TeluguOne - Grandhalayam | Online Book Store | Novel Reading | Telugu Novels | Telugu Kathalu | Famous Telugu Writers | Chandu Sombabu | Yandamuri Veerendranath | Merlapaka Murali | Vasireddy Seeta Devi | Samaram Novels
Adi Vishnu Novels 3


    "సారీ చెప్పకుండా వుండాల్సింది!"

 

    "అప్పుడు కోర్టుకి రమ్మనేవాడు!"

 

    "సారీ చెప్పడంకంటే కోర్టే బెటరు!"

 

    కొడుకు అభిప్రాయం వినగానే సత్యం బస్కీలు తీయడం ఆపేశాడు.

 

    కొడుకువేపు కొంచెం సీరియస్ గానే చూసేడు. ఏమనుకున్నాడో ఏమో కసరత్తు కార్యక్రమం అక్కడితో ఆపేసి లుంగీ కట్టుకుని ఇంటిలోకి వెళ్ళిపోయేడు.

 

    దాన్ని ఇల్లు అని సింపుల్ గా తీసిపారేస్తే అవమానం జరిగిపోయినట్లే లెక్క. ఇంద్రుడు వుండే ఇంటిని సాదాసీదాగా ఇల్లని పిలవరు. భవనం అంటారు కాబోలు. ఆ భవనానికి సత్యంగారిల్లు ఏ మాత్రం తీసిపోదు.

 

    అత్యాధునికమైన అలంకారాల్తో మిడిసిపడే ఆ భవనం ఖరీదు పది లక్షలని చెబితే చాల్లే ఊరుకో అనే ప్రమాదముంది. దిష్టి కొడుతుందనే దిగులుతో రేటు తగ్గించేరని కోప్పడతారు.

 

    ఏది ఏమైనా అది సత్యంగారిల్లు.

 

    ఆయన హోదాకి, లెవెల్ కి తగిన ఇల్లది.

 

    అంత ఖరీదయిన విశాలమైన అందమైన అంత పెద్ద భవనంలో కేవలం ఇద్దరంటే ఇద్దరే ఉన్నారు. సత్యంగారూ, వాళ్ళబ్బాయి కృష్ణమూర్తి!

 

    సత్యం స్నానం పూర్తి చేసేడు. డ్రస్సవుతుండగా కృష్ణమూర్తి గదిలోకి వచ్చేడు.

 

    "బ్రేకుఫాస్టు రెడీ" అన్నాడు కృష్ణమూర్తి.

 

    "నాకు అక్కర్లేదు నువ్వు తిను."

 

    "పెసరట్టూ, ఉప్మా! నీకిష్టమైన---"

 

    "ఒరే కిష్టుడూ! నన్ను విసిగించకు."

 

    కిష్టుడు తలొంచుకుని మెల్లిగా అన్నాడు-

 

    "నీ పాయింటే కరెక్టు నాన్నా! కోర్టుకెళ్ళడం కంటే సారీ చెప్పడమే బెటరు."

 

    సత్యం రిలాక్సయ్యేడు. కొడుకు భుజాన్ని తట్టేడు. అనునయంగా అన్నాడు.

 

    "లీవిటాఫ్! కోర్టులూ పోలీసులూ ట్రాప్! పెసరట్టన్నావ్. ఉప్మా అన్నావ్. ఆలస్యం చేస్తే చల్లారిపోవచ్చు. కమాన్" అంటూ కొడుకుని తీసుకుని డైనింగ్ హాల్ వేపు నడుస్తున్నాడు.

    
                                        3


    సత్యం ఇండస్ట్రీస్ వారి ముఖ్య కార్యాలయం సోమాజిగూడలో వుంది.

 

    ప్రొప్రయిటరుండే గది గొప్ప డాబూ దర్పంగా వుంటుంది. అందులో రివాల్వింగ్ ఛెయిర్ వున్నాడు సత్యం.

 

    అతనిముందు అతనీడువారే కొందరు వ్యక్తులు కూచుని వున్నారు. వాళ్ళల్లో ఖరీదైన వాళ్ళూ వున్నారు. సగటుజాతి పురుషులూ వున్నారు.

 

    సత్యం ఇంటర్ కమ్ లో సెక్రటరీతో అన్నాడు-

 

    "లంచ్ టైం వరకు నో బిజినెస్ మేటర్స్. మా ఫ్రెండ్సుతో వున్నాను. ప్రైవేట్ అఫైర్స్, డిస్టర్బ్ చేయకండి ఓకే?"

 

    అవతల్నుంచి ఓ.కే. అని వినిపించింతర్వాత ఇంటర్ కం వదిలేసి సత్యం తన ఫ్రెండ్సుతో అంటున్నాడు.

 

    "మా ఇంట్లో ఇప్పటివరకు నేనూ మా అబ్బాయి మాత్రమే వుంటున్నాము. దిసీజ్ ది టైం ఫర్ ది థర్డ్ మెంబర్!"

 

    కూచున్న వ్యక్తులు మొహమొహాలు చూసుకున్నారు. అందులో ఒక వ్యక్తి విసుక్కుంటూ అన్నాడు-

 

    "ఒరే సత్యం చిన్నప్పట్నుంచీ నువ్వింతేరా! ఉపోద్ఘాతం లేకుండా పాయింటు చెప్పవుగదా!"

 

    "చెప్తాను. నాకో కోడలుపిల్ల కావాలి. ఆస్థీవగైరాలు ముఖ్యం కాదు. కులం మతం పట్టింపుల్లేవు. గుణవంతురాలై వుండాలి. అందం అణకువా వుండాలి!"

 

    అక్కడ కొంచెంసేపు ఆగి అన్నాడు సత్యం-

 

    "ముఖ్యంగా ఆ పిల్ల తల్లిదండ్రులు నచ్చాలి!"

 

    ఆ మాట వినగానే కూచున్న వ్యక్తులలో నారాయణ అనే ఆసామికి వళ్ళు మండిపోయింది. అంచేత కొంచెం వేడిగానే అన్నాడు.

 

    "వెధవపాయింటు. ఎవరైనా వింటే నవ్వుతారుగానీ ఎక్కడా అనకు."

 

    "వాడ్డూయూ మీన్!" అన్నాడు సత్యం.

 

    "లేకపోతే ఏమిట్రా? పిల్లను చేసుకునేది మీవాడు, ఆ పిల్ల మీ వాడికి నచ్చాలి. అంతేగాని - ఆ పిల్ల తల్లిదండ్రులూ వాళ్ళింట్లో గోంగూరతో నీకు పనేమిటో చెప్పు?"

 

    "అదంతే!" అన్నాడు సత్యం.

 

    "తిక్కగా మాటాడకురా సత్యం! ఇంత కల్చరూ డబ్బూ వున్న వాడివి నీకిదేం పోయేకాలం బుద్ధిరా? నాన్నా! ఫలానా సుబ్బలక్ష్మిని చేసుకుంటానని మీవాడు చెప్పినప్పుడు ఓ.కే. అనేయడం, అక్షింతలు వేయడం నీ బాధ్యత. అబ్బాయికీ, అమ్మాయి అమ్మాయికి అబ్బాయి నచ్చేక వాళ్ళ పెళ్ళి జరిపించడం ప్రోగ్రెసివ్ అవుట్ లుక్. అంతేతప్ప ఎవరో కోన్ కిస్కా గొట్టాంగాళ్ళు ఆ పిల్ల తల్లిదండ్రులు నీకు నచ్చలేదని బ్రేకులేస్తావా?"

 

    "నచ్చకపోతే తప్పకుండా వేస్తాను!"

 

    "నీక్కావల్సింది కోడలురా! మీవాడు ఇష్టపడ్డాడు గనక ఆ వాళ్ళను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకో! తల్లిదండ్రులు నచ్చకపోతే గోలీమార్ పిల్లతో నీకేం పనసలు?"

 

    సత్యం చిరాగ్గా లేచి నించున్నాడు.

 

    "ఓకే. ఓకే తెలుగు సిన్మాలో తండ్రిలాగా పిల్లల ప్రేమకు బ్రేకులేసే ఫూల్ నని తిట్టొద్దు. కల్చర్ లేని గొడ్డునని బిరుదివ్వద్దు ఎక్కడాలేని విడ్డూరపు కోరికలు కోరుతున్నానని విమర్శించవద్దు. నా కధ వింటే మీరీ మాటలతో నన్ను బాధపెట్టరు. నా పెళ్ళి పెద్దల యిష్టానికి వ్యతిరేకంగా జరిగింది-


                                                           *  *  *


    అది ఏ ఊరో అనవసరం.

 

    ఆ ఊళ్ళో అదొక వీధి. సమయం రాత్రి. వీధి దాదాపు నిర్మానుష్యంగా వుంది.

 

    ఒక లైటు స్తంభం దగ్గిర పాతికేళ్ళ సత్యం నిలబడివున్నాడు. క్షణానికోసారి వాచీ చూసుకుంటున్నాడు.

 

    సిగరెట్ ని అసహనంగా కాల్చుతున్నాడు.

 

    ఎవరింటి గోడగడియారమో పదిగంటలు కొట్టింది.

 

    సత్యం తానుకాల్చే సిగరెట్ ని బూటుకింద వేసి నలిపేడు. ఒక అడుగు ముందుకు వేసేడు. వెంటనే ఆగిపోయాడు.

 

    సుభద్ర సూటుకేసుతో తత్తరపాటు అడుగులతో నడుచుకుంటూ వస్తోంది. వెనక్కి చూసుకుంటూ నడిచి వచ్చింది.

 

    ఆమె మొహమ్మీద చిరుచెమట్లు పోసేయి. ఆమె చూపులలో ఆందోళన కనిపిస్తుంది. సత్యాన్ని చేరుకుంటూనే అన్నది-

 

    "ఆలస్యం చేసేనుకదూ?"

 

    సత్యం ఆమె సూట్ కేసు అన్నాడు.

 

    "ఫర్లేదు రైలుకింకా టైముంది!"

 

    - రైలు నడుస్తోంది. ఆ కంపార్టుమెంటులో సత్యం సుభద్ర వున్నారు.

 

    సుభద్ర కళ్ళనీళ్ళు పెట్టుకోవడం సత్యం చూసేడు.

 

    ఆమె చేతిని అనునయంగా తీసుకున్నాడు. సుభద్ర చెప్పింది-

 

    "నేను వచ్చేటప్పుడు మా అమ్మ మేలుకునే వుంది!"

 

    "మేలుకుని వుంటే నిన్ను గడప దాటనిస్తుందా?"

 

    "అదే నాకు అర్ధం కావడంలేదు!"


Related Novels