TeluguOne - Grandhalayam
రేపటి మహిళ


    ఈ రకమైన మాటలు ఎప్పుడూ ఎక్కడా వినలేదు భాగవతార్. అతనికి అభిమానులు చాలానే వున్నారు. కొంతమంది కళ్ళల్లో ఆరాధన చూసాడు. కొందరి చూపుల్లో కాంక్ష కనిపించింది. కాని యీ దేశంలో ఆడపిల్ల, అందులోనూ తెలుగుపిల్ల యిలా మాట్లాడగలుగుతుందని అతడెప్పుడూ ఊహించలేదు.

    "ఏమిటి సార్! అలా చూస్తున్నారు. మీకు ఆలోచించుకోవడానికి టైమ్ కావాలా? సరే ఒకరోజు టైమ్ యిస్తాను. రేపటిలోగా సమాధానం యిచ్చారా ఓ.కే. లేకపోతే జన్మలో మీ ముఖం చూడను. బైబై."

    అతి మామూలుగా "నాకై స్క్రీమ్ ఇస్తావా?" అన్నంత సునాయాసంగా నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగేసి వెళ్ళిపోయింది. "కంగ్రాచ్యులేషన్స్" సంబరంగా అన్నాడు ఏండెటో.

    "దేనికి?"

    "అదేమిటి సార్! అంత అందమైన అమ్మాయి ఏరికోరి మీదగ్గిర కొచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటానంటే_"

    "కాని ఒక్కరోజే టైమ్ యిచ్చింది."

    "ఒకరోజు కూడా ఎందుకు సార్ ఒక్కగంట గట్టిగా మాట్లాడితే ఒక్క నిముషం చాలు. ఇందులో ఆలోచించడానికి నిర్ణయించుకోడానికి సమస్యేముంది సార్! నాకే గనక ఆ అమ్మాయి ప్రపోజ్ చేసివుంటే ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని ఇప్పుడే రిజిస్ట్రార్ ఆఫీసుకి తీసుకొనిపోయి వుండేవాడిని."

    "కాని సైకియాట్రిస్ట్ ని, జనటిక్ స్పెషలిస్టుని, ఫిజిషియన్ ని కలుసుకుని డిస్కస్ చేసుకోవద్దూ! నాకు నలభై. ఆ అమ్మాయికి నా వయస్సులో సగం కంటే తక్కువ. మా యిద్దరి జీవితం సరిగ్గా సాగుతుందో సాగదో సైకియాట్రిస్ట్ ని అడగాలి. అలాగే వయసు కారణంగా నా బాడీలో జీన్స్ ఏవైనా శక్తి హీనమైయేమోనని అనుమానంగా వుంది. అది తెల్సుకోవాలి. వయస్సులో వున్న విబేధం. కారణంగా సెక్సు జీవితం సవ్యంగా వుంటుందో లేదో స్పెషలిస్టు నడిగి నిర్ధారించుకోవాలి...."

    "ఇంకా యేవేవి యెవరెవరిని అడిగి నిర్ణయించుకోవాలో ఆలోచిస్తున్నాడు భాగవతార్.

    "ఏమిటి సార్! అర్ధంలేని ఆలోచనలు. ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడే విడిపోవచ్చు. మీరు అప్పుడే ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నారని నాకర్ధమైపోయింది. గో ఎహెడ్."

    "అలాగా...." అన్నట్లు చూసాడు భాగవతార్.

    తను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? అతని మనసంతా గంద్రగోళం అయింది.

    ఆ మర్నాడు మళ్ళీ వచ్చింది. "ఏం నిర్ణయించుకున్నార్ సార్?" అంది. ఎప్పటిలా నవ్వుతూనే వుంది. ఈసారి మేక్సీలో వచ్చింది. సోఫాలో స్వతంత్రంగా కాలుమీద కాలు వేసుక్కూర్చుంది. ఆ యింట్లో ఆవిడే యజమానురాలైనట్లు మిగిలినవాళ్ళు ఆవిడ సేవకులైనట్లు వుంది వాతావరణం. భాగవతార్ తో మాట్లాడుతూనే ఏండెటో వైపు తిరిగి "మీ మృదంగం కూడా చాలా బాగుంది. అయితే దాన్ని వర్ణించాలంటే ఆ టెక్నికల్ టరమ్స్ నాకు తెలియవు. మృదంగం మీద వేళ్ళు కదులుతోంటే నాకు లేచి నిలబడి స్టెప్స్ వెయ్యాలనిపించింది" అంది.

    ఈ చివరి వాక్యం నచ్చలేదు భాగవతార్ కి.

    "మీరు డాన్సు చేస్తారా?" అడిగాడు ఆ అమ్మాయిని.

    "చెయ్యను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. పెర్ ఫెక్షన్ వస్తే పెర్ ఫారమెన్స్ యివ్వడానికి ట్రై చేస్తానేమో? ఇప్పుడు చెప్పలేను."

    "మీపేరు."

    "మృదుల, మృదులా కేశవనాథ్. మానాన్నగారి పేరు కేశవనాధ్."

    "మా అమ్మపేరు చూడామణి. మాయింట్లో కుక్క పేరు బ్లాకీ. పిల్లి పిల్ల పేరు...." ఆ అమ్మాయి నవ్వుతోందని స్పష్టంగా తెలుస్తోంది.

    "మీ అమ్మగారితో, నాన్నగారితో మాట్లాడక్కరలేదా?"

    "వాళ్ళతో మీరెందుకు మాట్లాడటం? నేను మాట్లాడతాను. మీ వాళ్ళెవరైనా వుంటే వాళ్ళతో మాట్లాడుకోండి. మీ అభిప్రాయం చెప్పండి" చేతి గడియారం చూసుకుంది.

    మతి పోతోంది భాగవతార్ కి. ప్రేమ గురించి __ ప్రేమ పెళ్ళిళ్ళ గురించి అతను చాలా చాలా చదివాడు. విన్నాడు. ఇదేం ప్రేమ పెళ్ళి?

    లేచి నిలబడింది మృదుల. "ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్. వెళతాను. పెళ్ళి మాట మర్చిపోండి పోనీ." టాటా చెప్పేసింది.

    "వొద్దొద్దు. వెళ్ళకండి. నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను" హడావిడిగా తొందర తొందరగా చెప్పేశాడు.

    "ఓ.కే. మమ్మీ డాడీలతో మాట్లాడి డేట్ నిర్ణయిస్తాను" కాంపౌండ్ లో పార్క్ చేసిన మోపెడ్ మీద వెళ్ళిపోయింది.

    మెరుపులు తళుక్కుమని చీకట్లు కమ్ముకున్నట్లయింది.


                               *    *    *   


    మృదుల నిర్ణయం విని నిర్ఘాంతపోయారు తల్లిదండ్రులు.

    "ఈకాలం టీనేజర్స్ కి మతులు పోతున్నట్లున్నాయి." అంది తల్లి.

    "మృదూ! నీకు పూర్తిగా స్వేచ్చ యిచ్చి పెంచాం. అది సరిగ్గా వినియోగించుకో. ముఖ్యంగా మనదేశంలో పెళ్ళి అనేది...."

    "నూరేళ్ళపంట_ ఒకసారి లోపలికి అడుగుపెడితే బయట పడలేని జైలు_ జన్మజన్మల బంధం ఆత్మబంధం_ ఇంతేకదా మీరు చెప్పదలుచుకున్నది. ఈ డైలాగులన్నీ ఇదివరకటి తెలుగు సినిమాల్లో చాలాసార్లు విన్నాను. ఇప్పుడిప్పుడు తెలుసు సినిమాల్లో సైతం యిలాంటి డైలాగ్సు రావడంలేదు. ఏదియేమైనా నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఆయనకి చెప్పేసాను. అతడొప్పేసుకున్నాడు. ఇంకా నిర్ణయం మారదు."

    "మన పెంపకంలో యేమైనా లోపం వుందా?" బెంగగా అంది చూడామణి.

    "ఏమీ లేదు. మన సమాజంలో చాలామంది ఆడపిల్లలకు లేని ఆత్మవిశ్వాసం నాకుంది. మీరు కలిగించారు. నేను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలను. వాటివల్ల వచ్చే సాధక బాధకాలు స్థయిర్యంగా ఎదుర్కోగలను. మొదట్నించీ మీకో ఆపరేషన్ నేను ఎంజాయి చేస్తున్నాను. ఇప్పుడీ పెళ్ళి విషయంలో కూడా నాతో కో_ఆపరేట్ చెయ్యండి."

    నిట్టూర్చింది చూడామణి.

    "ఓ.కే. మైడియర్. ఒక్కమాట మాత్రం యెప్పుడూ మర్చిపోకు. నీకెపుడు యే యిబ్బంది యెదురైనా, యేం కావలసి వచ్చినా నీకు నేనున్నాను."

    "నాకు తెలుసు మమ్మీ!" తల్లి నడుం చుట్టూ చేతులు వేసి గారాబంగా అంది. ఒక్కతే కూతురు కావటంవల్ల ఎంత పెద్ద అయినా తల్లి దగ్గర గారాబాలు పోతూనే వుంటుంది మృదుల.

    కేశవనాధ్, చూడామణి దంపతులు భాగవతార్ కు మృదుల పెళ్ళి వైభవంగా జరిపించారు. పెళ్ళిలో జరీపూల కంచిపట్టుచీర కట్టుకుని పూలజడకి జడగంటలు వేళ్ళాడేసుకుని కళ్యాణతిలకం పెట్టుకుని పీటలమీద కూర్చున్న మృదులని చూసి మురిసిపోయాడు భాగవతార్. పెళ్ళయ్యాక ఆ అమ్మాయి ఫ్రాక్ లు, మేక్సీలు, జీన్స్ లు వగైరాలు మానేస్తుందని ఆశ పడ్డాడు. పెళ్ళయిన మర్నాడే పాంట్ అండ్ బ్లౌజ్ తో ప్రత్యక్షమైంది.     

    "చక్కగా తెలుగు ఆడపడుచులా చీరా పూలు బొట్టు కాటుకవీటితో కనపడాలి కాని యీ డ్రెస్సులేవిటి? అన్నాడు భాగవతార్, అదేదో పెద్ద జోక్ అయినట్లు నవ్వింది. "ఇదివరలో తెలుగు సినిమావాళ్ళు వ్యాంప్ ని మాత్రమే మోడరన్ డ్రస్ లో చూపించి కధానాయికని చాదస్తంగా చీరలో చూపేవారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు హీరోయిన్ ని కూడా మోడ్రన్ డ్రెసెస్ లోనే చూపిస్తున్నారు. తెలుగు సినిమా వాళ్ళేనా మారుతున్నారు కాని మీబోటి మగవాళ్ళు మాత్రం మారటం లేదు. గమ్మత్తుగా లేదూ! నన్ను తెలుగింటి ఆడపడుచుగా తయారవమంటున్నావు కాని నువ్వున్నావా తెలుగువాడిలా? ఎండాకాలం ఉక్కబోసి అవస్థగా వున్నా ఉలెన్ పాంట్ టెర్లిన్ షర్టులు వేసుకుని తయారవడం లేదా? జరీ అంచు నేత పంచె కట్టుకుని, నేతచొక్కా వేసుకుంటున్నావా?" నిలదీసినట్లడిగింది.

    సమాధానం చెప్పలేకపోయాడు. మృదుల తనని నువ్వు అని పిలవడం కూడా బాగులేదు. మొదటిసారి నువ్వు అని సంబోధించినప్పుడు షాక్ తిన్నట్లేయి, నన్ను "నువ్వు" అనకూడదు. "మీరు" అని పిలవాలి_నచ్చజెప్పబోయాడు.

    "నన్ను నువ్వు అంటే నువ్వు అంటాను_ మీరు అంటే మీరు అంటాను. అందుచేత అదేదో నువ్వే తేల్చుకోండి". చివరి వాక్యం కావాలని వెటకారంగా అని వెక్కిరించింది ఆ అమ్మాయి. అలా వెక్కిరిస్తూంటే అంత హుషారుగా మాట్లాడుతూంటే యేమనడానికి నోరురావడం లేదు అతనికి. ఈ విషయం చాలాసేపు ఆలోచించి తలమీద పదిపన్నెండు వెంట్రుకలు పీక్కుని తీవ్రమైన ఆలోచనకు నిదర్శనంగా భార్యని మీరు అని పిలవడం కంటే ఆమెచేత నువ్వు అని పిలిపించుకోవడమే మేలు అనే నిర్ణయానికొచ్చాడు. భాగవతార్ సమస్యలు అక్కడితో ఆగలేదు. మృదుల వంటమనిషి వండి పెట్టింది తింటూ అతను సంపాదించింది ఖర్చు పెట్టుకుంటూ బొమ్మలా ఇంట్లో తిరుగుతూ వుండిపోవడానికి ఒప్పుకోలేదు. పెళ్ళికాకముందు నుంచీ ఆ అమ్మాయి ఒకరకమైన ప్రాజెక్టు ప్లాన్ చేసుకుంది. మారుమూల గిరిజన గ్రామాలు ఎంచుకుని ఒక్కొక్క గ్రామంలోను కొన్ని రోజులుండి అక్కడ వాళ్ళ పిల్లల చదువులకి కావలసిన యేర్పాట్లు చేయటం. ప్రభుత్వంచేత చేయించడం_ పెళ్ళయ్యాక కూడా ఈ ప్రాజెక్టుని ఒదులుకోలేదు. నెలకొకసారి మృదుల ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయి పదిరోజులకో_పదిహేను రోజులకో వస్తోంటే గుండె బేజారై పోతోంది భాగవతార్ కి.

    ఇలాంటివి తన కిష్టంలేదని ఖచ్చితంగా చెప్పాడు. మృదుల పోట్లాడదు_డైలాగులు కొట్టదు_కన్నీళ్ళు ఆమె దరిదాపుల్లోకే రావు. హాయిగా ఏదో ఒక ఏపిల్ కొరుక్కుతింటూ "నీకిష్టంలేకపోతే నాకేం! నాకిష్టం" అంటుంది.


Related Novels