Previous Page Next Page 

న్యాయానికి అటూ-ఇటూ పేజి 2

  

     "కొన్నివేల ప్రాణాలు కాపాడాడని కొంతమందిని చంపే హక్కు అతనికి లేదు. లాయర్లు క్లయింట్స్ ని ఇబ్బంది పెడుతూ వుంటారన్నావు. మీ డాక్టర్ల టెక్నికల్ బాధలు మాకర్ధంకావని మీరనుకున్నట్లే.... మా ప్రాక్టికల్ డిఫికల్టీస్ మీకర్ధంకావని మేమూ అనుకోవచ్చుగా ఈ వాయిదాలూ, ఏళ్ళతరబడి కాలయాపన మీకు నిర్లక్ష్యంగా కనిపించవచ్చు. కాని యిది చాలామంది, అంటే యివతలి లాయరు, మేజిస్ట్రేట్ గారి ట్రెండ్ ఆఫ్ వర్క్ యిన్ని అంశాలమీద ఆధారపడి వుంటుంది. దటీజ్ ఎ ప్రొసీజర్ బై యిట్ సెల్ఫ్."
   
    "మీ లాయర్లమీద నువ్వు ఈగ వాలనియ్యవు" అన్నది మాలతి మళ్ళీ నవ్వి.
   
    ప్రదీప్ అన్నాడు "మాలతీ! మా ప్రొఫెషన్ మీద నాకు ఎంత గౌరవమో, మీ ప్రొఫెషన్ మీద కూడా అంతే గౌరవం సందర్భం వచ్చి ఆ ఒన్ పర్సెంట్ లోపమూ ఎందుకుండాలన్న బాధతో అన్నానుగాని, డాక్టర్లని దేవతలుగా పరిగణిస్తాను."
   
    మాలతి అతనిముఖంలోకి చూసింది. ఆ కళ్ళలోని నిజాయితీ, ముఖ కవళికల్లోని స్థిరత్వం ఆమెను చకితురాల్ని చేశాయి.
   
    "ఒక లాయరు కేసు చేపట్టేముందే అందులోని బలాబలాల్ని, లోపాల్ని బేరీజు వేసుకోవాలి. చేపట్టాక ప్రాణం ధారపోసయినా సరే నిజాయితీగా పనిచెయ్యాలి. కేసు గెలవొచ్చు పోవచ్చు. కాని ఇతని నిజాయితీలో లోపం వుండకూడదు. అలాగే ఒక డాక్టరు కేసు టేకప్ చేశాక బ్రతికించడానికి సర్వశక్తులూ ధారపొయ్యాలి, అతని ప్రయత్నలోపం వల్ల కేసు ఫెయిల్ కాకూడదు."
   
    ఒక వ్యక్తి మాట్లాడే మాటల్లో నిజాయితీ వున్నప్పుడు- వ్యాఖ్యానం చేద్దామానుకున్నా అవతలి వ్యక్తికి అవకాశం వుండదు.
   
    మాలతి అలాంటి పరిస్థితిలో పడిపోయింది.
   
                                   * * *
   
    ప్రదీప్ యింటికి వచ్చేసరికి రఘురామయ్యగారు డ్రాయింగ్ రూంలో కూర్చుని వున్నారు.
   
    ప్రదీప్ ఆయనవంక పలకరింపుగా నవ్వి "అప్పుడే సామానంతా సర్దేసి రెడీగా కూర్చున్నారా?" అన్నాడు.
   
    అతను వచ్చిన అలికిడి విని బిందు లోపలినుంచి వచ్చి గుమ్మంలో నిలబడింది.
   
    అయిదోనెల ప్రవేశించడంవల్ల శరీరాన్ని ఆవరించిన నిండుదనం, ముఖంలో చెంపకు చారడేసి వున్న ఆ కళ్ళలో కొట్టొచ్చినట్లు కనబడుతున్న నిగనిగ, చూపుల్లో సహజంగా వెల్లివిరిసే మెరుపు....
   
    "ఏమిటమ్మా! యింతాలస్యం" అన్నట్లు ప్రదీప్ వంక అలవోకగా చూసింది.
   
    "అదిగో! అలా చూడవద్దన్నానా?" అని ప్రదీప్ చూపుల్తోనే జవాబిచ్చేంతలో-
   
    "పోనీ నువ్వుకూడా రాకూడదటయ్యా! నాలుగైదు రోజులుండి వచ్చేద్దువు గాని" అన్నారు రఘురామయ్యగారు.
   
    "ఇక్కడ వర్క్ చాలా వుందండి. ఆ..... మళ్ళీ బిందువు ఎప్పుడు పంపిస్తారు?" అనడిగాడు.
   
    రఘురామయ్యగారు నవ్వారు. "ఇంకా తీసుకెళ్ళనే లేదు. అప్పుడే తిరిగి పంపించటం గురించి అడుగుతున్నావు. ఇక్కడ చేసేవాళ్ళెవరూ లేరు. అసలక్కడే పురుడు పోసుకుంటే ఎలా వుంటుందంటావు?"
   
    "అయ్యో వద్దండీ చాలా చిన్నవూరు. అక్కడ పెద్ద డాక్టర్లెవరూ వుండరు."
   
    రఘురామయ్యగారు మళ్ళీ నవ్వారు. "అక్కడకూడా యీ మధ్య చాలామంది డాక్టర్లు వచ్చారయ్యా! పెద్దపెద్ద నర్సింగ్ హోమ్ లు కూడా పెట్టారు."
   
    "అయినా వద్దండీ. హైదరాబాద్ లో వున్నంత మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ వుండవు."
   
    "అలాగే నీ యిష్టప్రకారమే కానియ్యి ఓ పదిహేనురోజులుంచి పంపించేస్తాను. వాళ్ళమ్మ బిందుని చూడాలని కలవరిస్తుంది. ఆవిడేమో లేవలేని స్థితిలో వున్నదాయె."
   
    ప్రదీప్ తలవూపి లోపలకు వెళ్ళాడు. అతను గదిలోకి వెళ్ళగానే వెనుకనే బిందు వచ్చింది.
   
    అతను కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ నిలబడ్డాడు.
   
    "ఏయ్"
   
    "నిన్నే"
   
    అతను వెనుదిరగలేదు.
   
    "నిన్నే నంటూంటే...." అంటూ దగ్గరగా వెళ్ళి వెనకనుండి భుజాలమీద చేతులు వేసింది.
   
    ఆ స్పర్శకు అతను చలించినా, తెచ్చిపెట్టుకున్న నిగ్రహంతో కదలకుండా అలాగే నిలబడ్డాడు.
   
    "ప్రదీప్!" అంది గోముగా అతని భుజాలు పొదివిపద్ట్టుకుని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూ.
   
    "మాట్లాడవా....?"
   
    "మరి.... నువ్వెందుకు వెళ్ళాలి?"
   
    "ఏం చెయ్యను చెప్పు? నాకు వెళ్ళాలని వుంటుందో, నీ దగ్గరే వుండాలని వుంటుందో నీకు తెలీదా?'
   
    "తెలిసే...?"
   
    "అమ్మ తృప్తికోసం."
   
    "మళ్ళీ ఎప్పుడొస్తావు?"
   
    "పదిహేనురోజులు."
   
    "అన్నిరోజులు.... నువ్వు లేకుండా...." అంటూ ఆమె భుజాలవెనగ్గా చేతులువేసి గాఢంగా అదుముకున్నాడు.
   
    "బిందూ!" అంటూ ఆమెముఖంమీదకు వొంగుతూ.
   
    ఆమె కనురెప్పల కదలికల్లో అతని ఆర్ద్రనేత్రాలు, ఆమె ఆధారాలనాట్యంలో అతని పెదవుల సరిగమలు.
   
    ప్రేమ - కోరికకు దగ్గరగా జరిగింది.
   
    అతని ముఖకవళికలు, భుజాలమీదుగా క్రిందికిప్రాకుతున్న చేతివ్రేళ్ళ కదలికలు.
   
    ఆమె గ్రహించి "అమ్మో!" అంది వెనక్కి జరగబోతూ.
   
    "ఉహు" అన్నాడు వొదలకుండా, తమకంతో.
   
    "అబ్బ! చెప్పేది పూర్తిగా వినిపించుకోండి. చాలా జాగ్రత్తగా వుండాలని చెప్పిందండి డాక్టరుగారు."
   
    "నిజంగానా?" అతని చేతుల పట్టు అప్రయత్నంగా వొదులైంది.
   
    అతడామెను పూర్తిగా వదిలేశాడు.
   
    "మాలతి అలా ఎడ్వైజ్ చేసిందా?"
   
    ఆ సమయంలో అతనిముఖంలోకి చూస్తే ఆమెకు జాలేసింది. కొంచెం కవ్వించాలన్న కొంటెదనంకూడా ఆమెలో ప్రవేశించింది.
   
    "చేత్శే చేసిందిలెండి. డాక్టర్లకేం అలాగే చెబుతారు. అది తినకూడదు, ఇది తినకూడదు అది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు అంటూ అంత ఏమీ పాటించనవసరంలేదు. వుండండి తలుపువేసి వస్తాను" అంటూ ఆమె కదలబోయింది.
   
    "బిందూ!"
   
    "మాలతి ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఆవిడగారికేం తెలుస్తాయి చెప్పండి పెళ్ళయినవాళ్ళు బాధలు? మీకు తెలీదు, వూరుకోండి. ఏమీ ఫర్వాలేదు. నేను చెబుతున్నానుగా ఏమీ ఫర్వాలేదు" అంటూ శ్వేతబిందు వెళ్ళి నిజంగానే తలుపులు వేసెయ్యబోయింది.
   
    "అయ్యో, వద్దు బిందూ, వుండు" అన్నాడు ప్రదీప్ కంగారుగా ఆమెను వారిస్తూ.
   
    "డాక్టరు చెబితే ఈ సలహా తూ.చ. తప్పకుండా పాటించాలి. డాక్టరు సలహాకి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. వద్దు ప్లీజ్."

 Previous Page Next Page