Previous Page Next Page 

డెత్ సెంటెన్స్ పేజి 2

       
    ఈ ఉత్తరం రాసిన అమ్మాయి ఇప్పుడెక్కడుందో కూడా అతనికి తెలీదు.

 

    వృత్తిపరమైన - వ్యక్తిగతమైన ఇబ్బందుల్లో... డిప్రెషన్ లో ఆ ఉత్తరమే అతనికి స్ఫూర్తి!

 

    నిస్సహాయంగా అనంత వాయువుల్లో కలిసిపోయిన తన చిన్నారి చెల్లెలి ప్రశ్నించే చూపులా ఆ ఉత్తరం అతన్నెప్పుడూ వెన్ను చరుస్తూనే వుంటుంది!!

 

    "సారీ డాక్టర్! బెడ్ నెంబర్ సిక్స్ పేషెంట్ ఎక్స్ పైర్ డ్!"

 

    చప్పున మంచంలోంచి లేచి కూచున్నాడు డాక్టర్ శరత్ చంద్ర.

 

    ఊపిరాడని అనుభూతి! గుండెమీద ఎవరో కూర్చున్నట్టు బరువుగా ఉంది.

 

    చుట్టూ చూశాడు. మెత్తని ఉదయపు వెలుగు, బెడ్ రూమ్ ని ఆక్రమించుకున్నది. మంచం పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో కన్పిస్తున్న అతని ప్రతిబింబం మీద చూపు నిలిపింది.

 

    కాస్త పక్కకి జరిగిన కిటికీ కర్టెన్ ని ఆసరా చేసుకుని లోపలికి ప్రవేశించిన నులివెచ్చని కిరణమొకటి ఏటవాలుగా అతని చెంపల్ని తాకుతోంది.

 

    మొహంనిండా కలవరం! నుదుటిమీద చిరుచెమటలు! తడితేరిన గాలితెర అప్పుడే అతని నుదిటిని చల్లగా తాకుతూ వెళ్ళింది.

 

    నుదుటిమీద చెమటని అరచేత్తో అద్దుకున్నాడు.

 

    నిద్రలో కూడా అదే పీడకల! నిన్న ఆపరేషన్ చేసిన పేషెంట్ పోయాడని చెప్తోంది నర్స్!

 

    "ఇప్పుడెలా వున్నాడో?" అనుకున్నాడు ఆందోళనగా.

 

    జరిగింది నిజంకాదని అర్ధం అయినా అతనికింకా కలవరం పూర్తిగా తగ్గలేదు. అతని చూపు అ ప్రయత్నంగా తలగడవైపు తిరిగింది.

 

    మంచం పక్కనే ఉన్న టేబిల్ లైట్ డోమ్ కింద ఒద్దికగా ముడుచుకుపడుకున్న తెల్లకుందేలులా కనిపించింది. ఉడెన్ బాక్స్ మీద టెలిఫోన్?

 

    "అర్ధరాత్రి హాస్పిటల్ నుండి వచ్చి పడుకున్న తర్వాత ఫోన్ తనని డిస్ట్రర్బ్ చేయలేదు అంటే... ఆపరేషన్ చేసిన వాళ్ళంతా క్షేమంగా వున్నారన్నమాట" తేలిగ్గా ఊపిరి పీలుస్తూ అనుకున్నాడు.

 

    "మృత్యుదేవుడెప్పుడూ కవ్విస్తూ బెదిరిస్తూ తనచుట్టు చుట్టూనే తచ్చాడుతుంటుంది.

 

    హార్ట్ సర్జన్ అవడం వల్ల దీనికెంత తేలికైపోయాను. ఇవాళ కలలో కూడా బెదిరిస్తోంది" నవ్వుకున్నాడు.

 

    చల్లనిగాలి మరొక్కసారి అతన్ని నిమురుతూ వెళ్ళింది.

 

    ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. వంట గదిలోంచి సన్నని వాసనలు గాలితో స్నేహంచేసి పడకగదిలో కొస్తున్నాయి.

 

    అలవాటుగా కళ్ళు పైకెత్తి గోడవైపు చూశాడు.

 

    గుడ్లురుముతున్నట్టు ఏడుంపావు చూపిస్తోంది. గోడగడియారం అందులోని సన్నని పొడవాటి ముల్లు అతని దినచర్యకు శాసించే రింగ్ మాస్టర్ చేతిలోని ఛెర్నాకోలలా నిమిషాలని చకచకా మింగేస్తోంది, ఉలిక్కిపడ్డాడు.

 

    ఆ రోజు చేయాల్సిన కేసుల్ని తలచుకుంటూ అదాటున మంచం దిగి అటాచ్ డ్ బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.

 

    మరో అరగంటలో స్నానంచేసి తయారై డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరాడు.

 

    అతనెప్పుడూ అంతే! నిముష నిముషాన్నీ లెక్కిస్తూ పరుగులు పెడుతుంటాడు. భర్త పనిలో అతని స్పీడుని అందుకోలేనప్పుడల్లా విసుక్కుంటుంది నీలిమ.

 

    డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి పక్కనే వున్న వంటగదివైపు తొంగి చూశాడు. అటు తిరిగి నిలబడి స్టవ్ దగ్గర ఏదో పనిచేసుకుంటోంది నీలిమ.

 

    కాఫీపొడి రంగు కాటన్ చీకీ, అదేరంగు జాకెట్టుకీ మధ్య అందమైన వంపుతో ఆమె నడుముభాగం తెల్లగా మెరుస్తోంది. అతనికి ఆ వంపంటే ఎంతో ఇష్టం. అంత తొందరలోనూ ఆ అందమైన భాగాన్ని అదేపనిగా చూసుకున్నాడు.

 

    ఆమెని నైటీలో తప్ప చీరలో చూసుకుని చాలా కాలమైనట్టు అప్పుడు గుర్తొచ్చింది. అర్ధారాత్రి ఇల్లుచేరి ఉదయం ఎనిమిది కాకుండానే పరిగెట్టేవాడికి ఆ భాగ్యం ఎక్కడిది అనుకున్నాడు.

 

    ఇద్దరి పిల్లల తల్లయినా ఆ నడుం ఒంపులోని అందం చెదరలేదు నీలిమకి. అరుదైన అదృష్టం అది.

 

    అనుభవజ్ఞుడైన శిల్పి చేతిలో రూపుదిద్దుకున్న పాలరాతి శిల్పాన్ని మరిపించే విగ్రహం ఆమెది. పొందికైన ఆ విగ్రహం పెరుగుతున్న వయసుతోపాటు కొత్తకొత్త అందాల్ని పొదువుకుంటోంది. తదేకంగా ఆమెనే చూస్తున్న అతని పెదవులపై ఓ చిరునవ్వు కదలాడింది. అంతలోనే కరుగుతున్న కాలం చర్నాకోలలా వీపు చరిచింది.

 

    తల్లిగుండెలని ఆర్తిగా హత్తుకుపోయిన నాలుగేళ్ళ పసివాడ్ని స్కూలు టైమైపోయిందని కఠినంగా లాక్కెళ్ళినట్టు... ఆమె నడుంమీదే నిలిచిపోయిన చూపును బలవంతంగా మరల్చుకున్నాడు.

 

    డైనింగ్ టేబుల్ మీద తనకోసం రెడీగా వుంచిన టిఫిన్ ప్లేట్ కనిపించింది. వేడివేడిగా టిఫిన్ వడ్డించాల్సిన నీలిమ అక్కడలేదు.

 

    అప్పుడు గుర్తువచ్చింది... నిద్రలేచాక నీలిమ తనవైపు తొంగికూడా చూడలేదని, కాఫీ కూడా ఇవ్వలేదని! దీని అర్ధం... నీలిమకి కోపం వచ్చింది!

 

    ఒక్కసారిగా ఒళ్ళంతా నీరసం ఆవహించిందతనికి!

 

    కారణాలు ఒక్కొక్కటి... బుల్లితెరమీది వార్తల ముఖ్యాశాల్లా కళ్ళముందు చకచకా కదిలిపోసాగాయి.

 

    నిన్న సాయంత్రం పెందలాడే ఇంటికొచ్చి భార్యాపిల్లల్ని సరదాగా బయటికి తీసుకెళతానని ఉదయం చెప్పి వచ్చాడు. ఎమెర్జన్సీ ఆపరేషన్ చేయాల్సి రావడంవల్ల అర్ధరాత్రి ఇంటికి చేరాడు.

 

    పిల్లలు సాయంత్రం స్కూలునుండి రావడం ఆలస్యమై కంగారు పడి నీలిమ హాస్పిటల్ కి ఫోన్ చేసిందని నర్స్ చెప్పింది. ఆపరేషన్ చేస్తుండడం వల్ల తను ఫోన్ కి అందుబాటులో లేడు. ఆ తర్వాత ఆపరేషన్లో లీనమై ఆ విషయమే మరిచిపోయాడు.

 

    అలసిపోయి అర్ధరాత్రి ఇల్లుచేరాడు. తలుపు తెరిచిన నీలిమ తనతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి పడుకుంది. తమగదిలో ఆదమరచి నిద్రపోతున్న పిల్లల్ని చూస్తేగాని గుర్తురాలేదు. ఏం జరిగిందని దగ్గరగా వెళ్ళి అడిగాడు నీలిమని.

 

    పొడిపొడిగా సమాధానం చెప్పింది.

 

    ఆమెను పట్టించుకునే ఓపిక కూడా లేక భోజనమైనా చేయకుండా మంచంమీద వాలిపోయాడు. ఆ తర్వాత అతనికి స్పృహలేదు.

 

    మళ్ళీ ఉదయం పీడకలతోనే మెలకువ రావడం - 'ఏ భార్యకి మాత్రం కోపం రాదు' అనుకున్నాడు.

 

    టిఫిన్ ప్లేటు చేతిలోకి తీసుకుని నీలిమ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. గ్యాస్ మీద ఏదో కూరలు ఉడుకుతున్నాయి. అతని రాకను గమనించినట్టు ఆమె చాకుతో త్వరత్వరగా ఉల్లిపాయల్ని తరుగుతోంది. అతనిమీద కోపం ఉల్లిపాయల మీద చూపిస్తున్నట్టు.

 Previous Page Next Page