Previous Page Next Page 

420 మెగా సిటీ పేజి 3


                           అహ నా ఇల్లు అంట            
    ముందు ప్రసూనాంబ చూసిందా ఇంటిని. చూడ్డంతోనే ఆమెకు ఆనందంతో గుండె ఆగిపోయినంత పనయింది. "అబ్బ! ఎంత అందంగా ఉందో ఈ ఇల్లు" అనుకుందామె తెగ మురిసిపోతూ. ఆ అందమైన ఇంటిపైన అంతకంటే అందంగా అంతకంటే మురిపాలతో రాసి ఉన్న అక్షరాలూ వేగంగా కొట్టుకుంటూన్న గుండెతో చదివిందామె.    
    "ఇదే- ఇదే మీరు కలలు కంటున్న స్వప్న మందిరం! పదేపదే మీ సొంతం కాబోతూన్న సొంత గృహం" ఆ తరువాత మేటర్ కూడా చకచకా చదివేసిందామె.
    "కేవలం భారత ప్రజల మీద కక్కుకు చచ్చేంత ఎక్కువ ప్రేమ పొంగి పొరలటం వల్ల 'హోమ్ లోన్' పథకాన్ని మా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వారు ప్రారంభిస్తున్నారు. మేమిచ్చే రుణ సహాయంతో నేడే ఈ పథకం చేపట్టి మీరు ఎప్పటినుంచో కలలు కంటూన్న స్వప్న గృహాన్ని సొంతం చేసుకోండి!
    ఆలసించిన ఆశాభంగం!
    ఎల్లప్పుడూ భారత ప్రజలను వదలకుండా వెంటాడి, వేటాడి సేవలు చేసే బ్యాంక్ మా బ్యాంక్" అంతవరకూ చదివేసరికి ప్రసూనాంబ ఇంక ఉండలేకపోయింది. ఆ న్యూస్ పేపర్ పట్టుకుని గాల్లో తేలిపోతున్నట్లు నడుస్తూ రామ్ గోపాల్ గదికి చేరుకుంది. రామ్ గోపాల్ కూడా ఆ ప్రకటన చూసి థ్రిల్ అయ్యాడు.
    "ఇయాళ్రేపు మన గవర్నమెంట్ జర ఆకలి తోటి పనిచేస్తున్నదే! మనసంటి పబ్లిక్ కి మదద్ జెయ్యనికి జబర్దస్త్ స్కీమ్ లు షురూ జేస్తున్నది" అన్నాడు ఆనందంతో పొంగిపోతూ.
    "అయితే ఆలస్యం ఎందుకండీ! మనం ఈ దిక్కుమాలిన ఏరియాలో ఫ్లాట్ కొని ఆరేళ్ళయిపోతోంది. ఇల్లు కట్టుకోడానికి డబ్బులేక ఈ పాడు అద్దె కొంపలో ఆ ఓనర్ గాడి సర్వ చాదస్తాలకూ తల ఒగ్గి, చేతులు కట్టుకుని నిలబడి నానా అవస్థలూ పడుతున్నాం. మన మధ్య తరగతి వాళ్ళ పాలిత కల్పతరువులా పాపం ఈ బ్యాంక్ వాళ్ళెవరూ ఇల్లు కట్టుకోడానికి అప్పు ఇస్తామంటున్నారు."
    రామ్ గోపాల్ ఒక్క క్షణం ఆలోచించాడు.
    "అంటే ఇయాళ్నే బ్యాంక్ కి బోమంటావా?" అడిగాడు సందేహంగా.
    "అవునండీ! రాక రాక ఛాన్స్ వచ్చింది. దీన్ని వదులుకుంటే ఎలా?"    
    "మరి నా ఆఫీస్?"
    "ఇవాళ సెలవు పెట్టేయండి! సొంతానికి ఓ ఇల్లు ఏర్పడుతోంటే ఆఫీస్ ఓ రోజు ఎగ్గొడితేనేం?"
    ఆమె చెప్పిన మాట నిజమేననిపించింది రామ్ గోపాల్ కి.
    అప్పటికప్పుడే వాళ్ళ ఆఫీస్ సూపర్నెంట్ కి టెలిఫోన్ బూత్ లో నుంచి ఫోన్ చేశాడతను.
    "సార్! నేను రామ్ గోపాల్ ని మాట్లాడుతున్నాను" అన్నాడు. అవతలి గొంతు హలో అనగానే
    "ఎస్? రామ్ గోపాల్!"
    "నేను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కెళ్ళి మాట్లాడుతున్నా సార్. హెల్త్ ఖరాబున్నదని ఈడికొచ్చినా! ఒక్కదినం లీవ్ శాంక్షన్ జేయాల్సార్."
    "నో ప్రాబ్లెమ్ రామ్ గోపాల్! తీసుకో! కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కి పోయినోండ్లకు ఒక్కదినం ఏం సరిపోతది? వాలంటరీ రిటైర్మెంట్ కి అప్లయ్ జేసి నీ జాబ్ మీ మిసెస్ కి ఇప్పియ్యనుండె! గట్ల జేస్తే నువ్ వాపస్ వచ్చినా రాకున్నాగానీ నడిచిపోతది."
    రామ్ గోపాల్ గతుక్కుమన్నాడు.
    "నాకు మరీ సీరియస్ ప్రాబ్లెమ లేద్సార్! జరంత సర్ది జేసిందన్నట్లు- అంది ఇస్నొఫీలియానా కాదా అని టెస్టింగ్ జేయిపించాలె! గంతనే!"
    "ఓకే రామ్ గోపాల్! వన్ డే లీవ్ శాంక్షన్డ్."
    "థాంక్యూ సర్."
    ఇంటికి చేరుకుని త్వరత్వరగా రెడీ అయి ఇద్దరూ న్యూస్ పేపర్లో ప్రకటన ఇచ్చిన ఆ బ్యాంక్ కి చేరుకున్నారు. మేనేజర్ చుట్టూ అరడజను మంది మూగి వున్నారు. అందరితోనూ ఒకేసారి మాట్లాడుతున్నాడతను.
    "సీతారామ్! మాకు అయిదు లక్షలు ఫిక్సుడ్ వేస్తామన్నారుగా- దాని సంగతేమయింది?"
    "వేస్తాన్సార్! తప్పకుండా వేస్తా! మా వాడి లోను సంగతేమయింది మరి?"
    "ఇంకో రెండు నెలలు ఆగండి. ప్రస్తుతం క్రెడిట్ స్క్వీజ్ ఉంది. ఆ! మీకేం కావాలి?" రామ్ గోపాల్ వంక చూస్తూ అడిగాడు.
    "అదేనండీ! హోమ్ లోన్ అనే స్కీమ్- మా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి తీసిన్రని పేపర్ల చదివినా! దాని గురించి...."
    ఓ- అదా! వెరీగుడ్! కూర్చోండి! నిజం చెప్తున్నా కదా! మిడిల్ క్లాస్ వాళ్ళ పాలిట ఈ స్కీమ ఒక వరం అనుకోండి. ఆఁ- "మీకేం కావాలండీ!" ఇంకొకతనిని అడిగాడు.
    "ఓడీ కావాల్సార్! లేకపోతే ఆరు చెక్కులు బౌన్స్ అయిపోతాయ్. క్లర్క్ మిమ్మల్ని అడగమంటున్నాడు."
    "అలాగా! మీ షాప్ లో అయిలాఫ్ అని ఏదో కొత్త కోల్డ్ క్రీమ్ వచ్చిందంటగా? మా అమ్మాయ్ అది కావాలని అడుగుతోంది. ఒక బాటిల్ శాంపుల్ పంపుతే..."
    "ఇప్పుడే తెచ్చిస్తాన్సార్!"    

 Previous Page Next Page