Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 64

  

      "ముందు బయటకు నడు" తర్జని చూపిస్తూ అందించింది లక్ష్మి "మా ఇంటికొచ్చి మా ఆయన్ని తిడతావా?"
   
    "అయ్యో! నేను తిట్టలేదండి. భార్యాభర్తలు ఒకర్నొకరు మోసం చేసుకుంటూంటే ఇక ఆ సంసారం....."
   
    "మా సంసారం ఎలా ఉండాలో చెప్పటానికి నువ్వెవ్వత్తివే? ఒళ్ళు కొవ్వెక్కి యిలా బజార్న పడతావా? మా ఆయన తప్ప నీ కింకెవరూ దొరకలేదా? అయినా మగాడన్నాక లక్ష వ్యవహారాలుంటాయి. కోటి లొసుగులుంటాయి. ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండాలి. అంతేకానీ యిలా ఇంటింటికీ వచ్చి భర్తల గురించి ఫిర్యాదులు చేయటం తప్ప నీ కింకేం పనిలేదా? డబ్బుకోసం వేశావా వల? ఎర్రగా వున్నారని వెంటపడ్డావా?"
   
    సాహితి కంపించిపోతోంది. అయితే అది ఆవేశం వల్ల వచ్చిన కంపన కాదు. దుఃఖం వలన వచ్చిన వణుకు. అతికష్టం మీద తనని తాను సంబాళించుకుంది. "ఇవన్నీ సాక్ష్యాధారాలతో చూపిస్తే, మీ భర్తని లాలించో, బెదిరించో సరిదిద్దుకుంటారనుకున్నానండీ. ఒక స్త్రీగా నేను చేసిన పనిని సపోర్టు చేస్తారనుకున్నాను. అలాగని నేనిదంతా చెప్పగానే మీరు నా చేతులు పట్టుకుని 'నా కళ్ళు తెరిపించావమ్మా' అంటారని అనుకోలేదు. కానీ, కనీసం నేనెళ్ళాకయినా మీ ఆయన్ని మందలిస్తారని అనుకున్నాను. కాస్తంత సెక్యూరిటీ కోసం స్త్రీ ఇంత ఆత్మవంచన చేసుకుని, మనసావాచా భర్తనే సపోర్ట్ చేస్తుందనుకోలేదు."
   
    "వెళతావా? పోలీసుల్ని పిలవమంటవా?"
   
    మొదటిసారి సాహితి నవ్వింది. "నేనెవరో తెలీక మరీ మాటలంటున్నారు. మీ ఆయన్ని పోలీసుల్తో అరెస్ట్ చేయించదల్చుకుంటే ఈ క్యాసెట్ చాలు" అని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
   
                                  12
   
    మళ్ళీ తుఫాను మొదలయింది. ప్రొద్దున్నుంచీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బయట ఉరుములు మెరుపులు. సాయంత్రమయ్యేసరికి ఉధృతం ఎక్కువయింది. సరీగ్గా ఆ సమయంలో టీవీలో పావనితో ఇంటర్వ్యూ మొదలయింది.
   
    "ఒక అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులోనే మంత్రయ్యారు. ఈ విజయంపట్ల మీ అభిప్రాయమేమిటి?"
   
    విశ్వపతి కుటుంబమంతా టీవీ చూస్తున్నారు. అక్కయ్యని ఆ పొజిషన్ లో చూడటంతో చిన్నపిల్లలు ఉద్విగ్నత పట్టలేక చప్పట్లు కొట్టారు. విశ్వపతి మనసంతా పరస్పర విరుద్ద భావాల్తో కొట్టుమిట్టులాడుతూ వుంది. టీవీలో కూతురు "చూశావా నాన్నా! సంపాదించాను" అని తనని చూసే నవ్వుతున్నట్టుంది. తన అభిప్రాయం తప్పా అన్న భావం కలుగుతోంది అతనికి.
   
    "ఒక మనిషి పైకి రావాలంటే కావాల్సింది కృషి, పట్టుదల" పావని చెప్పింది.
   
    "కృషి వుంటే చాలా? చదువు, డబ్బు, తెలివితేటలు - వీటి అవసరమేమీ లేదని మీరు భావిస్తున్నారా?"
   
    "ఒకప్పుడు నాకు ఆ మూడు లేవు. కాస్త వానాకాలం చదువు, అంతంత మాత్రం తెలివితేటలు, చేతిలో కాణీ కూడా లేని పరిస్థితి నాది. కృషి వుంటే దేన్నయినా సాధించవచ్చునని నాకు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో బోధపడింది. చదువు, డబ్బు వుంటే అన్నీ సాధించగలమనుకోవటం తప్పు. కావల్సింది ఆత్మవిశ్వాసం. అది వుంటే ఎలాగైనా ఆనందంగా బ్రతకవచ్చు."
   
    'కరెక్ట్' అనుకుంది టీవీ చూస్తున్న సాహితి. ఒకప్పుడు తను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చేతినిండా కావల్సినంత డబ్బు!! అయినా తానిలా కుంచించుకుపోయి జీవచ్చవంలా తయారయింది. కారణం ఏమిటి? సాహితికి సమాధానం పావని ఇంటర్వ్యూలోనే దొరికింది. ఇంటర్వ్యూ చేసే అమ్మాయి పావనిని అడుగుతోంది-
   
    "ప్రత్యేక పరిస్థితుల్లో బోధపడిందన్నారు. ఆ పరిస్థితులేమిటో వివరించగలరా?"
   
    "మనిషి.....ముఖ్యంగా స్త్రీ, తన ముగ్గురు శత్రువు లెవరో తెలుసుకో గలగటం-"
   
    ఎదుటి అమ్మాయి మొహంలో కుతూహలం "స్త్రీకి ముగ్గురు శత్రువులెవరు మేడమ్?" అనడిగింది ఉత్సుకతతో.
   
    "అభద్రతా భావం, ఆత్మన్యూనతా భావం, ప్రేమరాహిత్య భావం."
   
    "కొంచెం వివరించి చెప్పగలరా?"
   
    "చీకట్లో వున్నానని దిగులు పడుతూ కూర్చుంటే, జీవితం చివరి వరకూ అగ్గిపెట్టె గూట్లోనే వుండిపోతుంది. ఎంత హీనంగా బ్రతుకుతున్నా ఆ పరిస్థితుల్లోంచి బయటకు రాలేకపోవటం బైట కొస్తే ఏమవుతుందో అని అక్కడే కుమిలిపోవటం - అభద్రతా భావం! నేనెందుకు పనికిరాను అనుకోవటం ఆత్మన్యూనతా భావం! మాటిమాటికీ తన గురించే ఆలోచించుకుంటూ వుండిపోయి, చిన్న సమస్యలకు కూడా విపరీతంగా భయపడటం దీని లక్షణం. ఇది వుందని తెలిస్తే సన్యాసి కూడా మనల్ని భయపెట్టటానికి ప్రయత్నిస్తాడు. పోతే మూడోది- ప్రేమరాహిత్యభావం. నన్నెవరూ ప్రేమించరని అనుకుంటూ రిజర్వ్ డ్ గా, బింకంగా వుండకపోతే ..... స్త్రీ అన్నాక ఆ మాత్రం గ్రేస్ ఫుల్ నెస్ లేకపోతే ఎదురింటి పెద్దమనిషి కూడా కిటికీలోంచి చెయ్యి అందిస్తాడు."
   
    టీవీ చూస్తున్న భరద్వాజ కుతూహలంగా ముందుకు వంగాడు. అతడికి జీవితంలో థ్రిల్ కలిగించే సంఘటనలు చాలా తక్కువ. అర్ధరాత్రి కిరసనాయిలు వల్ల తడిసిన బట్టల్తో నిస్సహాయంగా నిలబడిన పావనికి, ఈ పావనికీ ఎంత తేడా! అయితే భరద్వాజ ఆలోచిస్తున్నది అదికాదు. ఎంతోమంది రచయితలు, రచయిత్రులు ఎన్నో పేజీల్లో వ్రాసిన భావాల్ని ఆమె చక్కగా నాలుగు పంక్తుల్లో చెప్పింది. తన జీవితంలో తారసపడిన ముగ్గురు వ్యక్తులు పరమహంస, రామనాథం, రామ్మూర్తిలు స్త్రీయొక్క మూడు బలహీనతల్ని ఎలా క్యాష్ చేసుకున్నారో మూడు ముక్కల్లో వివరించింది. ఆమె చెప్పింది నిజమే. ఏ స్త్రీకయినా యీ మూడు సమస్యలూ తప్ప మరేమి వుంటాయి?
   
    "చివరి ప్రశ్న మేడమ్. ఇదంతా మీ అదృష్టంగా భావిస్తున్నారా?"

    "అదృష్టమంటే?"
   
    ఆ అమ్మాయి తడబడి "అదే- జాతకం, అదృష్టం, ఇలా హోమ్ మినిష్టర్ అవటం" అంది. పావని నవ్వింది.
   
    "హోమ్ మినిష్టర్ వరకూ రాకపోదునేమోగానీ, నిశ్చయంగా ఇంత ఆనందంగానూ వుండేదాన్ని. అలా అని అందరు భార్యల్నీ సంసారాలు వదులుకొమ్మని చెప్పటంలేదు. 'భరించలేని బాధల్ని సహిస్తూ కూపస్థమండూకాల్లా జీవించటం కన్నా, ఏ మనిషి అయినా ఉన్నంతలో మరింత ఆనందంగా బ్రతకటం ఎలా అని నిరంతరం ఆలోచించాలి' అని మతఃరమే చెప్తున్నాను. ఇక జాతకం అంటారా? నేను 13 వ తారీఖు, శుక్రవారం అర్దరాత్రి పుట్టాను. ఇంగ్లీషు వాళ్ళకి చాలా చెడ్డదినం అది. అదే టైమ్ కి నా స్నేహితురాలు కూడా అదే హాస్పిటల్ లో జన్మించింది. ముహూర్తకాలంలోనే విధి నా జాతకాన్ని మార్చింది. అయినా సంతోషంగానే వున్నాను. జాతకాలు ఒకటే అయినా నేను టీవీలో మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి ప్రస్తుతం ఏం చేస్తూవున్నదో మరి....!
   
    ప్రసారం సమాప్తమైంది.
   
    సాహితి లేచి టీవీ కట్టేసి క్రిందికి వచ్చింది. ఇల్లంతా నిర్మానుష్యంగా వుంది. బయట వర్షం తాలూకు హోరు వినిపిస్తోంది. ఆమె మెట్లు దిగుతూ వుంటే అప్పుడే లోపలికి ప్రవేశిస్తున్నాడు.....వర్షపుధారలు వంటిమీద నుంచి క్రిందికి ప్రవాహంలా కారుతూండగా - రామనాథం.
   
    "ఏమిటి? ఈ వేళప్పుడు వచ్చావ్? ఏం కావాలి నీకు?" భయాన్ని దాచి పెట్టుకుంటూ అడిగింది.
   
    "మా ఇంటికి వెళ్ళి మా ఆవిడతో ఏదో వాగావుట ఏమిటి?" అడుగు ముందుకు వేస్తూ అన్నాడు. ఆమె దృష్టి తలుపుమీద పడింది. అతడు అప్పటికే దాన్ని వేసేశాడు.
   
    వికృతంగా నవ్వుతూ, "నువ్వు మా ఆవిడతో చెప్పినట్లే నేనూ నీ గురించి ప్రపంచానికి అన్నీ చెప్పేద్దామనుకుంటున్నాను. నువ్వు నాకు వ్రాసిన ఉత్తరాన్ని బయట పెడదామనుకుంటున్నాను. "సాహితి వణికి పోయింది. అదే ప్రేమనుకున్న ఆకర్షణలో ఎప్పుడో వ్రాసిన ఉత్తరం అది.
   
    "చెప్పు? నేనూ నీ గురించి అలా చేస్తే ఎలా వుంటుంది?" నవ్వాడు. "....అలా నేను చెయ్యకుండా వుండాలంటే ఈ రాత్రి నాతో గడపాలి. లేదా, కొత్తగా ఆస్థి వచ్చింది కాబట్టి ఓ లక్ష రూపాయలు ఇవ్వాలి. ఝాన్సీరాణిలా ధైర్యంగా వెళ్ళి మా ఆవిడతో చెప్పినందుకు నేను నీకు వేసే శిక్ష ఇది-"
   
    ఒకప్పుడు 'నా జీవిత సౌదామినీ' అన్న మనిషి ఇప్పుడు ఇంత వికృతంగా కనపడుతున్నాడు. ఆమెకు భయం వేయటం లేదు. దుఃఖం వస్తోంది. తన గురించి కాదు మనుష్యుల్ని చూసి అసలు మనుష్యులు పైకి ఒకలాగా, లోపల ఇంకోలా వుంటారని ఆమెకు తెలీదు. పరమహంస ఒక్కడే అనుకొంది. అందరూ అంతేనా?
   
    అతడి దగ్గర్నుంచి గుప్పున వాసన కొడుతూంది. అన్నిటికీ తెగించిన వాడిలా వచ్చినట్టున్నాడు. వేటగాడికి చిక్కకుండా పరుగెత్తే లేడిలా ఆమె ఆ గదిలో పరుగెడుతూంటే అతడిలో పట్టుదల ఎక్కువవుతోంది. బయట గాలి చప్పుడు ఆమె అరుపుల్ని మింగేస్తూంది. ఆ గదిలో వెలుతురు సూర్యాస్తమయ వర్ణంతో జాలిగా మెరుస్తూంది. కదిలే అస్థిపంజరాల్లా, మధ్యలో కనిపిస్తోన్న నీడలు. నిజమైన నిరవద్యత్వ స్వప్నంలో విషాద జలపాత స్నానం. ఆకాశం రోదిస్తున్నట్టు వర్షం. భూమి పగిలేలా ఉరుము అతడి చేతుల మధ్య ఆమె నైటీ పూర్తిగా చిక్కుపడింది. ఆమె చేతికి అంతలో ఫ్లవర్ వాజ్ తగిలింది. దాన్నితీసుకుని అతడి మొహం మీద బలంగా మోదింది. అతడు చప్పున అడుగు వెనక్కి వేశాడు. వరుసగా మూడుసార్లు ఆమె చరిచింది. అతడి మొహం పచ్చడైంది. నుదుటినుంచీ, ముక్కునుంచీ స్రవించిన రక్తంతో భయంకరంగా కనపడుతున్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS