TeluguOne - Grandhalayam
ప్రయాణంలో పదనిసలు

                                    ప్రయాణంలో పదనిసలు
                                                                   --వసుంధర
   
                               
   

 

   మన దేశంలో  ప్రయాణం-అందులోనూ ముఖ్యంగా రైలు ప్రయాణం ఒక విశేషానుభూతి రకరకాల వ్యక్తులూ, మనస్తత్వాలూ, అనుభవాలూ మనకీ ప్రయాణాలలో పరిచయమవుతాయి. జీవితాంతం అసహ్యించుకోవాలనిపించేటంతటి అసహ్యకరవ్యక్తులూ, ఇకమీదట క్షణకాలంకూడా విడిచి ఉండలేమనిపించేటంతటి స్నేహపాత్రులూ తటస్థపడుతుంటారు. స్వార్ధం-త్యాగం నీతి-అవినీతి, మంచి-చెడ్డ వగయిరా ఎన్నో పరస్పర విరుద్ద లక్షణాలు అనుభవంలోకి వస్తుంటాయి. దేశంలో ఏయే తరహా మనుషులున్నారు, ప్రస్తుతం దేశం యే రీతిలోనడుస్తోంది, ప్రభుత్వాన్ని గురించి ప్రజలేమనుకుంటున్నారు అసలు మన ఆలోచనలు అత్యధిక మెజారిటీ ప్రజల ఆలోచనలకు దగ్గర్లో వున్నాయా-వగయిరా అమూల్య ప్రశ్నలకు రెండేరెండురోజుల రైలుప్రయాణం సమాధానమివ్వగలదు.
   
    దేశాన్ని గురించి ఎన్నో వివరాలు తెలుసుకోవాలన్న సరదా రాజారావుకుంది. కాని ప్రయాణంచేసే ఓపికమాత్రం అతడికి లేదు. ఆకారణంగా అతను ఉద్యోగరీత్యా ఎన్నో ప్రయాణాలు చేయవలసివస్తే తప్పించుకున్నాడు. ఏదో వంక పెట్టి ఆ ప్రయాణాన్ని ఇతరులకంటగట్టేవాడు. ప్రయాణం ద్వార ప్రభుత్వపు ఖర్చుతో కొత్త ప్రదేశాలు చూడవచ్చు నని కొందరూ, వీలయితే ప్రభుత్వమిచ్చిన భత్యపు ఖర్చులలో డబ్బులు మిగుల్చుకోవచ్చుననికొందరూ, దూరప్రదేశాలలో షాపింగు చేయవచ్చునని కొందరూ ఆశపడి ఈ ప్రయాణాలకు ఎగబడుతూంటారు. అటువంటివారినీ, మొహమాటంతో కాదనలేనివారినీ రాజారావు ఈ ప్రయాణాలకు ఇరికించేవాడు. అయితే అన్ని సందర్భాలలోనూ అలా సాధ్యపడరు. ఒకోసారి అతనేస్వయంగా వెళ్ళి తీరవలసిన పరిస్థితులు వస్తూంటాయి. అటువంటిది ఇటీవల అతనికి వచ్చిన బరోడా ప్రయాణం.
   
    బరోడాలోని ఒక సంస్థ రాజారావు పనిచేసే సంస్థకు ఒకపని అప్పజెప్పింది. ఆ పని చేసినందుకుగానూ ఆ సంస్థ ఈ సంస్థకు కొంత డబ్బు ముట్టజెప్పింది. ఆ పని చెయ్యవలసిన బాధ్యత రాజారావుమీద పడింది. తన బాధ్యత నతను సక్రమంగానే నిర్వహిస్తున్నాడు. ఈ పని నిర్వహణలో ఇప్పటికి ఆర్నెల్లు గడిచాయి.
   
    ఏ సంస్థనుంచయినా బాధ్యతలు స్వీకరించడానికి ప్రభుత్వ సంస్థలకు కొన్ని పద్దతులుంటాయి వాటిలో ఖర్చు ఎస్టీమేటు ముఖ్యమైనది. ఆర్నెల్లుగడిచేక ఆ సంస్థ అకౌంట్స్ సెక్షన్ ఎస్టీమేటునూ, అంతవరకూ జరిగిన ఖర్చులనూ పరిశీలించి కొన్ని రిమార్క్సు ఇస్తుంది. అలాంటి రిమార్క్సులో ఒకటి రాజారావు బరోడా ప్రయాణానికి దారితీసింది.
   
    ఎస్టిమేటు ప్రకారం ప్రయాణాలకుగానూ రెండువేల రూపాయలకు పైయిగా కేటాయించారు. అయితే ఇంతవరకూ ఈ పని నిమిత్తం ఒక్క ప్రయాణంకూడా జరగలేదు. ఆ సందర్భంగా పైసాకూడా ఖర్చుకాలేదు. ఈ విషయమై అకౌంట్సు విభాగం తన తీవ్ర ఆక్షేపణను తెలియజేసింది.
   
    నిజానికి రాజారావు ఒక పర్యాయం బరోడా వెళ్ళవలసి ఉన్నది. ఆ సంస్థను సందర్శించి-అక్కడ వివిధ కార్యక్రమాలేరీతిలో సాగుతున్నాయో పరీక్షించి తన ఫలితములనా సంస్థ ఏ విధంగా ఉపయోగించుకోబోతోందో ప్రత్యక్షంగా చూసిరావాలి. ఆ పని పనిముగిసేక చేద్దామనుకున్నాడతను. అయితే అకౌంట్సు విభాగం ఆక్షేపణ తెలిసినవెంటనే అతను తనపై అధికారిని కలుసుకున్నాడు. ఆయన-"ఇప్పటికే ఆలస్యమయింది. తక్షణం బయల్దేరివెళ్ళు..." అన్నాడు.
   
    "డబ్బున్నది కాబట్టి పని కల్పించుకుని వెళ్ళాలి తప్పితే ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి చేయగలిగినదేమీ లేదు...." అన్నాడు రాజారావు.
   
    "అది నిజమే- మన పని మొత్తం ఒక సంవత్సరముంటుంది. రెండు ప్రయాణాలకని ఈ ఎసిమేటు ఇచ్చాము. ఇప్పుడు నువ్వు బరోడా వెళ్ళి వచ్చేసేయ్ రెండుమూడు నెలలాగి మళ్ళీ ఇంకోసారి వెడుదువుగాని..." అన్నాడు అధికారి.
   
    పుల్లయ్య వేమవరం గుర్తుకొచ్చింది రాజారావుకి అతను పై అధికారితో ఓ గంటసేపు చర్చలు జరిపి ఓ కార్యక్రమాన్ని రూపొందించాడు. ఆ ప్రకారం అతను ఇంతవరకూ తను చేసిన ప్రయోగ ఫలితాలను ఆ సంస్థ ఉద్యోగులతో చర్చిస్తాడు. అక్కడి యంత్రాలను సందర్శిస్తాడు. పని ఉన్నా లేకపోయినా చర్చల పేరు చెప్పి ఓ వారం రోజులక్కడ ఉంటాడు. అయితే బరోడా నగరం చాలాదూరాన ఉంది. అది చాలా పెద్ద ప్రయాణం. మళ్ళీ రెండు నెలల్లోనే ఇంకో ప్రయాణం చేయడం కష్టమని రాజారావు మనసులో అభిప్రాయపడి- "నేనూ ఈశ్వర్రావూ కలసి పని చేస్తున్నాం కదా. అతనుకూడా నాతోవస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను..." అన్నాడు. ఆ విధంగా రెండు ప్రయాణాల ఖర్చు ఒక దెబ్బతో అయిపోతుందనీ, ప్రయాణంలో తనకు మంచి తోడు వుంటుందనీ అతను ఆశపడ్డాడు. అతనిపై అధికారికూడా అలాచేస్తే బాగుంటుందన్నాడు.
   
    ఈశ్వరరావు రాజారావుకి అసిస్టెంటు అతనికీ కెమిస్ట్రీలో డాక్టరేటు డిగ్రీ వుంది. అతనికి తెలివితేటలతోపాటు అనుభవాన్ని గౌరవించే వినయంకూడా వుంది. అతనికీ రాజారావుకీ అనుభవం మినహాయిస్తే వేరే తేడా ఏమీ లేదు.
   
    రాజారావు వెంటనే ఆఫీసు ద్వారా బరోడాకి టెలిగ్రాం ఇప్పించాడు. అందులో తనకు అనుకూలమైన తేదీలు సూచిస్తూ ఆ తేదీలు బరోడాలోని సంస్థకు అనుకూలంగా వున్నదీ లేనిదీ తెలియ బర్చమని కోరాడు. టెలిగ్రాం ఇచ్చిన అయిదారు రోజులకతనికి అనుకూలమైన సమాధానంతో టెలిగ్రాం వచ్చింది. బరోడానుంచి. టెలిగ్రాములెంత త్వరగా అందుతున్నాయో సూచించడాని కన్నట్లుగా - టెలిగ్రాంతో పాటే ఆ సంస్థవారు రాసిన వుత్తరం కూడా ఆ రోజే అందింది. రాజారావువస్తున్నందుకు తాము చాల ఆనందిస్తున్నామనీ అతనక్కడ వుండడానికి అన్ని ఏర్పాట్లూచేసేశామని మామూలు మర్యాదలతో ఆ వుత్తరం వ్రాయబడింది.


Related Novels