TeluguOne - Grandhalayam
ahalya


                                     అహల్య   
                                                                    యామినీ సరస్వతి

 

                                      


    బంగరు గద్దె మీద కూచుని వీణ వాయిస్తూ ఉన్నది సృష్టికర్త సగ పాలులోని మేలిపాలు అయిన సరస్వతి. ఆమె వేలి చివళ్ళు వీణ తీగల మీద చరిస్తూ సృష్టికే సరికొత్త మాధుర్యాన్ని సృష్టిస్తున్నాయి. ఆమె జడ విడివడి వీపంతా ఆక్రమించుకుని చిరుగాలులకు సుతారంగా కదులుతూ బ్రహ్మ మనస్సుని కలవరపరుస్తూంది. అలవోకగా అంగుళుల్ని కదిలిస్తూ నూతన రాగ సృష్టిలో వినూత్న అందాలను వొలికిస్తూ చతురాననుడి ఎనిమిది శ్రవణేంద్రియాలకూ బ్రహ్మానందాన్ని పంచుతున్న వీణా విశారద అయిన శారద.     


    మరో బంగరు గద్దె మీద కూర్చుని జపిస్తూ ఒక చేతిలో జపమాల తిప్పుతూ, మరో చేత్తో రాగానికి తాళం వేస్తూ, మరో చేత్తో అద్భుతం అన్నట్లు అభినయిస్తూ, ఇంకో చేత్తో ప్రేమని వ్యక్తీకరిస్తూ, చతురాననుడు తన చతురత అంతా చతుర్ హస్తాలతో చదువుల రాణికి ప్రదర్శిస్తున్నాడు.  


    ధ్యానం చెడకుండా యోగం మారకుండా చిత్తం పరాయత్తం కాకుండా తన వీణా గానాన్ని వింటూ ఆలోచిస్తూ అభినందిస్తూ అలరింపజేస్తున్న పతిదేవుడు బ్రహ్మదేవుడి చతురభినయానికి మురిసిన భారతీదేవి రతీదేవిని తలదన్నేలా నవ్వింది.


    వీణా వాదం ఆగింది.


    'భారతీ!'


    పలకరింపులోని ప్రల్లదనం గమనించిందామె. రెండర్ధాలే కాదు. వేనవేల అర్ధాలను సైతం అరరెప్పపాటు మాత్రం కాలంలో అవగతం చేసుకోగలిగిన శారదాదేవికి సృష్టికర్తలైన భర్త గుండెలోతుల్లో ఏముందో తెలుసుకోవడం కష్టమా!


    'చతురాననా!' బదులుగా పలికిందామె. అందులోని వ్యంగ్యం ఆయన గుర్తించాడు. నాలుగు ముఖాలతో నాలుగు వేదాలు ఒకేసారి వల్లించడమే కాదు, నాలుగు ముఖాలలో నాలుగు భావాలను ప్రకటించగల నేర్పరులే మీరు అన్న భావం ధ్వనించింది అందులో.


    'అందాల రాశీ!'


    సృష్టికర్త పిలుపుకు ఉలికిపడిందామె. ఏమిటి ఈ వింత! ఏమిటా పలుకులోని కొత్తదనం! ఎందుకా గొంతులో రెపరెపలు!


    'గద్దె దిగి కదిలి రావా!'


    'ప్రభూ!'


    'మనసు కరిగించే మధుమయ సంగీతాన్ని వినిపించావు. నాలుగు నోళ్ళా ప్రశంసించవలసిన ప్రతిభ ప్రదర్శించావు. పెదవికి పెదవి సమాధానంగా పెదవి విప్పిన పాండిత్యాన్ని పెదవితోనే అభినందించాలని వుంది!'


    కానీ అందాల రాశీ అని నన్ను సంబోధించడమె అత్యాశ్చర్యకరంగా ఉంది స్వామీ! అందమంతా ఆమెలో దాగున్న మా అత్తగారు లక్ష్మీదేవికన్నా నేను అందగత్తెనా? అందానికే అందాలు దిద్దే మా అత్తగారి మరో కోడలు రతీదేవి కన్నా నేను అందంలో మిన్ననా?


    నల్లనైనా నిగానిగాలతో సొగసుల స్రవంతిలా వెలుగొందే నగజాత పార్వతీ దేవికన్నా ఎన్నదగిన సౌందర్యవంతురాలినా! అచ్చమైన మెచ్చుదలకు ఆద్యులనదగిన అచ్చెర మచ్చెకంటి సమూహం హేలగా లీలగా చరిస్తుండగా నేను వారికన్న సొగసుల మిన్ననా! ఏమి స్వామీ తమ ఆంతర్యం?


    పరమేష్టి పకపక నవ్వాడు.


    'ముప్పై మూడు కోట్ల ముద్దుగువలు ముగ్ధమనోహరంగా ముందు నిలిచినా కట్టుకున్న ఇల్లాలి కన్నా అందంగా కనిపించే కనులనయనా! ఎవరిని సృష్టించాను! ఎన్ని శరీరాలు మలిచాను! ఎన్ని సోయగాలు ఎందరెందరు లావణ్యవతుల వంతు చేశాను! ఎన్ని కల్పాలు జరిగాయి! ఏ అద్భుత సృష్టీ నన్ను కదిలించలేదు. కలవారపరచ లేదు! నిన్ను సృజించిన ఈ చేతులతోనే అర్బుధాలు న్యర్భుదాలూ సృష్టించేశానూ! అయినా నీమీదే చిత్తమాయత్తమైంది! అది ఈ బ్రహ్మ మదిలోని ఆంతర్యం! అందుకే జగాలు మారినా యుగాలు తీరినా నాదమయ సుందరే నా దివ్య సుందరి!'

    
    సరస్వతి నవ్వింది.


    నాధుడి వచనం ఆమెనెంతో అలరించింది. అయినా ఒక కోరిక కోరాలని అనుకుంది. అదే సమయంలో బ్రహ్మదేవుడి మనసులో వింత చైతన్యం! వినూత్న చైతన్యం! తొలుదొల్త సృష్ట్యారంభంలో ఆయన మనస్సులో కదలాడిన కదలిక లాంటి కదలిక! సరస్వతీ దేవిని సృష్టించిన పూర్వం ఆయన మదిలో మెదిలిన ఊహకు జోడైన ఊహలాంటి కదలిక!


    అందాలన్నీ ఒక చోట రాశి పోసి అత్యద్భుత మూర్తి మన్మధుడిని సృష్టించటానికి ఆయన హృదంతరంలో కదిలిన చిరు కదలిక లాంటి కదలిక! ఆ మన్మధమూర్తికి చేదోడువాదోడుగా కల్పించి మూసబోసిన రతీదేవీ రూపం రూపుదిద్దుకోడానికి పూర్వం ఆయన మనో మందిరంలో కదలాడిన కల్పన వంటి కల్పన!


    సరస్వతీదేవి ఆలోచనలో నిమగ్నురాలైంది. భర్త మనస్సుకి ప్రతిబింబంలా ఆయన నాలుగు ముఖాల్లో కదలాడుతున్న క్రొంగొత్త కదలికని గమనించి ఆలోచనామగ్నురాలైంది.


                                                                    2


    పారిజాత ప్రసూనాల పరిమళాలు అన్ని దిశలా అలుముకుంటున్నాయి. పలు విధ పుష్ప సౌరభాలు నాసాపుట తర్పణంగా కమ్ముకుంటున్నాయి. సిద్ధ, సాధ్య, కిన్నెరా, గరుడ, గంధర్వ, యక్ష, పన్నగ, కింపురుషాదులైన దేవతా గణమంతా సభా మందిరంలో ఆశీనులై ఉన్నారు. దిక్పాలకులు తమ తమ భార్యలతో విచ్చేసి తమ తమ ఆసనాల్లో కూర్చున్నారు.


    ఇంద్రుడు శచీదేవి మహోన్నతమైన మహోన్నతమైన సింహాసనాలపై తమ మతాధిపత్యాన్ని చాటుకునేలా కూర్చున్నారు. దేవర్షి నారద మహర్షి, దేవ గురువు బృహస్పతి, సృష్టికే ప్రతి సృష్టి చేసి ఇంద్ర లోకానికి ప్రతిగా మరో లోకాన్ని సృష్టించి ముప్పది కోట్ల దేవతలనూ ముప్పు తిప్పలు పెట్టిన విశ్వామిత్ర మహర్షి, గౌతమ, చ్యవన, జమదగ్ని, అత్రి, పరాశర, భరద్వాజ మొదలయిన మహర్షులంతా ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు.

Related Novels