TeluguOne - Grandhalayam
Samkellu and Pilla Donga


                                          సంకెళ్ళు
    
                                                                  --కొమ్మూరి వేణుగోపాలరావు
    
    
                            

 

     ఈ యిరవయ్యో శతాబ్దంలో నాలాంటి చాదస్తుడు ఎక్కడా వుండడని మిత్రులంతా పరిహసిస్తూ వుండేవాళ్ళు. "చిరంజీవి! నువ్వు డాక్టరువి. ఈ కాలమాన పరిస్థితుల్లో మా అందరికన్నా నీకు జోక్యం యెక్కువ వుంటుంది. రోజూ యెంతోమంది స్త్రీ పురుషులతో వృత్తిరీత్యా సంచరిస్తావు. అయినా నిన్నెవరూ మార్చలేరు. ఎవరూ నాగరికుడ్ని చేయలేరు" అనేవాళ్ళు.

 

    వీళ్ళేగాకుండా వైద్యంకోసం వచ్చే కొంతమంది ఉన్నత కుటుంబాల స్త్రీలుకూడా యిలాగే ఛలోక్తులు పట్టించేవారు.

 

    "మీరు నాగరికత అంటారు. నేను మీతో క్లబ్బులకు, డాన్సులకు తిరగలేదనేనా?" అని గద్దించి అడిగాను.
       
    "అంతేకాదు. నీవు తరచు దేవాలయానికి వెడతావు" అన్నారు.

 

    "అది నా వ్యక్తిగతమైన యిచ్చ."

   
    "ఓహో! అయితే యావజ్జీవిధం యిలా బ్రహ్మచర్యం పాటిస్తావా?"

 

    "నా అభిరుచులకు తగిన పిల్ల దొరికినప్పుడు తప్పక పెళ్ళాడతాను."

 

    "అలాంటి పిల్ల ప్రపంచంలో వుంటుందా? అయినా నీ సంగతి తెలిస్తే నిన్నెవరూ పెళ్లి చేసుకోరు సుమా. మేము మాత్రం బ్రహ్మచారులం కాదా? మేము చూడు ఎలా వుంటున్నామో!"

 

    "నీతి... అవినీతి గురించి నాకున్న విశ్వాసాలు వేరు. ఐనా మీదారి మీది, నాదారి నాది" అనేశాను బరితెగించి.

   
    "ఇంత గొప్ప పట్టణంలో వుంటున్నావు. దేముడు నిన్ను యెలా పుట్టించాడో తెలియదు" అని చికాగ్గా వెళ్లిపోయారు.
    
    వాళ్లు నిరంతరం నాలో పరివర్తనను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను మారనని నాకు తెలుసు. ఇది నా గర్వకారణం.
    
    ఒకరోజు పండుగ. నేను రాత్రి ఏడుగంటల వేళకు గుడినుంచి యింటికి వచ్చేసరికి ముందుగదిలో మిత్రులు అయిదారుగురు చేరి సిగరెట్లు కాలుస్తూ నవ్వుకుంటూ, పేలుకుంతూ వున్నారు. వాకిట్లో వారు యెక్కివచ్చిన కారు వుంది. "ఇదుగో కథానాయకుడు వచ్చేశాడు. ఇవాళ నీ వ్రతభంగం చేయదలిచాం" అన్నారు నన్ను చూస్తూనే.
    
    నేను చాలా మొహమాటం మనిషిని. నాకు బాగా కోపం వచ్చినప్పుడు కూడా కోపభంగిమ, ముఖంలో కాస్త చిరాకు ప్రదర్శించటానికి అవతలివారు యేమైనా అనుకునిపోతారేమోనని మొహమాటపడతాను.

 

    "ఏమిటి?" అన్నాను నవ్వు తెచ్చుకొంటూ.

 

    "నువ్వు యివాళ జీవితం చూడాలి!"

   
    "రోజూ చూస్తూనే వున్నాను."
    
    "అలాకాదు" అంటూ వీరప్రతాప్ లేచి నాకు చుట్టలాంటి సిగరెట్ అందివ్వబోయాడు. మిగతావాళ్ళంతా నావంక ఉత్సాహపూర్వకంగా చూడటం కనిపెట్టాను.
    
    "సిగరెట్ త్రాగితేనే అది జీవితమా?" అని ప్రశ్నించాను. ప్రతాప్ నవ్వి ముఖం చిట్లించాడు. ఛీ! మనమే డాక్టర్లం అయితే..." అన్నాడు.
    
    వాడు నొచ్చుకున్నట్లుగా వుంది. అందుకు నేను బాధపడసాగాను.
    
    "చిరంజీవి! నీవు పేషెంట్సుని ఎగ్జామిన చేస్తున్నప్పుడు మేము వస్తేనే పొడగిట్లనట్లు యెందుకళా సతమతమౌతావు? రేపటినుంచి నీ కన్సల్టింగ్ రూంలోనే కూర్చుందామనుకుంటున్నా" అంటూ మనోహర్ పెదవులు బిగపెట్టి నన్ను పరీక్షగా చూడసాగాడు.
    
    "హైద్రాబాద్ లోని అందమైన యువతీ యువకులంతా దాదాపు చిరంజీవి ఆసుపత్రి ఆవరణలోనే కనిపిస్తారు" అని రాంబాబు మెల్లగా అన్నాడు.
    
    మనోహర్ నవ్వి "కారణం ఏమిటంటావు? ఇంతమంది లేడీ డాక్టర్సు వుండగా వీడిదగ్గరికే వచ్చి తిష్ట వెయ్యటానికి!" అని కన్నుగీటాడు.
    
    నా స్నేహితుల్లో ఒక మహమ్మదీయుడు కూడా వున్నాడు. "హరే! హేమ్టిబే మీరంతా దవాఖానలోని బీమార్ గీమార్ లైక్ చేస్తార్." అని ఛీత్కారం చేశాడు.
    
    నాకు యివాళ వీళ్ళధోరణి యేమీ అర్ధంకాలేదు. "డాక్టర్! నువ్వు సూటు వేసుకుని చప్పున తయారుకా, మనం వెంటనే వెళ్లిపోవాలి. మేమంతా నీకోసమే వెయిట్ చేస్తున్నాం."
    
    "ఎక్కడికీ?" అన్నాను ఆశ్చర్యంగా.
    
    వాళ్ళంతా ఒకరి మొహాలు ఒకరు కొంటెగా చూసుకున్నారే తప్ప జవాబు యివ్వలేదు.
    
    "ఎక్కడికీ? ఎందుకూ?" అన్నాను అయోమయంగా.
    
    "చెబుతాం. నువ్వు ముందు తయారుకా."
    
    నాకు ఏమి చేయాలో పాలుపోక "మీరంతా నన్నేం చేయదలిచారు?" అన్నాను.
    
    "మరేం భయంలేదు. నిన్ను యేమీ కష్టపెట్టం. త్వరగా తెముల్చుకొని బయల్దేరతావా, లేదా?"

    అటు వాళ్ల బలవంతం... ఇటు న అమోహమాటం.... చివరకు తప్పలేదు. బట్టలు వేసుకున్నాక ఎందుకైనా మంచిదని ఒక వందరూపాయలు జేబులో వేసుకొని బయల్దేరాను.
    
    ఆ చీకటి వెల్తురులో అనేక వీధులు, సందులూ దాటి ఓ పెద్ద భవనం ముందు కారాగింది. ఏదో మనకు సంబంధించని క్లబ్బులా వుంది. నేను తడబడుతూ కాలు ఇంకా కారులోంచి యివతలకు పెట్టకముందే చిరచిర లోపలకు ఈడ్చుకుపోయారు.

Related Novels