Next Page 

కొత్తమలుపు పేజి 1

                                కొత్తమలుపు

            
                                                                        డి. కామేశ్వరి

 

                              

 


    రాత్రి ఏడు అయింది. తెలుగులో వార్తలు విని ట్రాన్సిష్టర్ నోరు నొక్కేశాడు విశ్వనాధం గారు. పక్కనే కూర్చున్న భార్య వంక ఒకసారి గంభీరంగా చూశారు.
    పద్మావతి అయన చూపులు ఎడుర్కొలేనట్టు కళ్ళు వాల్చుకుంది.
    అయన పడకుర్చిలోంచి లేచి వరండాలో పచార్లు ఆరంభించారు. పద్మావతి అక్కడ కూర్చుందన్న మాటేగాని ఆవిడ దృష్టి వేరేచోటుంది.
    రాబోయే ఉపద్రవం ఎదుర్కోవడం ఎలా భగవంతుడా అని బెంబేలు పడుతుంది ఆవిడ.
    అంతవరకు ఉరుములు ఉరిమిన భర్త కూతురు రాగానే పిడుగులు కురిపిస్తారని తెలిసి ఎంతకూ రాని కూతురిని త్వరగా ఇల్లు చేరేటట్లు చెయ్యమని భగవంతుడికి మనసులో మౌనంగా మొరపెట్టుకుంటోంది.
    కూతురు మీద ఆవిడకి కోపం ముంచుకు వస్తుంది. తన మాట లెక్క చేయకుండా, తానెన్ని సార్లు చెప్పినా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న కూతురు ఒక పక్క, ఆడపిల్లని అదుపులో పెట్టుకోవడం తల్లిపని, దాన్నలా విచ్చలవిడిగా ఎందుకు తిరగనిస్తున్నావు? అసలు తప్పు నీది అని దుయ్యబట్టే భర్త మధ్య ఆవిడ నలిగిపోతోంది కొద్దిరోజులుగా. ఆవిడ కూతురిని చాటుగా మందలిస్తూ భర్తకి నచ్చచెప్తూ ఏదో సర్దేస్తోంది ఇన్నాళ్లూ.
    కానీ, ఈరోజు.....సాయంత్రం ఇంటికి వస్తూనే విశ్వనాధం పద్మావతి మీద ఎగిరిపడ్డాడు. "రూప ఇంటికి వచ్చిందా?" అన్నాడు గంభీరంగా చూస్తూ.
    "లేదు.....లేదింకా రాలేదు"అంది తడబడ్తు పద్మావతి.....
    "టైమెంతయింది?" అయన తీక్షణంగా చూశాడు. పద్మావతి అప్రయత్నంగానే గోడవంక చూసి తలదించుకుంది.
    "పావుతక్కువ ఏడు. శీతాకాలం, చికటిపడి, ఇంత రాత్రయినా అదింటికిరాకుండా ఎక్కడికి వెళ్ళింది!" నిలేశాడు విశ్వనాధం.
    "టైపునించి ఇంకా ఇంటికి రాలేదండి! అట్నించి ఎవరన్నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళిందేమో...."నసిగింది.
    "నాలుగు నించి, ఐదు ఐదున్నర వరకు టైపు. ఆ తర్వాత ఇంటికి రాకుండా ఇంత చీకటిపడ్డా ఎక్కడ తిరుగుతుంది? స్నేహితురాలా, స్నేహితుడా..." అయన గొంతు రానురాను కరుకుగా మారడం గుర్తించి పద్మావతి మనసు బెదిరింది.
    భర్త 'స్నేహితుడా' అనగానే ఆమె మరింత భయపడింది. రూప వరస రెండు మూడు నెలలుగా ఆవిడ గమనిస్తూనే వుంది. రోజు సాయంత్రం ఏడు దాటాకగాని ఇల్లు చేరకపోవడం, ఎక్కడి కెళ్ళావంటే. 'అబ్బ ఇంటి దగ్గర బోర్ అమ్మా! ఫ్రెండిం టికి వెళ్ళాను' అని ఓసారి, అలా 'టాంక్ బండ్ ' మీదికి షికారు వెళ్ళాం నా ఫ్రెండు నేను', 'లతా వాళ్ళింట్లో రికార్డ్స్ వింటూ వుండిపోయాను', 'అబ్బ సాయంత్రం అన్నా ఒక గంట తిరగనియవు. అన్నిటికి అనుమానమే? నేనేం చిన్నపిల్లనా ఏమిటి- చీకట్లో భయపడటానికి. రోడ్డు పట్ట పగలుగా వుంటుంది లైట్లతో. ఇన్ని వందలమంది వుంటారు రోడ్లమీద, ఒక్కర్తిని రావడానికి కెందుకు భయం.' ఇలా ప్రతిరోజూ ఏదో వంక చెబుతూ చీకటి పడ్డాకగాని ఇల్లు చేరేదికాదు.
    ముందు ఒక నెల పద్మావతి అంత పట్టించుకోలేదు. ఒకరోజు కేకలు వేసి, మరో రోజు చూసి చూడనట్లు వూరుకునేది. దానికి ఇంట్లో తోచదు. ఒక్కర్తీ యింట్లో ఎంతకని కూర్చుంటుందిలే అని సరిపుచ్చుకునేది......విశ్వనాధం సాధారణంగా ఆఫీసునుంచి ఇంటికి వచ్చేసరికి ఏడుగంటలవుతుందేమో కూతురు ఆలస్యంగా ఇల్లు చేరడం అతనికి తెలియదు. ఒకో రోజు అతనోచ్చేసరికి రూప లేకపోతే పద్మావతి ఏదో సర్ది చెప్పేది. ఆహా అనుకునేవాడు కాని అది రోజు భాగోతం అని అతనికి తెలియదు. రానురాను రూప ధోరణి పద్మావతికి అనుమానం కల్గించింది.
    ఓ రోజు రూప రాగానే ఎవరింటికి వెళ్ళావు అంది పద్మావతి.
    లత ఇంటికి అంది.
    రూప, అబద్దం ఆడుతున్నావు? అంది తీక్షణంగా.
    రూప తడబడ్తు- లేదు....లేదు.....లత ఇంటికి వెళ్ళాను అని బుకాయించింది.
    'నీ వరుస బాగోలేదు. రోజు ఈ తిరుగుడేమిటి? రేపట్నించి టైపు నించి తిన్నగా ఇంటికి వచ్చే మాటయితే వెళ్ళు. లేదంటే మానేయి అంది పద్మావతి కోపంగా. రూప అప్పటికి వూరుకుని మర్నాడుమాత్రం పెందలాడే ఇంటికి వచ్చింది. మూడోరోజునించి మాములే. రూప గంటలకొద్దీ అద్దం ముందు కూర్చుని కనుబొమ్మలు కత్తిరించుకోడం, క్రిములు పాముకుంటూ, పౌడరు రుద్దుకుంటూ, జడవిప్పి అల్లుతూ గంట ముస్తబయి రోజు మడత నలగని చీరతో శ్రద్దగా ముస్తాబవడం కొత్త చీరలు కావాలని ప్రాణంతీస్తూ వేధించడం అంతా పద్మావతి దృష్టి దాటిపోలేదు.
    ఈ వయసులో ఆడపిల్లలందరూ అందంగా కనపడాలని తాపత్రయం పడడం సహజం.....తోడి పిల్లల్ని చూసి ఇదీ నేర్చింది షోకులు అనుకుంది.
    విశ్వనాధం "స్నేహితుడా" అనగానే కలవరపడ్తూ భర్త వంక చూసింది.
    "నీ కసలు బుద్దుందా-ఆడపిల్ల ఏడుగంటలు దాటినా ఇల్లు చేరకపోయినా  పట్టించుకోకుండా అలా వదిలేస్తావా?" తీక్షణంగా అన్నాడు విశ్వనాధం
    "పట్టించుకోకుండా వదిలేశానా? చూసినట్టు మాట్లాడకండి" భర్త మాటలకి పౌరషం వచ్చి అంది పద్మావతి. "ఆలస్యంగా వచ్చినందుకు ఎన్నిసార్లు తిట్టలేదు."
    "చాలు ఇంకా సమర్ధించుకుంటున్నావు. ఏం పట్టించుకున్నావు. పోనీ ఒక్కన్నాడన్నా నాతో చెప్పావా ఇలా ప్రతిరోజూ ఆలస్యంగా వస్తోందని- ఎవడో వూర్లో పుల్లయ్య, ఎల్లయ్య ఇలా మీ అమ్మాయి పార్కులు, సినిమాలు ఎవడితోనో షికార్లు తిరుగుతుందయ్యా జాగ్రత్తపడు అనేవరకు నాకేమన్నా తెల్సిందా. తెలియనిచ్చావా?
    "నేనంటే ఇంట్లో వుండే వాడిని కాదు. ఇంట్లో వున్న నీ కళ్ళు ఎలా మూసుకుపోయాయి.
    ఆ మాత్రం గుర్తించలేక పోయావా? ఇవాళ మా బ్యాంక్ లో ఆ ప్రసాదరావు నన్ను పిలిచి ఎవరండి ఆ కుర్రాడు మీ రూపతో తిరుగుతున్నాడు. మా ఆవిడకి ఒకరోజు సినిమాలో కనిపించారుట. మొన్న మేం పబ్లిక్ గార్డెన్స్ కి వెడితే కనపడ్డారు. మన సదాశివం అన్నాడు. మొన్న ఏదో మాటల్లో కనిపించారని-ఎవరతను మీకేమన్నా బంధువా- అంటూ నా మాడిపోయినా మొహం చూసి నాకేం తెలియదని గుర్తించి కూతుర్ని జాగ్రత్త పెట్టుకోమంటూ నీతులు బోధించాడు. నాకెంత తల కొట్టేసినట్లయిం దో నీ కేమన్నా తెలుసా తల్లివి ఆడపిల్లని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేవు?" ఎదురుగా లేని కూతురిమీద కోపం భార్య మీద చూపించి ఎగిరిపడ్డాడు విశ్వనాధం.
    తన కూతురు ఎవరితోనో తిరుగుతోందన్నబాధ కంటే వేరే వాళ్ళు తేలిగ్గా మాట్లాడటం అవమానంగా వుందాయనకి, ఆఫీసులో పని చెయ్యలేకపోయాడు-కూతురిమీద, పెళ్ళాం మీద పీకలదాకా కోపం వచ్చింది. సెగలు పొగలు కక్కుతూ ఇల్లు చేరాడు.
    ఇంట్లో కూతురు లేకపోవడం అయన ఆగ్రహాన్ని మరింత పెంచింది.
    "బాగుంది, మధ్య నామీద ఎగుర్తారెందుకు-ఏదో స్నేహితురాలింటికీ కెళ్ళాను, గార్డెన్ కెళ్ళాను సినిమా కెళ్ళాను అంటే స్నేహితురాళ్ళతో వెళ్ళిందనుకుంటాను గాని ఇలా ఎవడితోనో తిరుగుతుందని కలకన్నానా? నేనేదో చూసి తెలిసి వూరుకున్నట్టు మాట్లాడతారేం? ఇంట్లో వుండేదాన్ని అది బయట ఎక్కడ తిరుగుతుందో నాకెలా తెలుస్తుంది-అక్కడికి ఆలస్యంగా వచ్చినప్పుడు చివాట్లు వేశాను - ఈ కాలం పిల్లలు కాళ్ళు చేతులు కట్టిపడేస్తే మాత్రం ఇంట్లో కూర్చుంటారేమిటి? అందరికి స్నేహితులు, సినిమాలు, షికార్లు-తిరిగితే తప్పేమిటని మోహన్నే అడిగేసి నోరు మూయిస్తున్నారు పిల్లలు ఇంట్లో బోర్ బోర్ అంటూ అందరికి తిరుగుడలవాటయింది...."పద్మావతి తీవ్రంగానే సంజాయిషీ ఇచ్చింది.

Next Page