TeluguOne - Grandhalayam
ధ్యేయం


                        ధ్యేయం


                            -యండమూరి వీరేంద్రనాథ్    అధిగమిస్తే ప్రతి ఓటమి గెలుపుకి తొలిమెట్టు. అవరోహిస్తే ప్రతి గెలుపూ అహాన్ని తలపై నెట్టు.


                          *    *    *

    నాంది:

    బుక్ లవర్స్ షాప్ చాలా హడావిడిగా వుంది. ఆ ఊళ్ళో ఎక్కడా దొరకని పుస్తకాలు కూడా ఆ షాపులో దొరుకుతాయి.

    సాయంత్రం నాలుగైంది. అప్పటికి దాదాపు గంట నుంచీ పుస్తకాలని పరిశీలిస్తున్నారు వారిద్దరూ- నిఖితా,అవినాష్.

    "నిఖితా. అయిందా?" అడిగాడు అవినాష్.

    ఆ అమ్మాయి తను సెలక్ట్ చేసుకున్న మూడు  పుస్తకాలని తీసుకొని కౌంటర్ దగ్గరకు వచ్చింది. పుస్తకం పేరు హౌ టు ఎఛీవ్ సక్సెస్.

    "ఎంత?" అని అడిగింది పుస్తకాన్ని కౌంటర్ మీద పెడుతూ.

    తొంభై ఐదు రూపాయలు" అన్నాడు కౌంటర్ లో వ్యక్తి పుస్తకం మొదటి పేజీ చూసి.

    ఆమె ఆశ్చర్యపోయింది. చాలా చిన్న పుస్తకం అది. మొదటి పేజీ చూసి.

    ఆమె ఆశ్చర్యపోయింది. చాలా చిన్న పుస్తకం అది. మొదటి పేజీ తీసి ధర కోసం చూసింది. ఆ ధర  రూపాయిలలో లేదు. వన్ పౌండ్ అని వ్రాసి వుంది. అది బ్రిటీష్ పుస్తకం.

    "ఇదేమిటి, దీనిమీద 'వన్ పౌండ్ ' అని వుందికదా" అడిగిందామె.

    "టాక్స్ కూడా కలపాలి కదా" ఇంకో కష్టమర్ దగ్గర బిల్లు తీసుకుంటూ ఈ మాత్రం కూడా తెలీదా అన్నట్టు చిరాగ్గానే అడిగాడు.

    "టాక్స్ కలిపినా కూడా అంతవదు" అంటూ కౌంటర్ మీదున్న కాలిక్యులేటర్ తనవైపు తిప్పుకొని లెక్కలు కట్టటం ప్రారంభించింది.

    ఇదంతా చూస్తున్న అవినాష్ కళ్ళల్లో కొద్దిగా భయం, పిరికితనం కనిపించాయి. 'ఎందుకిదంతా' అనబోయి, ఆ మాటలు షాపువాడు వింటాడేమోనని వూరుకున్నాడు.

    'ఇంత పెద్ద షాపులో ఇలాటి సిల్లీ ఆర్గుమెంట్సా' అన్నట్లుగా వున్నాయి కౌంటర్ లోని వ్యక్తి చూపులు. నిఖిత దగ్గర నుంచి దాదాపుగా  లాక్కున్నట్లుగా  కాలిక్యులేటర్  వెనక్కి తీసుకుని "ఈ మధ్య రేట్లు పెరిగాయి మేడం" అని చెప్పాడు.

    "రేట్లు పెరిగితే ఆ విషయం పుస్తకం మీదే వుంటుందిగా " అంది నిఖిత.

    షాపువాడు ఆమెని చూసి వ్యంగ్యంగా నవ్వి, "రేట్లు పెరిగింది- పుస్తకాలకి కాదు. పౌండ్లుకి, డాలర్లకీ, అన్నాడు తన తెలివిని ప్రదర్శిస్తూ.

    "పౌండు ధర ఎంత పెరిగినా, తొంభై ఐదు రూపాయలు కాలేదు" అంది నిఖిత సూటిగా.

    "మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు" అన్నాడు షాపువాడు ఇక మీరు వెళ్ళొచ్చన్నట్లుగా.

    "నిఖితా  ఏమిటిది" అంటూ  కల్పించుకున్నాడు అవినాష్.

    అతని స్వరం మూడో వక్తికి వినిపించనంత తక్కువ స్థాయిలో వుంది. "ఇక్కడ  నువ్వు అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తున్నావు".

    నిఖిత ఆశ్చర్యంగా అవినాష్ వైపు చూసి ఏమీ మాట్లాడకుండా  షాపువాడివైపు తిరిగి "సరే తొంభై ఐదు రూపాయలకే తీసుకుంటాను. బిల్లిచ్చి ఆ విషయం కూడా దానిమీద వ్రాయండి" అంది.

    షాపువాడు ఆమె దగ్గర నుంచి విసురుగా పుస్తకం తీసుకొని వెనకాల ర్యాక్ లోకి విసిరేసి "ఆ బుక్ మేము అమ్మదల్చుకోలేదు" అన్నాడు.

    "సరే ఆ విషయమే వ్రాసివ్వండి" అంది నిఖిత.

    అవినాష్ కంగారుగా చూస్తున్నాడు. అతడి నుదుటమీద చమటపడుతోంది. షాపువాడు నవ్వాడు.

    "ఇక్కడ మేము ఏ యే పుస్తకాలు అమ్ముతామో, ఏవి అమ్మమో ఇవన్నీ అడిగిన వాళ్ళందరికీ వ్రాసివ్వవలసిన అవసరం మాకు లేదు" అన్నాడు.

    నిఖిత ఒక నిర్ణయానికొచ్చినట్లు "ఓ.కే" అని ఆగి "ఆ ఫోన్ వాడుకోవచ్చా" అనడిగింది.

    అనుమానంగా  షాపువాడు "ఎక్కడికి చేస్తారు?" అన్నాడు.

    "మీ దగ్గర ఫోన్ వాడినప్పుడు ఎక్కడికి చేస్తారో, ఎవరికి చేస్తారో చెప్పవలసిన అవసరం మాకు లేదనుకుంటాను" అని అతని మాట తిప్పి కొడుతూ"కావాలంటే ఇదుగో ఫోన్ కోసం రెండ్రూపాయలు తీసుకోండి" అని అతడి సమాధానం కోసం  వేచి వుండకుండా నెంబర్ డయిల్ చేయసాగింది.

    "ఏ నెంబర్ అది? ఎక్కడికి చేస్తున్నారు?" ఆ వ్యక్తి గొంతులో ఈ సారి కొంచెం కంగారు ధ్వనించింది.

    "ప్రివెన్షన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫీసుకి" అందామె సీరియస్ గా. "మీరు విదేశీమారకంలో మోసం చేస్తున్నారు అని ఫిర్యాదు చేయాటానికి."

    షాపువాడు వంగి ర్యాక్ లోంచి ఆ పుస్తకం తీసిస్తూ "వద్దులెండి మేడం. గొడవెందుకు, ఈ పుస్తకం తీసుకోండి" అంటూ అరవై రూపాయలకి బిల్లు రాసిచ్చాడు.

    నిఖిత పెదవులమీద సన్నని చిరునవ్వు కదలాడింది. ఓరగా అవినాష్ వైపు చూసింది. ఇప్పటికి అవినాష్ తేరుకున్నట్లుగా కనపడ్డాడు. ఇద్దరూ పుస్తకం తీసుకొని బైటకొచ్చారు.

    "భలే చేశావు నిఖితా, నిజంగా నువ్వింత ధైర్యంగా వాదిస్తావని నేనను కోలేదు" అన్నాడు అవినాష్.

    నిఖిత మాట్లాడలేదు. నవ్వి వూరుకుంది.

    "ఏం పుస్తకం అది ఇంతకీ" అడిగాడు అవినాష్.

    ఆమె బ్యాగ్ లోంచి పెన్ను తీసి ఆ పుస్తకం మీద ప్రేమతో అవినాష్ కి' అని వ్రాసింది. ఆ పుస్తకం అతని కిస్తూ "దీన్ని చదువు అవినాష్, ఇది నీకు చాలా  అవసరం. ఈ పుస్తకం నువ్వు ఎంత  తొందరగా చదివితే అంత మంచిది" అంది.

    అతనా పుస్తకం తీసుకొని అట్టమీద పేరు చూశాడు.

    "హౌ టు ఎఛీవ్ సక్సెస్" అతడి మొహం వాడిపోయింది.

    "ఎగతాళి పట్టిస్తున్నావా?" అనడిగాడు.

    నిఖిత అతనికి క్షమాపణ చెప్పే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. "నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యమంటున్నాను" అని అంది. ఆమె స్వరంలో కమిట్ మెంట్ కనబడింది. "మనం ఈ పుస్తకాన్ని కొంటూ కూడా, ఒక చిన్న అన్యాయాన్ని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోలేకపోతే, ఎండుకింక మనకీ చదువులు? పుస్తకాలు? సాహిత్యం? మనకి ఎఛీవ్ మెంట్ అన్నది అసలు ఈ జన్మకి రాదు."

    అవినాష్ అప్పటికి బాగా తేరుకున్నాడు. అతడు కూడా నవ్వేశాడు.

    "థేంక్యూ!" అన్నాడు పుస్తకం అందుకుంటూ.

    "నీకో విషయం చెప్పనా" అంది నవ్వుతూ.

    "ఏమిటి" అన్నాడు.

    "ప్రివెన్షన్ ఆఫ్ ఫారెన్ ఇర్రెగ్యులారిటీస్ అన్న ఆఫీసు లేదసలు".


                                                 *    *    *

    బైట సన్నగా వర్షం పడుతోంది. ఎండ కూడా అలాగే వుంది. ఎండ వెలుగులో వర్షం ధారలుగా పడుతూ వుంటే చూడ్డానికి గమ్మత్తుగా వుంది. జీవితంలాగే పొంతనలేని అనుభవాల కలయిక.

    షాప్ లోంచి బైటకొచ్చిన నిఖిత, అవినాష్ లు మెట్లమీద నిలబడి వున్నారు. వర్షం తుంపర్లు తుంపర్లుగా పడుతూవుంటే ఒక అవ్యక్తానుభూతిని పొందుతూ నిఖిత మేఘాలకేసి  చూస్తోంది. అనుకోకుండా దూరంగా ఒక లూనా వచ్చి ఆగింది. లూనా  స్టాండ్ వేస్తున్న అమ్మాయిని చూసిన నిఖిత, అవినాష్ వైపు తిరిగి "ఆ అమ్మాయిని గుర్తుపట్టావా" అని అడిగింది.

    అతడికి ఎక్కడో చూసినట్లే వుందిగాని పూర్తి స్ఫురణకు రావట్లేదు. నిఖిత ఈ లోపులో 'ధాత్రీ' అని గట్టిగా కేక వేసింది. ఇంకో షాప్ మెట్లమీదకి చేరుకోబోతున్న ధాత్రి ఆ పిలుపుకి వర్షంలో తడుస్తూ పరుగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి "నిక్కీ నువ్వేనా" అంది సంతోషంగా.

    "అవును నేనే, అమ్మా వాళ్ళు బాగున్నారా? ఏం చేస్తున్నావ్?"

    "అంతా బాగానే వున్నారు. నేనింకా డిగ్రీ ఫైనల్ లోనే వున్నాను. నీ విషయం ఏంటి? మీ రాము ఏం చేస్తున్నాడు" అని అడిగింది ధాత్రి గబగబా.

    నిఖితకి నవ్వొచ్చింది. "నీ తొందర ఏ మాత్రం తగ్గలేదు సుమా" అంటూ తన గురించి చెప్పింది. "డిగ్రీ అవగానే నాకు ఉద్యోగం వచ్చింది. ఐ.టి.సి.లో చేస్తున్నాను. రాము డిగ్రీ పూర్తిచేసి చార్టర్డ్ అకౌంటెన్సీ చేస్తున్నాడు. ఇదిగో ఈ అబ్బాయిని గుర్తుపట్టావా? అవినాష్. ఇంజనీరింగ్, యం.బి.ఎ. అయి ప్రస్తుతం ఆల్విన్ లో వున్నాడు".

    ధాత్రి ఒక్కక్షణం అవినాష్ వైపు తేరిపార చేసింది. పాతస్మృతుల పుటలలోంచి ఒక జ్ఞాపకాన్ని బైటకి తీస్తున్నట్లు ఆమె మొహం నెమ్మదిగా విచ్చుకుంది.

    "ఓ! పి.పి" అని అరిచింది. పి.పి. అంటే ఆ రోజుల్లో పుస్తకాల పురుగు అని వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరన్నమాట.

    ధాత్రి మొహంలో ఆనందం స్ఫుటంగా కనిపిస్తోంది. "అవినాష్! ఎన్ని రోజులైంది నిన్ను చూసి" అంది ఉద్వేగంగా. కొంచెంసేపు వాళ్ళు వర్షాన్ని చూస్తూ మాట్లాడుకున్నారు. ఈ లోపులో నిఖిత "అన్నట్లు నీ పేరు ఏ రోజైనా పేపర్లో ఒక  టెన్నిస్ ప్లేయర్ గానో, ఒక డాన్సర్ గానో వస్తుందని అనుకొంటూ వుంటాను" అంది ధాత్రితో. అప్పటివరకూ నవ్వుతూ మాట్లాడుతున్న ధాత్రి ముఖంలో కొంచెం విషాదరేఖ అస్పష్టంగా కనిపించింది.

    "అంత గొప్ప పేరేం తెచ్చుకోలేదులే" అంది.

    "అలా కాలనీకి వెళ్దాం రారాదూ. అందరూ నీ గురించి ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ వుంటారు. నీకు వేరే పని లేకపోతే ఇప్పుడే వెళ్దాం" అంది నిఖిత.

    ధాత్రి కంఠంలో ఒక వాసిలేటింగ్ ఫీలింగ్ "నాకంటూ ఎప్పుడూ ఏమీ పనులుండవు. అన్నీ నేను మా మమ్మీ, డాడీల కోసమే చేస్తాను. పద, ఈ రోజు నా సంతోషం కోసం మొదటి సారి కొన్ని గంటలపాటు గడుపుతాను" అంది ఫిలసాఫికల్ గా.

    ఈ లోపులో వర్షం తగ్గింది.

    "నేను వెళ్తాను" అని అవినాష్ అక్కడనుంచి మరోవైపుకు వెళ్ళిపోయాడు.

    ధాత్రి లూనామీద వాళ్ళు నిఖిత వుంటున్న కాలనీ చేరుకున్నారు. ఆ కాలనీ చేరుకోగానే ధాత్రి మనసునిండా అలలు అలలుగా జ్ఞాపకాల పొరల్లోంచి గతానుభవాల గుర్తులు బైటకి రాసాగాయి. 12 ఏళ్ళ వయసు వచ్చేవరకూ ఆమె ఆ కాలనీలో తిరిగింది. ఆ కాలనీ చాలా చిన్నది. ఏభై ఇళ్ళుంటాయి. అప్పుడు లేవుగాని, ఈ మధ్య కొన్ని ఇళ్ళకు పై అంతస్తులు లేచాయి. పెద్దగా  మార్పులు లేవు. కాలనీ మధ్యలో చిన్న పార్కుంది. అక్కడే ఆడుకునేవారు పిల్లలందరూ. ధాత్రి చివరిసారిగా చూసినపుడు చిన్న చిన్న చిగుర్లు తొడుగుతున్న మొక్కలన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలైపోయాయి. వృక్షానికి అనుభవాలుండవు. కాలం వాటిని శాసిస్తుంది. మనుషులను కాలంతోపాటు అనుభవాలు కూడా శాసిస్తాయి.

    తల్లి కడుపులో పెరుగుతున్న శిశువు నుదుటికన్నా స్వచ్ఛమైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు. బ్రహ్మకూడా అప్పటికి ఆ నుదుటిమీద 'రాత' వ్రాసి వుండడు.

    పుట్టని పాప నుదురులాగే పెరిగే పిల్లల మనసు కూడా స్వచ్ఛమైనదే. పిల్లల భవిష్యత్తును నుదుటిమీద బ్రహ్మ వ్రాస్తే మనసుమీద పెద్దలు గీసిన ప్రభావం మాత్రం జీవితాంతం పోదు.

    ....ఒకప్పుడు చిన్న మొక్కలన్నీ, ఇప్పుడు జీవితంలో సంతృప్తికరంగా స్థిరపడ్డ వ్యక్తుల్లాగా-తమ అస్థిత్వాన్నీ నిలబెట్టుకుంటున్నట్టు ఠీవిగా నిలబడ్డాయి.

    కానీ, అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఈనాడు ఏ స్థితిలో వున్నారు? ఎలా చెదిరిపోయారు? ఆ చెట్లకే నోళ్ళుంటే ఎన్నెన్ని కథలు చెబుతాయో? పదిహేనేళ్ళ క్రితం....


Related Novels