Previous Page Next Page 

వారుణి పేజి 3


    ఈ ప్రశ్నకీ నారాయణ సమాధానం చెప్పలేదు.
    "పలకరేం నాన్నా! అన్నయ్య యింకేమో అనుకుంటారనీ, ఆడబిడ్డలు ఒప్పుకోరనీ, యిలా యిలా కుటుంబంలోని అందరి అభిప్రాయాల్ని మన్నిస్తూ పార్ట్నర్ ని వెదుక్కోవటం మొదలెడితే మన జీవితం ఎక్కడ తేలుతుందో మనకే తెలీదు."
    ఒక్కక్షణం ఆగాడు సారధి. "పెళ్ళి విషయంలో అంతా పెద్దల బాధ్యత అంటూ వదిలెయ్యటం ఆ తర్వాత జీవితంలో పెద్ద అసంతృప్తితో బాధపడటం- భార్యని విసుక్కోవటం- యింట్లో వాళ్ళతో పోట్లాట పెట్టుకోవటం- అత్తమామల్ని ఎదిరించటం- ఇదీ మామూలుగా మన కుటుంబాల్లో మామూలు మనుషుల జీవితం- ఆ జీవితం నాకొద్దు నాన్నా!" నిర్దుష్టంగా చెప్పాడు సారధి.
    ఈ మాటలు ఆయనపై బాగా పనిచేసేయేమో సారధికి జవాబు చెప్పలేదు.
    తండ్రి మనసు మెత్తబడుతోందని గ్రహించాడు సారధి. అందుకే మరింత ధైర్యంతో, మరింత ఉత్సాహంతో తన మనసులోని విషయం చెప్పాడు.
    "నాన్నా! నాకు వారుణితో ఏడాది పరిచయం వుంది. తనంటే ఏమిటో నాకు బాగా తెలుసు. నేనేమిటో నా మనస్సేమిటో, నా మనస్థత్వం ఏమిటో వారుణికి కూడా చాలా బాగా తెల్సు."
    "ఇద్దరు ఒకటిగా కావాలనుకుంటే ముఖ్యంగా మనస్సులు తెలుసుకోవాలి, కలుపుకోవాలి అన్నాడు నారాయణ.
    "థాంక్యూ డాడీ! మా మనస్సులు కలిసిపోయాయి. మనస్థత్వాలు కలసిపోయాయి. మేం సుఖపడతాం. ఆ నమ్మకం వుంది. మిమ్మల్నీ సుఖపెడతాం ఆ విశ్వాసం వుంది. ఏ హ్యాపీ మారీడ్ లైఫ్ యీజ్ ది సోర్స్ ఆఫ్ ఏ హ్యాపీ సొసైటీ అన్న సూత్రాన్ని నమ్ముతాను. మేం సుఖంగా, శాంతిగా ఉంటే మన కుటుంబం శాంతిసుఖాలతో తేలియాడుతుంది. మనలాంటి కొన్ని కుటుంబాలే సంఘం కదా!" అన్నాడు సారధి. ఈ విషయంలో తండ్రితో తండ్రిలా కాకుండా స్నేహితుడితో లాగా మాటాడాలనుకున్నాడు అతను. దానికి కారణం నారాయణ పెంపకమే.
    "నీ యిష్టం సారధీ !"
    నారాయణ పూర్తిగా చెప్పకముందే ఆయన అభిప్రాయం అర్థమైంది సారధికి. ఇనుమడించిన ఉత్సాహంతో "థాంక్యూ డాడీ!" అన్నాడు.
    "ఎవరి జీవితం వాళ్ళది సారధీ- నీకూ పాతికేళ్ళ వయస్సు వచ్చింది పదహారేళ్ళు దాటితే కొడుకుని స్నేహితునిలాగా చూసుకోవాలి. యుక్తవయస్సు వచ్చి, చదువుకుని, బుద్ధిమంతుడై, ఉద్యోగం చేస్తూ, తనంత వాడైన కొడుకుని అదుపులో పెట్టాలని ఏ తండ్రీ అనుకోకూడదు సారధీ. అందుకే చదువు విషయంలోనూ, ఉద్యోగం విషయాల్లోనూ మీకు నేను పూర్తి స్వేచ్చ యిచ్చాను. కోరింది చదువుకున్నారు, కోరిన ఉద్యోగాలు వచ్చాయి. ఒకవేళ అక్కర్లేదనుకుంటే మానేయ్యగల ఉద్యోగం విషయాల్లోనే స్వాతంత్ర్యం యిచ్చాను. ఇక కోరిన అమ్మాయిని చేసుకుంటానంటే నేను కాదంటానా?" నింపాదిగా తన మనస్సులో విషయం బయటపెట్టారు నారాయణ.
    తండ్రి సమయ దృష్టికి- పరిశీలనకి-యువతరంపై ఆయనకున్న అభిప్రాయాలకి ఆయనపై ఎంతో గౌరవం పెరిగింది. అతనితో- "మీలాంటి తండ్రి లభించటం మా అదృష్టం డాడీ" అన్నాడు అతను. భుజాల్ని ఎగరేశాడు కొద్దిగా, చాలా ఆనంద సమయాల్లో అతనలా ప్రవర్తిస్తాడు.
    "సారధీ_" మెల్లిగా పిలిచారాయన. ఇప్పుడాయన కంఠం బరువుగా పలికింది, పాతికేళ్ళ అనుబంధం కొద్దికొద్దిగా సడలి పోతున్న భావన ప్రతిధ్వనించింది.
    "చెప్పండి డాడీ ఉత్సాహంగా అన్నాడతను.
    "తల్లి దండ్రులకి సంతానంపై కొన్ని ఆశలుంటాయి. మంచి చదువు చదువుకోవాలని వుంటుంది. మంచి హోదా గల ఉద్యోగం సంపాదించుకోవాలనీ, తద్వారా జీవితంలో మీరు సుఖపడుతూ వుంటే చూచి ఆనందించాలనీ వుంటుంది.  
    అలాగే మీకు తగిన యోగ్యురాలైన మంచి కుటుంబ సంప్రదాయం నుంచి వచ్చిన చక్కని అమ్మాయిని పెళ్ళి చేసుకుని సుఖ సంతోషాలతో కాపురం చెయ్యాలనీ వుంటుంది.

  Previous Page Next Page