Previous Page Next Page 

హ్యూమరాలజీ - 3 పేజి 2


    అందరం శ్యామల్రావ్ ఇంట్లోకి నడిచాము.

 

    లోపల బెడ్ రూమ్ లో నేలమీద పడిపోయి వుందామె. గుండె చుట్టూ రక్తం మడుగు, ఓ చేతిలో ఆటోమేటిక్ గన్- ఆమెవేపుకి గురిపెట్టుకుని వుంది.

 

    "జాగ్రత్త! ఎవరూ ఈ గదిలో వేలిముద్రలు పడకుండా చూడండి. లేకపోతే మనల్నే హంతకులుగా చేసేస్తాడు" అంటోంది డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి.

 

    మా కందరికీ రాజ్యలక్ష్మిని చూస్తే జాలివేసింది.

 

    మా కాలనీ ఆడాళ్ళు చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు.

 

    "బిడ్డ పాపం అత్తగారింటికి వచ్చిన దగ్గర్నుంచీ సుఖం అనేది తెలీదమ్మా. అత్తమామలు, మరిది పగలంతా కాల్చుకుని నానాహింసలూ పెడితే ఆ భర్త ముండాకొడుకు రాత్రుళ్ళు తాగివచ్చి మీ నాన్న దగ్గర కెళ్ళి డబ్బు తేవే' అంటూ తెల్లార్లూ గొడ్డుని బాదినట్టు బాదేవాడు" అంటోంది సావిత్రమ్మ.

 

    ఆ అమ్మాయి తెల్లవారుజామున అయిదింటికి లేచి ఇంటిముందు కళ్ళాపిజల్లి, ముగ్గులు వేస్తుంటే- ఆ దృశ్యం ఇకముందు మాకు కనిపించదనుకునేసరికి మా అందరి హృదయాలూ బాధతో భారంగా తయారయినయ్.

 

    శ్యామల్రావ్ భార్య శవం పక్కన కూర్చుని దొంగ ఏడుపులు ఏడుస్తోంది. మరి కాసేపట్లో పోలీసులు వచ్చారు. మాకు చెప్పిన కథే వాళ్ళకూ చెప్పాడు శ్యామల్రావ్.

 

    ఆ కథ అబద్దమనీ, ఆ అమ్మాయిని వాళ్ళే గన్ తో కాల్చి చంపి వుంటారనీ పోలీస్ ఇన్ స్పెక్టర్ తో చెప్పాము. అతను శ్యామల్రావ్ ని పక్కకు తీసుకెళ్ళి రహస్యంగా పావుగంటసేపు మాట్లాడాడు. ఆ తరువాత ఇద్దరూ శ్యామల్రావ్ గదిలోకెళ్ళి అయిదునిమిషాల తర్వాత బయటికొచ్చారు.

 

    "ఆయన కాల్చగా మీలో ఎవరయినా చూశారా?" అడిగాడు ఇన్ స్పెక్టర్ మా దగ్గరకొచ్చి.

 

    మేము మొఖాలు చూసుకున్నాం.

 

    "చూడక్కర్లేదండీ! రోజూ ఆమెను హింసిస్తున్న వాళ్ళు చంపలేదని ఏమిటి నమ్మకం?" అంటూ ఎదురు తిరిగాడు రంగారెడ్డి.

 

    "అంటే ఇదంతా కేవలం మీ అనుమానం అన్నమాట! అంతేనా?"

 

    "అనుమానమేంటండీ? ఆ అమ్మాయి గన్ క్లీన్ చేయటమేంటసళు? పైగా లోడెడ్ గన్! అది క్లీన్ చేస్తూ గన్ ని తనకే గురిపెట్టుకోవడం, ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్ నొక్కడం ఎవరైనా నమ్ముతారా ఈ హరికథలు?" అరిచాడు శాయిరామ్.

 

    ఇన్ స్పెక్టర్ కి మా మీద కోపం పెరిగిపోతున్నట్లు తెలుస్తూనే వుంది.

 

    "అయితే ఇప్పుడేమంటారు?" మరింత మండిపడుతూ అడిగాడు.

 

    "శ్యామల్రావ్ దంపతులనూ, ఆమె భర్తనూ అరెస్ట్ చేయండి ముందు. తరువాత ఇన్ వెస్టిగేట్ చేస్తే మీకే రుజువులు దొరుకుతాయ్" దబాయించాడు.

 

    "అంటే మా పోలీసులున్నది జనం ఏం చెప్తే అది చేయటానికి అన్నమాట"

 

    "అవును! మీ డిపార్ట్ మెంట్ చేతగాని డిపార్ట్ మెంట్ గనుక మేము చెప్పడానికి మాకు అధికారం వుంది"

 

    "అలాగా! ఆల్ రైట్! అయితే మీరందరూ ముందు స్టేషన్ కి పదండి!"

 

    మేము అదిరిపడ్డాం.

 

    "మేమెందుకు?"

 

    "స్టేట్ మెంట్స్ తీసుకోవాలి- మేజిస్ట్రేట్ దగ్గర! పదండి"

 

    ఆ మాటతో క్షణంలో మా వెనుక వున్న వాళ్ళంతా చెల్లాచెదురయిపోయారు. చివరకు నేనూ, రంగారెడ్డి, శాయిరామ్, గోపాల్రావ్ మాత్రం మిగిలాము.

 

    "చూస్తారేమిటి? వాన్ ఎక్కండి!" ఉరిమాడు ఇన్ స్పెక్టర్.

 

    "మా వాళ్ళను కూడా తీసుకొస్తాము" అని బొంకి మేము కూడా అక్కడినుంచి పారిపోయాం. పోలీస్ స్టేషన్ లో కెళ్ళినా, పోలీస్ కేస్ లో ఇరుక్కున్నా నరకం అనుభవించాలో మాకు అదివరకే తెలిసింది కదా!

 

    తెలిసి తెలిసి నిప్పుని ఎవరూ తాకరు కదా!

 

    మర్నాడు న్యూస్ పేపర్ లో ఆ వార్త ప్రచురించబడింది.

 

    "ప్రమాదవశాత్తూ గన్ పేలడంవల్ల ఓ ఇల్లాలి మృతి! ఆమె మరణానికి కృంగిపోతూన్న భర్త, అత్తమామల ఫోటోలు లోపలిపేజీలలో చూడవచ్చు!"

 

    మాకు కోపం ఆగలేదు. ఆ న్యూస్ పేపర్స్ చింపి పారేశాం, అంతకంటే ఇంకేం చేయగలం కనుక?

 

    ఇది జరిగిన మూడో రోజునే మా కాలనీ బయటవున్న ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ లో మరో పెద్ద శబ్దం వినిపించింది.

 

    అందరికీ ఆ శబ్దం ఏమిటో అర్థమయిపోయింది.

 

    అచ్చం శ్యామల్రావ్ ఇంట్లో విన్న శబ్దమే.

 

    పరుగుతో ఆ స్టోర్స్ కి చేరుకున్నాం.

 

    కొత్తగా ఆ షాప్ పెట్టిన ఆన్ ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ రక్తపు మడుగులో పడి వున్నాడు. ఎదురుగా గన్ పెట్టుకుని మా ఏరియా తాలూకూ శంకర్ దాదా కోపంగా నిలబడి వున్నాడు.

 

    "సాలే! వినాయకచవితి చందా వెయ్యి రూపాయలిమ్మంటే వంద రూపాయిలిస్తాడు బాడుకవ్? గిసంటోళ్ళ నెట్ల ఖతమ్ జెయ్యాలో నాకెరుక బే! వెళ్ళండ్రి! అన్ని దుకాణాలకు పోయి మనం అడిగినన్ని పైసలు ఎవళ్ళియ్యరో ఆళ్ళ పేర్లు రాస్కరాండ్రి! ఖతమ్ జేస్తా కొడుకులను" అరుస్తున్నాడతను.

 

    మిగతా షాపుల వాళ్ళందరూ గూండాలు అడిగినంత డబ్బిచ్చేస్తూ కనిపించారు మాకు.

 

    "ఏయ్! మీరేం జూస్తున్రు బే! పొండ్రి ఈడకెళ్ళి! సాలేగాండ్లు సినిమా జూస్తున్నట్టు జూస్తున్రు" గన్ మావేపు గురిపెట్టి గాలిలో ఇంకో రౌండ్ కాల్చాడతను.

 

    క్షణంలో ఎవరిళ్ళల్లో వాళ్ళున్నాము మేము.

 

    మర్నాడు ఆత్రుతగా న్యూస్ పేపర్ చూశాము.

 

    "నిన్నరాత్రి శంకర్ దాదా ఇంటిమీద నగ్జలైట్లు దాడి చేసినప్పుడు శంకర్ దాదా వారిని వీరోచితంగా ఎదుర్కొని వేటాడి గన్ తో మెయిన్ రోడ్ మీద ఓ షాప్ లో దాక్కున్న ఒక నగ్జలైజ్ ని కాల్చి చంపినట్లు పోలీస్ వర్గాలు తెలుపుతున్నాయ్!"

 

    మేము ఎవ్వరం ఆ విషయం చర్చించుకోలేదు. ఎందుకంటే శంకర్ దాదాతో కిరికిరి పెట్టుకోవడం మాకేమాత్రం నచ్చనిపని!

 

    అదేరోజు మధ్యాహ్నం ఇంటర్ పరీక్షలు రాస్తూన్న మా కాలనీ పిల్లలు పరీక్షల మధ్యలో ఇళ్ళకు పారిపోయి వచ్చారు.

 

    "ఏమిట్రా- ఏమిటిప్పుడే వచ్చారు. సాయంత్రం వరకూ పరీక్ష వుంది కదా?" అడిగామ్మేం ఆశ్చర్యంగా.

 

    "ఉంది కానీ, మా ఎగ్జామినేషన్ సెంటర్ లో ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి ఓ స్టూడెంట్ దగ్గర కాపీలు పట్టుకున్నందుకు ఆ కుర్రాడు గన్ తో ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళను ఇద్దరిని కాల్చి చంపేశాడు. మాకు భయం వేసి పారిపోయి వచ్చేశాం"

 

    మేం ఏమీ మాట్లాడలేదు. మర్నాడు పేపర్ చూశాము.

 

    "గుర్తు తెలీని వ్యక్తులు ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్స్ ఇద్దర్ని ఎగ్జామినేషన్ సెంటర్లో కాల్చి చంపిన వైనం. పాతకాలం నాటి కక్షలే దీనికి కారణమయి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు" అని ఉందందులో.

 

    "అయుండవచ్చు!" అన్నాడు రంగారెడ్డి.

 

    "మే బి!" అన్నాడు గోపాల్రావ్.

 

    "మీకేం మతిపోయిందా? మన కాలనీ స్టూడెంట్స్ ప్రత్యక్షంగా చూసిన విషయం విన్నా కూడా ఆ న్యూస్ పేపర్ లో రాసిన పోలీస్ వర్షన్ నమ్ముతున్నారా?" ఆశ్చర్యంగా అన్నాడు శాయిరామ్.

 Previous Page Next Page