్ మేట్.


    "ఐ ఎ. ఎస్ పాసయ్యాను."


    "ఓహ్ మై మై! సతీష్ కలెక్టరవుతాడా?" అంది నవ్వుతూ.


    అతను నవ్వాడు.


    "అపుడే ఎక్కడ. పరిక్ష పాసవగానే అయిపోయిందా? ఇంటర్వ్యు లో సెలక్ట్ కావద్దూ?"


    "డోంట్ ఫీడ్ మీ దిస్ క్రాప్! ఇంటర్వ్యూలో మీ ఫాదర్ నిన్ను సెలక్టు చేయించలేరని నన్ను నమ్మమంటావా? బిగ్ జోక్?"

 

    "అది సాధ్యం కాని....."


    "నువ్వు గుండెల మీద చెయ్యి వేసుకుని నిజం చెప్పు! మీ డాడీ తన ఇన్ ఫ్లుయేన్స్ తో నిన్ను సెలెక్ట్ చేయించాలేరా?"


    అతను భుజాలు ఎగరేసి గుంభనంగా నవ్వాడు.


    "వెంకట్ ఏం చేస్తున్నాడు?" అంది సుదీర.


    అతను కూడా ఐ.ఎ. ఎస్ పాసయ్యాడు. అయితే తనకి, గన్ షాట్ గా సెలక్షన్ వస్తుంది."

 

    "ఎందుకు?"

 

    "రిజర్వేషన్ కోటా!" అన్నాడు సతీష్ చులకనగా.


    "రిజర్వేషనా?" అంది సుదీర అర్ధం కానట్లు చూస్తూ.


    "యా! దట్ ఛాప్ బిలాంగ్స్ టు షెడ్యుల్డ్ ట్రైబ్- యూనో.'

 

    "ఐసీ! అంది సుదీర. వెంకట్ గిరిజనుడు. ఆ సంగతి గుర్తు లేదు తనకి.

Next Page