Next Page 

ఆత్మజ్యోతి పేజి 1

           

                             ఆత్మజ్యోతి
   
                                                   --కొమ్మూరి వేణుగోపాలరావు
   

   

                         


    స్త్రీ జీవితంకన్నా పురుషుడి జీవితమే చిత్రమైనది. కాకపోతే కాస్త వక్రమైనది. నాకు తెలిసినంతవరకూ ఏ ఆడదీ తననింతా మోసగించుకోదు. పురుషుడు చేసే మొదటి తెలివితక్కువ పని అదే. స్త్రీ హృదయంలోతు తెలుసుకోవడం బ్రహ్మకైనా సాద్యంకాదని అంతా అంటారు.....మొదట శివనాధ రావుని గురించి చెబుతాను. అంతా అతన్ని శివాయ్ అనీ, శివా అనీ పిలుస్తారు. పైన చెప్పిన స్త్రీ హృదయాన్ని గురించిన సత్యంలోని నిజం ఎంతో అతనికి తెలియదు. తన జీవితకాలంలో ఏ స్త్రీనీ అర్ధం చేసుకోటానికి ప్రయత్నించనూ లేదు. ఆ పని అతనికి విసుగుకూడా. అలా అని యీ విషయంలో అతనికి ఓనమాలు తెలియవని కాదు. అసలు ప్రపంచంలో ఏ విషయం మీదా అతనికి శ్రద్ద నిలకడగా వుండలేదు. చదువు అంటే మొదట ఏమీ ఆసక్తి లేదు. చదివాడు. ఉద్యోగాలు చేయడమంటే అభిలాష లేదు. చేశాడు ఉద్యోగాలు. ఆర్టు అంటే అంతగా ప్రీతిలేదు. కొంతమంది అమాయకులతన్ని ఆర్టిస్టువన్నారు పాపం. గానం కొంచెం వినగలిగే ఓపిక వుంది. ఏమీ తోచనప్పుడూ, జీవితంమీద సరదా పుట్టినప్పుడూ, అదంటే భయం వేసినప్పుడూ కూనిరాగాలు తీస్తూ వుంటాడు. వయొలిన్ వాయిస్తాడు. గాయకుడని అక్కడక్కడా కీర్తి ఏర్పడింది. ఇదంతా యిలా ఎందుకు జరుగుతోంది? మిగతావాళ్ళు యీ విషయాన్ని గురించి శ్రద్దగా ఆలోచించి వుండరు. ఒకరిద్దరు మెరిట్ అని తోసేశారు. తీరిగ్గా వున్నప్పుడు అతను యీ విషయాన్ని గురించి ఆలోచించుకునేందుకు పూనుకుంటే 'నక్షత్రాలెన్ని వున్నాయి, వాటిల్లో ఏమున్నాయి?' అన్న ప్రశ్నలకు జవాబు ఏమొస్తుందో అదే వచ్చింది.
   
    శివనాధరావునిగురించి చెబుతున్నాను. అంటే గాలివానతో ప్రారంభించాలి. గాలివాన.... అదిగో విలయతాండవం చేస్తోంది.
   
                           *    *    *   
   

    అంత పెద్ద గాలివానను అది రెండో తడవ అతను చూడడం. మొదటిసారి ఎప్పుడో చిన్నప్పుడు చూడడం జరిగింది. అప్పటికి ఊహలింకా ఉద్భవించలేదు.... పగలంతా వర్షం, గాలి విరుచుకుపడి వీస్తూండగా కుంభవృష్టిగా కురుస్తూనే వుంది. మెడమీద వసారాలో జల్లుకూడా రాని సురక్షిత ప్రదేశంలో నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఎదురుగా పెంకుటింటి మీద పెంకులు గిర్రున ఎగిరిపోతున్నాయి. పొలాలను సమూలంగా నాశనంచేసే మిడుతలగుంపు ఆకాశంలో విహరిస్తున్నట్లుగా చీకటిఛాయలు, చెవులు చిల్లులు పడేటట్లు వర్షంమోత, పిడుగు పాటులు, అక్కడక్కడా ఏవో కూలిపోతున్న శబ్దాలు నిర్విరామంగా విన్పిస్తున్నా - తనలాగే ప్రతివాడూ మనసులో నిశ్శబ్దతనే పొందుతున్నట్లు ఓ వింత అనుభూతి.
   
    మెరుస్తోంది ఆకాశం మధ్య మధ్య.
   
    వాళ్ళ మేడప్రక్క పాకలమీద కప్పబడి, యింతకాలం ఎండా వానా జొరబడకుండా సంరక్షిస్తున్న తాటాకులు నిస్సహయంగా పెనుగాలికి 'ఫ్లయింగ్ సాసర్స్' లా ఎగిరిపోతుంటే దృశ్యం మనోజ్ఞంగా వుంది. ఎక్కడో ఏవో చెట్లు కూలిపోతున్న శబ్దంతోపాటూ, పాకల్లోని ప్రాణుల ఆక్రందనలు మనసులో ఊహించుకున్నప్పుడు జాలి కలుగుతున్నా, ఆ రమణీయతను అభినందించకుండా వుండలేకపోతున్నాడు. ఆ మేడ ఎదురుగావున్న రావిచెట్టు భయంకరంగా ఊగుతోంది. అసలే దాని జీవం ఉడికిపోతోంది. కట్టెలు కొట్టుకునేవాళ్ళ కళ్ళు అప్పటికే దానిమీద పడ్డాయి. కానీ దగ్గర్లోవున్న రామాలయంలోని పూజారిమాత్రం రావిచెట్టు నరకరాదని ఆ ప్రమేయం వచ్చినప్పుడల్లా వాదిస్తూనే వున్నాడు. ఇవేళ యీ ఉధృతానికి దాని పాటు తప్పదుగావును. ఎదుటిమేడో, తమ మేడో దాని దెబ్బకు కొంత గురి కావాలి.
   
    ఇల్లంతా చెడ్డ నిశ్శబ్దంగా వుంది. శివనాథరావూ, వంటవాడూ తప్ప ఇంట్లో ఎవరూలేరు. అతని తల్లీ తండ్రీ యాత్రలకని వెళ్ళి పదిరోజులు దాటింది. పనివాడు గాలివాన మూలంగా రాలేదు. ప్రతి అరగంటకూ వంటవాడు పైకివచ్చి స్ట్రాంగ్ కాఫీ యిచ్చి వెళుతున్నాడు. ఈ చలిలో, వలిలో అలా వున్ని స్వెటర్ వేసుకుని, చెవులచుట్టూ మఫ్లర్ చుట్టుకుని వేడి వేడి కాఫీ త్రాగుతూంటే ఆహా.....ఎంతమజా వుంది యిందులో? ధనవంతునిదే జీవితం వీధిలో అక్కడక్కడా యిళ్ళముందు వున్న సావిళ్ళలో తలదాచుకుంటూ ఆకాశంవంక జాలిగా దృక్కులు బరుపుతూన్న బాటసారులని చూస్తుంటే యీ సుఖానికీ, ఆ కష్టానికీ ఎన్ని మైళ్ళదూరమా అని ఆశ్చర్యంగా వుంది.
   
    ఎదురుగా పెంకుటింటి ముందు చూరుక్రింద యిద్దరు వృద్ద దంపతులు నిండా ముసుగు కప్పుకుని దీనంగా కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వానధారల్లోంచి వాళ్ళని చూస్తోంటే కళ్ళు తిరుగుతున్నప్పుడు కనిపించే గజిబిజీ దృశ్యంలా వుంది శివనాథరావుకు వాళ్ళ ముఖాల్లో, చేష్టితాల్లో ఏదో ఆతృత వూహిస్తోంది అతని అంతరంగం. ఇంతలో ఓ ఘోరవిపత్తు జరిగిపోయింది. ఉన్నట్లుండి ఆ దంపతులిద్దరూ లేచారు. ఓ క్షణం గాలివానవంక నిరాశగా చూశారు. రెండు మూడునిముషాలు తటపటాయించారు. తర్వాత హఠాత్తుగా రోడ్డుమీదకు వచ్చేశారు. శివనాథరావు త్రుళ్ళిపడ్డాడు. మనుషులేనా వీళ్ళు? గొంతెత్తి అరవబోయాడు. నోట్లో కాఫీవుంది. ఉమ్మి నెత్తురులా పడింది. ఈ లోపున గాలివిసురుకి వృద్దులిద్దరూ క్రిందపడిపోయి దొర్లుతున్నారు. ఐదారుగురు మనుష్యులు చుట్టుపట్ల యిళ్ళ పంచల్లోంచి గుడ్లప్పగించి చూస్తున్నారేగానీ, ఎవరికీ సాహసం కలగనట్లుంది కదలరు, మెదలరు. శివనాథరావులో రక్తం పొంగింది. ఉన్మాదునిలా ఓ కేకవేసి క్రిందకు పరిగెత్తాడు. 'ఏమిటిబాబూ, ఏమిటి బాబూ?' అని వంటవాడు వెనుకనుంచి పరుగెత్తుకు వస్తున్నాడు. అతను జవాబుచెప్పలేదు. ఒక్క ఊరుకున క్రిందకు పోయాడు. తలుపులు గడియవేసి వున్నాయి. నీటికి తడిసి, చెక్క ఉబికి ఎంతకూ గడియ వూడిరావట్లేదు. అటూయిటూ చూసి ప్రక్కనున్నకర్రతో బలంగా గడియ విడగొట్టాడు. గాలి బలానికి తలుపులు వాటంతటవే విసుసుగా తెరచుకున్నాడు. వాయువేగంతో వర్షంలోకి పరిగెత్తాడు. గాలివేగం, బలం అపరిమితంగా వున్నాయి. బలహీనుడు అతడు. ఎండలోనూ, వానలోనూ కాలు ఎన్నడూ బైటపెట్టి ఎరుగని సుకుమార ప్రాణం ఐనా లక్ష్యంచెయ్యకుండా వెళ్ళి వృద్దుడిని అందుకోబోయాడు. వృద్దుడు తల అడ్డంగావూపి భార్యవంక చూపించాడు. ఆలోచించటానికి వ్యవధిలేదు. రెండుచేతుల్తోనూ ఆ వృద్ద మాతనులేవదీసి భుజాలమీదకు ఎత్తుకున్నాడు. లోపలకు పరిగెత్తబోతూ తల ప్రక్కకుతిప్పి చూసేసరికి వంటమనిషి గోవిందం ముసలాయన్ని ఎత్తుకొస్తున్నాడు.
   
    లోపలకు వచ్చాక, యిద్దరినీ ఓ మూల పడుకోబెట్టారు.
   
    "గోవిందూ! తలుపులు వేసెయ్యి" అన్నాడు శివనాథరావు.
   
    అతను తలుపులు మూసేటందుకు పోయి ఓ క్షణం తటపటాయించి వెనుదిరిగి "బాబూ! ఇక్కడకూడా ఎవరో యిద్దరు చలికి ఒణుకుతున్నారు" అన్నాడు.
   
    అరె! తను చూడలేదే. "వెంటనే లోపలకు తీసుకురా!" అన్నాడతను సానుభూతితో.
       
    ఆ జంఝాటంలో గోవిందు మాటలు సరిగ్గా వినబడలేదు గాని వాళ్ళతో ఏదో చెప్పాడు. మరునిమిషంలో మరో యిద్దరు లోపలకు వచ్చారు. తడిసి ముద్దయిపోయారు. అందులో ఒకరు నడివయసు స్త్రీ రెండోఆమె యువతి. ముఖం కానరాకుండా తల క్రిందకు దించుకుంది. జుట్టునుండి నీళ్ళు సుందరంగా పడుతున్నాయి నేలమీద.
   
    "నీ మేలు మరచిపోలేను నాయనా" అంది నడివయసు స్త్రీ.
   
    ఈలోగా గోవిందు వెళ్ళి తలుపులు మూసి వచ్చాడు. వృద్దులిద్దరూ గజగజలాడడం యింకా మానలేదు. నెమ్మదిగా లేచి కూర్చుని అతనివంక కృతజ్ఞతాపూరితంగా చూస్తున్నారు.
   
    వాళ్ళదగ్గరకు వెళ్ళి "ఎందుకలా తొందరపడ్డారు?" అని అడిగాడు శివనాథరావు.
   
    "ఏం చెప్పం బాబూ? ఆతృత" అన్నాడు వృద్దుడు.
   
    "గోవిందూ! వీళ్ళకు బట్టలు మార్చుకునే సదుపాయం చూడు" అని చెప్పి "ఎటువంటి వాడైనా యీ గాలివాన దెబ్బకు వెరచి యింట్లోంచి కాలు బయటపెట్టడే! ఎంత ఆత్రుతగా వున్నా, ఏమిటి మీకంత సాహసం? గాలి బలంకన్నా మీ శరీరబలం ఎంత తక్కువో తెలుసుకున్నారా?

    'ఏమిటో నాయనా! ఆమాత్రం ఆలోచించే జ్ఞానం లేకపోయింది.'
   
    'మీదే ఊరు?'

    వృద్దురాలు కళ్ళు తుడుచుకుంది. 'ఈ ఊరే' అంది.   
   
    'అయితే యిల్లు కదిలి బయటకు ఎందుకు వచ్చారు?'

Next Page