Previous Page Next Page 

420 మెగా సిటీ పేజి 2


    "సోదర సోదరీమణులారా! మీ కాలనీ వాళ్ళకు ఏర్పడ్డ భయం నగరంలోని ప్రజలందరికీ కూడా ఏర్పడ్డ మాట నిజమే! కానీ మెగాసిటీ అవటం వలన ఏవేవో గుర్తు తెలియని సౌకర్యాలు మిమ్మల్ని ఎటాక్ చేస్తాయని మీరు భయపడాల్సిన పనిలేదు!
    మా డిపార్టుమెంటు సజీవంగా వుండగా మా తరపు నుండి ఎలాంటి సౌకర్యం ప్రజలకు లభించదని నేను హామీ ఇస్తున్నాను. మెగాసిటీ అయినా కూడా రాంగ్ నెంబర్లు యథావిధిగా పోతూనే ఉండేలా చీ పూచీ నాది! అలాగే 197,199 నెంబర్లు ఎవరికీ దొరక్కుండా ఇరవైనాలుగు గంటలూ ఎంగేజ్ లోనే ఉండేలా చూసే నైతిక బాధ్యతను కూడా మేము విస్మరించమని మనవి చేసుకుంటున్నాను.
    ఇంతకుముందు నగరంలో ఫోన్ కోసం అప్లయ్ చేసినవాడు చచ్చాకే మేము ఫోన్ కనెక్షను ఇస్తూ వచ్చాం! మెగాసిటీ అయ్యాక వాడు చచ్చినా ఫోను కనెక్షన్ ఇవ్వటం జరగదనీ, అప్లయ్ చేసిన వ్యక్తి భావితరాల వారికి మాత్రమే ఇవ్వటం జరుగుతుందనీ ఆనందంతో తెలియ చేసుకుంటున్నాను."
    మా కాలనీ వాళ్ళందరూ పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.
    "టెలిఫోన్ డిపార్ట్ మెంట్ అధినేత - ప్రపంచ నేత" అంటూ నినాదాలు చేశారు నినాదాల గ్రూపు వాళ్ళు.
    ఆ తర్వాత వాటర్ వర్క్ చీఫ్ ఇంజనీరు లేచి నిలబడ్డాడు.
    "సోదర, సోదరీమణులారా! మన రాజధాని మెగాసిటీ అయినంతమాత్రాన మంచినీటి కరువు తీరిపోతుందన్న భయం మీకవసరంలేదని మనవి చేస్తున్నాను. ఇదివరకు రోజు విడిచిరోజు నీరు సప్లయ్ చేసేందుకు సరిపోయేది. మెగాసిటీ అయ్యాక నెల - అంటే సంవత్సరానికి ఆరుసార్లు సప్లయ్ చేయబడుతుంది.
    కనుక కొత్తగా వచ్చిపడే పెద్ద ప్రమాదమేమీ వుండదు. మెగాసిటీ అవటం వల్ల కోట్లకొద్ది డబ్బుతో రోడ్లు పెద్దవి చేసే ప్రమాదం పొంచి ఉన్నా, ఆ రోడ్లను మా డిపార్టుమెంట్ ఎప్పటికప్పుడు తవ్వి గోతుల మయం చేసి మిమ్మల్ని నరకయాతన పెడతామని కూడా మాట ఇస్తున్నాను."
    ఈసారి మరింత పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు మావాళ్ళు.
    అతని హామీ మావాళ్ళకు పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చింది.
    ఆ తరువాత మునిసిపల్ కార్పొరేషన్ అధికారి మైక్ ముందుకొచ్చాడు.
    "భాయియో! బెహనో! మెగాసిటీ అయినా గూడా మా కార్పొరేషన్ గిట్లనే అనుమతిలేని కట్టడాలను రూల్స్ కి వ్యతిరేకమైన కట్టడాలను మంచిగ ప్రోత్సహిస్తుందని ఖసమ్ తోటి జెప్తున్నా! ఎవళ్ళుబడితే ఆళ్ళు గవర్నమెంట్ జాగాలు, ప్రైవేట్ జాగాలు కబ్జా చేసినా గూడా గవర్నమెంట్ అడ్డు రాదు, కల్పించుకోము. మెయిన్ రోడ్డు గిప్పుడు కూరగాయల బండ్లు, పళ్ళమ్మే బండ్లవాళ్ళు సగం వరకూ కబ్జా జేసిన్రుగానీ మెగాసిటీ అయినాక పూర్తి మెయిన్ రోడ్లు కబ్జా చేయనీకి స్వయంగా మేమే పర్మిషనిస్తాం! అప్పుడు మీరంతా ఇంక మెయిన్ రోడ్ల మీదకెళ్ళే పనే ఉండది! చిన్న చిన్న సందుల్లోకెళ్ళి తిరగాలె! ఇక చెత్తాచెదారాలూ ఎప్పటికీ క్లీన్ చేసెడిది ఉండదన్నట్లు-" అందరూ మళ్ళీ తప్పట్లు కొట్టారు.
    ఈసారి ఆర్టీసీ అధికారి ముందుకొచ్చాడు.
    "మెగాసిటీ అనగానే బస్సుల సంఖ్య పెంచి ఇంకా ఎక్కువ విషపూరితమైన పొగలు గాలిలోకి వదిలి వాతావరణాన్ని వీలైనంత ఎక్కువగా కలుషితం చేస్తామని నేను ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. అలాగే చెడిపోయిన బస్ లను ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రవేశపెట్టి సడెన్ గా బస్ లు కాన్సిల్ చేసేయటం, లేదా ప్రయాణీకులందరితోపాటు నదుల్లోకి దూకించే బస్ లు ప్రవేశపెట్టటం లాంటి కార్యక్రమాలు చేపట్టగలమనీ తద్వారా ప్రజలకు అదనపు సౌకర్యాల నుంచి ఎలాంటి ప్రాణగండం లేకుండా చూడగలమనీ హామీ ఇస్తున్నాను" మళ్ళీ బిగ్గరగా తప్పట్లు కొట్టి నినాదాలు చేశారు మావాళ్ళు.
    ఆ తరువాత పరిశ్రమల అధికారి లేచి నిలబడ్డాడు.
    "సోదరులారా౧ మనది మెగాసిటీ అయిపోతే ప్రభుత్వం మీమీద లేనిపోని సౌకర్యాలు రుద్దుతుందని భయపడనక్కరలేదు. నగరానికి అన్నివేపులా విస్తరించి ఉన్న మా పరిశ్రమలు భూగర్భజలాన్ని మరింత కలుషితం చేస్తాయని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఇంతకుముందు బోర్ వెల్ వాటర్ తాగితే మీ అందరికీ రకరకాల జబ్బులు పుట్టుకొచ్చేవి. కానీ మెగాసిటీ అయ్యాక నీళ్ళు తాగ్గానే ఇన్ స్టెంట్ గా అక్కడక్కడే క్షణాల్లో గిలగిల కొట్టుకొని పిట్టల్లాగా నేలమీద పడి ఛస్తారని కూడా నేను హామీ ఇస్తున్నాను.
    ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ మా చేతిలో కీలుబొమ్మలే కాబట్టి వాళ్ళంతా కూడా మాకెంతో సహకరిస్తారు. మెగాసిటీలో మరెన్నో మెగా పరిశ్రమలకు లైసెన్సులు ఇచ్చి మేము ప్రజలందరినీ నరకయాతన పెట్టేందుకు మరెంతో ప్రోత్సాహం మాకు లభిస్తుందని మీకువాగ్దానం చేస్తున్నాను.
    ఆ తరువాత లారీల అసోసియేషన్ ప్రతినిధి మైక్ దగ్గరకు వచ్చాడు.
    "ఇగో! ఈ మెగాసిటీ, గిగాసిటీలు మాకెరుక లేదు. భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా! మెగాసిటీలో ఎంత విశాలమయిన రోడ్లయినా వేసుకోనీండ్రి! మా లారీలు రోడ్ ని మూడొంతులు ఆక్రమించి నిలబెడతాం! ట్రాఫిక్ జామ్ లయి, డ్రైవింగ్ చేయనీకి పరేషానై పబ్లిక్ బ్లడ్ ప్రెజర్ తోటి చస్తారు! కనుక నేను జెప్పెడిదేమంటే మా లారీవోళ్ళు ఉండంగా మీ జోలికి ఎలాంటి సౌకర్యం రాదని మళ్ళీమళ్ళీ జెప్తున్న! ఏమంటున్న? జైహింద్" అతను ముగించగానే తప్పట్లు మార్మోగిపోయినయ్.
    ఆ తరువాత విద్యుచ్చక్తి శాఖ ప్రతినిధి స్టేజ్ మీదకొచ్చాడు.
    "వాటర్ వర్క్స్ వాళ్ళు తవ్వకుండా వదిలేసిన రోడ్లన్నీ మెగాసిటీ అయినా కూడా మేము తవ్వి మీకెలాంటి సౌకర్యం కలగకుండా కాపాడతామని మా డిపార్ట్ మెంటు తరపున మీ అందరికీ మాట ఇస్తున్నాను. మెగాసిటీ అనగానే విద్యుత్ కోతను రోజుకి రెండుగంటల నించీ 22 గంటలకు పెంచి మాకు చేతనయిన సేవ మేము చేస్తాం! అంతేకాదు కొంచెం పెద్దగాలి వీస్తే చాలు తెగి రోడ్డున పోయేవారి మీద పడే పాతకాలంనాటి తీగలే వాడి మీ అందరినీ అదివరక్కంటే ఎక్కువ సంఖ్యలో పరలోకానికి పంపగలమని కూడా ఈ మెగాసిటీ ఏర్పడే శుభసందర్భాన మీకు తెలియజేస్తున్నాను."
    అతని మాటలు పూర్తవకుండానే హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
    మీటింగ్ ముగిశాక అందరూ నిర్భయంగా, ఆనందంగా ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకున్నాం! మెగాసిటీ ఏర్పడినా కూడా మాకు కొత్త సౌకర్యాల ప్రమాదం ఏమీ ఉండదన్న నిజం తెలిసేసరికి ఆ రాత్రి ఆనందంగా నిద్రపట్టింది. ఉదయం రంగారెడ్డి పరుగుతో వచ్చి అందరినీ బయటకు పిలిచాడు.
    "మెగాసిటీ అవటం వల్ల మనం కట్టాల్సిన పనులన్నీ పెరిగిపోతాయట! ఇంటి పన్ను పదింతలు అవుతుందిట! కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, నీళ్ళ ఛార్జీలు అన్నీ అయిదారు రెట్లు పెరిగే అవకాశం ఉందిట" అన్నాడు గాబరాగా!
    ఎవరికీ నోట మాట రాలేదు చాలాసేపు!
    "ఇందుకా- మన గవర్నమెంటు మెగాసిటీ మెగాసిటీ అని సంబర పడుతోంది!" అన్నాడు శాయిరామ్.

 Previous Page Next Page